వేలేరుపాడు: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల గిరిజనుల సంసృతీ సంప్రదాయాలతో పాటు నాగరికత, ఆహారపు అలవాట్లకు ముప్పు ఏర్పడనుంది. అడవిలో లభించే కందమూలాలు, దుంపలు, వివిధ రకాల పండ్ల వంటివి తుడిచిపెట్టుకుపోనున్నాయి. అడవితో వారికున్న అనుబంధం, సీజనల్ వారీగా వారికి లభించే సహజసిద్ధ ఆహారం ఇక మీదట వారికి దూరం కానుంది. ఇష్టమైన చేపలవేట, బొంగు చికెన్ వంటి వాటికి కూడా గిరిజనులు నోచుకోకుండా పోతున్నారు.
వెదురు బియ్యం.. బొంగు చికెన్‌కు ‘ముంపు’
అడవిలో దొరికే వెదురు బియ్యం గిరిజనులకు ఎంతో బలవర్ధకమైన ఆహారం. వెదురు ముదురు పిడియాలకు మాత్రమే బియ్యం వస్తాయి. పూతరూపంలో వచ్చి, గింజలు బయటికి వస్తాయి. వీటిని దంచుకొని అన్నం వండుకొని తింటారు. ఈ అన్నం తింటే సంతానం ప్రాప్తిస్తుందని గిరిజనులు చెబుతున్నారు. అంతేకాక వెదురు పిడియంతో బొంగుచికెన్ కూడా తయారుచేసుకొని తింటారు. ఏదైనా మాంసాన్ని పచ్చివెదురు పిడియం( గొట్టం)లో నింపుతారు. దానిని మంటలో వేసి కాలుస్తారు. వేడి వల్ల పిడియంలో మాంసం ఉడుకుతుంది. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే వెదురు కొమ్ముల కూర కూడా తింటారు.
ఇక చేపలవేట లేనట్టేనా...?
చేపల వేటకు గిరిజనులు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఎక్కడ చేపలున్నా ఊరంతా చిన్నాపెద్ద తేడాలేకుండా అక్కడికి చేరుకొని వేట ప్రారంభిస్తారు. వారు సొంతంగా వెదురుబద్దలతో తయారు చేసిన వలలను వేటకు వాడతారు. ఎక్కువగా గ్రామాల్లో కుంటలు, చెరువులు, గోదావరి మడుగుల్లో చేపల వేట సాగిస్తారు. ఎన్ని చేపలు దొరికినా సరే అందరూ సమంగా పంచుకుంటారు.
బొద్దుకూర ఇక బందేనా..!
అడవిలో దొరికే బొద్దుకూర తీగ, పొట్టను కూరచేసుకొని తింటారు. బొద్దుకూర తియ్యగా ఉంటుంది. అడవి పొట్ట మనం తినే మొక్కజొన్నను పోలి వుంటుంది. దీనిని ముందుగా ఒలిచి ఉడకబెట్టి, ఆ తర్వాత కూర వండుకొని తింటారు. ఇది కూడా చాలా బలమైన ఆహారంగా గిరిజనులు చెబుతున్నారు.
కందమూలాలూ కనుమరుగు
అటవీ ప్రాంతంలో లభ్యమయ్యే ట్యాగ, అడవి కంద, పంది దుంపలంటే గిరిజనులకు చాలా ఇష్టం. కూరగాయలన్నింటిలో ఉండే పోషకాలు ఈ దుంపల్లోనే ఉంటాయని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో గిరిజనులు దుంపల అన్వేషణలో మునిగిపోతారు. ఇవి దట్టమైన అటవీ ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయి. ఉడకబెట్టుకొనిగానీ, కాల్చుకొని గానీ తింటే ఆ మజాయే వేరని గిరిజనులు అంటున్నారు. ఇవి ఉదయం ఒక్కసారి తింటే ఆ రోజంతా అసలు ఆకలే కాదని, శరీరమంతా ఎంతో ఉల్లాసంగా ఉంటుందని పేర్కొంటున్నారు.
తాటి, జీలుగు కల్లు తాగలేమా..?
గిరిజనులు పూర్వం నుంచి తాటి వృక్షాలు పెంచడం ఆనవాయితీ. వారు సాగు చేసుకునే భూముల గట్లవెంట వీటిని పెంచుతారు. వీటి ద్వారా వచ్చే కల్లును ఇష్టంగా తాగుతారు. ఆడ, మగ, పిల్లాజెల్లా తేడా లేకుండా అంతా ఒకచోట చేరి కల్లును ఆస్వాదిస్తారు.అడవిలో దొరికే జీలుగు కల్లును కూడా ఇష్టపడతారు. కల్లు సీజన్‌లో ఆహారం కన్నా దీనికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
దీని దుంప తెగ
Published Sun, Nov 23 2014 2:58 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement