చేపా చేపా.. ఎప్పుడేదుగుతవ్‌ ! | Officials Showing Negligence To Aqua Culture In Mancherial | Sakshi
Sakshi News home page

చేపా చేపా.. ఎప్పుడేదుగుతవ్‌ !

Published Sat, Sep 14 2019 12:05 PM | Last Updated on Sat, Sep 14 2019 12:05 PM

Officials Showing Negligence To Aqua Culture In Mancherial - Sakshi

సాక్షి, మంచిర్యాల : మత్స్యకారులకు ఉపాధి కల్పించే నీలి విప్లవంపై జిల్లాలో నిర్లక్ష్యం కొనసాగుతోంది. జలాశయాల్లో చేపపిల్లలు వదిలే కార్యక్రమంలో జాప్యం కావడంతో అనుకున్న లక్ష్యం నెరవేరదే మో.. నని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో చేపపిల్లలను చెరువులు, కుంటలు, జలశయాల్లో వదిలితే ఏప్రిల్, మే నాటికి మత్స్యసంపద చేతికొచ్చేదని.. ఇప్పుడు వేస్తే అనుకున్న ఫలితం ఉండదని అంటున్నారు. జిల్లాలో ఈ ఏడాది 2 కోట్ల 23 లక్షలు చేపపిల్లలు ఆయా జలాశయాల్లో వదలా లని లక్ష్యంగా పెట్టుకున్నా.. శుక్రవారంనాటికి నాలుగోవంతు కూడా పూర్తి కాలేదు. వర్షాకాలం ముగిశాక చేపపిల్లలు వేసినా.. అవి ఎదగడం కష్టంగానే ఉంటుంది. అధికారుల నిర్లక్ష్యం, సరై న ప్రణాళిక లేని కారణంగా జిల్లా మత్స్యసంపదకు దూరం కానుంది. 

లక్ష్యం 2.23 కోట్లు.. వేసింది 32.5 లక్షలు
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడు కూడా ప్రభుత్వం జలాశయాల్లో చేపపిల్లలు వదిలేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ ఏడాది జిల్లాలో 2 కోట్ల 23 లక్షల 89 వేల చేపపిల్లలను వదలాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం జిల్లాలోని 274 జలాశయాలను గుర్తించింది. దీంతోపాటు ఎల్లంపల్లి, సుందిళ్ల ప్రాజెక్టులలో 2.63 లక్షల రొయ్య పిల్లలను కూడా వదలాలని నిర్ణయించింది. జిల్లాలో రొహు, కట్ల, బొచ్చ చేపపిల్లల ద్వారా 20 వేల టన్నుల చేపలు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ వర్షాకాలం ముగింపు దశకు వచ్చినా.. లక్ష్యం పాతిక శాతం కూడా పూర్తి కాకపోవడం విమర్శలకు తావునిస్తోంది. 35 నుంచి 40 ఎంఎం సైజు చేపపిల్లలు 1.50 లక్షలు, 80 నుంచి 100 ఎంఎం సైజు గల 68,089 చేపపిల్లలు చెరువుల్లో వదిలేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.

జిల్లాలో వర్షకాలం ఆరంభంలో ఆశించిన వర్షాలు లేకపోవడంతో చేపలను వదలలేదు. గత నెల భారీ వర్షాలు కురవడంతో సుందిళ్ల బ్యారేజీ బ్యాక్‌వాటర్‌ మంచిర్యాల గోదావరిలోకి చేరింది. ఈ క్రమంలోనే గతనెల 19న కలెక్టర్‌ భారతిహోళికేరి, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు తొమ్మిది లక్షల చేపపిల్లలను వదిలారు. అదే నెలలో చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారం బ్యారేజ్‌లో 15 లక్షల చేప పిల్లలను వదిలారు. గురువారం బెల్లంపల్లి ఎమ్మెల్యే 30వేల చేపపిల్లలను వదిలారు. మొత్తం కలిపి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 32.5 లక్షల వరకు చేపపిల్లలను మాత్రమే వదిలారు. 

ఇప్పుడేస్తే...ఎదిగేదెట్లా..?
జిల్లాలో 72 మత్య్సకార సంఘాల్లో 4,850 మంది సభ్యులు ఉన్నారు. కాలం దాటిన తరువాత చేపపిల్లలు వేస్తే అవి ఎదిగేదెట్లా అని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటికే చెరువులు, కుంటల్లో చేపపిల్లలను మొత్తం వదలాల్సి ఉంది. జూన్, జూలైలో ఆశించిన వర్షాలు కురువక పోవడంతో జలాశయాల్లోకి నీరు చేరక చేపపిల్లలు వదలేదు. ఆగస్టు నెలలో భారీ వర్షాలు కురవడంతో నీళ్లు ఎక్కువై, చెరువుల నుంచి వెళ్లిపోతున్నాయని వేయలేదు. కారణాలేవైనా ఇప్పుడు చేపపిల్లలు వేయడం వల్ల పెద్దగా ఫలితం ఉండదని మత్స్యకారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పంటల సాగుకు చెరువుల్లోంచి నీటిని వదులుతున్నారు. దీంతో చేపపిల్లల మనుగడ కష్టంగా మారుతోంది. జూలై, ఆగస్టులో చేపపిల్లలను వేస్తే ఏప్రిల్, మే నాటికి ఒక్కో చేప మూడు నుంచి నాలుగు కిలోల వరకు ఎదుగుతుంది.

కానీ..  ఇప్పుడు వేయడం వల్ల కిలో నుంచి కిలోన్నర కంటే మించి పెరగదని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. వర్షకాలం ముగింపు లోపు చేపపిల్లలను వదిలితే, చెరువుల్లో నీరుండడం వల్ల వాటికి సరిపడా ఆహారం అభిస్తుంది. ఆలస్యంగా వదిలితే నీరు తగ్గిపోతుండడం, ఆహారం లభించకపోవడం, వాతావరణ మార్పులతో ఆక్సిజన్‌ లభించక చేపపిల్లల ఎదుగుదల నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరిగితే చేపపిల్లలు మత్యువాతపడే అవకాశం ఉంటుందని మత్స్యకారులు వాపోతున్నారు. అధికారులు మాత్రం చేపపిల్లల ఎదుగుదలకు ఎలాంటి ఇబ్బందీ లేదంటున్నారు. ఏదేమైనా లక్ష్యంలో కనీసం పాతిక శాతం కూడా ఇప్పటివరకు పూర్తికాకపోగా.. మిగిలిన వాటికి మరింత సమయం పడుతుండడంపై మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

నెలాఖరుకు లక్ష్యం పూర్తి చేస్తాం
ఈ నెలాఖరు వరకు జిల్లా లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. చేపపిల్లలు వేయడం ఆలస్యం కాలేదు. ఇప్పుడు వేసినా ఆరు నెలల సమయం ఉంటుంది కాబట్టి చేపపిల్లలు పెరగవనే ప్రశ్నేలేదు. ఏప్రిల్‌లో చేపలు పడుతారు కాబట్టి ఆలోపు బరువు పెరుగతాయి. రెండు సంవత్సరాల క్రితం అక్టోబర్‌లో వేశాం. జలాశయాలకు నీళ్లు రావడం, ఆ నీళ్లు వెళ్లిపోతుండడంతో చేపలు వేసినా ప్రయోజనం ఉండేది కాదు. అందుకే ఈ నెలలో చేపపిల్లలు వేయడాన్ని పూర్తి చేస్తున్నాం.
– సత్యనారాయణ, ఏడీ, మత్స్యశాఖ

చేపపిల్లలు ఎదగకపోతే నష్టం
పోయిన నెల భారీ వర్షాలతో చెరువులు, కుంటులు, ప్రాజెక్టులు నిండినయి. అప్పుడే చేపపిల్లలు వేసేదుండే. వానకాలం అయిపోవడానికి వచ్చింది. ఎండలు ముదరక ముందే పిల్లలు వదిలితే ఎదుగుదల ఉంటుంది, సాగుకు చెరువుల్లో నీటిని వదలుతే నీరుతగ్గి చేపల ఎదగవు. ఆలస్యమైతే చేపపిల్లలు పెరగక నష్టపోతాం.  
– కంపెల రమేష్, మత్స్యకారుడు, నెన్నెల 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement