district medical health department
-
‘డైస్’ సేవలు అందేదెప్పుడో..!
నిర్మల్‌చైన్‌గేట్: పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం(ఆర్బీఎస్కే)లో భాగంగా డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్ వేషన్ సెంటర్ (డీఈఐసీ)ను నిర్మల్‌కు రాష్ట్ర ప్రభుత్వం 2014–15 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసింది. అప్పట్లో ఈ భవన నిర్మాణం కోసం రూ.85 లక్షల నిధులు మంజూరు చేశారు. జిల్లా ప్రసూతి ఆసుపత్రి పై అంతస్తులో 2019లో భవన నిర్మాణం పూర్తి చేసిన కాంట్రాక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు భవనాన్ని అప్పగించాడు. అయితే ఐదేళ్లు గడిచినా వైద్య పరికరాలు సమకూర్చలేదు. కనీసం సిబ్బందిని నియమించలేదు. ఫిబ్రవరిలో నోటిఫికేషన్... డైస్ కేంద్రంలో సిబ్బంది నియామకానికి గత ఫిబ్రవరి 20న వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. నాలుగు నెలలు గడిచినా ఇప్పటికీ నియామక ప్రక్రియ చేపట్టలేదు. దీంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నియామక ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందో అని ఎదురుచూస్తున్నారు. అందుబాటులోకి వస్తే ప్రయోజనాలు డైస్ కేంద్రం అందుబాటులోకి వస్తే ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించడం, పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించడం చేస్తారు. చిన్న పిల్లల వైద్యులు, ఫిజియోథెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, ఆప్తాల్మిక్ అసిస్టెంట్ ఇలా వివిధ విభాగాలకు చెందిన నిపుణులు వైద్య సిబ్బంది సుమారు 15 నుంచి 20 వరకు అందుబాటులోకి వస్తారు. మాటలు సరిగా మాట్లాడ లేని వారికి స్పీచ్ థెరపీ, అంగవైకల్యం ఉన్నవారికి ఫిజియోథెరపీ లాంటి చికిత్సలు అందిస్తారు. మూగ, చెవిటి, మానసిక దివ్యాంగులకు అవసరమైన వైద్య సహాయం అందుతుంది. మానసిక నిపుణులు సైతం అందుబాటులో ఉండటం వల్ల మనో వైకల్య సమస్య పరిష్కారం అవుతుంది. ఊడుతున్న టైల్స్... డైస్ కేంద్రం ఏర్పాటు చేసి ఐదేళ్లు పూర్తయినా భవనం మాత్రం నిరుపయోగంగానే ఉంది. దాదాపు రూ.85 లక్షలతో నిర్మించిన ఈ భవనాన్ని నాణ్యత పాటించకపోవడంతో టైల్స్ ఎక్కడికక్కడే ఊడిపోతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి డైస్ కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చి సామాన్య ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందేలా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. నియామకాలు చేపడతాం డైస్ కేంద్రానికి సంబంధించి ఫిబ్రవరిలో 11 విభాగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశాం. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేశాం. త్వరలోనే మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎన్నుకొని నియామక పత్రాలు అందిస్తాం. – డాక్టర్ ధనరాజ్, డీఎంహెచ్‌వో -
డెప్యూటేషన్.. వసూళ్ల యాక్షన్!
సాక్షి, గుంటూరు : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (డీఎంఅండ్‌హెచ్‌వో) కార్యాలయంలో డెప్యూటేషన్లపై వచ్చిన ఉద్యోగులదే హవా. అక్కడ రెగ్యులర్ ఉద్యోగుల కంటే వారి హడావుడే ఎక్కువ. దీనికి తోడు కీలక విధుల్లో కొనసాగుతూ వసూళ్ల పర్వానికి తెరలేపుతున్నారు. పైసలివ్వనిదే ఒక్క ఫైల్ కూడా ముందుకు కదలని దుస్థితి. వాస్తవానికి ఇక్కడ అధికారికంగా డెప్యూటేషన్లపై వచ్చిన వారు 30 మంది అయితే, అనధికారికంగా ఉన్నవారు 20 మంది వరకు ఉంటారు. గెజిటెడ్, నాన్‌గెజిటెడ్, నాలుగో తరగతి ఇలా మూడు రకాల ఉద్యోగులు విధులు నిర్వహిస్తుంటారు. సుమారు 200 మంది రెగ్యూలర్ ఉద్యోగులు ఉంటారు. అయితే డీఎంహెచ్‌వో సీసీ(క్యాంప్‌క్లర్క్) పేరుతో, ఇతర జిల్లా వైద్యాధికారుల సీసీ పేర్లతో మల్టీపర్పస్‌హెల్త్ సూపర్వైజర్స్, మల్టీ పర్పస్‌హెల్త్ అసిస్టెంట్లను ఇక్కడ పని చేయిస్తున్నారు. అసలు వీరికి డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయం పోస్టులతో సంబంధం లేకున్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో రాజకీయ పలుకుబడితో అడ్డదారిలో డెప్యూటేషన్లపై వచ్చి ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్నారని విమర్శలొస్తున్నాయి. వీరి కోసం రెగ్యూలర్ ఉద్యోగుల విధులను తగ్గించారు. అదనపు సిబ్బందితో పని లేనప్పటికీ మూడేళ్లుగా రెగ్యూలర్ ఉద్యోగులు చేస్తున్న పనిని విభజించి కాలం వెళ్లదీస్తున్నారు. ఎటువంటి ఉత్తర్వులు లేకుండానే.. ఇక్కడ చాలా మంది డెప్యూటేషన్లపై ఎటువంటి ఉత్తర్వులు లేకుండా పని చేస్తున్నారు. వీరు వారానికి ఒకసారి తము అసులు పని చేసే ఆరోగ్యకేంద్రంలో సంతకాలు పట్టి వస్తున్నట్లు సమాచారం. మిగిలిన వారు బయోమెట్రిక్ హాజరు వేసి బయటకు వెళ్లి వడ్డీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు చేసుకుంటూ విధులను గాలికొదిలేస్తున్నారు. నిబంధనల ప్రకారం సీసీగా విధులను స్టెనోలు, జూనియర్ అసిస్టెంట్లు నిర్వర్తించాల్సి ఉంది. డీఎంహెచ్ఓ కార్యాలయంలో స్టెనోలు, జూనియర్ అసిస్టెంట్స్ ఉన్నా వారిని పక్కనపెట్టి ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలు అందించాల్సిన వారిని సీసీలుగా కొనసాగిస్తున్నారు. అదనపు సిబ్బంది అవసరమైతే మూడు, నాలుగు నెలలు మహా అయితే ఏడాది పాటు డెప్యూటేషన్‌పై వేస్తారు. కానీ ఇక్కడ ఏళ్ల తరబడి పాతుకుపోయారు. గతంలో డీఎంహెచ్‌వోగా పనిచేసిన డాక్టర్ పద్మజరాణి ఇద్దరు ఉద్యోగులకు డెప్యూటేషన్‌పై కార్యాలయంలో విధులు కేటాయించారు. ఆమె ఇక్కడి నుంచి బదిలీ అయ్యి ఏళ్లు గడుస్తున్న సదరు ఉద్యోగులు మాత్రం ఇంకా కొనసాగుతున్నారు. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి ప్రస్తుతం సీసీగా పనిచేస్తున్నారు. ఈయన అనధికారిక ఆదాయం నెలకు రూ.లక్ష వరకూ ఉంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వసూళ్ల పర్వం.. డెప్యూటేషన్లపై వచ్చిన వారు స్కానింగ్ సెంటర్స్, ఆస్పత్రులు, ల్యాబ్‌ల రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్, ఉద్యోగుల ఇంక్రిమెంట్ల మంజూరు, సరెండర్ లీవ్‌ల మంజూరు, ఎరియర్స్ మంజూరు, పదోన్నతులు, డెప్యూటేషన్లు, నిధులు మంజూరు వంటి కీలక విధులను నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో వారు వసూళ్లకు తెరలేపారు. ప్రతి పనికి ఒక రేటును నిర్ణయించి కాసులు దండుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2017 నవంబర్‌లో ఆత్మహత్య చేసుకున్న జూనియర్ అసిస్టెంట్ రవికుమార్ ఉదంతం అప్పట్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో సంచలనం రేకెత్తించింది. అతనికి పదోన్నతి సకాలంలో ఇవ్వకుండా డబ్బు కోసం వేధించారని, డబ్బు తీసుకుని కూడా పనిచేయకుండా ఇబ్బందులు పెట్టారని ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలో జనరల్ సెక్షన్, ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్స్‌లో ఉన్న ఉద్యోగుల విధులను కొన్నింటిని డెప్యూటేషన్‌పై వచ్చిన వారికి కేటాయించటం వల్లే ఇలా జరిగిందనే వాదన బలంగా వినిపించింది ఏసీబీకి ఫిర్యాదులు వెళ్లినా.. మారని తీరు! అనధికారిక డెప్యూటేషన్లపై డీఎంహెచ్‌వో కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల వసూళ్ల భాగోతంపై ఏసీబీకి సైతం ఫిర్యాదులు అందాయి. దీంతో ఇద్దరు ఉద్యోగులను అక్కడి నుంచి బదిలీ చేయాలని ఏసీబీ డైరెక్టర్ ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో ఒకరు తథాస్థానికి వెళ్లిపోగా, మరొకరు మాత్రం డీఎం అండ్‌హెచ్‌వో కార్యాలయంలో కొనసాగుతున్నారు. మరోవైపు ఏసీబీకి ఫిర్యాదులు వెళ్లిన సదరు ఉద్యోగి వసూళ్లకు అడ్డుకట్ట పడలేదు. ఇందులో పై స్థాయి అధికారులకు సైతం వాటలు వెళ్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్య కేంద్రాల్లో ఇబ్బందులు.. సీజనల్ వ్యాధులు గ్రామాల్లో వ్యాప్తి చెందుతున్నాయి. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆరోగ్య కేంద్రాల్లో పారామెడికల్ సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య కేంద్రాల్లో ఉండాల్సిన వారిని డెప్యూటేషన్లపై పని చేయిస్తుండటం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ఇటువంటి డెప్యూటేషన్లను ఇతర జిల్లాల్లో రద్దు చేశారు. గుంటూరు జిల్లాలో మాత్రం కొనసాగిస్తుండం ఏమిటని, దీనిపై కలెక్టర్ దృష్టి సారించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. . -
కదలం..సీటు వదలం!
సాక్షి, కర్నూలు : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పలువురు ఉద్యోగులకు బదిలీ గుబులు పట్టుకుంది. వారు ఉన్న చోట నుంచి కదిలేందుకు ఎంత మాత్రమూ ఇష్టపడటం లేదు. ఐదేళ్లకు పైగా ఒకేచోట ఉన్న వారు కొందరైతే.. పదేళ్ల నుంచి పాతుకుపోయిన వారు మరికొందరు ఉన్నారు. సదరు సీటు ఇతరులకు ఇచ్చేందుకు వారు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నుంచి లేఖలను అప్పటికప్పుడు తెచ్చుకుని బదిలీ ఆపేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు 20 శాతం పోస్టుల విషయంలోనూ పేచీ పెడుతున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని ఉద్యోగులు డీఎంహెచ్ఓ కార్యాలయంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్లు, ప్రాంతీయ శిక్షణ కేంద్రాలు, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, మెడికల్ కాలేజీలో విధులు నిర్వర్తిస్తున్నారు. జోనల్ స్థాయి బదిలీలకు సంబంధించి కడపలోని రీజినల్ డైరెక్టర్ (ఆర్డీ) కార్యాలయంలో, జిల్లా స్థాయి పోస్టులకు కర్నూలులోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. బదిలీల కోసం ఈ నెల నాలుగు నుంచి ఆరో తేదీ వరకు ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జోనల్ స్థాయిలో పీహెచ్ఎన్లు 18 మంది, ఎంపీహెచ్ఎస్(మేల్) 27, ఎంపీహెచ్ఎస్(ఫిమేల్) 30, డీపీఎంవో 7, హెడ్‌నర్సులు ఇద్దరు, స్టాఫ్‌నర్సులు 64, రేడియోగ్రాఫర్లు ఇద్దరు, ఎంపీహెచ్‌ఈవో 32, సీనియర్ అసిస్టెంట్లు 41, ఆఫీస్ సూపరింటెండెంట్లు ముగ్గురు, జిల్లా స్థాయిలో జూనియర్ అసిస్టెంట్లు 13 మంది, ఎల్డీ కంప్యూటర్ ఆపరేటర్లు 9, హెచ్ఏఎంలు 10, ల్యాబ్టెక్నీషియన్లు 25, డ్రైవర్లు 9 మంది దరఖాస్తు చేసుకున్నారు. సీటు కదిలేందుకు ససేమిరా! ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులు కొందరు సీటు కదిలేందుకు ఇష్టపడడం లేదు. ఐదేళ్లు, పదేళ్లు..కొందరు ఏకంగా పదిహేనేళ్ల నుంచి ఒకేచోట పాతుకుపోయారు. వీరిలో కొందరు ఉద్యోగ సంఘాల్లో నాయకులుగా చలామణి అవుతుండగా.. మరికొందరు బదిలీల సమయంలో ఉద్యోగ సంఘాల లేఖలతో ప్రత్యక్షమవుతున్నారు. ఆయా సంఘాల నాయకులు సైతం అప్పటికప్పుడు ‘వీరు మా సంఘంలో నాయకులంటూ లేఖలు ఇస్తుండడం గమనార్హం. ఈ వ్యవహారం ప్రతి ఏటా సాగుతోంది. దీనిపై వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. ప్రస్తుత బదిలీల ప్రక్రియలో సీనియర్ అసిస్టెంట్లలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకరు, వైద్య, ఆరోగ్యశాఖలో ఒకరు, ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో ఒకరు మాత్రమే బదిలీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. మిగిలిన వారందరూ ఉద్యోగ సంఘాల నాయకుల పేరుతో బదిలీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయానికి 80కి పైగా ఉద్యోగ సంఘాల లేఖలు అందాయి. 20 శాతం పోస్టులపైనా పేచీ ఐదేళ్లు దాటిన వారిలో కేవలం 20 శాతం మందిని బదిలీ చేయాలన్న నిబంధన ఫెవికాల్ వీరులకు కలిసి వస్తోంది. ఇందుకోసం ఆయా సంఘాల నాయకులతో కలిసి బదిలీ నిబంధనలపై రాద్ధాంతం చేస్తున్నారు. జోనల్ స్థాయిలో మొత్తం మంజూరైన పోస్టుల్లో ఐదేళ్లు దాటిన వారిలో 20 శాతంగా బదిలీలు చేస్తుండగా.. జిల్లా స్థాయిలో మాత్రం ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో 20 శాతం మాత్రమే బదిలీ చేయాలని వాదిస్తున్నారు. దీంతో రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి వివరణ తీసుకుంటూ జిల్లా అధికారులు బదిలీల ప్రక్రియకు సిద్ధమవుతున్నారు. -
స్వైన్ ఫ్లూపై తప్పుడు లెక్కలు!
► వైద్యాధికారులపై కేంద్ర బృందం మండిపాటు చిత్తూరు (అర్బన్ ) : గత రెండు నెలల కాలంలో జిల్లాలో నమోదైన స్వైన్ ఫ్లూ కేసులు ఏ ప్రాతిపదికన నిర్ధారించారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కేంద్ర వైద్య బృందం నిలదీసింది. జిల్లాలో నమోదైన స్వైన్ ఫ్లూ కేసులపై విచారణ చేపట్టడానికి మూడు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఓ బృందం గురువారం చితూ్తరుకు వచ్చింది. ఢిల్లీకి చెందిన డాక్టర్ అబిత్ చటర్జీ, డాక్టర్ ప్రనబ్ భవన్ తో పాటు రాష్ట్ర వైద్య శాఖ అధికారులు డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ భార్గవి తొలుత చితూ్తరులోని డీఎం అండ్ హెచ్‌వో కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ విజయగౌరితో భేటీ అయ్యారు. బృంద సభ్యులు మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో 54 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్లు, ఇద్దరు మృతి చెందినట్లు ఏ ప్రాతిపదికన నివేదిక ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై డీఎం అండ్ హెచ్‌వో మాట్లాడుతూ స్వైన్ ఫ్లూ వ్యాధిని రాపిడ్ పరీక్ష ద్వారా నిర్ధారించామన్నారు. దీంతో పాటు తమిళనాడుకు చెందిన వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో ఇచ్చిన రిపోరు్టను కూడా జత చేశామన్నారు. రాపిడ్ పరీక్ష, సీఎంసీ ఆస్పత్రి ఇచ్చిన నివేదికతో వ్యాధి నిర్దారణ ఎలా చేశారని కేంద్ర బృంద సభ్యులు ప్రశ్నించడంతో అధికారులు నీళ్లు నమిలారు. వ్యాధి గ్రస్తులకు ఎలాంటి పరీక్షలు చేశారో తాము స్వయంగా చూస్తే తప్ప ఓ అభిప్రాయానికి రాలేమని బృంద సభ్యులు పేర్కొన్నారు. చిత్తూరు ఆస్పత్రిలో వసతుల లేమిపై అసంతృప్తి జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటప్రసాద్‌తో కలిసి చితూ్తరు ప్రభుత్వాస్పత్రిని బృందం సభ్యులు సందర్శించారు. ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలో రోగులకు మాస్కులు అందుబాటులో లేకపోవడాన్ని గుర్తించారు. చేతులు కడుక్కోవడానికి కనీసం సోపును కూడా ఉంచకపోవడం ఏమిటని వైద్యులను ప్రశ్నించారు. ఆస్పత్రిలోని పలు వారు్డలను, స్కానింగ్ యూనిట్లను బృందం తనిఖీ చేసింది. ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన స్న్ ఫ్లూ వారు్డలో రోగులకు కనీస సదుపాయాలు, వసతులు లేకపోవడంపై కేంద్ర బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. మరో రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించి నివేదికను కేంద్రానికి అందజేయనుంది. చితూ్తరు ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారులు పాల్ రవికుమార్, గౌరీప్రియ తదితరులు కేంద్ర బృందం వెంట ఉన్నారు. -
ముగ్గురిపై సస్పెన్షన్ వేటు?
♦ మందుల కొనుగోలు వ్యవహారం ♦ వైద్య ఆరోగ్య శాఖలో అక్రమార్కులు ♦ కలెక్టర్, డీఎంహెచ్‌వోను ♦ తప్పుదోవ పట్టించిన వైనం నిజామాబాద్ అర్బన్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో మందుల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు సిబ్బంది పై సస్పెన్షన్ వేటు పడనుంది. ఓ మాజీ అధికారి, నలుగు సిబ్బంది కలిసి అక్రమాలకు తెరలేపారు. ఏడాదిగా ఈ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. 2015లో వైద్య ఆరోగ్యశాఖలోరూ. 52 లక్షలతో మందుల కొనుగోలుకు అప్ప టి జిల్లా వైద్యాధికారి నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ నుంచి రూ. 7 లక్షల మందులకు మాత్రమే అనుమతి తీసుకున్నారు. వీటికి టెం డర్లు నిర్వహించారు. అనంతరం పాత అనుమతులతోనే రూ. 45 లక్షల మందులను కొనుగో లు చేశారు. ఇందుకు ఎలాంటి టెండర్లు నిర్వహించకుండా ఏజెన్సీలకు కాంట్రాక్టు అప్పగిం చారు. వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఏజెన్సీ నిర్వాహకులు మందులు సరఫరాకు చేసేందుకు ముందుకు రాగా, వారికి పోటీగా ప్రకాశం జిల్లాకు చెందిన ఏజెన్సీ నిర్వాహకుడు మందులు తక్కువ ధరకు సరఫరా చేస్తానని పేర్కొన్నాడు.ఒక మందు బిల్లను రూ. 2 లకు సరఫరా చేస్తానని దరఖాస్తు చేశాడు. అయితే నాటి వైద్యాధికారి వరంగల్, మహబూబ్‌నగర్,నిజామాబాద్ జిల్లాలకు చెం దిన ఏజెన్సీ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకుని ఒక్క మందు బిల్లను రూ.7 లకు కొనుగోలు చేశారు. ఇందులో వైద్యాధికారికి రూ. 8 లక్షలు, సిబ్బందికి , మరో అధికారికి రూ. 4 లక్ష లు మామూళ్లు అందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ప్రకాశం జిల్లాకు చెందిన ఏజెన్సీ నిర్వాహకుడు అప్పటి కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ విచారణాధికారిగా డీఆర్వోను నియమించారు. డీఆర్వో చేపట్టిన విచారణలో మందుల కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. టెండర్లు లేకుండా ఎక్కువ ధరకు మందులు కొనుగోలు చేయడం బట్టబయలైంది. డీఆర్వో నివేదిక మేరకు మందుల ఏజెన్సీలకు బిల్లులు నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు. ఏడాది కాలంగా రూ. 52 లక్షల బిల్లులు రాకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులు అధికారులు, సిబ్బందిపై ఒత్తిడి తీసుకు వచ్చారు. ఫైలు కలెక్టరేట్లో ఉండడంతో సిబ్బంది ఏమీ చేయలేకపోయారు. వైద్యశాఖ సిబ్బంది సూచనల మేరకే ఏజెన్సీ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు వేయడం ద్వారా ఫైలు ముందుకు కదులుతుందని,బిల్లులు పొందవచ్చునని పథకం పన్నారు. ఇందులో రిటైర్డ్ అయిన అధికారి మం దుల కొనుగోలుకు సంబంధించి డిసెంబర్లోనే ఆడిట్ చేయించారు. మార్చిలో చేయవల్సిన ఆడిట్ నాలుగు నెలల ముందుగానే ముగిం చారు. అనంతరం ఫిబ్రవరిలో కోర్టును ఆశ్రయించాలని ఏజెన్సీ నిర్వాహకులకు సలహాలు ఇచ్చినట్లు తెలిసింది. కోర్టు నుంచి వైద్య శాఖకు నోటీసులు జారీ కావడంతో మందుల కొనుగోలుకు సంబంధించి ఫైలు కలెక్టర్ వద్ద ఉందని, తమకు సంబంధం లేదంటూ ప్రస్తుత జిల్లా వైద్యాధికారిణి సమాధానం ఇచ్చారు. అనంత రం కోర్టు నుంచి బిల్లులు చెల్లించకపోవడంపై డీఎంహెచ్‌వో, కలెక్టర్‌ను హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టుకు సమాధా నం చెప్పిన తరువాత కలెక్టర్ తీవ్ర స్థాయిలో వైద్య ఆరోగ్యశాఖపై మండిపడ్డారు. మందుల కొనుగోలులోతప్పుడు రిపోర్టులు, సమాచారం అందించకపోవడం,నిబంధనలకు విరుద్ధంగా టెండర్ల నిర్వహణపై ముగ్గురు వైద్య సిబ్బం దిపై సస్పెన్షన్వేటు వేసే అవకాశం ఉందని తెలిసింది. టీబీ కార్యాలయం నుంచిడిప్యుటేషన్పై కొనసాగుతున్న అధికారి ఒకరు, మరో ఇద్దరు ఉద్యోగులు ప్రధాన పాత్ర పోషించినట్లు జిల్లా కలెక్టర్ గుర్తించారు. మరో రెండు రోజుల్లో చర్యలు అమలు కానున్నాయి. -
రేపు రెండో విడత పల్స్‌పోలియో
* ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్య ఆరోగ్యశాఖ * జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు 3.67 లక్షలు * పీహెచ్‌సీలు, అర్భన్హెల్త్సెంటర్లకు వ్యాక్సిన్ సరఫరా నల్లగొండ టౌన్: రెండో విడత పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని జిల్లాలో ఆదివారం నిర్వహించనున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల లోపు వయస్సు కలిగిన పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. పల్స్ పోలియో కార్యక్రమం కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలు, ఐదు రెవెన్యూ డివిజన్లలో కలిపి మొత్తం 3లక్షల 67వేల 460మంది ఐదు సంవత్సరాల లోపు వయస్సు కలిగిన పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. వారికి అవసరమైన వ్యాక్సీన్ జిల్లాకు తెప్పించారు. జిల్లాలోని 15 సీహెచ్‌ఎన్‌సీలు, వాటి పరిధిలోని 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలుగు పీపీ యూనిట్లు, 8 అర్భన్ హెల్త్ సెంటర్లు, మూడు అర్భన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లకు వ్యాక్సిన్ సరఫరా చేశారు. పోలియో చుక్కలను వేయడానికి రూరల్ పరిధిలో 2737 సెంటర్లు, అర్భన్‌లో 234 పోలియే చుక్కల కేంద్రాలను కలిపి మొత్తం జిల్లా వ్యాప్తంగా 2971 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశారు. 79 మొబైల్ బృందాల ఏర్పాటు సంచారజాతులు,ఇటుకబట్టీలు,మురికివాడలు, నిర్మాణ రంగాలు, చేపలుపట్టే ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారి పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి 79 మొబైల్ బృందాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్టు చేసింది. మొబైల్ బృందంలో పీహెచ్సీ వైద్యాధికారితో పాటు నలుగురు సిబ్బంది పోలియో చుక్కలను వేయడంతో పాటు వారి పరిధిలో కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్, బస్‌స్టాప్‌లలో పోలియో చుక్కలను వేయడం కోసం 54 ట్రాన్సిట్ బృందాలను నియమించారు. పోలియో చుక్కల కార్యక్రమంపై ప్రజలలో అవగాహన కల్పించడం కోసం అవసరమైన కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేశారు. 21వ తేదీ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పోలియో కేంద్రాలలో పిల్లలకు చుక్కలను వేయనున్నారు. అదే విధంగా 22, 23 తేదీల్లో ఇంటింటికీ తిరిగి చుక్కలు వేయించని పిల్లలను గుర్తించి వారికి పోలియో చుక్కలు వేయనున్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు ఉపాధ్యాయులు, స్వయం సహాయక సంఘాలు, ఐకేపీ, ఐసీడీఎస్, ఆశ వర్కర్ల సేవలను వినియోగించుకుంటారు. 11,884 మంది సిబ్బంది నియామకం పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతం చేయడానికి జిల్లా వ్యాప్తంగా 11,884 మంది సిబ్బందిని నియమించారు. అందులో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది 1836, ఉపాధ్యాయులు 327, అంగన్వాడీ వర్కర్లు 3560, ఆశ వర్కర్లు 2978, ఇతర వాలంటీర్లు 3183 మందిని నియమించారు. కార్యక్రమం పర్యవేక్షణ కోసం 294 మంది సూపర్వైజర్లను నియమించారు. కార్యక్రమాన్ని కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అదనపు జా యింట్ కలెక్టర్, డీఎంఅండ్‌హెచ్‌ఓ, డీఐఓ, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్, ఇతర శాఖల అధికారులు పర్యవేక్షించనున్నారు. నేడు పల్స్‌పోలియో ర్యాలీ జిల్లాలో ఆదివారం నుంచి నిర్వహించనున్న రెండో విడత పల్స్‌పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ భానూప్రసాద్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాలీ ఉదయం 9. గంటలకు డీఎంహెచ్ కార్యాలయం వద్ద ప్రారంభమై గడియారం సెంటర్ మీదుగా ప్రకాశంబజార్, డీఈఓ కార్యాలయంనుంచి డీఎంహెచ్ఓ కార్యాలయానికి చేరుకుంటుందని తెలిపారు. -
పనిచేయకుంటే షాక్ ‘ట్రీట్మెంట్’
సంగారెడ్డి క్రైం: వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, లేకుంటే చర్యలు తప్పవని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. ముఖ్యంగా అధికారులంతా సమన్వయంతో వ్యవహరిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితిపై మంత్రి హరీశ్‌రావు వైద్య ఆరోగ్య శాఖమంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లోని సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రజలకు వైద్య సేవల్లో ఎక్కడా చిన్న లోపం కనిపించినా సహించేది లేదని హెచ్చరించారు. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో అపరిష్కృతంగా వున్న సమస్యల పరిష్కారానికి అధికారులకు మార్గదర్శకాలను ఇచ్చారు. అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలపై మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డిలు సమీక్షించారు. జిల్లాకు 13వ ఆర్థిక సంఘం మంజూరు చేసిన ఐదు ప్రాథమిక వైద్యశాలల పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించడానికి కావాల్సిన పరికరాలు పీహెచ్‌సీలకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి మంజూరవుతున్నా వాటిని అందుబాటులోకి తేవడంలో జరుగుతున్న జాప్యంపై మండిపడ్డారు. జనని శిశు సురక్షా కార్యక్రమాన్ని సమీక్షిస్తూ మందులు, ఆహారం, వైద్య పరీక్షలు, రక్తం రవాణా కోసం డబ్బులు రోగులకు కచ్చితంగా అందే విధంగా చూడాలన్నారు. జహీరాబాద్, పటాన్చెరు, మెదక్‌లకు ఐసీయులకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇంటి వద్దకే మందులు సరఫరా చేసే కార్యక్రమాన్ని జిల్లాలో వెంటనే ప్రారంభించాలన్నారు. జిల్లాలోని ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ విధానం వెంటనే పునరుద్ధరించాలని, సీసీ కెమెరాల పనితీరును కూడా అడిగి తెలుసుకున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ కౌన్సిలర్లకు చెల్లించాల్సిన వేతనాలు వెంటనే చెల్లించాలని ఆదేశించారు. సదు సంవత్సరాలుగా ఒకే దగ్గర పనిచేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందిని వెంటనే బదిలీ చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. పటాన్చెరు, జోగిపేట, నర్సాపూర్, దుబ్బాక, రామాయంపేటలో కూడా రక్త నిధి సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్‌రెడ్డితో పాటు జిల్లా ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఛీ ఛీ ఇదేం దూషణ!
- జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఓ ఉన్నతాధికారి నిర్వాకం - మహిళా ఉద్యోగుల పట్ల అసభ్య ప్రవర్తన - ‘సాక్షి’తో గోడు చెప్పుకున్న బాధితులు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ఏయ్.. పచ్చ రంగు చీర కట్టుకున్నదాన.. నిన్నే..! ఇటురా.. మీటింగ్‌కు వచ్చావా? లేక.. ’ ఈ మాటలు ఎవరో సభ్యత లేని మనిషివి కావు.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నత స్థాయి అధికారి.. నర్సులను, మహిళా ల్యాబ్ టెక్నీషియన్లను ఉద్దేశించి అంటున్న మాటలు. ఉన్నతస్థాయి అధికారి దూషణ పర్వాన్ని తట్టుకోలేక కొంత మంది బాధితులు ‘సాక్షి’ కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పారు. ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘వైద్య విధ్వంసం’పై ప్రచురించిన వరుస కథనాలకు స్పందించిన మహిళా ఉద్యోగులు.. ‘మీరు రాస్తున్న కథనాలతో పాటు మా వ్యథను కూడా ప్రచురించండి’ అని కోరారు. ఇంతకాలం మౌనంగా భరించిన వారు.. తమ బాధను బట్టబయలు చేశారు. ఆ చూపులు భరించలేం... ఇటీవల సమావేశానికి వచ్చిన ఓ మహిళా ఉద్యోగిని ఉద్దేశించి ‘ఏమే.. బొట్ల బొట్ల చీరకట్టుకొచ్చినవ్.. షూటింగ్‌కు వచ్చావా?’ అంటూ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటంతో సదరు ఉద్యోగి కన్నీరు మున్నీరుగా విలపించడంతో తోటి ఉద్యోగులు ఓదార్చారు. అదే రోజు జరిగిన విషయాన్ని ఆమె తన తండ్రికి వివరించింది. తండ్రి ఈ విషయాన్ని ఓ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.మరో ప్రభుత్వ ఉద్యోగి భార్యను కూడా ‘ఏమే’ అంటూ ఏకవచనంతో సంబోధించడంతో పాటు మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీసే చూపులతో ఇబ్బంది పెట్టినట్టు ఫిర్యాదులు అందాయి. తమ ఇంట్లో కూడా చెప్పుకోలేని దుస్థితి అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మెమో ఇప్పించి.... సదరు ఉద్యోగి టార్గెట్ చేసిన మహిళా ఉద్యోగులకు చీటికి మాటికి మెమోలు ఇప్పిస్తారని, వచ్చి నేరుగా కలవాలని తన సబార్డినేట్స్‌తో ఫోన్ చేయిస్తారని, మెమో పట్టుకొని ఆయన ఆఫీసు రూంలోకి వెళ్తే నరకంలోకి వెళ్లినట్లుగా ఉంటుందని ఓ ఉద్యోగి ఉద్వేగానికి లోనయ్యారు. మీసం తిప్పుతూ ‘మీరు చెప్పినట్టు ఇక్కడ సాగవు’ అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతారని, ఎదురు మట్లాడితే వేధింపులకు గురి చేస్తారని, చేయని తప్పుకు ఎక్కడ ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందేమోనన్న ఆవేదనతో ఉన్నామని.. మరో ఉద్యోగి కన్నీళ్ల పర్యంతమయ్యారు. సదరు ఉద్యోగి మీద నిర్భయ చట్టం ప్రయోగిస్తే ఇప్పటి వరకు కనీసం 50 కేసులు పెట్టాల్సి వచ్చేదని మరో ఉద్యోగి ఆక్రోశం వెళ్లగక్కారు. ఇలాంటి అధికారిని తక్షణమే పంపించి మహిళా ఉద్యోగుల ఆత్మగౌరవం కాపాడాలని వారు కలెక్టర్‌ను కోరుతున్నారు. -
డీఎంహెచ్‌వోపై కలెక్టర్... కన్నెర్ర
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పనితీరుపై కలెక్టర్ మండిపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులందరూ ఉండగానే పట్టరాని కోపంతో ఫైలును నేలకేసి కొట్టారు. అర్ధంతరంగా సమావేశం నుంచి బయటికి వెళ్లిపోయారు. ఈ హఠాత్పరిణామంతో జిల్లా అధికారులంతా కంగుతిన్నారు. ఇటీవల మచిలీపట్నంలో లింగనిర్ధారణ, అబార్షన్ ఘటనలో నిందితులపై కేసు పెట్టాలని తాను ఆదేశించినా ఎందుకు పట్టించుకోలేదని కలెక్టర్ ప్రశ్నించగా, ఆయన పంపిన లేఖ తాను ఇంతవరకు చూడలేదని డీఎంహెచ్‌వో సమాధానమివ్వడమే ఆయన ఆగ్రహానికి కారణమని తెలిసింది. -
ఇదేమి లక్కో
* రూ.20 వేల శకటానికి రూ.1.44 లక్షల బిల్లు * కరపత్రాల పంపిణీకి రూ. 1.14 లక్షలట * ఆరు రెట్లు అదనంగా దోచేసినా పట్టని వ్యవహారం * హెల్త్ ఇన్‌ఛార్జి నేడు రాక ... ఫిర్యాదుకు కొందరు సిద్ధం ఒంగోలు సెంట్రల్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి తాండవిస్తోంది. ప్రతి పనిలో 100 శాతానికిపైగా అదనంగా బిల్లులు పెట్టుకుని, చెక్కులు రాసుకొని నిధులను స్వాహా చేస్తున్నా పర్యవేక్షించాల్సిన సంబంధితాధికారులు ప్రేక్షకపాత్ర వహించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం నాడే కాదు ... జన్మభూమి కార్యక్రమానికి చంద్రబాబు వచ్చినా సరే వీరికి పండుగే. ఎందుకంటే సంబంధిత ఏర్పాట్లకు లక్షలు ఖర్చు పెట్టినట్టు దొంగ బిల్లులు జత చేసి డ్రా చేసుకోవచ్చునని వీరి ఆలోచన. ఈ ఆలోచనలను ఆచరణలో పెట్టి నిధులు దారి మళ్లించినా ఉన్నతాధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం గమనార్హం. ఆరు రెట్లు అదనంగా బిల్లులు ఆగస్టు 15న జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ధూమపానం, గుట్కాలు వల్ల వచ్చే అనర్థాలపై ఓ శకటాన్ని ప్రదర్శించింది. ఒక టర్బోలారీకి చుట్టూ ఫ్ల్లెక్సీలను కట్టి, మధ్యలో ఆరుగురు కళాకారులచే ధూమపానం, గుట్కాలు వినియోగిస్తే వచ్చే నష్టాన్ని వివరిస్తూ శకటాన్ని రూపొందించారు. దీనికి సంబంధించి జిల్లావైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న జిల్లా అధికారి ఒకరు అన్నీతానై ఖాళీ బిల్లులను తెప్పించుకొని, తనే లెక్కలు రాసేసి చెక్కును నగదుగా మార్చుకున్నారు. దీనికి అయిన ఖర్చు అక్షరాలా రూ. 1,44,000. మామూలుగా అయితే టర్బోలారీ రోజు బాడుగ రూ.5000లకు మించదు. కళాకారులకు రోజుకు రూ.1000లు ఇచ్చినా ఆరుగురికి ఆరు వేలు సరిపోతుంది. మరో రూ.4 వేలు వెచ్చిస్తే ఫ్లెక్సీలు, అలంకరణకు మరో 5 వేలు వేసుకున్నా రూ.20 వేలు దాటడంలేదు. మరి ఆరు రెట్లు అధికంగా బిల్లులు వేయడమే కాకుండా ఎంచక్కా నగదుగా మార్చుకోవడం పట్ల ఆ శాఖ సిబ్బందే ముక్కున వేలేసుకుంటున్నారు. పాత కరపత్రాలకే బూజు దులిపి... ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో ఒంగోలులో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఒక స్టాల్‌ను ఆ రోజున ఏర్పాటు చేశారు. ఆరోగ్యానికి తీసుకోవాల్సిన చర్యలపై వేసిన కరపత్రాలకు, మంచి నీరు తాగడానికి కొనుగోలు చేసిన జగ్గులకు రూ.1.14 లక్షను చూపించారు. శకటాల్లో చేతివాటం చూపించిన అధికారే ఇక్కడ కూడా హస్తలాఘవం ప్రదర్శించి తన జేబులో వేసేసుకున్నారు. అసలు విషయమేమిటంటే తన కార్యాలయంలో మిగిలిపోయిన కరపత్రాలను బయటకు తీసి ... బూజు దులిపి పంపిణీ చేసి మరీ వేల రూపాయలు నొక్కేయడంతో ఔరా అంటూ బుగ్గలు నొక్కుకున్నారు అక్కడున్న సిబ్బంది. హెల్త్ ఇన్‌ఛార్జి రాకతో అంతా గప్‌చుప్ డెరైక్టరేట్ అఫ్ హెల్త్ ఇన్‌ఛార్జి గీతా ప్రసాదిని మంగళవారం ఒంగోలులో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననుండటంతో ఈ విషయం బయటకు పొక్కకుండా ఇందులో భాగస్వామ్యమైన స్వాహారాయుళ్లు సకల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుట్టుగా సాగుతున్న ఇలాంటి అవినీతి తీగను లాగితే డొంకంతా కదులుతుందని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఔనా... నాకు తెలియదే: డాక్టర్ కె. చంద్రయ్య, డి.ఎం.హెచ్.ఓ. ఔనా ... ఆ విషయం నాకు తెలియదే. ఎంత ఖర్చు చేసిందీ, బిల్లులు ఎంతెంత పెట్టారో కూడా వివరాలు నా దగ్గర లేవు. పరిశీలిస్తా ... దర్యాప్తు చేయిస్తా. -
ఆరోగ్యశాఖకు అవినీతి రోగం
సాక్షి, ఏలూరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు అవినీతి రోగం పట్టుకుంది. ఎందరు అధికారులు మారినా.. నిబంధనలు ఎంత కఠినతరం చేసినా వైద్య ఆరోగ్య శాఖలో అక్రమాలు ఆగడం లేదు. అక్రమాలే పరమావధిగా, అవినీతే ఆలంబనగా వ్యవహరిస్తున్న ఈ శాఖ ఉన్నతాధికారుల తీరుతో జిల్లా ప్రతిష్ట మంటగలుస్తున్నా మార్పు రావడం లేదు. తప్పుచేస్తే ఒకసారి కాకపోతే మరోసారైనా దొరికిపోవడం ఖాయమని తెలిసినా ఎవరూ బెదరడం లేదు. సాక్షాత్తూ ఆ శాఖ జిల్లా అధికారులే వరుసగా దొరికిపోతున్నా మళ్లీ అదే పునరావృతమవుతోంది. యథేచ్ఛగా నగదు డ్రా రెండేళ్ల క్రితం 2011 డిసెంబర్ 6, 7, 8 తేదీల్లో పైలేరియా నివారణ కార్యక్రమం జరుగగా 12న దాదాపు రూ.11.50 లక్షల మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (డీఎంఏ) నిధులను నిబంధనలకు విరుద్ధంగా నగదు రూపంలో డ్రా చేశారు. ఆ నగదును కార్యాలయంలో ఉంచడంతో అప్పటి వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) పద్మజ, ఇన్చార్జి డీఎంవో సి.ప్రసాద్‌లపై సస్పెన్షన్ వేటు పడింది. రెండేళ్ల అనంతరం ఇటీవలే పద్మజకు డిమోషన్‌తో ఉత్తరాంధ్రలో పోస్టింగ్ ఇచ్చారు. పద్మజ వ్యవహారంతో మేల్కొన్న ఉన్నతాధికారులు నగదు లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే జరగాలని నిబంధన విధించారు. ఈ నిబంధనలను ఖాతరుచేయకుండా ఇటీవల దాదాపు రూ.26 లక్షలను డ్రా చేశారు. ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ బయటపెట్టడంతో డీఎంహెచ్ఓ టి.శకుంతల, డెప్యూటీ డీఎంహెచ్‌వో, ఇన్చార్జి జిల్లా మలేరియా అధికారి టి.నాగేశ్వరరావు, మలేరియా అధికారి కార్యాలయం సూపరింటెండెంట్ కేవీవీ సత్యనారాయణ కొద్ది రోజుల క్రితం సస్పెండ్ అయ్యారు. గతంలో డీఎంహెచ్‌వో విజయపాల్ 2008లో అవినీతి ఆరోపణలతో బదిలీ అయ్యారు. అంతకు ముందు 2006-07లో అప్పటి డీఎంహెచ్‌వో సత్యనారాయణ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఇక ఈ శాఖలో తరచుగా మెమోలు తీసుకునేవారు, సస్పెండైనవారు కిందిస్థాయిలో చాలామందే ఉన్నారు. తీవ్ర స్థాయిలో విభేదాలు ఇతర శాఖల కంటే ఈ శాఖలో సిబ్బంది మధ్య విభేదాలు కాస్త ఎక్కువే. అవినీతి సొమ్ము పంపకాల విషయంలో తలెత్తిన వివాదం, ఆధిపత్యం కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే తమ శాఖలో అక్రమాలపై లీకులు ఇస్తున్నారని స్పష్టమవుతోంది. అలాగే తమకు నష్టం కలిగించినవారి బండారాలు బయటకు పొక్కేలా చేస్తున్నవారూ ఉన్నారు. ఇప్పటికైనా కలెక్టర్, ఆ శాఖ అత్యున్నత స్థాయి అధికారులు స్పందించి ప్రక్షాళన చేపట్టకపోతే ఈ శాఖ ద్వారా అందే సేవలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉంది.