Pulasa Season
-
Pulasa Fish: పేరు పులస.. అమ్మేది విలస
ఆత్రేయపురం: పులస సీజన్ వచ్చేసింది. నకిలీ పులసలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. అంటే విలస అన్నమాట. చూసేందుకు పులస, విలస ఒకే రకంగా ఉంటాయి. రుచిలో భారీ తేడా ఉంటుంది. అంతేకాదు. ధరలో కూడా తేడా ఉంటుంది. పులస కేజీ చేప రూ.5 వేల నుంచి రూ.10 వేల వర ధర పలుకుతూండగా నకిలీ పులసను కూడా అదే ధరకు విక్రయిస్తూ పలువురు మోసం చేస్తున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో గోదావరికి భారీగా వరద వస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఉపనదులు తోడుగా గోదావరి పోటెత్తుతుంది. నది ఉధృతంగా ప్రవహించి తిరిగి నీటిమట్టం తగ్గుతున్న సమయంలో సముద్రం నుంచి విలసలు గోదావరి నీటిలోకి ఎదురీదుతూ వస్తాయి. ఆ విధంగా కేంద్ర పాలిత ప్రాంతం యానాం సమీపాన సముద్రం నుంచి గోదావరిలోకి ఎదురు ప్రయాణం ప్రారంభించిన విలసలు సుమారు 40 కిలోమీటర్ల మేర గోదావరిలో ఎదురీత పూర్తయ్యే సరికి పులసలుగా రూపాంతరం చెందుతాయని మత్స్యకారులు అంటారు. ఆ పులసలు కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, ఆలమూరు మండల గ్రామాలైన ఆత్రేయపురం, బొబ్బర్లంక, పేరవరం, రాజవరం, మెర్లపాలెం, చొప్పెల్ల, రావులపాలెం తదితర ప్రాంతాల్లో పులస దొరుకుతుంది. కానీ విలస చేప మాత్రం సముద్రంలోనే దొరుకుతుంది. దీని ధర కేవలం రూ.200 నుంచి రూ.500 లోపే ఉంటుంది. ఒడిశా, ముంబై, విశాఖ తదితర సముద్ర తీర ప్రాంతాల్లో వీటిని పట్టి ఐస్ బాక్సుల్లో నిల్వ చేసి గోదావరి ప్రాంతాలకు ఈ సీజన్లో తరలించి పులస పేరుతో 10 రెట్లు ఎక్కువ ధరకు విక్రయించి మత్స్య ప్రియులను మోసం చేస్తున్నారు. పుస్తెలు అమ్మి అయినా ఏడాదికి ఒక్కసారి పులస కూర తినాలనే నానుడి ఉన్న కోనసీమ వాసులు ఎంత ధరయినా వెనకాడకుండా పులసలు కొని తృప్తిగా ఆరగిస్తున్నారు. అయితే ఈ పులసలు గోదావరిలో ఎర్ర నీరు ఉన్నంత వరకూ మాత్రమే దొరికే అవకాశం ఉండటంతో నకిలీ పులసలను తెచ్చి కొందరు వ్యాపారం చేస్తున్నారు. కొత్తగా పులస చేపల కొనుగోలుకు వస్తున్న వారు విలస బారిన పడి మోసపోతున్నారు. ఇంతకీ పులసకు, విలసకు తేడా గమనిస్తే.. పులస చేప నిగనిగలాడుతూ ఉంటుంది. ఎటువంటి రంగూ లేకుండా పూర్తి తెలుపు రంగులో ఉంటుంది. చల్లదనం అసలే ఉండదు. చేప మొత్తం జిగురుగా అంటే పట్టుకుంటే జారిపోయేలా ఉంటుంది. కేవలం గోదావరి బ్యారేజీల వద్ద లేదా పరీవాహక ప్రాంతంలో మాత్రమే పులస చిక్కుతుంది. విలసగా ఉన్న చేప సముద్రం నుంచి 40 లేదా 50 కిలోమీటర్లు గోదావరికి ఎదురీదుతూ వచ్చి పులసగా మార్పు