సాక్షి, ఒంగోలు: లంచగొండి అధికారులు, సిబ్బంది వల్ల ఇబ్బంది పడుతున్న వారు, ప్రజలు చొరవ తీసుకుని తమకు సమాచారం అందిస్తే ఆ తరువాత జరగాల్సిన పనిని తాము చూసుకుంటామని ఏసీబీ డీఎస్పీ జె.భాస్కరరావు అన్నారు. శుక్రవారం ఆయన ఒంగోలులో ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రజల్లో చైతన్యం పెరిగిందని, గతేడాది జిల్లా వ్యాప్తంగా 9 ట్రాప్ కేసులు, ఒక ఆదాయానికి మించిన ఆస్తి కేసును ఛేదించడమే ఇందుకు నిదర్శనమన్నారు.
ప్రజలు నిర్భయంగా తమకు ఫోన్ ద్వారా లేదా స్వయంగా వచ్చి అవినీతిపరుల సమాచారం ఇవ్వొచ్చన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. అవినీతిపరులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే విషయంలో బాధితులు, ప్రజల సహకారం అవసరమన్నారు. 2011లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో 9 ట్రాప్ కేసులు, 2012లో 9 ట్రాప్ కేసులు నమోదు కాగా, 2013లో మొత్తం 23 ట్రాప్ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో మరిన్ని ఎక్కువ కేసులను నమోదు చేసే విధంగా ముందుకెళ్తున్నట్లు డీఎస్పీ వివరించారు.
కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం
జిల్లాలో పనిచేసే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఎంతటి వారైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదని ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నారు. గతంలో బాధితులు వచ్చి తమను ఫలానా అధికారి, సిబ్బంది లంచం కోసం పీడిస్తున్నారని ఫిర్యాదు చేస్తేనే ఏసీబీ అధికారులు స్పందించేవారు. ప్రస్తుతం వారు దూకుడు పెంచేశారు. అవినీతి అధికారులను పట్టించే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ ఆవిర్భవించి 53 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లు, గ్రంథాలయాలు, జన సంచారం అధికంగా ఉండి రద్దీప్రాంతాల్లో పెద్ద ఎత్తున కరపత్రాల పంపిణీ చేస్తున్నారు. ఎవరైనా ప్రభుత్వోద్యోగి లంచం అడిగితే 155361 అనే టోల్‌ఫ్రీ నంబర్‌కు లేదా 94404 46184, 94404 46189 సెల్ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కరపత్రాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ రేంజ్ అధికారుల ఫోన్ నంబర్లను వాటిలో ముద్రించారు.
మేం రెడీ.. ఆలస్యం మీదే
Published Sat, Jan 4 2014 1:40 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement