Fishing hunting
-
సముద్రంలో చేపల వేటపై 2 నెలల నిషేధం
భోగాపురం: సాగరంలో జలసంపదను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి సంవత్సరం లాగానే చేపలు గుడ్లు పెట్టే సమయం ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు ప్రభుత్వం వేట నిషేధాజ్ఞలు జారీచేసింది. ఈ సమయంలో ఉపాధి కోల్పోనున్న మత్స్యకారులకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తోంది. మత్స్య భరోసా పథకం ద్వారా అదుకుంటుంది. గత ప్రభ్వుత్వం వేట నిషేధ సమయంలో మత్స్యకారులను పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి సంవత్సరం మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో మత్స్యభరోసా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.10 వేలు సాయాన్ని అందిస్తుండడంతో గంగపుత్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 15,138 మంది మత్స్యకారులు విజయనగరం జిల్లాలోని తీరప్రాంత మండలాలు పూసపాటిరేగ, భోగాపురంలో 14 సముద్రతీర మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో 15,138 మంది మత్స్యకారులు ఉన్నారు. వారిలో 10 వేల నుంచి 12 వేల మంది మత్స్యకారులు నిరంతరం సముద్రంలో వేట కొనసాగిస్తుంటారు. రెండు మండలాల్లో 706 మోటార్ బోట్లు, 424 సంప్రదాయ బోట్లకు రిజిస్ట్రేషన్ అయింది. మత్స్యశాఖ అధికారులు మోటార్ బోట్లు, సంప్రదాయ పడవల్లో వేట కొనసాగిస్తున్న 2,335 మంది మత్స్యకారులను గుర్తించి రిజిస్ట్రేషన్ చేయించారు. పారదర్శకంగా అమలు మత్స్యకారులకు మంజూరైన సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నాం. మత్స్య సంపదను వృద్ధి చేసేందుకే ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించి వేట కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. - నిర్మలాకుమారి, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్, విజయనగరం మత్స్యకారులకు భరోసా వేట నిషేధ సమయంలో మత్స్యకారులను అదుకునేందుకు మత్స్యకార భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేలు సాయం అందజేస్తోంది. జిల్లాలో 2,335 మందికి మత్స్యకార భరోసా అందనుంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు పనులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. - వాసుపల్లి రేయుడు, సర్పంచ్ ముక్కాం గ్రామం -
పులస.. తగ్గుతోంది వలస
సృష్టిలో ఏ జీవి అయినా సంతానోత్పత్తి కోసం పుట్టింటికే వెళుతుంది. సముద్ర జలాల్లో జీవించే ఇలసలు సైతం సంతానోత్పత్తి కోసం వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి తమ పుట్టినిల్లయిన గోదావరి నదిలోకి చేరుకుంటాయి. గోదావరి నీటిలోని తీపిని ఆస్వాదిస్తూ.. నదిలోనే సంతానాన్ని వృద్ధి చేస్తాయి. ఈ క్రమంలో వాటి శరీరంలో మార్పులు సంభవించి.. తెల్లటి ఇలసలు కాస్తా ఎరుపు, గోధుమ వర్ణాలను సంతరించుకుని పులసలుగా మారతాయి. సంతానోత్పత్తి అనంతరం తిరిగి సముద్రంలోకి చేరుకుని ఇలసలుగా రూపాంతరం చెందుతాయి. ఇలస.. పులస అవుతుందిక్కడ ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లోని సముద్ర జలాల్లో జీవించే ఈ అరుదైన చేప సంతానోత్పత్తి కోసం హిందూ మహాసముద్రాన్ని దాటి బంగాళాఖాతంలోకి చేరుకుంటుంది. ఆయా ప్రాంతాల్లో దీనిని హిల్సా, హిల్సా హెర్రింగ్, ఇలిషా పేర్లతో పిలుస్తారు. మన ప్రాంతంలో మాత్రం సముద్ర జలాల్లో ఉన్నప్పుడు వీటిని ఇలస అంటారు. వేల కిలోమీటర్ల దూరాన్ని ఈదుకుంటూ గోదావరి, సముద్రం కలిసే ప్రాంతానికి చేరుకుంటాయి. వరదల సమయంలో వచ్చే ఇలసలు ఎర్ర నీటిలోని తీపిదనాన్ని ఆస్వాదిస్తూ.. గోదావరి ప్రవాహానికి ఎదురీదుకుంటూ ముందుకొస్తాయి. ఈ నదిలోనే సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ క్రమంలో వాటి శరీరంలో మార్పులు సంభవిస్తాయి. తెల్లటి ఇలసలు కాస్తా ఎరుపు, గోధుమ వర్ణాలను సంతరించుకుని పులసలుగా మారతాయి. సంతానాన్ని వృద్ధి చేశాక పిల్లలతో తిరిగి బంగాళాఖాతం గుండా హిందూ మహాసముద్రంలోకి వెళ్లిపోతాయి. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఏడాదిలో ఒక్కసారి మాత్రమే లభించే పులస ఉనికి కోల్పోతోందా. అవుననే అంటున్నారు మత్స్య రంగ నిపుణులు. గోదావరికి వరద (ఎర్ర నీరు) వచ్చినప్పుడు మాత్రమే కనిపించే పులస రాక దారుణంగా తగ్గిపోయింది. పులసల సీజన్ మొదలై రెండు నెలలు గడిచిపోయింది. చివరి దశకు చేరుతోంది. అయినా.. గోదావరిలో ఈ ఏడాది పులసల జాడ పెద్దగా కనిపించలేదు. గతంలో కేజీ నుంచి నాలుగైదు కేజీలుండే పులసలు లభించేవి. ఒక్కొక్కటీ రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ధర పలికేవి. ప్రస్తుత సీజన్లో అరకిలో పులస దొరకడమే గగనమైపోయింది. తూర్పు గోదావరి జిల్లా యానాం, కోటిపల్లి, ఎదుర్లంక, ధవళేశ్వరం, రావులపాలెం, కేదార్లంక, పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం, మల్లేశ్వరం, ఖండవల్లి, తీపర్రు, పెండ్యాల, ఆచంట, యలమంచిలి మండలాల్లోని గోదావరి తీరంలో పులసలు విరివిగా దొరికేవి. ప్రస్తుతం ఎక్కడా వీటి జాడ కనబడటం లేదు. తగ్గడానికి కారణాలివీ.. ► సముద్ర ముఖ ద్వారాల నుంచి పులస గోదావరి నదిలోకి ప్రయాణిస్తుంది. అఖండ గోదావరి సముద్రంలో కలిసే ముందు ఏడు పాయలుగా విడిపోయింది. ప్రధాన పాయలైన వశిష్ట, వైనతేయ, గౌతమి పాయల వద్ద ఉండే సముద్ర ముఖద్వారాల నుంచి ధవళేశ్వరం వరకూ సుమారు 60 కిలోమీటర్ల మేర గోదావరి నదిలోకి ఎదురీదుకుంటూ వస్తాయి. కృష్ణా, గోదావరి (కేజీ బేసిన్)లో చమురు కార్యకలాపాలు, ధ్వని కాలుష్యం పెరిగిపోవడంతో పులసలు సముద్రం నుంచి గోదావరి నదిలోకి రావడం లేదు. ► గోదావరి, బంగాళాఖాతం కలిసే ముఖద్వారం వద్ద రిలయన్స్, ఓఎన్జీసీ, కెయిర్న్ ఎనర్జీ తదితర చమురు సంస్ధలు చమురు వెలికితీత పనులు నిర్వహిస్తున్నాయి. ఈ కార్యకలాపాల వల్ల సముద్ర జలాల్లో కంపనాల (వైబ్రేషన్స్)కు భయపడి పులసలు గోదావరి జలాల వైపు రావడం లేదు. ► మరోవైపు సముద్ర ముఖద్వారాల వద్ద ఇసుక మేటలు వేయడం కూడా వాటి రాకకు అడ్డుపడుతున్నాయి. ► గోదావరి పొడవునా రాజమహేంద్రవరం, అంతర్వేది, కరవాక, యానాం సమీప ప్రాంతాల్లో పారిశ్రామిక వ్యర్థాలు గోదావరిలో కలిసిపోతున్నాయి. సల్ఫర్, అమోనియా, లెడ్, పాదరసం ఇతర కర్బనాలు నదిలో కలుస్తున్నాయి. తీరం వెంబడి వేలాది ఎకరాల్లోని రొయ్యల చెరువుల సాగు వ్యర్థాలు నేరుగా గోదావరిలోనే కలుస్తున్నాయి. దాదాపు అన్ని నదీపాయల పరిధిలో రొయ్యల సాగు జరుగుతోంది. ఈ పాయల పరిధిలో డంపింగ్ యార్డులు కూడా ఉన్నాయి. ఆక్వా సాగులో యాంటీ బయోటిక్స్‌తో పాటు పటిక(అం) వినియోగిస్తారు. గోదావరి నుంచి ఈ అవశేషాలన్నీ సముద్రంలో కలుస్తుండటంతో పులస గోదావరిలోకి రావడం తగ్గిపోయింది. ► సముద్రంలో చేపల వేట విచక్షణా రహితంగా సాగటం కూడా పులస అంతరించిపోవడానికి మరో కారణం. కాలుష్యంతో పులస మనుగడకే ముప్పు గోదావరి నది కాలుష్యంతో పాటు విచక్షణా రహితంగా సాగుతున్న వేట వల్ల గోదావరి నదిలో పులసల సంఖ్య పదేళ్లుగా తగ్గుతూ వస్తోంది. ఆధునిక వలలతో లోతు జలాల్లో వేట సాగుతోంది. దీనివల్ల పులసల పునరుత్పత్తి తగ్గిపోతోంది. ఈ తగ్గుదల ఆందోళనకరంగా ఉంది. మత్స్యకారులకు సూచనలు చేసినా పెద్దగా ఫలితం ఉండడం లేదు. – పీవీ కృష్ణారావు,అసిస్టెంట్ డైరెక్టర్, ఫిషరీస్ చమురు కార్యకలాపాలూ ప్రధాన కారణం సముద్ర జలాల్లో చమురు కార్యకలాపాలే పులసల తగ్గుదలకు ప్రధాన కారణం. అధిక వేట, నీటి కాలుష్యం కూడా దీనికి కారణాలే. బ్రీడింగ్ సమయంలో వేట నిషేధం కఠినతరం చేయాలి. పరిశ్రమలు, పట్టణాల కాలుష్యం గోదావరిలోకి వదిలేయటాన్ని నివారించాలి. – డాక్టర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, జువాలజీ విభాగం యానాం -
చేపా చేపా.. ఎప్పుడేదుగుతవ్ !
సాక్షి, మంచిర్యాల : మత్స్యకారులకు ఉపాధి కల్పించే నీలి విప్లవంపై జిల్లాలో నిర్లక్ష్యం కొనసాగుతోంది. జలాశయాల్లో చేపపిల్లలు వదిలే కార్యక్రమంలో జాప్యం కావడంతో అనుకున్న లక్ష్యం నెరవేరదే మో.. నని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో చేపపిల్లలను చెరువులు, కుంటలు, జలశయాల్లో వదిలితే ఏప్రిల్, మే నాటికి మత్స్యసంపద చేతికొచ్చేదని.. ఇప్పుడు వేస్తే అనుకున్న ఫలితం ఉండదని అంటున్నారు. జిల్లాలో ఈ ఏడాది 2 కోట్ల 23 లక్షలు చేపపిల్లలు ఆయా జలాశయాల్లో వదలా లని లక్ష్యంగా పెట్టుకున్నా.. శుక్రవారంనాటికి నాలుగోవంతు కూడా పూర్తి కాలేదు. వర్షాకాలం ముగిశాక చేపపిల్లలు వేసినా.. అవి ఎదగడం కష్టంగానే ఉంటుంది. అధికారుల నిర్లక్ష్యం, సరై న ప్రణాళిక లేని కారణంగా జిల్లా మత్స్యసంపదకు దూరం కానుంది. లక్ష్యం 2.23 కోట్లు.. వేసింది 32.5 లక్షలు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడు కూడా ప్రభుత్వం జలాశయాల్లో చేపపిల్లలు వదిలేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ ఏడాది జిల్లాలో 2 కోట్ల 23 లక్షల 89 వేల చేపపిల్లలను వదలాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం జిల్లాలోని 274 జలాశయాలను గుర్తించింది. దీంతోపాటు ఎల్లంపల్లి, సుందిళ్ల ప్రాజెక్టులలో 2.63 లక్షల రొయ్య పిల్లలను కూడా వదలాలని నిర్ణయించింది. జిల్లాలో రొహు, కట్ల, బొచ్చ చేపపిల్లల ద్వారా 20 వేల టన్నుల చేపలు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ వర్షాకాలం ముగింపు దశకు వచ్చినా.. లక్ష్యం పాతిక శాతం కూడా పూర్తి కాకపోవడం విమర్శలకు తావునిస్తోంది. 35 నుంచి 40 ఎంఎం సైజు చేపపిల్లలు 1.50 లక్షలు, 80 నుంచి 100 ఎంఎం సైజు గల 68,089 చేపపిల్లలు చెరువుల్లో వదిలేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలో వర్షకాలం ఆరంభంలో ఆశించిన వర్షాలు లేకపోవడంతో చేపలను వదలలేదు. గత నెల భారీ వర్షాలు కురవడంతో సుందిళ్ల బ్యారేజీ బ్యాక్‌వాటర్ మంచిర్యాల గోదావరిలోకి చేరింది. ఈ క్రమంలోనే గతనెల 19న కలెక్టర్ భారతిహోళికేరి, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు తొమ్మిది లక్షల చేపపిల్లలను వదిలారు. అదే నెలలో చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారం బ్యారేజ్‌లో 15 లక్షల చేప పిల్లలను వదిలారు. గురువారం బెల్లంపల్లి ఎమ్మెల్యే 30వేల చేపపిల్లలను వదిలారు. మొత్తం కలిపి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 32.5 లక్షల వరకు చేపపిల్లలను మాత్రమే వదిలారు. ఇప్పుడేస్తే...ఎదిగేదెట్లా..? జిల్లాలో 72 మత్య్సకార సంఘాల్లో 4,850 మంది సభ్యులు ఉన్నారు. కాలం దాటిన తరువాత చేపపిల్లలు వేస్తే అవి ఎదిగేదెట్లా అని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటికే చెరువులు, కుంటల్లో చేపపిల్లలను మొత్తం వదలాల్సి ఉంది. జూన్, జూలైలో ఆశించిన వర్షాలు కురువక పోవడంతో జలాశయాల్లోకి నీరు చేరక చేపపిల్లలు వదలేదు. ఆగస్టు నెలలో భారీ వర్షాలు కురవడంతో నీళ్లు ఎక్కువై, చెరువుల నుంచి వెళ్లిపోతున్నాయని వేయలేదు. కారణాలేవైనా ఇప్పుడు చేపపిల్లలు వేయడం వల్ల పెద్దగా ఫలితం ఉండదని మత్స్యకారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పంటల సాగుకు చెరువుల్లోంచి నీటిని వదులుతున్నారు. దీంతో చేపపిల్లల మనుగడ కష్టంగా మారుతోంది. జూలై, ఆగస్టులో చేపపిల్లలను వేస్తే ఏప్రిల్, మే నాటికి ఒక్కో చేప మూడు నుంచి నాలుగు కిలోల వరకు ఎదుగుతుంది. కానీ.. ఇప్పుడు వేయడం వల్ల కిలో నుంచి కిలోన్నర కంటే మించి పెరగదని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. వర్షకాలం ముగింపు లోపు చేపపిల్లలను వదిలితే, చెరువుల్లో నీరుండడం వల్ల వాటికి సరిపడా ఆహారం అభిస్తుంది. ఆలస్యంగా వదిలితే నీరు తగ్గిపోతుండడం, ఆహారం లభించకపోవడం, వాతావరణ మార్పులతో ఆక్సిజన్ లభించక చేపపిల్లల ఎదుగుదల నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరిగితే చేపపిల్లలు మత్యువాతపడే అవకాశం ఉంటుందని మత్స్యకారులు వాపోతున్నారు. అధికారులు మాత్రం చేపపిల్లల ఎదుగుదలకు ఎలాంటి ఇబ్బందీ లేదంటున్నారు. ఏదేమైనా లక్ష్యంలో కనీసం పాతిక శాతం కూడా ఇప్పటివరకు పూర్తికాకపోగా.. మిగిలిన వాటికి మరింత సమయం పడుతుండడంపై మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. నెలాఖరుకు లక్ష్యం పూర్తి చేస్తాం ఈ నెలాఖరు వరకు జిల్లా లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. చేపపిల్లలు వేయడం ఆలస్యం కాలేదు. ఇప్పుడు వేసినా ఆరు నెలల సమయం ఉంటుంది కాబట్టి చేపపిల్లలు పెరగవనే ప్రశ్నేలేదు. ఏప్రిల్‌లో చేపలు పడుతారు కాబట్టి ఆలోపు బరువు పెరుగతాయి. రెండు సంవత్సరాల క్రితం అక్టోబర్‌లో వేశాం. జలాశయాలకు నీళ్లు రావడం, ఆ నీళ్లు వెళ్లిపోతుండడంతో చేపలు వేసినా ప్రయోజనం ఉండేది కాదు. అందుకే ఈ నెలలో చేపపిల్లలు వేయడాన్ని పూర్తి చేస్తున్నాం. – సత్యనారాయణ, ఏడీ, మత్స్యశాఖ చేపపిల్లలు ఎదగకపోతే నష్టం పోయిన నెల భారీ వర్షాలతో చెరువులు, కుంటులు, ప్రాజెక్టులు నిండినయి. అప్పుడే చేపపిల్లలు వేసేదుండే. వానకాలం అయిపోవడానికి వచ్చింది. ఎండలు ముదరక ముందే పిల్లలు వదిలితే ఎదుగుదల ఉంటుంది, సాగుకు చెరువుల్లో నీటిని వదలుతే నీరుతగ్గి చేపల ఎదగవు. ఆలస్యమైతే చేపపిల్లలు పెరగక నష్టపోతాం. – కంపెల రమేష్, మత్స్యకారుడు, నెన్నెల -
చేపలవేట 14 అర్థరాత్రి నుంచి విరామం
మరోసారి వేట నిషేధం అమల్లోకి రాబోతోంది. చేపల సంతతిని పెంచి, మత్స్యకారులకు ప్రయోజనం కల్పించే ధ్యేయంతో ప్రభుత్వం అమలు చేస్తున్నవేట విరామం రెండు నెలల పాటు అమలు కాబోతోంది. నిషేధం పర్యవసారంగా యంత్రాలతో నడిచే బోట్లు మొత్తం నిలిచిపోనున్నాయి. సంప్రదాయ మత్స్యకారులు మాత్రం వేట కొనసాగించే వీలుంది. నిషేధ కాలంలో ప్రభుత్వ సాయం అంతంత మాత్రమే కావడంతో వేలాది మంది మత్స్యకారుల జీవితాలు మాత్రం ఆటుపోట్లకు గురికాబోతున్నాయి. వేట సాగక, పూట గడవక చాలామంది కూలి పనులకు వెళ్లి బతుకు బండిని లాగాల్సిన పరిస్థితి అనివార్యమనిపిస్తోంది. విశాఖపట్నం, పాతపోస్టాఫీసు: తూర్పు తీరంలో ఆదివారం అర్థరాత్రి నుంచి చేపల వేట నిలిచిపోనుంది. మత్స్యకారులకు విరామం దొరకనుంది. పది నెలల అవిశ్రాంత వేటకు రెండు నెలల విశ్రాంతి లభించనుంది. సముద్రంలో చేపల ఉత్పత్తికి వీలుగా ప్రభుత్వం ఏటా ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి జూన్ 15 అర్ధరాత్రి వరకూ చేపల వేటపై నిషేధాన్ని అమలు చేస్తుంది. గడిచిన ఏడాదిలో ఏప్రిల్ 15 నుంచి మొత్తం 61 రోజుల పాటు వేటను నిలిపేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ జూన్ 14 అర్థరాత్రి నుంచి చేపల వేట మొదలు కానుంది. ఈవిరామ సమయంలో మత్స్యసంపద పెరిగి ఏడాది పాటు వాటి లభ్యతకు వీలవుతుంది. నిషేధం నుంచి సంప్రదాయ పడవలకు మినహాయింపు ఉంటుంది. 2014 వరకూ నిషేధం 47 రోజులుగా పరిగణించేవారు. అయితే మత్స్యకార సంఘాలు, బోట్ల ఆపరేటర్ల విజ్ఞప్తి మేరకు గడువును 2015 నుంచి 61 రోజులకు పొడిగించారు. అనుమతి లేని బోట్లు వేట కాలంలో 708 మెకనైజ్డ్ బోట్లు (మరపడవలు), 3,500 పైచిలుకు ఇంజిను పడవలు, 1000 తెప్పలు చేపలు, రొయ్యలు వేట సాగిస్తాయి. . మరపడవలు, డాల్ఫిన్ బోట్లు ఒకసారి వేటకు సముద్రంలోకి వెళ్తే కనీసం పదిహేను రోజుల నుంచి 20 రోజుల పాటు సముద్రంలోనే ఉండిపోతాయి. ఈ సమయంలో సింగిల్ ఇంజన్లతో నడిచే బోట్లను కూడా వేటకు అనుమతించరు. ఒకవేళ నిబంధనలకు వ్యతిరేకంగా వేటకు వెళ్లిన ఈ తరహా బోట్లను మత్స్యశాఖ అధికారులు పట్టుకొని సీజ్ చేస్తారు. దెబ్బతీసిన హుద్‌హుద్ 2014 అక్టోబర్‌లో సంభవించిన హుద్‌హుద్ తుపాను బోటు యజమానులను దెబ్బతీసింది. 66 బోట్లు మునిగిపోగా, మరో 200 బోట్లకు నష్టం వాటిల్లింది. సుమారు 3 వారాల పాటు వేట నిలిచిపోయింది. 2015–16 సీజన్లో కూడా చేప, రొయ్యల దిగుబడి తగ్గింది ఆ ఏడాదితో పోల్చితే మూడేళ్లుగా దిగుబడి బాగా పడిపోయింది. తీరానికి అతి చేరువలో ఏర్పాటు చేసిన రసాయన కర్మాగారాల వల్ల చేపలు గుడ్లు, పిల్లల దశలోనే నశించిపోతున్నాయి. దీంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందని బోట్ల యజమానులు చెబుతున్నారు. ఈ సీజన్లో గత ఏడాది డిసెంబరు నుంచి దిగుబడులు తగ్గిపోయాయి. రెండు నెలల నుంచి 80 శాతం బోట్లు రేవుకే పరిమితం అయ్యాయి. వేట ఆశాజనకంగా లేకపోవడం, సముద్రం ఆటుపోట్లలో మార్పులతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన 20 శాతం బోట్లు వేటనిషేధం ప్రకటించిన నేపద్యంలో ఒడ్డుకు చేరుకుంటున్నాయి. వెనుతిరిగిన బోట్లుఈనెల 15 అర్ధరాత్రి నుంచి నిషేధం అమలులోకి వస్తుండడంతో ఇప్పటికే సముద్రంలో వేట సాగిస్తున్న పడవలు తిరుగు ముఖం పట్టాయి. అత్యధిక శాతం బోట్లు ఫిషింగ్ హార్బర్లో లంగరేసుకున్నాయి. మిగిలినవి 15 ఉదయానికల్లా హర్బర్‌కు చేరుకోనున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిషేధాన్ని విధిగా ఆమలు చేయాలని సంబంధిత మత్స్యకారులను మత్స్యశాఖ అధికారులు కోరారు. సంప్రదాయ పడవలకు అనుమతి.. మెకనైజ్డ్ బోట్లు (మరపడవలు), సింగిల్ ఇంజన్ బోట్లు, స్పీడ్ బోట్లకు మాత్రం వేటకు అనుమతి లేదు. సంప్రదాయ పడవలు, తెప్పలలో వేటాడేవారికి అనుమతి ఉంది. ఎందుకంటే అవి తీరానికి అతి చేరువలోనే ప్రయాణిస్తూ వేటను సాగిస్తాయి. అతిక్రమిస్తే జరిమానా నిషేధాన్ని ఉల్లంఘించి మరబోట్లు, మెకనైజ్డ్ బోట్ల ద్వారా చేపలవేట సాగిస్తే చర్యలు తీసుకుంటాం. అలాంటి వారికి రూ.5వేల వరకూ జరిమానా విధిస్తాం. వారు వేటాడిన చేపలు స్వాధీనం చేసుకుని అమ్మగా వచ్చిన సొమ్మును ప్రభుత్వానికి జమ చేస్తాం. అంతేకాదు..వారికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలకు అనర్హులను చేస్తాం. అందువల్ల మత్స్యకారులు వేట నిషేధం అమలుకు సహకరించాలి. పెద్ద బోట్లలో 8 మందికి, చిన్న బోట్లలో (ఫైబర్) ఆరుగురి చొప్పున కలాసీలను గుర్తించి ఈ ఏడాది ఒక్కక్కరికి రూ.4వేలు అందజేస్తాం. గత సీజన్లో 15,356 మంది కార్మికులను గుర్తించి ఒక్కొక్కరికి రూ.4వేల చొప్పున ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈనెల 17, 18, 19 తేదీల్లో మత్స్యకార కార్మికులను గుర్తించేందుకు మత్స్యశాఖ సిబ్బంది సర్వే మొదలు పెడతారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 15,000 మంది వరకూ గుర్తింపు పొందే అవకాశం ఉంది. సాఫ్ట్‌వేర్‌లో సమస్య, తగిన పత్రాలు సమర్పించకపోవడం వల్ల గతేడాది కొంతమందికి పరిహారం అందలేదు. మరికొందరు అసలు దరఖాస్తు చేసుకోలేదు. ఈ ఏడాది అటువంటి సమస్య తెలత్తకుండా అర్హులందరిని గుర్తించి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం– కోటేశ్వరరావు,మత్స్యశాఖ ఇన్చార్జ్ సంయుక్త సంచాలకులు నష్టాలు చవిచూశాం 2014 హుద్‌హుద్ తుపాను వచ్చిన నాటి నుంచి నష్టాలు చవిచూస్తునే ఉన్నాం. ప్రస్తుత సీజ న్లో చేపలు, రొయ్యల వేట ఆశాజనకంగా లేదు. ప్రభుత్వం బోటు యజమానులను ఆదుకోవాలి. రసాయన కర్మాగారాల వల్ల సముద్ర ఉత్పత్తులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలి– బర్రి కొండబాబు, విశాఖ కోస్టల్ బోటు ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు సకాలంలో పరిహారం చెల్లించాలి మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.4వేలు చెల్లిస్తున్నారు. వేట ముగిసే సమయానికి అందిస్తే వారికి మేలు జరిగేది. ఐదు నెలలుగా వేట సాగని కారణంగా చాల బోట్లు రేవుకే పరిమితం అయ్యాయి. బోట్ల యజమానులు ఈ సీజన్లో ఆర్థికంగా చాలా నష్టపోయారు.– సిహెచ్.సత్యనారాయణ మూర్తి, డాల్ఫిన్ మరపడవల సంఘం అధ్యక్షుడు -
చేపల వేటపై నిషేధం.. షరతులు!
బీజింగ్: నదీజలాల్లో లభ్యమయ్యే జీవ సంపదను సంరక్షించేందుకుగానూ చైనా ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగా ప్రతి ఏడాది మూడు నెలలపాటు చైనాలోని పొడవైన నదుల్లో రెండోదైన ఎల్లో రివర్ (పసుపు నది), లేక హోయాంగ్లో చేపల వేటను నిషేధిస్తూ సోమవారం నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు మత్స్యకారులు, ఇతరులు పసుపు నది తీరంలో వేటకు వెళ్లొద్దని వ్యవసాయ మంత్రిత్వశాఖ అధికారులు ఓ ప్రకనటలో వెల్లడించారు. చైనాలో అతిపొడవైన నది యాంగ్ట్జే లో 2002నుంచి పూర్తి స్థాయిలో చేపలు, ఇతర జలచరాల వేటను అధికారులు నిషేధించారు. పెరల్ నది తీరంలోనూ ఫిషింగ్ నిషేధిస్తూ చైనా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో చేపలవేట నిషేధించిన మూడోనదిగా ఎల్లో రివర్ (పసుపు నది) నిలిచింది. ఈ ఏప్రిల్ నుంచి చేపలవేటపై నిషేధం అమల్లోకి వస్తుంది. మూడు పెద్ద సరస్సులు, 13 పెద్ద కాలువలు ఎల్లో రివర్‌తో అనుసంధానమై ఉన్నాయి. కాగా, మత్స్యసంపదకు ఆటంకాలు తలెత్తుతున్నాయన్న కారణంతో ప్రతి ఏడాది కొంతకాలం చేపల వేటపై నిషేధం విధిస్తున్నట్లు వ్యవసాయ మంత్రిత్వశాఖ అధికారులు వివరించారు. అనుమతి లేకుండా ఎక్కడైనా చేపలవేట కొనసాగించినట్లు గుర్తిస్తే ఆ మత్స్యకారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
దీని దుంప తెగ
వేలేరుపాడు: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల గిరిజనుల సంసృతీ సంప్రదాయాలతో పాటు నాగరికత, ఆహారపు అలవాట్లకు ముప్పు ఏర్పడనుంది. అడవిలో లభించే కందమూలాలు, దుంపలు, వివిధ రకాల పండ్ల వంటివి తుడిచిపెట్టుకుపోనున్నాయి. అడవితో వారికున్న అనుబంధం, సీజనల్ వారీగా వారికి లభించే సహజసిద్ధ ఆహారం ఇక మీదట వారికి దూరం కానుంది. ఇష్టమైన చేపలవేట, బొంగు చికెన్ వంటి వాటికి కూడా గిరిజనులు నోచుకోకుండా పోతున్నారు. వెదురు బియ్యం.. బొంగు చికెన్‌కు ‘ముంపు’ అడవిలో దొరికే వెదురు బియ్యం గిరిజనులకు ఎంతో బలవర్ధకమైన ఆహారం. వెదురు ముదురు పిడియాలకు మాత్రమే బియ్యం వస్తాయి. పూతరూపంలో వచ్చి, గింజలు బయటికి వస్తాయి. వీటిని దంచుకొని అన్నం వండుకొని తింటారు. ఈ అన్నం తింటే సంతానం ప్రాప్తిస్తుందని గిరిజనులు చెబుతున్నారు. అంతేకాక వెదురు పిడియంతో బొంగుచికెన్ కూడా తయారుచేసుకొని తింటారు. ఏదైనా మాంసాన్ని పచ్చివెదురు పిడియం( గొట్టం)లో నింపుతారు. దానిని మంటలో వేసి కాలుస్తారు. వేడి వల్ల పిడియంలో మాంసం ఉడుకుతుంది. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే వెదురు కొమ్ముల కూర కూడా తింటారు. ఇక చేపలవేట లేనట్టేనా...? చేపల వేటకు గిరిజనులు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఎక్కడ చేపలున్నా ఊరంతా చిన్నాపెద్ద తేడాలేకుండా అక్కడికి చేరుకొని వేట ప్రారంభిస్తారు. వారు సొంతంగా వెదురుబద్దలతో తయారు చేసిన వలలను వేటకు వాడతారు. ఎక్కువగా గ్రామాల్లో కుంటలు, చెరువులు, గోదావరి మడుగుల్లో చేపల వేట సాగిస్తారు. ఎన్ని చేపలు దొరికినా సరే అందరూ సమంగా పంచుకుంటారు. బొద్దుకూర ఇక బందేనా..! అడవిలో దొరికే బొద్దుకూర తీగ, పొట్టను కూరచేసుకొని తింటారు. బొద్దుకూర తియ్యగా ఉంటుంది. అడవి పొట్ట మనం తినే మొక్కజొన్నను పోలి వుంటుంది. దీనిని ముందుగా ఒలిచి ఉడకబెట్టి, ఆ తర్వాత కూర వండుకొని తింటారు. ఇది కూడా చాలా బలమైన ఆహారంగా గిరిజనులు చెబుతున్నారు. కందమూలాలూ కనుమరుగు అటవీ ప్రాంతంలో లభ్యమయ్యే ట్యాగ, అడవి కంద, పంది దుంపలంటే గిరిజనులకు చాలా ఇష్టం. కూరగాయలన్నింటిలో ఉండే పోషకాలు ఈ దుంపల్లోనే ఉంటాయని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో గిరిజనులు దుంపల అన్వేషణలో మునిగిపోతారు. ఇవి దట్టమైన అటవీ ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయి. ఉడకబెట్టుకొనిగానీ, కాల్చుకొని గానీ తింటే ఆ మజాయే వేరని గిరిజనులు అంటున్నారు. ఇవి ఉదయం ఒక్కసారి తింటే ఆ రోజంతా అసలు ఆకలే కాదని, శరీరమంతా ఎంతో ఉల్లాసంగా ఉంటుందని పేర్కొంటున్నారు. తాటి, జీలుగు కల్లు తాగలేమా..? గిరిజనులు పూర్వం నుంచి తాటి వృక్షాలు పెంచడం ఆనవాయితీ. వారు సాగు చేసుకునే భూముల గట్లవెంట వీటిని పెంచుతారు. వీటి ద్వారా వచ్చే కల్లును ఇష్టంగా తాగుతారు. ఆడ, మగ, పిల్లాజెల్లా తేడా లేకుండా అంతా ఒకచోట చేరి కల్లును ఆస్వాదిస్తారు.అడవిలో దొరికే జీలుగు కల్లును కూడా ఇష్టపడతారు. కల్లు సీజన్లో ఆహారం కన్నా దీనికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.