చెందుతుంది. వీటిని వండిన తరువాత వారం రోజులైనా కూర రుచిగానే ఉంటుంది. విలస (నకిలీ పులస) చేపకు నిగారింపు ఉండదు. ఎరుపు, పసుపు రంగుల్లో ఉంటుంది. చల్లగా ఉంటుంది. ఎందుకంటే ఐస్ బాక్స్‌ల్లో నిల్వ చేస్తారు. చేప పట్టుకుంటే పెద్ద జిగురుగా ఉండదు. ఎక్కడబడితే అక్కడ వీటిని విక్రయిస్తూ ఉంటారు. కేవలం సముద్రంలో మాత్రమే ఇవి దొరుకుతాయి. అక్కడ నుంచి ఐస్ బాక్సుల్లో నిల్వచేసి పులసలు అమ్మే ప్రాంతానికి తరలించి పులస ధరకే వీటిని విక్రయిస్తుంటారు. వీటిని వండిన మరుసటి రోజుకే కూర రుచి తగ్గుతుంది. చేప ప్రియులను మోసం చేస్తున్నారు సముద్రంలో పుట్టిన విలసను గోదావరి జిల్లాలకు తీసుకువచ్చి పులస పేరుతో మత్స్య ప్రియులను మోసం చేస్తున్నారు. పులస కేవలం సముద్రంలోనే పుడుతుంది. అది 20 నుంచి 40 కిలోమీటర్ల మేర గోదావరిలో ఎదురీదిన తరువాత పులసగా మారుతుంది. ఐస్ బాక్సుల్లో విలసను తెచ్చి మత్స్యప్రియులను మోసం చేస్తున్నారు. దాని వల్ల మాలాంటి జాలర్లు నష్టపోతున్నాం. – లంకె వెంకటకృష్ణ, మత్స్యకారుడు, ఆత్రేయపురం -
యాండే.. పులసొచ్చిందండీ.. ఓ చూపు చూడండే! (ఫొటోలు)
-
‘పులస’ ప్రియులకు ఈ ఏడాది నిరాశేనా?
ఏదీ ఆ రుచి? ఆ అమోఘమైన రుచి ఏమైనట్టు? అద్భుతమైన ఆ రుచి ఎటు పోయినట్టు? పుస్తెలు అమ్మైనా పులస తినాలంటారే.. అసలు ఈ ఏడాది పులసల జాడేది? అవి లేకుంటే జిహ్వ చాపల్యం తీరేదెలా? మైమరపించే ఆ రుచిపై మోజు తీరేదెలా? పులసమ్మా.. పులసమ్మా.. ఏమైతివే? ఎటు పోతివే? కాసింత కానరావే..! సాక్షిప్రతినిధి, కాకినాడ: గోదావరి వరద ఉధృతి పులసను ఓడించింది. లక్షలాది క్యూసెక్కుల ప్రవాహానికి ఎదురీదలేక పులస తలవంచింది. సముద్రంలో ఇలసలు గోదావరికి ఎదురీదుతూ పులసలుగా మారతాయి. జూలై – ఆగస్టు నెలల మధ్య పులసల సీజన్. ఆగస్టు వచ్చి మూడు వారాలు గడచినా గోదావరి తీరంలో పులసల జాడ లేదు. మత్స్యకారుల వలకు చిక్కడం లేదు. దీంతో పులసలంటే పడిచచ్చే మాంసాహార ప్రియులు ఉసూరుమంటున్నారు. పులసల సీజన్లో మూడొంతులు గోదావరికి వరదలతోనే గడిచిపోయింది. మునుపెన్నడూ లేని స్థాయిలో జూలైలో వరదలు గోదావరిని ముంచెత్తాయి. అదే వరద ఒరవడి ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీంతో సముద్రంలోని ఇలసలు గోదావరికి ఎదురీదలేక వెనక్కి పోతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. గోదావరిలో ఆగస్టు 10 నుంచి మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. వరద ఉధృతి తీవ్రంగా ఉండటమే పులసలు రాకపోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. సముద్రంలో ఉండే ఇలస(హిల్స)చేప పునరుత్పత్తి కోసం ఎదురీదుతూ గోదావరికి వచ్చే సరికి పులస అవుతుంది. గోదావరి నుంచి సముద్రానికి వచ్చే నీటి ప్రవాహాన్ని తట్టుకుని ఈదుకుంటూ రావాలి. లక్షన్నర నుంచి మూడు లక్షల క్యుసెక్కులు స్థాయిలో గోదావరి నుంచి సముద్రానికి నీటి విడుదల ఉంటే.. సముద్రం వైపు నుంచి విలసలు గోదావరికి రాగలుగుతాయి. ఆగస్టులో వరదలు మొదటి పది రోజులు మూడు లక్షలు, అప్పటి నుంచి 20–8–2022 వరకు ఏ రోజూ 10 లక్షల క్యుసెక్కులకు తక్కువ కాకుండా మిగులు జలాల (వరద నీరు)ను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అలా రోజూ లక్షల క్యుసెక్కుల నీరు సముద్రానికి చేరుతుంటే.. ఆ నీటి ఉధృతిని తట్టుకుని విలసలు సముద్రం నుంచి గోదావరికి ఎదురీదలేకపోతున్నాయి. అలాగే గోదావరి, బంగాళాఖాతం కలిసే సీ మౌత్(నదీ ముఖద్వారం వద్ద)లు మొగలు పూడుకుపోవడం కూడా పులస రాకకు అడ్డుగా మారి ఉండొచ్చని మత్స్యశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో విలసలు గోదావరి వైపు రాకుండా పశ్చిమ బెంగాల్, ఒడిశా వైపు తరలిపోతున్నాయి. ఆ రుచికి.. ఈ రుచికి అసలు పొంతనే లేదు గోదావరిలో పులసలు లభించకపోవడంతో ఒడిశా సముద్ర జలాల్లో లభిస్తున్న విలసలను గోదావరి జిల్లాలకు తెచ్చి జోరుగా విక్రయిస్తున్నారు. ఒడిశా నుంచి ఎదుర్లంక, యానాం, కోటిపల్లి తదితర ప్రాంతాలకు వ్యాన్లలో తీసుకొచ్చి మరీ అమ్ముతున్నారు. అరకిలో విలస రూ.1,000 నుంచి రూ.1,500 పలుకుతోంది. అంతగా రుచి లేకున్నా పులస ప్రియులు అలా సర్దుకుపోతున్నారు. గోదావరిలో లభించే పులస రుచికి, ఈ విలస రుచికి అసలు పొంతనే లేదంటున్నారు. గత సీజన్లో పులసలు ఒక్కోటి కిలో నుంచి నాలుగైదు కిలోల పరిమాణంలో లభించేవి. ధర రూ.10 వేలకు పైనే పలికేది. ఎదురీదలేక.. గోదావరికి ఉధృతంగా వరదలు రావడంతో పులసలు ఎదురీదలేకపోతున్నాయి. దీంతో గోదావరిలో పులసలు కానరావడం లేదు. ప్రస్తుతానికి ఒడిశాలో దొరికిన విలసలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాం. – నాటి పార్వతి, మత్స్యకార మహిళ, యానాం. విచక్షణ రహిత వేటతో పులసలకు ప్రమాదం విచక్షణ రహితంగా సాగుతున్న వేట కారణంగానే గోదావరిలో పులసల సంఖ్య నానాటికీ తగ్గిపోతుంది. గతంలో దాదాపు ఆరు కిలో మీటర్ల మేర మాత్రమే సముద్రంలో వేట సాగేది. ప్రస్తుతం ఆధునిక బోట్లు, వలల కారణంగా వంద కిలో మీటర్లు కూడా వేట సాగుతోంది. ఫలితంగా పలు రకాల చేపలు అంతరించిపోతున్నాయి. అందులో పులస జాతి కూడా ఉంది. – పీవీ కృష్ణారావు, అసిస్టెంట్ డైరెక్టర్, ఫిషరీస్, రాజమహేంద్రవరం -
పులసొచ్చింది.. రుచుల పండుగ తెచ్చింది!
-
పులసొచ్చింది.. రుచుల పండుగ తెచ్చింది!
పులస పులుసు.. ఆ పేరు వింటే చాలు ఉభయ గోదావరి జిల్లావాసులకు నోరూరిపోవాల్సిందే. దాన్ని రుచిచూసిందాకా జిహ్వ మారాం మానదు. పిడకల పొయ్యిపై మట్టి మూకిడిలో సన్నకాకపై వండుతూ.. ఉప్పుకారం తగినంత దట్టించి.. కాసింత ఆవకాయ నూనె తగిలించి.. అరటి ఆకుపై వడ్డించుకుతింటుంటే ఉంటుంది నా సామిరంగా.. అబ్బ ఏం రుచిరాబాబు.. అంటూ లొట్టలేసుకు తినాల్సిందే. అంతటి అమోఘమైన రుచి పులస చేపది. అందుకే పుస్తెలమ్ముకోనైనా పులస తినాలంటారు గోదావరి జిల్లావాసులు. సాక్షి, అమరావతి : గోదావరి తీరానికి పులసల సీజన్ వచ్చేసింది. వరద (ఎర్ర నీరు) నీరు రావడంతో పులసలు సముద్రం నుంచి గోదావరికి ఎదురీదుతూ వచ్చేస్తున్నాయి. దాదాపు అన్ని సముద్రాల్లోనూ ఉండే ఈ చేప రాష్ట్రంలోని గోదావరి జిల్లాల్లో పులస చేపగా ప్రసిద్ధి. పుస్తెలమ్ముకునైనా పులస తినాలనేది గోదావరి జిల్లాల్లో నానుడి. ఏడాదిలో కేవలం జూలై నుంచి సెప్టెంబర్ వరకే పులస లభిస్తుంది. ఎర్రమట్టి తినడం కోసం, సంతానోత్పత్తి కోసం పులస ఈ మూడు నెలల కాలంలో ఉభయగోదావరి జిల్లాల నుంచి ప్రవహించే గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ట, వైనతేయ తదితర నదుల్లోకి వస్తుంది. సముద్రంలో ఉన్నప్పుడు విలస! సముద్రంలో ఉన్నప్పుడు విలసగా పిలిచే ఈ చేపకు గోదావరిలోకి వచ్చాక స్థానికులు ముద్దుగా పులస అనే పేరు పెట్టుకున్నారు. గోదావరి నదీపాయల్లో ప్రవహించే మట్టితో కూడిన వరదనీటిని తాగడం వల్లే పులసకు అంత రుచి వచ్చిందని చెబుతున్నారు. సముద్రం నుంచి ఈదుకుంటూ రాజమహేంద్రవరం సమీపాన ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు వచ్చేసరికి పులస ముదిరిపోతుంది. సముద్ర మొగ (ముఖద్వారం)లో లభించే చేప కంటే ధవళేశ్వరం, ఆత్రేయపురం, వద్దిపర్రు, బొబ్బర్లంక, సిద్దాంతం ప్రాంతాలకు వచ్చేసరికి దాని రుచి బాగుంటుంది. అలా వండితే నా సామిరంగా.. రంపపు పొట్టు లేదా, పిడకల పొయ్యిపై వెడల్పు కలిగిన మట్టి మూకిడిలో సన్నని కాకపై వండాలి. కొత్త ఆవకాయ నూనె, ఆముదం, బెండకాయలు, పెద్ద సైజు పచ్చిమిరపకాయలు వేసి వండితే ఎవరైనా పులస పులుసు లొట్టలేసుకుని తినాల్సిందే. వండిన రోజు కాకుండా తర్వాత రోజు తింటే ఆ టేస్టే వేరట. అరటి ఆకుపై పులస పులుసుతో భోజనం తింటుంటే ఆ రుచి రెట్టింపవుతుందని చెబుతున్నారు స్థానికులు. చుక్కల్లో ధరలు పులసకున్న డిమాండ్‌తో దాని ధర సామాన్యులనే కాదు ఒక మోస్తరు సంపన్నులకు కూడా చుక్కలు చూపిస్తోంది. ప్రస్తుత సీజన్లో కేజీ పులస రూ.3000 నుంచి రూ.5000 పలుకుతోంది. పులస పులుసుకున్న డిమాండు నేపథ్యంలో యానాంకు చెందిన కొప్పిశెట్టి రమణ, రాజు ఆన్లైన్లో పులస పులుసు డోర్ డెలివరీ కోసం పులసఫిష్.కామ్ నడుపుతున్నారు. పొలుసుపై ఎర్రజార ఉంటేనే ఒరిజినల్ డూప్లికేట్ పులసలు మార్కెట్‌కు వస్తున్నాయి. గోదావరి పులస పోలికలతో ఉండే చేపలను ఒడిస్సా నుంచి తెచ్చి విక్రయిస్తున్నారు. గోదావరి పులసల పొలుసుపై ఎర్రజార ఉందో లేదో చూసుకుని కొనుక్కోవాలని మత్స్యకారులు సూచిస్తున్నారు.