Babu Rao Naidu
-
సమస్యలు వింటూ.. పరిస్థితులు చూస్తూ
సాక్షి, ఏలూరు : రాష్ర్ట విభజన నేపథ్యంలో ఖమ్మం నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో కలిసిన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో జిల్లా అధికారుల బృందం గురువా రం పర్యటించింది. కలెక్టర్ కె.భాస్కర్, ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), పోలవరం ఎమ్మె ల్యే మడియం శ్రీనివాసరావు, అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన సుమారు 40 మంది జిల్లా అధికారులు పర్యటనలో పాల్గొన్నారు. కలెక్టరేట్ నుంచి ఉదయం 8 గంటలకు జాయింట్ కలెక్టర్ టి.బాబురావునాయుడు నేతృత్వంలో అధికారుల బృందం ఆర్టీసీ బస్సులో బయలుదేరింది. ఎవరికి వారు రూ.270 చొప్పున చెల్లించి టిక్కెట్ కొనుక్కుని బస్సు ఎక్కారు. ఉదయం 11 గంట లకు అంతా కుక్కునూరు చేరుకున్నారు. తొలుత అక్కడి తహసిల్దార్ కార్యాలయం వద్ద ప్రజలు, అధికారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు తాము తెలంగాణ రాష్ట్రంలో పనిచేసేలా ఆప్షన్ ఇవ్వాలంటూ ఆందోళన నిర్వహించారు. కలెక్టర్ వారితో చర్చించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. డ్వాక్రా సంఘాల యానిమేటర్లు గత ఏడాది నుంచి తమకు జీతాలు రావడం లేదని అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా కలిసిన గ్రామాల ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలకు సంబంధించి రాష్ట్ర సరి హద్దు ప్రాంతాలు దాటివచ్చిన వారికి సైతం సేవలందించే ధృక్పథాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్ధీకరణ చట్టాన్ని అనుసరించి, రాష్ట్రంలో అమల్లో ఉన్న అన్ని చట్టాలు ఈ గ్రామాల ప్రజలకు వర్తిస్తాయన్నారు. రైతులకు రూ.1.50 లక్షల వరకు, డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష వరకు రుణమాఫీ అవుతా యని వివరించారు. వరద బాధితులను, పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. అక్టోబర్ 2నుంచి రాష్ట్రంలో అమలయ్యే నూతన సామాజిక పెన్షన్ కార్యక్రమం, ఎన్టీఆర్ సుజల స్రవంతి వంటి పథకాలన్నిటినీ జిల్లాలో కలిసిన తెలంగాణ గ్రామాల్లో అమలు చేస్తామని కలెక్టర్ చెప్పారు. ఈ ప్రాంత రైతులకు పత్తి వంటి విత్తనాలతోపాటు ఎరువులను పూర్తిస్థాయిలో అందిస్తామని, కుక్కునూరు, వేలేరుపాడులోని వ్యవసాయ సహకార సంఘాల్లో ఎరువులను నిల్వచేసి రైతులకు అందిస్తామని తెలిపారు. ఈ గ్రామాల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు గిరిజన సంక్షేమ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వరరావును సమన్వయాధికారిగా, ప్రత్యేక అధికారిగా నియమించినట్టు చెప్పారు. పోల వరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే వారికి మెరుగైన ప్యాకేజీ అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ సర్వే సెటిల్మెంట్ చట్టాన్ని అనుసరించి భూముల సర్వేకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ టి.బాబురావునాయుడును కలెక్టర్ ఆదేశించారు. కుక్కునూరు, బూర్గంపాడు, ఏలేటి పాడు గ్రామాలకు ఏలూరు, జంగారెడ్డిగూడెం, కోటరామచంద్రపురం ప్రాంతాల నుంచి బస్సు సర్వీసులను పెంచుతామన్నారు. గిరిజనులు కోటరామచంద్రపురం ఐటీడీఏ పరిధిలోకి వస్తారని పేర్కొన్నారు. అన్ని గ్రామాల్ని అభివృద్ధి చేస్తాం ఏలూరు ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా చేరిన గ్రామాలకు రోడ్లు, మంచినీరు, విద్యు త్, విద్య, వైద్యం వంటి మౌలిక సౌకర్యాలు పూర్తిస్థాయిలో కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. వరదల కారణంగా పంటల్ని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు మాట్లాడుతూ కొత్తగా చేరిన గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆయా గ్రామాల్లో అధికార యంత్రాం గం పూర్తి స్థాయిలో ఉండేలా, ప్రజలకు మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు వేలేరుపాడు వెళ్లారు. అక్కడ జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. అక్కడి ప్రజల చెప్పిన సమస్యలు విన్నారు. నిరుద్యోగ సంఘాల నాయకులు పోలవరం ముంపు వల్ల ఉపాధి కోల్పోతామని, తమకు సాయం చేయాలని కోరారు. పలువురు ఉపాధ్యాయులు తాము తెలంగాణలో పనిచేసేలా ఆప్షన్ ఇవ్వాలని కోరారు. జారుుంట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, అదనపు జేసీ సీహెచ్ నరసింగరావు, జిల్లా పరిషత్ సీఈవో కె.వెంకటరెడ్డి, డీపీవో ఎ.నాగరాజువర్మ, వ్యవసాయ శాఖ జేడీ వి.సత్యనారాయణ, ఐసీడీఎస్ పీడీ పి.వసంతబాల, కుక్కునూరు తహసిల్దార్ బి.సుమతి, ఎంపీడీవో రామచంద్రరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆంధ్ర అధికారులూ.. గో బ్యాక్
వేలేరుపాడు : పోలవరం ముంపు మండలాల్లో బలవంతంగా తమ పాలన సాగించాలని చూస్తున్న ఆంధ్రా ఉన్నతాధికారులకు పరాభవం ఎదురైంది. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లిలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముంపు మండలాల అధికారులు హాజరుకావాలని ఆ జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించిన విషయం తెల్సిందే. అయితే ఈ సమావేశానికి ఏ ఒక్క తెలంగాణా అధికారీ వెళ్లకపోవడంతో ఆ జిల్లా జేసీ బాబూరావునాయుడు, కోటరామచంద్రాపురం ఐటిడీఏ పీఓ టి.శ్రీనివాసరావు, రవాణ శాఖ కమిషనర్ శ్రీదేవి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్‌బాబు, జేడీఏ సత్యనారాయణ, జెడ్పీ సీఈఓ వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ రామచంద్రారెడ్డి తదితరులు శుక్రవారం వేలేరుపాడు వచ్చేందుకు యత్నించారు. అయితే వారిని పాతరెడ్డిగూడెం గ్రామం వద్ద ప్రజలు అడ్డుకున్నారు. ‘ తెలంగాణ వారే మా అధికారులు... మీరు ఆంధ్రా రాష్ట్రం వాళ్లు.. మా రాష్ట్రానికి ఎందుకొచ్చారు... ఇక్కడి నుంచి వెళ్లండి.. ముంపు ప్రాంతాలు తెలంగాణలోనే ఉన్నాయని, మా సేవలే కొనసాగుతాయని ఖమ్మం కలెక్టర్ శ్రీనివాస నరేష్ స్పష్టం చేశారు. అయినా మీరెందుకు వచ్చారు’ అంటూ నిలదీశారు. దీంతో ఆ జిల్లా అధికారులు మాట్లాడుతూ.. ‘మీ సమస్యలు పరిష్కరించడానికి వచ్చాం.. అన్ని విధాలా అండగా ఉంటాం’ అని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వారి మాటలను ఖాతరు చేయని బాధితులు వెంటనే ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలంటూ పట్టుబట్టారు. దీంతో చేసేది లేక వారు అక్కడి నుంచే వెనుదిరిగారు. చిత్తయిన టీడీపీ నేతల ఎత్తులు... పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నతాధికారుల వెంట ఆ జిల్లా టీడీపీ నేతలు వాహనాల్లో తరలి వచ్చారు. అధికారులకంటే ఎక్కువగా వీరే అంతా తామే అన్నట్టుగా వ్యవహరించడంతో స్థానికులు వారిపై తిరుగుబాటు చేశారు. ‘మా ప్రాంతంలో మీ పెత్తనం ఏంటి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక అధికారులకు సమాచారం లేదు... పశ్చిమ అధికారుల రాకపై స్థానిక అధికారులకు ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఇక్కడి అధికారులు ఉన్నతాధికారులను కలవలేదు. ఈ విషయమై వేలేరుపాడు తహశీల్దార్ పాపయ్యను వివరణ కోరగా, ఆ అధికారులు వస్తున్నారనే విషయం తమకు తెలియదని, అలాంటప్పుడు తామెందుకు వెళ్తామని అన్నారు. రక్షణగా వచ్చిన తెలంగాణ పోలీసులు... ఆంధ్రా ఉన్నతాధికారులకు రక్షణగా జంగారెడ్డిగూడెం సీఐతో పాటు, అశ్వారావుపేట ఎస్ఐ కిరణ్, సిబ్బంది, వేలేరుపాడు పోలీసులు పాల్గొనడం గమనార్హం. -
అక్రమాల పుట్ట.. తేలని చిట్టా
సాక్షి, ఏలూరు:జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో అక్రమాల పుట్ట లోతుగానే ఉన్నట్టు స్పష్టమవుతోంది. బోదవ్యాధి నివారణ చర్యల్లో భాగంగా నిర్వహించిన మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎండీఏ) ప్రోగ్రాం కోసం వచ్చిన నిధుల గోల్‌మాల్‌పై కలెక్టర్ ఆదేశం మేరకు విచారణ చేపట్టిన జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు ఆ వ్యవహారం మూలాలను తవ్వి తీసే పనిలో నిమగ్నమయ్యూరు. మంగళవారం బుట్టాయగూడెం మండలం కేఆర్ పురంలోని మలేరియా నివారణ కేంద్రానికి వెళ్లి రికార్డుల్ని తనిఖీ చేశారు. ఈ వ్యవహారంలో డీఎంహెచ్‌వో, డీఎంవో ప్రమేయం ఉన్నట్టు ఇప్పటికే నిర్ధారణ కాగా.. వారితోపాటు కామయ్యపాలెం మెడికల్ ఆఫీసర్ రాథోడ్, మరికొంతమంది సిబ్బందికి కూడా సంబంధం ఉన్నట్టు విచారణలో వెల్లడైంది. అసిస్టెంట్ డీఎంవో జగన్మోహనరావు, డెమో నాగేశ్వరావు, సీనియర్ అసిస్టెంట్లు కేదారేశ్వరావు, రాజు, కేఆర్‌పురం ఎంపీహెచ్వో ప్రసాద్ ప్రమేయంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదినుంచీ ఇంతే... వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి సార్వసాధారణమైపోయింది. 2011 డిసెం బర్ 6, 7, 8 తేదీల్లో పైలేరియా నివారణ కార్యక్రమం నిర్వహించగా.. అదే ఏడాది డిసెంబర్ 12న దాదాపు రూ.11.50 లక్షలను నగదు రూపంలో కార్యాలయంలో ఉంచి అప్పటి డీఎం హెచ్‌వో, ఇన్చార్జి డీఎంవో సస్పెండయ్యారు. ఆ తర్వాత డీఎంహెచ్‌వోగా బాధ్యతలు చేపట్టిన శకుంతలపై ఆది నుంచీ ఆరోపణలు వస్తున్నాయి. సిబ్బందికి డెప్యుటేషన్లు ఇవ్వడానికి.. హెల్త్ అసిస్టెంట్లు, స్టాఫ్ నర్స్‌ల నియామకాలకు లంచాలు తీసుకునేవారనే అపవాదును మూటగట్టుకున్నారు. తనకు అనుకూలంగా లేనివారిని వేధింపులకు గురిచేసేవారని సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుత వ్యవహారంలో తనతోపాటు మెడికల్ ఆఫీసర్ రాథోడ్ కూడా ఉన్నారని విచారణ సందర్భంగా డీఎంహెచ్‌వో శకుంతల జేసీకి చెప్పారు. డీఎంవో నాగేశ్వరావు, రాథోడ్ కలిసి వెళ్లి బ్యాంకులో డబ్బు లు తీశారని అంటున్నారు. అయితే జారుుంట్ అకౌంట్నుంచి డీఎంహెచ్‌వో, డీఎంవో సంతకాలు లేకుండా సొమ్ములు డ్రా చేయడం వీలుకాదనే విషయూన్ని మరుగున పెట్టే ప్రయత్నం చేస్తుండటం విశేషం. సొమ్ము తిరిగిచ్చేస్తారట! ఈ వ్యవహారంలో మరో ముఖ్య పాత్రధారి అయిన డీఎంవో నాగేశ్వరావు తనకేమీ తెలియదన్నట్టు తెల్లమొహం వేస్తున్నారు. ‘సాక్షి’లో కథనాలు ప్రచురితం కావడంతో.. జిల్లాలోని పీహెచ్‌సీలకు ఇవ్వడానికి సొమ్ములు తీసుకెళ్లిన మాట వాస్తవమేనని, కొందరు ఆ సొమ్ము తీసుకోవడానికి నిరాకరించారని విచారణ సందర్భంగా జేసీ ఎదుట అంగీకరించారు. తమ వద్ద ఉన్న సొమ్మును తిరిగి ఇచ్చేస్తామని, తప్పును మన్నించమని డీఎంహెచ్‌వో శకుంతల, డీఎంవో నాగేశ్వరావు జేసీని వేడుకున్నారు. ఓచర్లు, బిల్లులు ఉన్నాయని వీరిద్దరూ చెప్పగా, రికార్డుల తనిఖీలో మాత్రం అనేక తప్పులు కని పించాయి. దేనికి ఎంత ఖర్చు చేశారనే వివరాలను ఈ ఇద్దరితోపాటు డీఎం హెచ్‌వో కార్యాలయంలోని అకౌంట్స్ చూసే సీనియర్ అధికారులు కూడా చెప్పలేకపోవడం జేసీని విస్మయానికి గురిచేసింది. మంగళవారం ఉదయం డీఎంహెచ్‌వోతో పాటు కొన్ని పీహెచ్‌సీల నుంచి మెడికల్ ఆఫీసర్లను రప్పించి జేసీ విచారించారు. వారు కూడా అనేక వాస్తవాలు జేసీకి వెల్లడించినట్లు తెలిసింది. ఎవరీ రాథోడ్!? జేసీ విచారణ చేపట్టినప్పటి నుంచీ రాథోడ్ పేరును డీఎంహెచ్‌వో శకుం తల ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. అంతా ఆయనకే తెలుసని చెబుతున్నారు. విభాగాధిపతికే తెలియని విషయాలు ఆయనకెలా తెలుస్తాయని జేసీ ఆశ్చర్యానికి గురయ్యూరు. శకుంతలను సున్నితంగా మందలిం చారు. అయితే గిరిజన ప్రాంతంలో పట్టున్న అధికారి కావడంతో అతని సాయం తీసుకున్నామని డీఎంహెచ్‌వో వివరించారు. ఈ నేపథ్యంలో రాథోడ్ ఎవరనే దానిపై ‘సాక్షి’ ఆరా తీయగా.. ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. జిల్లాలోని 73 పీహెచ్‌సీల్లో ఒకటైన కామయ్యపాలెం పీహెచ్సీలో రాథోడ్ ఒక మెడికల్ ఆఫీసర్. ఇంత చిన్న పోస్టులో ఉన్న వ్యక్తికే అంతా తెలుసని జిల్లా అధికారి చెబుతున్నారంటే అతనికి అపార ప్రతిభ ఉండాలి. నిజమే.. అతనికి ప్రతిభ అంతాఇంతా కాదు. గిరిజన ప్రాం తంలో మలేరియా నివారణ చర్యల్లో భాగంగా దోమల నిర్మూలన కార్యక్రమాన్ని ఆయన చేపడుతుంటారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రతి ఇంటి గోడలకు దోమల మందు స్ప్రే చేయిస్తుంటారు. ఆ కాంట్రాక్టును తన బంధువులకే ఇప్పించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు రాథోడ్‌పై ఉన్నా యి. కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో దోమల మందు కొడుతూ ఓ కూలీ చనిపోయాడు. గతంలో డీఎం వోగా, ఇన్చార్జి డీఎంహెచ్‌వోగా పులి రామన్నగూడెం, కోటరామచంద్రపురం పీహెచ్‌సీలకు ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్‌గా ఏకకాలంలో విధులు నిర్వర్తించిన ఘనత ఆయనకు ఉంది. ఆ సమయంలో ఒక కారు వినియోగిస్తూ, మూడు కార్ల అద్దెను తీసుకునేవారని కొందరు చెబుతున్నారు. 2010లో ఆయన చేసిన ట్యూబెక్టమీ ఆపరేషన్ వికటించి ఓ గిరిజన మహిళ దుర్మర ణం పాలయినట్లు సమాచారం. ఈ ఆరోపణల నేపథ్యంలో 2011 నవంబర్ 30న రాథోడ్‌ను అన్ని బాధ్యతల నుంచి తప్పించి వైద్య ఆరోగ్య శాఖకు సరెండర్ చేశారు. అలాంటి వ్యక్తిని ప్రస్తుత డీఎంహెచ్‌వో ఉపయోగించుకున్నారంటే.. అక్రమాలకు అనుభవజ్ఞుడిని ఎంచుకున్నట్టేనని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు అంటున్నాయి.