జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయం
సాక్షి, గుంటూరు : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (డీఎంఅండ్‌హెచ్‌వో) కార్యాలయంలో డెప్యూటేషన్లపై వచ్చిన ఉద్యోగులదే హవా. అక్కడ రెగ్యులర్ ఉద్యోగుల కంటే వారి హడావుడే ఎక్కువ. దీనికి తోడు కీలక విధుల్లో కొనసాగుతూ వసూళ్ల పర్వానికి తెరలేపుతున్నారు. పైసలివ్వనిదే ఒక్క ఫైల్ కూడా ముందుకు కదలని దుస్థితి. వాస్తవానికి ఇక్కడ అధికారికంగా డెప్యూటేషన్లపై వచ్చిన వారు 30 మంది అయితే, అనధికారికంగా ఉన్నవారు 20 మంది వరకు ఉంటారు. గెజిటెడ్, నాన్‌గెజిటెడ్, నాలుగో తరగతి ఇలా మూడు రకాల ఉద్యోగులు విధులు నిర్వహిస్తుంటారు. సుమారు 200 మంది రెగ్యూలర్ ఉద్యోగులు ఉంటారు. అయితే డీఎంహెచ్‌వో సీసీ(క్యాంప్‌క్లర్క్) పేరుతో, ఇతర జిల్లా వైద్యాధికారుల సీసీ పేర్లతో మల్టీపర్పస్‌హెల్త్ సూపర్‌వైజర్స్, మల్టీ పర్పస్‌హెల్త్ అసిస్టెంట్‌లను ఇక్కడ పని చేయిస్తున్నారు. అసలు వీరికి డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయం పోస్టులతో సంబంధం లేకున్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో రాజకీయ పలుకుబడితో అడ్డదారిలో డెప్యూటేషన్లపై వచ్చి ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్నారని విమర్శలొస్తున్నాయి. వీరి కోసం రెగ్యూలర్ ఉద్యోగుల విధులను తగ్గించారు. అదనపు సిబ్బందితో పని లేనప్పటికీ మూడేళ్లుగా రెగ్యూలర్ ఉద్యోగులు చేస్తున్న పనిని విభజించి కాలం వెళ్లదీస్తున్నారు.
ఎటువంటి ఉత్తర్వులు లేకుండానే..
ఇక్కడ చాలా మంది డెప్యూటేషన్లపై ఎటువంటి ఉత్తర్వులు లేకుండా పని చేస్తున్నారు. వీరు వారానికి ఒకసారి తము అసులు పని చేసే ఆరోగ్యకేంద్రంలో సంతకాలు పట్టి వస్తున్నట్లు సమాచారం. మిగిలిన వారు బయోమెట్రిక్ హాజరు వేసి బయటకు వెళ్లి వడ్డీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు చేసుకుంటూ విధులను గాలికొదిలేస్తున్నారు. నిబంధనల ప్రకారం సీసీగా విధులను స్టెనోలు, జూనియర్ అసిస్టెంట్‌లు నిర్వర్తించాల్సి ఉంది. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో స్టెనోలు, జూనియర్ అసిస్టెంట్స్ ఉన్నా వారిని పక్కనపెట్టి ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలు అందించాల్సిన వారిని సీసీలుగా కొనసాగిస్తున్నారు. అదనపు సిబ్బంది అవసరమైతే మూడు, నాలుగు నెలలు మహా అయితే ఏడాది పాటు డెప్యూటేషన్‌పై వేస్తారు. కానీ ఇక్కడ ఏళ్ల తరబడి పాతుకుపోయారు. గతంలో డీఎంహెచ్‌వోగా పనిచేసిన డాక్టర్ పద్మజరాణి ఇద్దరు ఉద్యోగులకు డెప్యూటేషన్‌పై కార్యాలయంలో విధులు కేటాయించారు. ఆమె ఇక్కడి నుంచి బదిలీ అయ్యి ఏళ్లు గడుస్తున్న సదరు ఉద్యోగులు మాత్రం ఇంకా కొనసాగుతున్నారు. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి ప్రస్తుతం సీసీగా పనిచేస్తున్నారు. ఈయన అనధికారిక ఆదాయం నెలకు రూ.లక్ష వరకూ ఉంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
వసూళ్ల పర్వం..
డెప్యూటేషన్లపై వచ్చిన వారు స్కానింగ్ సెంటర్స్, ఆస్పత్రులు, ల్యాబ్‌ల రిజిస్ట్రేషన్‌లు, రెన్యూవల్స్, ఉద్యోగుల ఇంక్రిమెంట్ల మంజూరు, సరెండర్ లీవ్‌ల మంజూరు, ఎరియర్స్ మంజూరు, పదోన్నతులు, డెప్యూటేషన్‌లు, నిధులు మంజూరు వంటి కీలక విధులను నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో వారు వసూళ్లకు తెరలేపారు. ప్రతి పనికి ఒక రేటును నిర్ణయించి కాసులు దండుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
2017 నవంబర్‌లో ఆత్మహత్య చేసుకున్న జూనియర్ అసిస్టెంట్ రవికుమార్ ఉదంతం అప్పట్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో సంచలనం రేకెత్తించింది. అతనికి పదోన్నతి సకాలంలో ఇవ్వకుండా డబ్బు కోసం వేధించారని, డబ్బు తీసుకుని కూడా పనిచేయకుండా ఇబ్బందులు పెట్టారని ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలో జనరల్ సెక్షన్, ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్స్‌లో ఉన్న ఉద్యోగుల విధులను కొన్నింటిని డెప్యూటేషన్‌పై వచ్చిన వారికి కేటాయించటం వల్లే ఇలా జరిగిందనే వాదన బలంగా వినిపించింది
ఏసీబీకి ఫిర్యాదులు వెళ్లినా.. మారని తీరు!
అనధికారిక డెప్యూటేషన్‌లపై డీఎంహెచ్‌వో కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల వసూళ్ల భాగోతంపై ఏసీబీకి సైతం ఫిర్యాదులు అందాయి. దీంతో ఇద్దరు ఉద్యోగులను అక్కడి నుంచి బదిలీ చేయాలని ఏసీబీ డైరెక్టర్ ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో ఒకరు తథాస్థానికి వెళ్లిపోగా, మరొకరు మాత్రం డీఎం అండ్‌హెచ్‌వో కార్యాలయంలో కొనసాగుతున్నారు. మరోవైపు ఏసీబీకి ఫిర్యాదులు వెళ్లిన సదరు ఉద్యోగి వసూళ్లకు అడ్డుకట్ట పడలేదు. ఇందులో పై స్థాయి అధికారులకు సైతం వాటలు వెళ్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆరోగ్య కేంద్రాల్లో ఇబ్బందులు..
సీజనల్ వ్యాధులు గ్రామాల్లో వ్యాప్తి చెందుతున్నాయి. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆరోగ్య కేంద్రాల్లో పారామెడికల్ సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య కేంద్రాల్లో ఉండాల్సిన వారిని డెప్యూటేషన్లపై పని చేయిస్తుండటం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ఇటువంటి డెప్యూటేషన్లను ఇతర జిల్లాల్లో రద్దు చేశారు. గుంటూరు జిల్లాలో మాత్రం కొనసాగిస్తుండం ఏమిటని, దీనిపై కలెక్టర్ దృష్టి సారించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. .
Comments
Please login to add a commentAdd a comment