
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతుండటంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాల ఆయకట్టు పరిధిలో సాగునీటి కష్టాలకు తెరపడనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవ తీసుకుని పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కాఫర్ డ్యామ్ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 120 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం అప్పర్, లోయర్ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం పూర్తి కావడంతో 25 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం దక్కింది. దీంతో గోదావరి జిల్లాల్లోని 10 లక్షల ఎకరాల ఆయకట్టు రైతులకు సాగునీటి కష్టాలు శాశ్వతంగా దూరం కానున్నాయి.« ఇప్పటికే పోలవరం కాఫర్‌డ్యాం వద్ద నీటి మట్టం 25.75 మీటర్లకు చేరుకుంది. దీంతో తొలిసారిగా స్పిల్‌వే నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఆనకట్ట వద్ద నీరు నిల్వ చేసే అవకాశం లేక..
గతంలో నిర్మించిన ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిని నిల్వ చేసే సదుపాయం లేదు. ఆనకట్టకు పాండ్‌లో గరిష్టంగా 2.69 టీఎంసీల నీరు మాత్రమే ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు ఆనకట్ట గేట్ల ద్వారా సాగునీటిని విడుదల చేస్తుంటారు. వర్షభావ పరిస్థితులు తలెత్తినప్పుడు మూడు డెల్టాలు తీవ్రమైన సాగునీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వచ్చేది. గత పదేళ్లుగా రబీ సీజన్‌లో సీలేరు జలాలపై ఆధారపడి సాగును నెట్టుకు రావాల్సి వస్తోంది. నీటి పొదుపు చర్యలు పాటించడం, వంతుల వారీ విధానం ద్వారా రబీకి సాగునీరు అందించినా కాలువ శివారు భూములకు నీరందక రైతులు రోడ్డెక్కే దుస్థితి దాపురించేది. పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో పురోగతి వల్ల ఇకపై ఈ సమస్య నుంచి ఉభయ గోదావరి జిల్లాల రైతులు శాశ్వతంగా బయటపడనున్నారు.
ఆక్వా రంగానికీ ఆయువు
పశ్చిమ గోదావరి జిల్లాలో 1.35 లక్షలు ఎకరాల్లో చేపలు, రొయ్యల చెరువులున్నాయి. ఆక్వా రంగం మనుగడ సాగించాలంటే గోదావరి నీరు వాటికి అందించడం తప్పనిసరి. వ్యవసాయ అవసరాలకే నీరు సరిపోని పరిస్థితుల్లో ఆక్వా పరిశ్రమ కూడా నీటిఎద్దడి వల్ల అనేక ఇబ్బందులు పడేది. సీలేరు నుంచి 40 టీఎంసీల వరకు నీటిని గోదావరిలోకి మళ్లించినప్పటికీ మరో 10 నుంచి 20 టీఎంసీల నీటి కొరత ఉండేది. పోలవరం వద్ద అప్పర్, లోయర్ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం వల్ల నీటి నిల్వలు అందుబాటులోకి రానుండటంతో ఆక్వా రంగం కూడా నీటి కష్టాల నుంచి గట్టెక్కే అవకాశం ఏర్పడింది.
చదవండి: పోలవరం మరింత వేగం
Comments
Please login to add a commentAdd a comment