జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం, కర్నూల్
సాక్షి, కర్నూలు : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పలువురు ఉద్యోగులకు బదిలీ గుబులు పట్టుకుంది. వారు ఉన్న చోట నుంచి కదిలేందుకు ఎంత మాత్రమూ ఇష్టపడటం లేదు. ఐదేళ్లకు పైగా ఒకేచోట ఉన్న వారు కొందరైతే.. పదేళ్ల నుంచి పాతుకుపోయిన వారు మరికొందరు ఉన్నారు. సదరు సీటు ఇతరులకు ఇచ్చేందుకు వారు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నుంచి లేఖలను అప్పటికప్పుడు తెచ్చుకుని బదిలీ ఆపేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు 20 శాతం పోస్టుల విషయంలోనూ పేచీ పెడుతున్నారు.
వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని ఉద్యోగులు డీఎంహెచ్‌ఓ కార్యాలయంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్లు, ప్రాంతీయ శిక్షణ కేంద్రాలు, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, మెడికల్ కాలేజీలో విధులు నిర్వర్తిస్తున్నారు. జోనల్ స్థాయి బదిలీలకు సంబంధించి కడపలోని రీజినల్ డైరెక్టర్ (ఆర్‌డీ) కార్యాలయంలో, జిల్లా స్థాయి పోస్టులకు కర్నూలులోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. బదిలీల కోసం ఈ నెల నాలుగు నుంచి ఆరో తేదీ వరకు ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
జోనల్ స్థాయిలో పీహెచ్‌ఎన్‌లు 18 మంది, ఎంపీహెచ్‌ఎస్(మేల్) 27, ఎంపీహెచ్‌ఎస్(ఫిమేల్) 30, డీపీఎంవో 7, హెడ్‌నర్సులు ఇద్దరు, స్టాఫ్‌నర్సులు 64, రేడియోగ్రాఫర్లు ఇద్దరు, ఎంపీహెచ్‌ఈవో 32, సీనియర్ అసిస్టెంట్లు 41, ఆఫీస్ సూపరింటెండెంట్లు ముగ్గురు, జిల్లా స్థాయిలో జూనియర్ అసిస్టెంట్లు 13 మంది, ఎల్‌డీ కంప్యూటర్ ఆపరేటర్లు 9, హెచ్‌ఏఎంలు 10, ల్యాబ్‌టెక్నీషియన్లు 25, డ్రైవర్లు 9 మంది దరఖాస్తు చేసుకున్నారు.
సీటు కదిలేందుకు ససేమిరా!
ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులు కొందరు సీటు కదిలేందుకు ఇష్టపడడం లేదు. ఐదేళ్లు, పదేళ్లు..కొందరు ఏకంగా పదిహేనేళ్ల నుంచి ఒకేచోట పాతుకుపోయారు. వీరిలో కొందరు ఉద్యోగ సంఘాల్లో నాయకులుగా చలామణి అవుతుండగా.. మరికొందరు బదిలీల సమయంలో ఉద్యోగ సంఘాల లేఖలతో ప్రత్యక్షమవుతున్నారు. ఆయా సంఘాల నాయకులు సైతం అప్పటికప్పుడు ‘వీరు మా సంఘంలో నాయకులంటూ లేఖలు ఇస్తుండడం గమనార్హం.
ఈ వ్యవహారం ప్రతి ఏటా సాగుతోంది. దీనిపై వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. ప్రస్తుత బదిలీల ప్రక్రియలో సీనియర్ అసిస్టెంట్లలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకరు, వైద్య, ఆరోగ్యశాఖలో ఒకరు, ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో ఒకరు మాత్రమే బదిలీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. మిగిలిన వారందరూ ఉద్యోగ సంఘాల నాయకుల పేరుతో బదిలీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయానికి 80కి పైగా ఉద్యోగ సంఘాల లేఖలు అందాయి.
20 శాతం పోస్టులపైనా పేచీ
ఐదేళ్లు దాటిన వారిలో కేవలం 20 శాతం మందిని బదిలీ చేయాలన్న నిబంధన ఫెవికాల్ వీరులకు కలిసి వస్తోంది. ఇందుకోసం ఆయా సంఘాల నాయకులతో కలిసి బదిలీ నిబంధనలపై రాద్ధాంతం చేస్తున్నారు. జోనల్ స్థాయిలో మొత్తం మంజూరైన పోస్టుల్లో ఐదేళ్లు దాటిన వారిలో 20 శాతంగా బదిలీలు చేస్తుండగా.. జిల్లా స్థాయిలో మాత్రం ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో 20 శాతం మాత్రమే బదిలీ చేయాలని వాదిస్తున్నారు. దీంతో రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి వివరణ తీసుకుంటూ జిల్లా అధికారులు బదిలీల ప్రక్రియకు సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment