వేలేరుపాడు : పోలవరం ముంపు మండలాల్లో బలవంతంగా తమ పాలన సాగించాలని చూస్తున్న ఆంధ్రా ఉన్నతాధికారులకు పరాభవం ఎదురైంది. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లిలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముంపు మండలాల అధికారులు హాజరుకావాలని ఆ జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించిన విషయం తెల్సిందే.
అయితే ఈ సమావేశానికి ఏ ఒక్క తెలంగాణా అధికారీ వెళ్లకపోవడంతో ఆ జిల్లా జేసీ బాబూరావునాయుడు, కోటరామచంద్రాపురం ఐటిడీఏ పీఓ టి.శ్రీనివాసరావు, రవాణ శాఖ కమిషనర్ శ్రీదేవి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్‌బాబు, జేడీఏ సత్యనారాయణ, జెడ్‌పీ సీఈఓ వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ రామచంద్రారెడ్డి తదితరులు శుక్రవారం వేలేరుపాడు వచ్చేందుకు యత్నించారు. అయితే వారిని పాతరెడ్డిగూడెం గ్రామం వద్ద ప్రజలు అడ్డుకున్నారు. ‘ తెలంగాణ వారే మా అధికారులు... మీరు ఆంధ్రా రాష్ట్రం వాళ్లు.. మా రాష్ట్రానికి ఎందుకొచ్చారు... ఇక్కడి నుంచి వెళ్లండి.. ముంపు ప్రాంతాలు తెలంగాణలోనే ఉన్నాయని, మా సేవలే కొనసాగుతాయని ఖమ్మం కలెక్టర్ శ్రీనివాస నరేష్ స్పష్టం చేశారు.
అయినా మీరెందుకు వచ్చారు’ అంటూ నిలదీశారు. దీంతో ఆ జిల్లా అధికారులు మాట్లాడుతూ.. ‘మీ సమస్యలు పరిష్కరించడానికి వచ్చాం.. అన్ని విధాలా అండగా ఉంటాం’ అని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వారి మాటలను ఖాతరు చేయని బాధితులు వెంటనే ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలంటూ పట్టుబట్టారు. దీంతో చేసేది లేక వారు అక్కడి నుంచే వెనుదిరిగారు.
చిత్తయిన టీడీపీ నేతల ఎత్తులు...
పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నతాధికారుల వెంట ఆ జిల్లా టీడీపీ నేతలు వాహనాల్లో తరలి వచ్చారు. అధికారులకంటే ఎక్కువగా వీరే అంతా తామే అన్నట్టుగా వ్యవహరించడంతో స్థానికులు వారిపై తిరుగుబాటు చేశారు. ‘మా ప్రాంతంలో మీ పెత్తనం ఏంటి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక అధికారులకు సమాచారం లేదు...
పశ్చిమ అధికారుల రాకపై స్థానిక అధికారులకు ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఇక్కడి అధికారులు ఉన్నతాధికారులను కలవలేదు. ఈ విషయమై వేలేరుపాడు తహశీల్దార్ పాపయ్యను వివరణ కోరగా, ఆ అధికారులు వస్తున్నారనే విషయం తమకు తెలియదని, అలాంటప్పుడు తామెందుకు వెళ్తామని అన్నారు.
రక్షణగా వచ్చిన తెలంగాణ పోలీసులు...
ఆంధ్రా ఉన్నతాధికారులకు రక్షణగా జంగారెడ్డిగూడెం సీఐతో పాటు, అశ్వారావుపేట ఎస్‌ఐ కిరణ్, సిబ్బంది, వేలేరుపాడు పోలీసులు పాల్గొనడం గమనార్హం.
ఆంధ్ర అధికారులూ.. గో బ్యాక్
Published Sat, Jul 26 2014 2:58 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement