నగరపాలక సంస్థలో విభాగాల మధ్య సమన్వయ లోపం
కమిషనర్ మెతక వైఖరే కారణమా ?
అన్నీ విభాగాల్లో నిర్లక్ష్యం, అవినీతి
ఒంగోలు అర్బన్: నగరవాసులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించాల్సిన నగరపాలక సంస్థ విభాగాల అధికారులు, సిబ్బంది ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఏ ఒక్క పనిలోనూ సమన్వయం లేక పనులు జాప్యం చేయడంతో పాటు ఇష్టానుసారంగా చేస్తున్నారు. సిబ్బందిని గాడిలో పెట్టాల్సిన ఓఎంసీ కమిషనర్ మెతక వైఖరి అవలంబించడంతోనే విభాగాల మధ్య సమన్వయం లేక ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నారుు. అన్నీ విభాగాలు చేయాల్సిన పనుల్లో నిర్లక్ష్యం, అవినీతి తాండవిస్తోంది.
ఏళ్ల తరబడి కౌన్సిల్ లేక అధికారుల కనుసన్నల్లోనే నగరపాలక సంస్థ పాలన కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం సీడీఎంఏ కార్యాలయం నుంచి నగరపాలక సంస్థ రికార్డులను, పనితీరుని పరిశీలించేందుకు బృందం వస్తోంది. రెండు మూడు రోజుల పాటు పరిశీలన కొనసాగే అవకాశం ఉంది. దీంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. పరిశీలనలో నిజాలు నిగ్గు తేలుతాయా లేదా వేచి చూడాలి.
అవకతవకలు, అవినీతికి నిదర్శనం ఇంజినీరింగ్ విభాగం:
కోట్లాది రూపాయల టెండర్లు ఇచ్చే అవకాశం ఉన్న ఇంజినీరింగ్ విభాగం పనితీరులో అవకతవకలతో పాటు అవినీతి పెద్ద ఎత్తున జరుగుతోందని ముమ్మర ప్రచారం సాగుతోంది. ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఇప్పటికే పలు కాంట్రాక్టులు కేటాయించే విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరించారు. కొన్ని పనులకు సంబంధించి ముందుగా పనులు కేటాయించి ఆ తర్వాత టెండర్లకు పిలిచారు. కోట్లాది రూపాయల టెండర్లను ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన ఫెవ్‌మెన్ కమిటీ సూచించిన కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. రూ.11 కోట్ల టెండర్లు ఈ ఏడాది జనవరి 1వ తేది అకస్మాత్తుగా సాంకేతిక కారణాల పేరుతో రద్దు చేసిన విష యం తెలిసిందే. అక్రమ నీటి కుళా యి కనెక్షన్లపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రోడ్ల విస్తరణలో డ్రైనేజిల నిర్మాణంలో అస్మదీయులు, తస్మదీయులంటూ కాలువలను అష్టవంకర్లు తిప్పారు. జరుగుతున్న అభివృద్ధి పనుల నాణ్యత పై పర్యవేక్షణ కొరవడింది. ఊర చెరువు ప్రక్షాళన, డంపింగ్ యార్డు ఏర్పాటు తదితర అంశాల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు లేకపోలేదు. నగర సుందరీకరణ పనులు నత్తనడకనే నడుస్తున్నాయి. ఎట్టకేలకు ప్రారంభించిన గాంధీపార్కు నిర్వహణ కూడా సరిగాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు
నిర్లక్ష్యానికి నిదర్శనం శానిటేషన్ విభాగం:
నగరంలో చెత్త నిల్వలు లేకుండా, డ్రైనేజిలు సక్రమంగా ఉంచాల్సిన శానిటేషన్ విభాగం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పనికి హాజరయ్యే కార్మికుల మస్టర్లలో కాంట్రాక్టర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు మాయాజాలం చూపుతున్నారు. వారిపై శానిటరీ సూపర్‌వైజర్ పర్యవేక్షణ దాదాపుగా లేదనే చెప్పాలి. కేవలం ఇంటింటి చెత్త సేకరణ మినహా మిగిలిన పనులను గాలికొదిలేశారు. ఉన్నతాధికారులు పరిశీలనకు వచ్చే సమయంలో మాత్రం హడావుడి చేయడమే తప్పా చిత్తశుద్ధి లేదు. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 4 శానిటేషన్ డివిజన్లలో అరకొర పనులే జరుగుతుండగా... 3వ డివిజన్ మరీ అధ్వానంగా మారింది. ఆ డివిజన్‌లో సక్రమంగా పనులు చేయడంలేదని ఇప్పటికే ఒక మేస్త్రిని పనుల నుంచి పక్కన పెట్టారు. అయినా ఆ డివిజన్‌లో మరికొంతమంది మేస్త్రిలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, కాంట్రాక్టర్లతో మేస్త్రిలకు ఉన్న లాలూచిగానే తెలుస్తోంది.
ఇష్టానుసారంగా రెవెన్యూ విభాగం:
నగరపాలక సంస్థకి ఆదాయం చేకూర్చే రెవెన్యూ విభాగం ఇష్టానుసారంగా పనిచేస్తోంది. ఆ విభాగంలో ఇటీవలే ఆర్‌ఐల మార్పులు చేర్పులు జరిగాయి. ఆర్‌ఐ పోస్టులు దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నం వారు గట్టిగానే చేశారు. ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా నగరంలో పన్నుల వసూలుకు బృందాలుగా ఏర్పడి మరీ ప్రజలను భయ భ్రాంతుల్ని చేశారు. పన్నులు కట్టని షాపులకు, కాలేజీలకు తాళాలు వేశారు. ఒక కాలేజికి సంబంధించి పన్ను కోటి రూపాయల పైబడి బకాయి ఉండటంతో దానికి కూడా తాళం వేసి.. సదరు కాలేజి యాజమాన్యం రూ.20 లక్షలు చెల్లించడంతో తాళం తీశారు. దీనిలో దాదాపుగా లక్షల్లో అవినీతి జరిగిందని సిబ్బందే చెవులు కొరుక్కుంటున్నారు. ఆర్‌ఐలు కూడా పన్నుల వసూలుకు తిరిగే సమయంలో బాగానే జేబులు నింపుకున్నట్లు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇదిలా ఉంటే నగరవాసులకి ఇవ్వాల్సిన డిమాండ్ నోటీసులు సక్రమంగా అందచేయకుండా ప్రజలపై తీవ్ర ఒత్తిడి తెచ్చారనేది స్పష్టంగా తెలుస్తోంది.
ఆక్రమణలు, అక్రమ కట్టడాలకు ఊతమిస్తున్న టౌన్‌ప్లానింగ్ విభాగం:
మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉండాల్సిన రోడ్లు, భవనాలు ఇతర నిర్మాణాలు ఇష్టానుసారంగా వెలుస్తున్నాయి. దీనికి కారణం ఆక్రమణలు, అక్రమ కట్టడాలు తొలగించాల్సిన టౌన్‌ప్లానింగ్ విభాగం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటమే. కన్వర్షన్ లేని వ్యవసాయ భూముల్లో కట్టడాలకు ప్లాన్ అనుమతులు ఇస్తున్నారు. మరికొన్నిటికి రాజకీయ ఒత్తిళ్లతో ప్లాన్‌లే లేకుండా ఆ నిర్మాణాల వైపు కన్నెత్తి చూడటం లేదు. మొత్తం మీద అవినీతితో ఆక్రమణలు, అక్రమ కట్టడాలను నిరోధించడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఎవరి దారి వారిదే
Published Tue, Apr 19 2016 9:32 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement