మరోసారి వేట నిషేధం అమల్లోకి రాబోతోంది. చేపల సంతతిని పెంచి, మత్స్యకారులకు ప్రయోజనం కల్పించే ధ్యేయంతో ప్రభుత్వం అమలు చేస్తున్నవేట విరామం రెండు నెలల పాటు అమలు కాబోతోంది. నిషేధం పర్యవసారంగా యంత్రాలతో నడిచే బోట్లు మొత్తం నిలిచిపోనున్నాయి. సంప్రదాయ మత్స్యకారులు మాత్రం వేట కొనసాగించే వీలుంది. నిషేధ కాలంలో ప్రభుత్వ సాయం అంతంత మాత్రమే కావడంతో వేలాది మంది మత్స్యకారుల జీవితాలు మాత్రం ఆటుపోట్లకు గురికాబోతున్నాయి. వేట సాగక, పూట గడవక చాలామంది కూలి పనులకు వెళ్లి బతుకు బండిని లాగాల్సిన పరిస్థితి అనివార్యమనిపిస్తోంది.
విశాఖపట్నం, పాతపోస్టాఫీసు: తూర్పు తీరంలో ఆదివారం అర్థరాత్రి నుంచి చేపల వేట నిలిచిపోనుంది. మత్స్యకారులకు విరామం దొరకనుంది. పది నెలల అవిశ్రాంత వేటకు రెండు నెలల విశ్రాంతి లభించనుంది. సముద్రంలో చేపల ఉత్పత్తికి వీలుగా ప్రభుత్వం ఏటా ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి జూన్ 15 అర్ధరాత్రి వరకూ చేపల వేటపై నిషేధాన్ని అమలు చేస్తుంది. గడిచిన ఏడాదిలో ఏప్రిల్ 15 నుంచి మొత్తం 61 రోజుల పాటు వేటను నిలిపేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ జూన్ 14 అర్థరాత్రి నుంచి చేపల వేట మొదలు కానుంది. ఈవిరామ సమయంలో మత్స్యసంపద పెరిగి ఏడాది పాటు వాటి లభ్యతకు వీలవుతుంది. నిషేధం నుంచి సంప్రదాయ పడవలకు మినహాయింపు ఉంటుంది. 2014 వరకూ నిషేధం 47 రోజులుగా పరిగణించేవారు. అయితే మత్స్యకార సంఘాలు, బోట్ల ఆపరేటర్ల విజ్ఞప్తి మేరకు గడువును 2015 నుంచి 61 రోజులకు పొడిగించారు.
అనుమతి లేని బోట్లు
వేట కాలంలో 708 మెకనైజ్డ్ బోట్లు (మరపడవలు), 3,500 పైచిలుకు ఇంజిను పడవలు, 1000 తెప్పలు చేపలు, రొయ్యలు వేట సాగిస్తాయి. . మరపడవలు, డాల్ఫిన్ బోట్లు ఒకసారి వేటకు సముద్రంలోకి వెళ్తే కనీసం పదిహేను రోజుల నుంచి 20 రోజుల పాటు సముద్రంలోనే ఉండిపోతాయి. ఈ సమయంలో సింగిల్ ఇంజన్లతో నడిచే బోట్లను కూడా వేటకు అనుమతించరు. ఒకవేళ నిబంధనలకు వ్యతిరేకంగా వేటకు వెళ్లిన ఈ తరహా బోట్లను మత్స్యశాఖ అధికారులు పట్టుకొని సీజ్ చేస్తారు.
దెబ్బతీసిన హుద్‌హుద్
2014 అక్టోబర్‌లో సంభవించిన హుద్‌హుద్ తుపాను బోటు యజమానులను దెబ్బతీసింది. 66 బోట్లు మునిగిపోగా, మరో 200 బోట్లకు నష్టం వాటిల్లింది. సుమారు 3 వారాల పాటు వేట నిలిచిపోయింది. 2015–16 సీజన్‌లో కూడా చేప, రొయ్యల దిగుబడి తగ్గింది ఆ ఏడాదితో పోల్చితే మూడేళ్లుగా దిగుబడి బాగా పడిపోయింది. తీరానికి అతి చేరువలో ఏర్పాటు చేసిన రసాయన కర్మాగారాల వల్ల చేపలు గుడ్లు, పిల్లల దశలోనే నశించిపోతున్నాయి. దీంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందని బోట్ల యజమానులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో గత ఏడాది డిసెంబరు నుంచి దిగుబడులు తగ్గిపోయాయి. రెండు నెలల నుంచి 80 శాతం బోట్లు రేవుకే పరిమితం అయ్యాయి. వేట ఆశాజనకంగా లేకపోవడం, సముద్రం ఆటుపోట్లలో మార్పులతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన 20 శాతం బోట్లు వేటనిషేధం ప్రకటించిన నేపద్యంలో ఒడ్డుకు చేరుకుంటున్నాయి.
వెనుతిరిగిన
బోట్లుఈనెల 15 అర్ధరాత్రి నుంచి నిషేధం అమలులోకి వస్తుండడంతో ఇప్పటికే సముద్రంలో వేట సాగిస్తున్న పడవలు తిరుగు ముఖం పట్టాయి. అత్యధిక శాతం బోట్లు ఫిషింగ్ హార్బర్లో లంగరేసుకున్నాయి. మిగిలినవి 15 ఉదయానికల్లా హర్బర్‌కు చేరుకోనున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిషేధాన్ని విధిగా ఆమలు చేయాలని సంబంధిత మత్స్యకారులను మత్స్యశాఖ అధికారులు కోరారు.
సంప్రదాయ పడవలకు అనుమతి..
మెకనైజ్డ్ బోట్లు (మరపడవలు), సింగిల్ ఇంజన్ బోట్లు, స్పీడ్ బోట్లకు మాత్రం వేటకు అనుమతి లేదు. సంప్రదాయ పడవలు, తెప్పలలో వేటాడేవారికి అనుమతి ఉంది. ఎందుకంటే అవి తీరానికి అతి చేరువలోనే ప్రయాణిస్తూ వేటను సాగిస్తాయి.
అతిక్రమిస్తే జరిమానా
నిషేధాన్ని ఉల్లంఘించి మరబోట్లు, మెకనైజ్డ్ బోట్ల ద్వారా చేపలవేట సాగిస్తే చర్యలు తీసుకుంటాం. అలాంటి వారికి రూ.5వేల వరకూ జరిమానా విధిస్తాం. వారు వేటాడిన చేపలు స్వాధీనం చేసుకుని అమ్మగా వచ్చిన సొమ్మును ప్రభుత్వానికి జమ చేస్తాం. అంతేకాదు..వారికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలకు అనర్హులను చేస్తాం. అందువల్ల మత్స్యకారులు వేట నిషేధం అమలుకు సహకరించాలి. పెద్ద బోట్లలో 8 మందికి, చిన్న బోట్లలో (ఫైబర్) ఆరుగురి చొప్పున కలాసీలను గుర్తించి ఈ ఏడాది ఒక్కక్కరికి రూ.4వేలు అందజేస్తాం. గత సీజన్‌లో 15,356 మంది కార్మికులను గుర్తించి ఒక్కొక్కరికి రూ.4వేల చొప్పున ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈనెల 17, 18, 19 తేదీల్లో మత్స్యకార కార్మికులను గుర్తించేందుకు మత్స్యశాఖ సిబ్బంది సర్వే మొదలు పెడతారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 15,000 మంది వరకూ గుర్తింపు పొందే అవకాశం ఉంది. సాఫ్ట్‌వేర్‌లో సమస్య, తగిన పత్రాలు సమర్పించకపోవడం వల్ల గతేడాది కొంతమందికి పరిహారం అందలేదు. మరికొందరు అసలు దరఖాస్తు చేసుకోలేదు. ఈ ఏడాది అటువంటి సమస్య తెలత్తకుండా అర్హులందరిని గుర్తించి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం– కోటేశ్వరరావు,మత్స్యశాఖ ఇన్‌చార్జ్ సంయుక్త సంచాలకులు
నష్టాలు చవిచూశాం
2014 హుద్‌హుద్ తుపాను వచ్చిన నాటి నుంచి నష్టాలు చవిచూస్తునే ఉన్నాం. ప్రస్తుత సీజ న్‌లో చేపలు, రొయ్యల వేట ఆశాజనకంగా లేదు. ప్రభుత్వం బోటు యజమానులను ఆదుకోవాలి. రసాయన కర్మాగారాల వల్ల సముద్ర ఉత్పత్తులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలి– బర్రి కొండబాబు, విశాఖ కోస్టల్ బోటు ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు
సకాలంలో పరిహారం చెల్లించాలి
మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.4వేలు చెల్లిస్తున్నారు. వేట ముగిసే సమయానికి అందిస్తే వారికి మేలు జరిగేది. ఐదు నెలలుగా వేట సాగని కారణంగా చాల బోట్లు రేవుకే పరిమితం అయ్యాయి. బోట్ల యజమానులు ఈ సీజన్‌లో ఆర్థికంగా చాలా నష్టపోయారు.– సిహెచ్.సత్యనారాయణ మూర్తి, డాల్ఫిన్ మరపడవల సంఘం అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment