మా గురించి పట్టించుకోరా
మా గురించి పట్టించుకోరా
Published Thu, Dec 29 2016 9:48 PM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల ఆందోళన బాట
ప్రచారంపైనే ప్రభుత్వం దృష్టి
నేడు స్పిల్ వే కాంక్రీట్ పనులను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
నిరసన వ్యక్తం చేసేందుకు సన్నద్ధమవుతున్న నిర్వాసితులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని 2018 నాటికి పూర్తి చేస్తామని ఊదరగొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పునరావాసంపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. ఈ నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ పోలవరం నిర్వాసితులు నెలన్నర రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. బుధవారం రోడ్లను దిగ్భంధనం చేసిన నిర్వాసితులు గురువారం భిక్షాటన కార్యక్రమం ద్వారా తమ నిరసన తెలిపారు. పునరావాస ప్యాకేజీని సంపూర్ణంగా అమలు చేస్తే గ్రామాలు విడిచి వెళ్లిపోతామని నిర్వాసితులు గగ్గోలు పెడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ప్రాజెక్టు పనుల పేరిట హడావుడి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పునరావాసం గురించి పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రాజెక్టు స్పిల్‌వే పనులు ప్రారంభించేందుకు వస్తున్న సీఎం దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లేందుకు నిర్వాసితులు సన్నద్ధం అవుతున్నారు.
ముంపు గ్రామాలు 130.. పునరావాసం కల్పించింది 8 గ్రామాలకే..
పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో మొత్తం 130 గ్రామాలు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ముంపుబారిన పడతాయి. ఆయా గ్రామాలవారికి çపునరావాసం ప్యాకేజీ అమలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకూ ఏడు గ్రామాలను, పోలవరం కుడి కాలువలో వల్ల ముంపుబారిన పడే మరో గ్రామాన్ని మాత్రమే ఖాళీ చేయించారు. ఈ గ్రామాల్లో కూడా అనేక సమస్యలు ఉన్నా వాటిని పట్టించుకోవడం లేదు. తమకు రావాల్సిన రాయితీలు ఇవ్వడం లేదని 45 రోజులుగా నిర్వాసితులు పోలవరంలో దీక్షలు చేస్తున్నారు. అన్ని ముంపు గ్రామాల నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాసం కల్పించాలని కోరుతున్నా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ నిర్ధిష్టమైన ప్రకటన రాలేదు. పునరావాస కేంద్రాలకు వచ్చి ఏడాది దాటినా మౌలిక వసతులు కల్పించ లేదని, ఇంకా కొందరికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా భూమికి భూమి, యువతీ యువకులకు రాయితీలు చెల్లించలేదని, పోడు భూములకు పట్టాలివ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఖాళీ చేయించని 122 గ్రామాల ప్రజలు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముంపు ప్రాంతాలు కావడంతో ఇక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు చేయడం లేదు. ప్రధానంగా రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతులు కరువయ్యాయని, అధికారులకు చెప్పినా ముంపు గ్రామాలు కావటంతో పట్టించుకోవటంలోదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పునరావాస కాలనీలోనూ నిర్వాసితులే..
పునరావాస కాలనీల్లోనూ వారు నిర్వాసితులుగానే ఉండాల్సి వస్తోంది. గోదావరితో అనుబంధం, తాతముత్తాతల కాలం నుంచి ఊరితో పెనవేసుకున్న బంధాన్ని వదులుకుని కన్నీటితో పునరావాస కాలనీకి చేరిన నిర్వాసితులకు కన్నీరు మాత్రం ఆగటం లేదు. అన్నీ వదులుకుని వచ్చామని, అయినా అధికారులు తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చేగొండిపల్లి నిర్వాసితులు తమ కోసం నిర్మించిన ఇళ్లు నాసిరకంగా ఉన్నాయని, తమకు న్యాయం చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. పైడిపాక, రామయ్యపేట నిర్వాసితుల కోసం పేరంపేట రోడ్డులో 265 ఇళ్లు నిర్మించారు. పైడిపాక గ్రామస్తులకు 189, రామయ్యపేట గ్రామస్తులకు 76 ఇళ్లు నిర్మించి వారందరినీ ఈ కాలనీకి తరలించారు. పునరావాస కేంద్రంలో ఆధునిక పరిజ్ఞానంతో ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పిన అధికారులు చివరకు నాసిరకం ఇళ్లను నిర్వాసితులకు అందజేశారు. గత సెప్టెంబర్‌లో వర్షాలు కురిసిన సమయంలో ఇంటి శ్లాబుల నుంచి నీరు గదుల్లోకి కారుతున్నాయని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అలాగే ఇంటికి సంబంధించి ఏర్పాటు చేసిన మెట్లకు గాని ఇంటి పైన గాని పిట్టగోడలు ఏర్పాటు చేయలేదు. దీంతో ఏ ప్రమాదం జరుగుతుందో అని భయంగా ఉందని పేర్కొన్నారు. ఇటీవల ఒక బాలుడు ఇంటిపైకి ఎక్కుతుండగా తూలి కిందపడిపోగా చేయి విరిగింది. కిటికీలకు, ద్వారబంధాలకు తలుపులు లేవని, కొన్నింటికి తలుపులు ఏర్పాటు చేసిన గొళ్లాలు పెట్టలేదని మహిళలు పేర్కొన్నారు. కాలనీలో ఇళ్లు ఇష్టం వచ్చినట్లుగా నిర్మించారని, ఒక ఇంటికి, మరొక ఇంటికి అసలు సంబంధం లేదని పేర్కొన్నారు. ఒక ఇంట్లో రెండు గుమ్మాలు ఏర్పాటు చేస్తే, మరో ఇంట్లో నాలుగు గుమ్మాలు ఏర్పాటు చేశారని తెలిపారు. అలాగే తమ ఇంటి స్థలం ఎంతవరకు ఉందో కొలిచి ఇస్తే కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటామన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇంటికి ఆనుకుని నిర్మించిన మరుగుదొడ్ల పరిస్థితి మరీ ఘోరం. బాత్రూమ్ పైకప్పుపై సిమెంట్ ప్లేటు వేసి వదిలివేశారు. ప్లేట్‌కు ప్లేట్‌కు మధ్య ఖాళీ ఏర్పడి, వర్షం కురిస్తే వర్షపు నీరంతా అందులోకి వస్తోంది. అలాగే తాము సొంతంగా కట్టుకున్న మరుగుదొడ్లకు బిల్లులు ఇవ్వడం లేదని నిర్వాసితుల్లో కొందరు వాపోతున్నారు. ఈ కాలనీలో పాఠశాల ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించి భవనం కూడా కట్టారు. అయితే దానిలో సిమ్మెంట్‌బస్తాలు నిల్వ చేస్తున్నారు. కాలనీలో బడి కట్టకపోవడంతో వారంతా పిల్లలను ప్రైవేట్‌పాఠశాలల్లో చేర్పించారు. అయితే హడావుడిగా తాజాగా ఒక ఉపాధ్యాయుడిని నియమించి కమ్యూనిటీ హాల్‌లో పాఠశాల ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే ప్రైవేట్‌పాఠశాలలో విద్యార్థులు చేరిపోవడంతో ఈ పాఠశాలకు 10 నుంచి 15 మంది విద్యార్థులకు మించి వెళ్లడం లేదు.
నష్టపరిహారం ఇవ్వలేదు
పైడిపాకలో మా ఇంటికి నష్టపరిహారం ఇవ్వలేదు. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. సర్వే కూడా చేసుకుని వెళ్లారు. ఇంకా 14 మందికి నష్టరిహారం అందాల్సి ఉంది. మమ్మల్ని తీసుకువచ్చి పునరావాస కాలనీలో పడేసి పట్టించుకోవడం లేదు.
గూడా అచ్చమ్మ, పైడిపాక పునరావాస కాలనీ వా’ట
ఇల్లు కట్టలేదు
నాకు చేగొండపల్లి పునరావాస గ్రామంలో ఇంటి స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టలేదు. అడిగితే వేరేచోట కట్టిన ఇల్లు ఇస్తామంటున్నారు. నాకు ఇచ్చిన స్థలంలోనే ఇల్లు కట్టాలంటే అధికారులు కుదరదంటున్నారు.
కొవ్వాసు అనిల్‌కుమార్, చేగొండపల్లి నిర్వాసితులు
Advertisement
Advertisement