నకిలీ సీఎంఓ అధికారి అరెస్టు  | LB Nagar police arrest fake protocol officer of Telangana CMO | Sakshi
Sakshi News home page

నకిలీ సీఎంఓ అధికారి అరెస్టు 

Published Sun, Dec 10 2023 4:49 AM | Last Updated on Sun, Dec 10 2023 7:45 AM

LB Nagar police arrest fake protocol officer of Telangana CMO - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి (సీఎంఓ) అని ప్రచారం చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ను ఎల్బీనగర్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలికి చెందిన ప్రవీణ్‌ సాయి బీటెక్‌ పూర్తయ్యాక హైదరాబాద్‌కు వచ్చి, వనస్థలిపురంలో ఉంటున్నాడు.

స్థానికంగా ఓ ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఎంటెక్‌లో చేరాడు. విలాసవంతమైన జీవనానికి అలవాటు పడిన ప్రవీణ్‌ సాయి అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఏడాది కాలంగా సీఎంఓ అధికారిగా ప్రచారం చేసుకుంటూ అమాయకులను మోసం చేయడం ప్రారంభించాడు. మంత్రులు, ఎమ్మెల్యేలతో సత్సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేసుకొని, డబుల్‌ బెడ్రూం ఇళ్లు, స్థలాలు ఇప్పిస్తానని అమాయకులను మోసం చేసేవాడు.

మంత్రులు, ఎమ్మెల్యేల నకిలీ లెటర్‌ హెడ్‌లతో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులు, యువత నుంచి పెద్దఎత్తున డబ్బు వసూలు చేశా డు. నకిలీ ఎన్‌ఓసీలు, ల్యాండ్‌ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాలు విక్రయించేవాడు. బేగంపేటలో పలువురు బాధితులకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానని రూ.లక్షల్లో వసూలు చేశాడు. ఈ కేసులో ప్రవీణ్‌ సాయి మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా ఉండటంతో గతంలో∙ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. 

రూ.30 కోట్ల భూ సెటిల్‌మెంట్‌లో.. 
అబ్దుల్లాపూర్‌మెట్‌లో రూ.30 కోట్లు విలువ చేసే భూమి సెటిల్‌మెంట్‌ చేయిస్తానని చెప్పి, బాధితుడితో రూ.12 కోట్లకు ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.8 లక్షలు తీసుకొని, బాధితుడిని ఆ ల్యాండ్‌లో నిలబెట్టి ఫొటోలుతీసి బోర్డు కూడా పాతాడు. కొద్దిరోజుల తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లిన బాధితుడు ఆ స్థలంలో బోర్డు లేకపోవడంతో అనుమానం కలిగింది. వెంటనే ప్రవీణ్‌ సాయికి ఫోన్‌ చేయగా పొంతనలేని సమాధానం చెప్పడంతో మోసపోయానని గ్రహించి అబ్దుల్లాపూర్‌మెట్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఎల్బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు శుక్రవారం నిందితుడు అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం రాగా.. వెంటనే అరెస్టు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement