సాక్షి, ఏలూరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు అవినీతి రోగం పట్టుకుంది. ఎందరు అధికారులు మారినా.. నిబంధనలు ఎంత కఠినతరం చేసినా వైద్య ఆరోగ్య శాఖలో అక్రమాలు ఆగడం లేదు. అక్రమాలే పరమావధిగా, అవినీతే ఆలంబనగా వ్యవహరిస్తున్న ఈ శాఖ ఉన్నతాధికారుల తీరుతో జిల్లా ప్రతిష్ట మంటగలుస్తున్నా మార్పు రావడం లేదు. తప్పుచేస్తే ఒకసారి కాకపోతే మరోసారైనా దొరికిపోవడం ఖాయమని తెలిసినా ఎవరూ బెదరడం లేదు. సాక్షాత్తూ ఆ శాఖ జిల్లా అధికారులే వరుసగా దొరికిపోతున్నా మళ్లీ అదే పునరావృతమవుతోంది.
యథేచ్ఛగా నగదు డ్రా
రెండేళ్ల క్రితం 2011 డిసెంబర్ 6, 7, 8 తేదీల్లో పైలేరియా నివారణ కార్యక్రమం జరుగగా 12న దాదాపు రూ.11.50 లక్షల మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (డీఎంఏ) నిధులను నిబంధనలకు విరుద్ధంగా నగదు రూపంలో డ్రా చేశారు. ఆ నగదును కార్యాలయంలో ఉంచడంతో అప్పటి వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) పద్మజ, ఇన్‌చార్జి డీఎంవో సి.ప్రసాద్‌లపై సస్పెన్షన్ వేటు పడింది. రెండేళ్ల అనంతరం ఇటీవలే పద్మజకు డిమోషన్‌తో ఉత్తరాంధ్రలో పోస్టింగ్ ఇచ్చారు. పద్మజ వ్యవహారంతో మేల్కొన్న ఉన్నతాధికారులు నగదు లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనే జరగాలని నిబంధన విధించారు.
ఈ నిబంధనలను ఖాతరుచేయకుండా ఇటీవల దాదాపు రూ.26 లక్షలను డ్రా చేశారు. ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ బయటపెట్టడంతో డీఎంహెచ్‌ఓ టి.శకుంతల, డెప్యూటీ డీఎంహెచ్‌వో, ఇన్‌చార్జి జిల్లా మలేరియా అధికారి టి.నాగేశ్వరరావు, మలేరియా అధికారి కార్యాలయం సూపరింటెండెంట్ కేవీవీ సత్యనారాయణ కొద్ది రోజుల క్రితం సస్పెండ్ అయ్యారు. గతంలో డీఎంహెచ్‌వో విజయపాల్ 2008లో అవినీతి ఆరోపణలతో బదిలీ అయ్యారు. అంతకు ముందు 2006-07లో అప్పటి డీఎంహెచ్‌వో సత్యనారాయణ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఇక ఈ శాఖలో తరచుగా మెమోలు తీసుకునేవారు, సస్పెండైనవారు కిందిస్థాయిలో చాలామందే ఉన్నారు.
తీవ్ర స్థాయిలో విభేదాలు
ఇతర శాఖల కంటే ఈ శాఖలో సిబ్బంది మధ్య విభేదాలు కాస్త ఎక్కువే. అవినీతి సొమ్ము పంపకాల విషయంలో తలెత్తిన వివాదం, ఆధిపత్యం కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే తమ శాఖలో అక్రమాలపై లీకులు ఇస్తున్నారని స్పష్టమవుతోంది. అలాగే తమకు నష్టం కలిగించినవారి బండారాలు బయటకు పొక్కేలా చేస్తున్నవారూ ఉన్నారు. ఇప్పటికైనా కలెక్టర్, ఆ శాఖ అత్యున్నత స్థాయి అధికారులు స్పందించి ప్రక్షాళన చేపట్టకపోతే ఈ శాఖ ద్వారా అందే సేవలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉంది.
ఆరోగ్యశాఖకు అవినీతి రోగం
Published Sat, Apr 19 2014 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 6:12 AM
Advertisement