సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. బీజేపీ లీగల్ సెల్ ఉన్నత న్యాయస్థానంలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించింది. గురువారం డివిజన్ బెంచ్‌లో విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.
అదే విధంగా బండి సంజయ్ అరెస్ట్‌పై హైకోర్టులో బీజేపీ హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు సాంరెడ్డి సురేందర్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. బండి సంజయ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ.. ఆరుగురిని ప్రతివాదులుగా చేర్చారు. హోం శాఖ కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్ రాచకొండ సీపీలు, బొమ్మలరామారం సీఐలను ప్రతివాదులుగా చేర్చారు. అరెస్టు సమయంలో పాటించాల్సిన కనీస నిబంధనలు పోలీసులు పాటించలేదని పిటిషన్‌లో తెలిపారు.
కాగా తీవ్ర ఉద్రిక్తత నడుమ మంగళవారం అర్థరాత్రి కరీంనగర్‌లో బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం బలవంతంగా పోలీస్ వాహనంలో బొమ్మలరామారం పోలీసుస్టేషన్‌కు తరలించారు. అయితే ఎందుకు అరెస్టు చేశారనే విషయంపై పోలీసుల నుంచి స్పష్టత రాలేదు. బండి సంజయ్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నారు. 41crpc కింద ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయనున్నారు. అనంతరం నల్గొండకు తరలించే అవకాశం ఉంది.
మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పీఎస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ బొమ్మలరామరం పీఎస్‌కు బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. మహిళాకార్యకర్తలు పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు. సంజయ్‌ను కలిసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే రఘునందన్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అడ్డుకున్న పోలీసులతో రఘునందన్ రావు వాగ్వాదానికి దిగారు.
చదవండి: బండి సంజయ్ అరెస్ట్.. బొమ్మలరామారం పీఎస్ వద్ద హైటెన్షన్!
Comments
Please login to add a commentAdd a comment