అవయవాల అమ్మకం కథ కంచికేనా? | revelli srikanth organ donation controversy in Mancherial | Sakshi
Sakshi News home page

అవయవాల అమ్మకం కథ కంచికేనా?

Published Sat, Sep 7 2024 12:28 PM | Last Updated on Sat, Sep 7 2024 12:28 PM

revelli srikanth organ donation controversy in Mancherial

కార్పొరేట్‌ ఆస్పత్రి నుంచి ఫోన్‌ చేసిందెవరు.. 

శ్రీకాంత్‌ కుటుంబ సభ్యులకు రూ.3లక్షలు ఇచి్చందెవరు..? 

 విచారణ కొనసాగుతోంది అంటున్న పోలీసులు

మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా షెట్‌పల్లికి చెందిన రేవెళ్లి శ్రీకాంత్‌ అవయవ దానం వెనుక ఉన్న మిస్టరీ వీడడం లేదు. శ్రీకాంత్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందగా, అంబులెన్స్‌ నిర్వాహకులే శ్రీకాంత్‌ అవయవాలు అమ్ముకున్నారనే చర్చ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదికాస్త రోజు రో జుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఆగస్టు 6న ప్రమాదానికి గురైన శ్రీకాంత్‌ హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆస్పత్రిలో చనిపోయాడు.

 అనంతరం అతడి అవయవాలు అంబులెన్స్‌ డ్రైవర్లే అమ్ముకున్నారనే చర్చ మొదలైంది. అంబులెన్స్‌ డ్రైవర్లు మొదటి నుంచీ అవయవాలు దానం చేయాలంటూ ప్రోత్సహించడం మృతుడి కుటుంబ సభ్యులకు అనుమా నం కలిగించింది. అవయవాలను ఎక్కువ ధరకు అమ్ముకొని తమకు తక్కువ డబ్బులు ఇప్పించారేమోననే అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత నెల 13న ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచి్చంది. దీంతో అదే నెల 14న ‘అవయవాలు అమ్ముకున్నారు’అనే శీర్షికన ‘సాక్షి’దినపత్రికలో కథనం ప్రచురితం కాగా, సంచలనం సృష్టించింది. 

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్‌లోని కార్పొరేట్, కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. గత నెల 19న స్థానిక ఏసీపీ కార్యాలయంలో అవయవాలు అమ్ముకున్నారనే కథనంపై డీసీపీ భాస్కర్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. అవయవాలు అమ్మకం జరగలేదని, కేవలం జీవాన్‌దాన్‌ అనే సంస్థకు శ్రీకాంత్‌ కుటుంబసభ్యుల ఒప్పందం మేరకు అవయవాలు దానం చేశారని వెల్లడిస్తూ శ్రీకాంత్‌ను ఆస్పత్రిలో చేరి్పంచడంలో కమీషన్ల కోసం వేర్వేరు ఆస్పత్రులకు తిప్పుతూ కాలయాపన చేసినందుకు, అవయవాలు అమ్ముకున్నారనే అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఆరోపణలు చేసినందుకు కిరణ్, నరేష్‌, శ్రావణ్, సాయిరాం, సాగర్‌లపై చీటింగ్‌ కేసు నమోదు చేసి స్టేషన్‌ బెయిల్‌పై వదిలేశారు. అవయవాలు అమ్మకం జరగలేదనే విషయాన్ని తేల్చేశారు. 

రూ.3లక్షలు ఇచ్చింది ఎవరు..?  
శ్రీకాంత్‌ అవయవాలు అమ్మకం జరగకపోతే శ్రీకాంత్‌ మృతదేహాన్ని అప్పగించిన తర్వాత కార్పొరేట్‌ ఆస్పత్రి సర్జన్‌.. శ్రీకాంత్‌ భార్య స్వప్న, కుటుంబ సభ్యులను పిలిపించి ఖర్చులకు తీసుకోమని రూ.3లక్షలు ఇచి్చనట్టు చెబుతున్నారు. అవయవాలు దానం చేస్తే రూ.3లక్షలు ఇవ్వడం ఎందుకు, దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాంత్‌ను కరీంనగర్‌ ఆస్పత్రి నుంచి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. కానీ వెళుతున్న క్రమంలో అవయవాలు దానం చేసిన ఆస్పత్రి నుంచి యాదగిరి అనే వ్యక్తి ఫోన్‌ చేసి కరీంనగర్‌ వైద్యులు సూచించిన ఆస్పత్రికి వెళ్లకుండా అడ్డుకొని మాయమాటలు చెప్పి ఆ ఆస్పత్రికి రప్పించుకున్నాడు. 

ఈ యాదగిరి ఎవరనే దానిపై పోలీసులు దృష్టి సారించలేదు. మృతుడి కుటుంబ సభ్యులకు రూ.3లక్షలు ఇచ్చింది ఎవరనేదానిపైనా పోలీసులు స్పష్టత ఇవ్వలేకపోయారు. రూ.3లక్షల ప్రస్తావన, శ్రీకాంత్‌ భార్య స్పప్న ఫోన్‌నంబర్‌ ఎలా వెళ్లిందనే దానిపై స్పష్టత ఇవ్వకుండా పొంతన లేని సమాధానాలు చెప్పి దాటవేశారు. చివరకు కేసు విచారణ పూర్తి కాలేదని, అంబులెన్స్‌ నిర్వాహకులను మళ్లీ కస్టడీకి తీసుకొని శాస్త్రీయ ఆధారాలు సేకరించి ఈ కేసులో పూర్తి విచారణ చేపడుతామని పేర్కొనడం గమనార్హం.  

పూర్తిస్థాయి విచారణ ఏమైంది..  
అవయవాలు అమ్ముకున్న కథ కంచికేనా అన్న చందంగా మారింది. విచారణ పేరిట రోజుకో మలుపు తిరుగుతోంది. శ్రీకాంత్‌ అవయవాలు ఎవరు..? ఎంతకు అమ్ముకున్నారనేది ఇంకా ప్రజల్లో చర్చనీయాంశంగానే మిగిలిపోయింది. పోలీసులు మాత్రం విచారణ కొనసాగుతోందని చెబుతున్నారు. గత నెల 27న కరీంనగర్‌ ఆస్పత్రి నిర్వాహకులు మంచిర్యాలకు వచ్చి వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై సీఐ బన్సీలాల్‌ను సంప్రదించగా విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ కేసులో అంబులెన్స్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేశామని, అవయవాలు అమ్మకంపై వస్తున్న వదంతులపై సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నామని, 
విచారణ సాగుతోందని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement