
బీజింగ్: నదీజలాల్లో లభ్యమయ్యే జీవ సంపదను సంరక్షించేందుకుగానూ చైనా ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగా ప్రతి ఏడాది మూడు నెలలపాటు చైనాలోని పొడవైన నదుల్లో రెండోదైన ఎల్లో రివర్ (పసుపు నది), లేక హోయాంగ్‌లో చేపల వేటను నిషేధిస్తూ సోమవారం నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు మత్స్యకారులు, ఇతరులు పసుపు నది తీరంలో వేటకు వెళ్లొద్దని వ్యవసాయ మంత్రిత్వశాఖ అధికారులు ఓ ప్రకనటలో వెల్లడించారు.
చైనాలో అతిపొడవైన నది యాంగ్ట్‌జే లో 2002నుంచి పూర్తి స్థాయిలో చేపలు, ఇతర జలచరాల వేటను అధికారులు నిషేధించారు. పెరల్ నది తీరంలోనూ ఫిషింగ్ నిషేధిస్తూ చైనా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో చేపలవేట నిషేధించిన మూడోనదిగా ఎల్లో రివర్ (పసుపు నది) నిలిచింది. ఈ ఏప్రిల్ నుంచి చేపలవేటపై నిషేధం అమల్లోకి వస్తుంది.
మూడు పెద్ద సరస్సులు, 13 పెద్ద కాలువలు ఎల్లో రివర్‌తో అనుసంధానమై ఉన్నాయి. కాగా, మత్స్యసంపదకు ఆటంకాలు తలెత్తుతున్నాయన్న కారణంతో ప్రతి ఏడాది కొంతకాలం చేపల వేటపై నిషేధం విధిస్తున్నట్లు వ్యవసాయ మంత్రిత్వశాఖ అధికారులు వివరించారు. అనుమతి లేకుండా ఎక్కడైనా చేపలవేట కొనసాగించినట్లు గుర్తిస్తే ఆ మత్స్యకారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment