అక్రమాల పుట్ట.. తేలని చిట్టా | Medical department, the endless corruption | Sakshi
Sakshi News home page

అక్రమాల పుట్ట.. తేలని చిట్టా

Published Wed, Feb 5 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM

Medical department, the endless corruption

 సాక్షి, ఏలూరు:జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో అక్రమాల పుట్ట లోతుగానే ఉన్నట్టు స్పష్టమవుతోంది. బోదవ్యాధి నివారణ చర్యల్లో భాగంగా నిర్వహించిన మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎండీఏ) ప్రోగ్రాం కోసం వచ్చిన నిధుల గోల్‌మాల్‌పై కలెక్టర్ ఆదేశం మేరకు విచారణ చేపట్టిన జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు ఆ వ్యవహారం మూలాలను తవ్వి తీసే పనిలో నిమగ్నమయ్యూరు. మంగళవారం బుట్టాయగూడెం మండలం కేఆర్ పురంలోని మలేరియా నివారణ కేంద్రానికి వెళ్లి రికార్డుల్ని తనిఖీ చేశారు. ఈ వ్యవహారంలో డీఎంహెచ్‌వో, డీఎంవో ప్రమేయం ఉన్నట్టు ఇప్పటికే నిర్ధారణ కాగా.. వారితోపాటు కామయ్యపాలెం మెడికల్ ఆఫీసర్ రాథోడ్, మరికొంతమంది సిబ్బందికి కూడా సంబంధం ఉన్నట్టు విచారణలో వెల్లడైంది. అసిస్టెంట్ డీఎంవో జగన్‌మోహనరావు, డెమో నాగేశ్వరావు, సీనియర్ అసిస్టెంట్లు కేదారేశ్వరావు, రాజు, కేఆర్‌పురం ఎంపీహెచ్‌వో ప్రసాద్ ప్రమేయంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
 ఆదినుంచీ ఇంతే...
 వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి సార్వసాధారణమైపోయింది. 2011 డిసెం బర్ 6, 7, 8 తేదీల్లో పైలేరియా నివారణ కార్యక్రమం నిర్వహించగా.. అదే ఏడాది డిసెంబర్ 12న దాదాపు రూ.11.50 లక్షలను నగదు రూపంలో కార్యాలయంలో ఉంచి అప్పటి డీఎం హెచ్‌వో, ఇన్‌చార్జి డీఎంవో సస్పెండయ్యారు. ఆ తర్వాత డీఎంహెచ్‌వోగా బాధ్యతలు చేపట్టిన శకుంతలపై ఆది నుంచీ ఆరోపణలు వస్తున్నాయి. సిబ్బందికి డెప్యుటేషన్లు ఇవ్వడానికి.. హెల్త్ అసిస్టెంట్లు, స్టాఫ్ నర్స్‌ల నియామకాలకు లంచాలు తీసుకునేవారనే అపవాదును మూటగట్టుకున్నారు. తనకు అనుకూలంగా లేనివారిని వేధింపులకు గురిచేసేవారని సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుత వ్యవహారంలో తనతోపాటు మెడికల్ ఆఫీసర్ రాథోడ్ కూడా ఉన్నారని విచారణ సందర్భంగా డీఎంహెచ్‌వో శకుంతల జేసీకి చెప్పారు. డీఎంవో నాగేశ్వరావు, రాథోడ్ కలిసి వెళ్లి బ్యాంకులో డబ్బు లు తీశారని అంటున్నారు. అయితే జారుుంట్ అకౌంట్‌నుంచి డీఎంహెచ్‌వో, డీఎంవో సంతకాలు లేకుండా సొమ్ములు డ్రా చేయడం వీలుకాదనే విషయూన్ని మరుగున పెట్టే ప్రయత్నం చేస్తుండటం విశేషం. 
 
 సొమ్ము తిరిగిచ్చేస్తారట!
 ఈ వ్యవహారంలో మరో ముఖ్య పాత్రధారి అయిన డీఎంవో నాగేశ్వరావు తనకేమీ తెలియదన్నట్టు తెల్లమొహం వేస్తున్నారు. ‘సాక్షి’లో కథనాలు ప్రచురితం కావడంతో.. జిల్లాలోని పీహెచ్‌సీలకు ఇవ్వడానికి సొమ్ములు తీసుకెళ్లిన మాట వాస్తవమేనని, కొందరు ఆ సొమ్ము తీసుకోవడానికి నిరాకరించారని విచారణ సందర్భంగా జేసీ ఎదుట అంగీకరించారు. తమ వద్ద ఉన్న సొమ్మును తిరిగి ఇచ్చేస్తామని, తప్పును మన్నించమని డీఎంహెచ్‌వో శకుంతల, డీఎంవో నాగేశ్వరావు జేసీని వేడుకున్నారు. ఓచర్లు, బిల్లులు ఉన్నాయని వీరిద్దరూ చెప్పగా, రికార్డుల తనిఖీలో మాత్రం అనేక తప్పులు కని పించాయి. దేనికి ఎంత ఖర్చు చేశారనే వివరాలను ఈ ఇద్దరితోపాటు డీఎం హెచ్‌వో కార్యాలయంలోని అకౌంట్స్ చూసే సీనియర్ అధికారులు కూడా చెప్పలేకపోవడం జేసీని విస్మయానికి గురిచేసింది. మంగళవారం ఉదయం డీఎంహెచ్‌వోతో పాటు కొన్ని పీహెచ్‌సీల నుంచి మెడికల్ ఆఫీసర్లను రప్పించి జేసీ విచారించారు. వారు కూడా అనేక వాస్తవాలు జేసీకి వెల్లడించినట్లు తెలిసింది.
 
 ఎవరీ రాథోడ్!?
 జేసీ విచారణ చేపట్టినప్పటి నుంచీ రాథోడ్ పేరును డీఎంహెచ్‌వో శకుం తల ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. అంతా ఆయనకే తెలుసని చెబుతున్నారు. విభాగాధిపతికే తెలియని విషయాలు ఆయనకెలా తెలుస్తాయని జేసీ ఆశ్చర్యానికి గురయ్యూరు. శకుంతలను సున్నితంగా మందలిం చారు. అయితే గిరిజన ప్రాంతంలో పట్టున్న అధికారి కావడంతో అతని సాయం తీసుకున్నామని డీఎంహెచ్‌వో వివరించారు. ఈ నేపథ్యంలో రాథోడ్ ఎవరనే దానిపై ‘సాక్షి’ ఆరా తీయగా.. ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. జిల్లాలోని 73 పీహెచ్‌సీల్లో ఒకటైన కామయ్యపాలెం పీహెచ్‌సీలో రాథోడ్ ఒక మెడికల్ ఆఫీసర్. ఇంత చిన్న పోస్టులో ఉన్న వ్యక్తికే అంతా తెలుసని జిల్లా అధికారి చెబుతున్నారంటే అతనికి అపార ప్రతిభ ఉండాలి. నిజమే.. అతనికి ప్రతిభ అంతాఇంతా కాదు. గిరిజన ప్రాం తంలో మలేరియా నివారణ చర్యల్లో భాగంగా దోమల నిర్మూలన కార్యక్రమాన్ని ఆయన చేపడుతుంటారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రతి ఇంటి గోడలకు దోమల మందు స్ప్రే చేయిస్తుంటారు. ఆ కాంట్రాక్టును తన బంధువులకే ఇప్పించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు రాథోడ్‌పై ఉన్నా యి. కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో దోమల మందు కొడుతూ ఓ కూలీ చనిపోయాడు.
 
 గతంలో డీఎం వోగా, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా పులి రామన్నగూడెం, కోటరామచంద్రపురం పీహెచ్‌సీలకు ఇన్‌చార్జి మెడికల్ ఆఫీసర్‌గా ఏకకాలంలో విధులు నిర్వర్తించిన ఘనత ఆయనకు ఉంది. ఆ సమయంలో ఒక కారు వినియోగిస్తూ, మూడు కార్ల అద్దెను తీసుకునేవారని కొందరు చెబుతున్నారు. 2010లో ఆయన చేసిన ట్యూబెక్టమీ ఆపరేషన్ వికటించి ఓ గిరిజన మహిళ దుర్మర ణం పాలయినట్లు సమాచారం. ఈ ఆరోపణల నేపథ్యంలో 2011 నవంబర్ 30న రాథోడ్‌ను అన్ని బాధ్యతల నుంచి తప్పించి వైద్య ఆరోగ్య శాఖకు సరెండర్ చేశారు. అలాంటి వ్యక్తిని ప్రస్తుత డీఎంహెచ్‌వో ఉపయోగించుకున్నారంటే.. అక్రమాలకు అనుభవజ్ఞుడిని ఎంచుకున్నట్టేనని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు అంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement