* రూ.20 వేల శకటానికి రూ.1.44 లక్షల బిల్లు
* కరపత్రాల పంపిణీకి రూ. 1.14 లక్షలట
* ఆరు రెట్లు అదనంగా దోచేసినా పట్టని వ్యవహారం
* హెల్త్ ఇన్‌ఛార్జి నేడు రాక ... ఫిర్యాదుకు కొందరు సిద్ధం
ఒంగోలు సెంట్రల్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి తాండవిస్తోంది. ప్రతి పనిలో 100 శాతానికిపైగా అదనంగా బిల్లులు పెట్టుకుని, చెక్కులు రాసుకొని నిధులను స్వాహా చేస్తున్నా పర్యవేక్షించాల్సిన సంబంధితాధికారులు ప్రేక్షకపాత్ర వహించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం నాడే కాదు ... జన్మభూమి కార్యక్రమానికి చంద్రబాబు వచ్చినా సరే వీరికి పండుగే. ఎందుకంటే సంబంధిత ఏర్పాట్లకు లక్షలు ఖర్చు పెట్టినట్టు దొంగ బిల్లులు జత చేసి డ్రా చేసుకోవచ్చునని వీరి ఆలోచన. ఈ ఆలోచనలను ఆచరణలో పెట్టి నిధులు దారి మళ్లించినా ఉన్నతాధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం గమనార్హం.
ఆరు రెట్లు అదనంగా బిల్లులు
ఆగస్టు 15న జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ధూమపానం, గుట్కాలు వల్ల వచ్చే అనర్థాలపై ఓ శకటాన్ని ప్రదర్శించింది. ఒక టర్బోలారీకి చుట్టూ ఫ్ల్లెక్సీలను కట్టి, మధ్యలో ఆరుగురు కళాకారులచే ధూమపానం, గుట్కాలు వినియోగిస్తే వచ్చే నష్టాన్ని వివరిస్తూ శకటాన్ని రూపొందించారు. దీనికి సంబంధించి జిల్లావైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న జిల్లా అధికారి ఒకరు అన్నీతానై ఖాళీ బిల్లులను తెప్పించుకొని, తనే లెక్కలు రాసేసి చెక్కును నగదుగా మార్చుకున్నారు. దీనికి అయిన ఖర్చు అక్షరాలా రూ. 1,44,000. మామూలుగా అయితే టర్బోలారీ రోజు బాడుగ రూ.5000లకు మించదు. కళాకారులకు రోజుకు రూ.1000లు ఇచ్చినా ఆరుగురికి ఆరు వేలు సరిపోతుంది. మరో రూ.4 వేలు వెచ్చిస్తే ఫ్లెక్సీలు, అలంకరణకు మరో 5 వేలు వేసుకున్నా రూ.20 వేలు దాటడంలేదు. మరి ఆరు రెట్లు అధికంగా బిల్లులు వేయడమే కాకుండా ఎంచక్కా నగదుగా మార్చుకోవడం పట్ల ఆ శాఖ సిబ్బందే ముక్కున వేలేసుకుంటున్నారు.
పాత కరపత్రాలకే బూజు దులిపి...
ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో ఒంగోలులో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఒక స్టాల్‌ను ఆ రోజున ఏర్పాటు చేశారు. ఆరోగ్యానికి తీసుకోవాల్సిన చర్యలపై వేసిన కరపత్రాలకు, మంచి నీరు తాగడానికి కొనుగోలు చేసిన జగ్గులకు రూ.1.14 లక్షను చూపించారు. శకటాల్లో చేతివాటం చూపించిన అధికారే ఇక్కడ కూడా హస్తలాఘవం ప్రదర్శించి తన జేబులో వేసేసుకున్నారు. అసలు విషయమేమిటంటే తన కార్యాలయంలో మిగిలిపోయిన కరపత్రాలను బయటకు తీసి ... బూజు దులిపి పంపిణీ చేసి మరీ వేల రూపాయలు నొక్కేయడంతో ఔరా అంటూ బుగ్గలు నొక్కుకున్నారు అక్కడున్న సిబ్బంది.
హెల్త్ ఇన్‌ఛార్జి రాకతో అంతా గప్‌చుప్
డెరైక్టరేట్ అఫ్ హెల్త్ ఇన్‌ఛార్జి గీతా ప్రసాదిని మంగళవారం ఒంగోలులో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననుండటంతో ఈ విషయం బయటకు పొక్కకుండా ఇందులో భాగస్వామ్యమైన స్వాహారాయుళ్లు సకల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుట్టుగా సాగుతున్న ఇలాంటి అవినీతి తీగను లాగితే డొంకంతా కదులుతుందని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఔనా... నాకు తెలియదే: డాక్టర్ కె. చంద్రయ్య, డి.ఎం.హెచ్.ఓ.
ఔనా ... ఆ విషయం నాకు తెలియదే. ఎంత ఖర్చు చేసిందీ, బిల్లులు ఎంతెంత పెట్టారో కూడా వివరాలు నా దగ్గర లేవు. పరిశీలిస్తా ... దర్యాప్తు చేయిస్తా.
ఇదేమి లక్కో
Published Tue, Oct 21 2014 3:05 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement