నిరుపయోగంగా ఉన్న డైస్ కేంద్రం
నిర్మల్‌చైన్‌గేట్: పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే)లో భాగంగా డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్ వేషన్ సెంటర్ (డీఈఐసీ)ను నిర్మల్‌కు రాష్ట్ర ప్రభుత్వం 2014–15 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసింది. అప్పట్లో ఈ భవన నిర్మాణం కోసం రూ.85 లక్షల నిధులు మంజూరు చేశారు. జిల్లా ప్రసూతి ఆసుపత్రి పై అంతస్తులో 2019లో భవన నిర్మాణం పూర్తి చేసిన కాంట్రాక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు భవనాన్ని అప్పగించాడు. అయితే ఐదేళ్లు గడిచినా వైద్య పరికరాలు సమకూర్చలేదు. కనీసం సిబ్బందిని నియమించలేదు.
ఫిబ్రవరిలో నోటిఫికేషన్...
డైస్ కేంద్రంలో సిబ్బంది నియామకానికి గత ఫిబ్రవరి 20న వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. నాలుగు నెలలు గడిచినా ఇప్పటికీ నియామక ప్రక్రియ చేపట్టలేదు. దీంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నియామక ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందో అని ఎదురుచూస్తున్నారు.
అందుబాటులోకి వస్తే ప్రయోజనాలు
డైస్ కేంద్రం అందుబాటులోకి వస్తే ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించడం, పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించడం చేస్తారు. చిన్న పిల్లల వైద్యులు, ఫిజియోథెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, ఆప్తాల్మిక్ అసిస్టెంట్ ఇలా వివిధ విభాగాలకు చెందిన నిపుణులు వైద్య సిబ్బంది సుమారు 15 నుంచి 20 వరకు అందుబాటులోకి వస్తారు. మాటలు సరిగా మాట్లాడ లేని వారికి స్పీచ్ థెరపీ, అంగవైకల్యం ఉన్నవారికి ఫిజియోథెరపీ లాంటి చికిత్సలు అందిస్తారు. మూగ, చెవిటి, మానసిక దివ్యాంగులకు అవసరమైన వైద్య సహాయం అందుతుంది. మానసిక నిపుణులు సైతం అందుబాటులో ఉండటం వల్ల మనో వైకల్య సమస్య పరిష్కారం అవుతుంది.
ఊడుతున్న టైల్స్...
డైస్ కేంద్రం ఏర్పాటు చేసి ఐదేళ్లు పూర్తయినా భవనం మాత్రం నిరుపయోగంగానే ఉంది. దాదాపు రూ.85 లక్షలతో నిర్మించిన ఈ భవనాన్ని నాణ్యత పాటించకపోవడంతో టైల్స్ ఎక్కడికక్కడే ఊడిపోతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి డైస్ కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చి సామాన్య ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందేలా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
నియామకాలు చేపడతాం
డైస్ కేంద్రానికి సంబంధించి ఫిబ్రవరిలో 11 విభాగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశాం. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేశాం. త్వరలోనే మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎన్నుకొని నియామక పత్రాలు అందిస్తాం. – డాక్టర్ ధనరాజ్, డీఎంహెచ్‌వో
Comments
Please login to add a commentAdd a comment