సందర్భం
సముద్రపు ఆటుపోటుల సమయంలో ఉండే అల జడి ఇప్పుడు మత్స్య కారుల కుటుంబాల్లో కని పిస్తోంది. నిత్యం ఉద్రేకంగా ఉరకలు వేసే సము ద్రంతో సావాసం చేసే గంగపుత్రులకు పొంచి ఉన్న మరో పెనుముప్పు ఇందుకు కారణం. గంగమ్మ కరుణిస్తేనే కడుపు నిండే తీరప్రాంత మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉప్పెనలాంటి ముప్పు తీసుకొని వచ్చింది. కష్టాలు తీర్చవలసిన ప్రభుత్వమే ముప్పులాగ మారితే మత్స్యకారుల పరిస్థితి చుక్కాని లేని నావలా మారడం తప్ప మరొకటి కాదు. రాష్ట్రంలో సువిశాలమైన 974 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ ప్రాంతములో వేట కోసం కనీస సౌకర్యాలు లేక ఇక్కడ మత్స్య కారులు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళి సమస్యలు కొనితెచ్చుకొంటున్నారు.
ఇది గమనించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో 10 ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో జవ్వలిదిన్నె ఫిషింగ్ హార్చర్ ప్రారంభమయ్యింది. మరికొన్ని సగానికి పైగా పనులు పూర్తిచేసుకుంటున్నాయి. దీనితో తమ జీవితాలలో వెలుగులు రానున్నాయని ఆనందంగా ఉన్న మత్స్యకారుల ఆశలుపై కొత్తగా వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం నీళ్ళు చల్లుతూ ఫిషింగ్ హార్బర్లను ప్రైవేట్ పరం చేసేందుకు సన్నహాలు ప్రారంభించింది. ఈ ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేసి నిర్వహించేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వనిస్తూ కూటమి ప్రభుత్వం టెండర్లను పిలిచి మత్స్యకారుల కుటుంబాల్లో అమవాస్య చీకటిని నింపింది.
గతంలో వైస్ జగన్ ప్రభుత్వం రూ. 3,520 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీ పట్నం, ఉప్పాడ, మంచినీళ్ళుపేట, బూడగడ్ల పాలెం, పుడిమెడక, కొత్తపట్నం, ఓడరేవు, బియ్యపుతిప్ప లాంటి 10 ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు కోసం పనులు ప్రారంభించింది. ఈ హార్బర్లు అందుబాటులోకి వస్తే సుమారు 10,521 మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్థ్యంతో పాటు సుమారు 5 లక్షల టన్నుల అదనపు మత్స్య సంపదను పెంచుకొనే వెసులు బాటు ఉంటుంది. దీనితోపాటు ప్రత్యక్షంగా, పరో క్షంగా వేలాది మంది మత్స్య కారులకు జీవనోపాధి పెరుగుతుంది. ఇటువంటి హార్బర్లను ప్రభుత్వం నిర్వహించకుండా ప్రైవేటుకు అప్పగిస్తే, కార్పొరేట్ల చేతుల్లోకి మత్స్యకారుల బతు కులు వెళతాయి.
వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు గత ప్రభుత్వం ‘మత్స్యకార భరోసా’ పేరుతో భృతి అందించేది. దీన్ని కూడా రీ సర్వే పేరుతో కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ఉన్న చంద్రబాబు ప్రభుత్వం వేట నిషేధ సమయంలో నాలుగు వేల రూపాయల భృతి ఇచ్చేది. దాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం రూ. 10,000కు పెంచింది. అన్నిరకాల బోట్లతో పాటు, తెప్పలు, నాటు పడవలకు మత్యకార భరోసా అందించింది. గత 5 ఏళ్లలో ప్రతీ సంవత్సరం మే నెలలో మత్స్యకార భరోసా అందిస్తూ 5 ఏళ్ళల్లో రూ. 538 కోట్లు ఖర్చు చేసింది. ఈ పథకం అమలు చేయడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తాత్సారం చేస్తోంది.
చదవండి: శ్రీబాగ్ ఒడంబడిక అమలే కీలకం!
జగన్ ప్రభుత్వం మత్స్యకారులకు ఇతర పథకాల ద్వారానూ చేదోడుగా వాదోడుగా నిలిచింది. చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం రూ. 5 లక్షలు పరిహారం అందించగా... జగన్ ప్రభుత్వం దాన్ని రూ. 10 లక్షలకు పెంచి వెనువెంటనే అందించింది. గత ఐదేళ్లలో 175 మంది గంగపుత్రులు మృతి చెందగా వారి కుటుంబాలకు ఒక్కక్కరికి రూ. 10 లక్షలు చొప్పున జగన్ ప్రభుత్వం రూ. 17.50 కోట్ల పరిహారాన్ని అందజేసింది. అదేవిధంగా గతంలో ఆరు రూపాయలుగా ఉన్న డీజిల్ సబ్సిడీని తొమ్మిది రూపాయలకు పెంచింది. ఈ లెక్కన ఐదేళ్లలో బోట్ల యజమానులకు రూ. 148 కోట్లు చెల్లించింది. వీటితో పాటు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జీఎస్‌పీసీ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు రూ. 78.22 కోట్లు, ఓఎన్‌జీసీ పైపు లైను తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది కుటుంబాలకు 5 విడతల్లో రూ. 647.44 కోట్లు సహాయాన్ని జగన్ ప్రభుత్వం అందించింది.
చదవండి: వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా?
మొట్టమొదటిసారిగా మత్స్యకార వర్గానికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి సమున్నత గౌరవం కల్పించింది వైఎస్సార్‌సీపీనే అనేది మరువరాదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగించాలి. అలాగే ఫిషింగ్ హార్బర్ల ప్రైవేటీకరణను నిలిపి వేయాలి.
- బందన పూర్ణచంద్రరావు
జాతీయ మత్స్యకార సంఘం వైస్ చైర్మన్
(నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవం)
Comments
Please login to add a commentAdd a comment