సమస్యలు వింటూ.. పరిస్థితులు చూస్తూ
సాక్షి, ఏలూరు : రాష్ర్ట విభజన నేపథ్యంలో ఖమ్మం నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో కలిసిన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో జిల్లా అధికారుల బృందం గురువా రం పర్యటించింది. కలెక్టర్ కె.భాస్కర్, ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), పోలవరం ఎమ్మె ల్యే మడియం శ్రీనివాసరావు, అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన సుమారు 40 మంది జిల్లా అధికారులు పర్యటనలో పాల్గొన్నారు. కలెక్టరేట్ నుంచి ఉదయం 8 గంటలకు జాయింట్ కలెక్టర్ టి.బాబురావునాయుడు నేతృత్వంలో అధికారుల బృందం ఆర్టీసీ బస్సులో బయలుదేరింది. ఎవరికి వారు రూ.270 చొప్పున చెల్లించి టిక్కెట్ కొనుక్కుని బస్సు ఎక్కారు. ఉదయం 11 గంట లకు అంతా కుక్కునూరు చేరుకున్నారు.
తొలుత అక్కడి తహసిల్దార్ కార్యాలయం వద్ద ప్రజలు, అధికారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు తాము తెలంగాణ రాష్ట్రంలో పనిచేసేలా ఆప్షన్ ఇవ్వాలంటూ ఆందోళన నిర్వహించారు. కలెక్టర్ వారితో చర్చించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. డ్వాక్రా సంఘాల యానిమేటర్లు గత ఏడాది నుంచి తమకు జీతాలు రావడం లేదని అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా కలిసిన గ్రామాల ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలకు సంబంధించి రాష్ట్ర సరి హద్దు ప్రాంతాలు దాటివచ్చిన వారికి సైతం సేవలందించే ధృక్పథాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్ధీకరణ చట్టాన్ని అనుసరించి, రాష్ట్రంలో అమల్లో ఉన్న అన్ని చట్టాలు ఈ గ్రామాల ప్రజలకు వర్తిస్తాయన్నారు.
రైతులకు రూ.1.50 లక్షల వరకు, డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష వరకు రుణమాఫీ అవుతా యని వివరించారు. వరద బాధితులను, పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. అక్టోబర్ 2నుంచి రాష్ట్రంలో అమలయ్యే నూతన సామాజిక పెన్షన్ కార్యక్రమం, ఎన్టీఆర్ సుజల స్రవంతి వంటి పథకాలన్నిటినీ జిల్లాలో కలిసిన తెలంగాణ గ్రామాల్లో అమలు చేస్తామని కలెక్టర్ చెప్పారు. ఈ ప్రాంత రైతులకు పత్తి వంటి విత్తనాలతోపాటు ఎరువులను పూర్తిస్థాయిలో అందిస్తామని, కుక్కునూరు, వేలేరుపాడులోని వ్యవసాయ సహకార సంఘాల్లో ఎరువులను నిల్వచేసి రైతులకు అందిస్తామని తెలిపారు.
ఈ గ్రామాల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు గిరిజన సంక్షేమ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వరరావును సమన్వయాధికారిగా, ప్రత్యేక అధికారిగా నియమించినట్టు చెప్పారు. పోల వరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే వారికి మెరుగైన ప్యాకేజీ అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ సర్వే సెటిల్‌మెంట్ చట్టాన్ని అనుసరించి భూముల సర్వేకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ టి.బాబురావునాయుడును కలెక్టర్ ఆదేశించారు. కుక్కునూరు, బూర్గంపాడు, ఏలేటి పాడు గ్రామాలకు ఏలూరు, జంగారెడ్డిగూడెం, కోటరామచంద్రపురం ప్రాంతాల నుంచి బస్సు సర్వీసులను పెంచుతామన్నారు. గిరిజనులు కోటరామచంద్రపురం ఐటీడీఏ పరిధిలోకి వస్తారని పేర్కొన్నారు.
అన్ని గ్రామాల్ని అభివృద్ధి చేస్తాం
ఏలూరు ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా చేరిన గ్రామాలకు రోడ్లు, మంచినీరు, విద్యు త్, విద్య, వైద్యం వంటి మౌలిక సౌకర్యాలు పూర్తిస్థాయిలో కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. వరదల కారణంగా పంటల్ని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు మాట్లాడుతూ కొత్తగా చేరిన గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆయా గ్రామాల్లో అధికార యంత్రాం గం పూర్తి స్థాయిలో ఉండేలా, ప్రజలకు మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు వేలేరుపాడు వెళ్లారు. అక్కడ జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. అక్కడి ప్రజల చెప్పిన సమస్యలు విన్నారు. నిరుద్యోగ సంఘాల నాయకులు పోలవరం ముంపు వల్ల ఉపాధి కోల్పోతామని, తమకు సాయం చేయాలని కోరారు. పలువురు ఉపాధ్యాయులు తాము తెలంగాణలో పనిచేసేలా ఆప్షన్ ఇవ్వాలని కోరారు. జారుుంట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, అదనపు జేసీ సీహెచ్ నరసింగరావు, జిల్లా పరిషత్ సీఈవో కె.వెంకటరెడ్డి, డీపీవో ఎ.నాగరాజువర్మ, వ్యవసాయ శాఖ జేడీ వి.సత్యనారాయణ, ఐసీడీఎస్ పీడీ పి.వసంతబాల, కుక్కునూరు తహసిల్దార్ బి.సుమతి, ఎంపీడీవో రామచంద్రరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.