నిఘా మొద్దునిద్ర
- జిల్లాలో నిస్తేజంగా మారిన విజిలెన్స్, ఏసీబీ విభాగాలు
- ఫిర్యాదులపైనా చర్యలు కరువు
- ఏసీబీ పనితీరు ఘోరం
- విజి‘లెన్స్’ శూన్యం
అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపాల్సిన ఏసీబీ, విజిలెన్స్ విభాగాలు జిల్లాలో నిద్రావస్థలో ఉన్నాయి. కార్యాలయాలకే నేరుగా ఫిర్యాదులు వెళ్తున్నా చలించడం లేదన్న అపప్రథను మూటకట్టుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి శ్రుతిమించిపోతున్నా ఏసీబీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా పంపిణీకి సంబంధించి నిత్యావసరాలు అడ్డదారుల్లో గోదాముల్లోకి చేరుతున్నా విజిలెన్స్ చలించడం లేదన్న ఆక్షేపణలున్నాయి.
సాక్షి, విశాఖపట్నం: సాగర్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి (42) తన ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం నెల రోజుల క్రితం జీవీఎంసీలో ఓ అధికారిని కలిశాడు. రూ.25 వేలు ఇస్తేనే పని అవుతుందని ఆ అధికారి చెప్పాడు. బాధితుడు ఏసీబీ కార్యాలయానికి వెళ్తే పెద్ద సారు లేరంటూ సిబ్బంది ఫిర్యాదు తీసుకోలేదు. నాలుగైదుసార్లు తిరిగినా సిబ్బంది పట్టించుకోకపోవడంతో చివరకు జీవీఎంసీ అధికారికి రూ.15 వేలు ఇచ్చి పని చేయించుకున్నాడు.
నర్సీపట్నం మున్సిపాలిటీలో అనుమతి లేకుండా పైఅంతస్తు నిర్మించిన ఓ భవంతి యజమాని నుంచి రూ.17 వేలు డిమాండ్ చేశారు అక్కడ పనిచేస్తున్న ఓ మున్సిపల్ అధికారి. లేకపోతే భారీగా అపరాధ రుసుము వేస్తానని భయపెట్టారు. దీంతో సదరు యజమాని ఇరవై రోజుల క్రితం ఏసీబీ అధికారులను కలవాలని ప్రయత్నించాడు.
నేరుగా కలవడానికి భయపడి ఫోన్‌లో ఫిర్యాదు ఇవ్వాలని నిర్ణయించాడు. ఏసీబీ అధికారులు ఎంతకీ ఫోన్ తీయలేదు. మరుసటి రోజు ఫోన్ చేస్తే కట్ చేశారు. వారం రోజులు ఎదురు చూసి చేసేది లేక లంచం ఇచ్చుకుని అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది...వీళ్లే కాదు..జిల్లాలో ఎందరో బాధితులు న్యాయం జరుగుతుందని ఏసీబీ వైపు ఆశగా చూస్తే చివరకు నిరాశే మిగులుతోంది. జిల్లాలో ఏసీబీ పనితీరు ఘోరంగా తయారవుతోంది.
పలు ప్రభుత్వ కార్యాలయాల్లోని కొన్ని విభాగాల్లో అవినీతి వ్యవహారాలు తీవ్రస్థాయికి చేరుతున్నా అధికారులు తమకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు, రెవెన్యూ, వైద్య విభాగాల్లో ఈ ధోరణి మరీ శ్రుతి మించిపోతోంది. అయినా ఏసీబీ మాత్రం కళ్లు తెరవడం లేదు. వాస్తవానికి ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిరోధానికి ఏసీబీ విస్తృతంగా ప్రచారం చేయాలి. టోల్‌ఫ్రీ నంబర్ లేదా అధికారుల ఫోన్ నంబర్లు అందరికీ తెలిసేలా ఉంచాలి. కానీ జిల్లాలో దీనికి విరుద్ధం.
ఎవరో ఫోన్ చేస్తేనే విధులు నిర్వహిస్తామనే ధోరణి ఈ విభాగంలో తీవ్రంగా ప్రబలిపోయింది. నగదు లావాదేవీలు అధికంగా జరిగే కార్యాలయాలపై నిఘా ఉంచాలి. సొంతంగా దాడులు చేయాలి. అధికారులు మాత్రం ఎవరైనా బాధితులు వచ్చి ఆశ్రయిస్తేనే పనిచేస్తాం అనేలా తయారయ్యారు. ఒకవేళ ఎవరైనా బాధితులు కార్యాలయానికి వస్తున్నా కనీసం సిబ్బంది పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
కొన్నిసార్లైతే ఇచ్చిన సమాచారం నేరుగా వేరొకరికి లీకవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వల్లే జిల్లాలో ఏసీబీ దాడులు పెద్దగా జరగడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒక వేళ నెలకో, రెండు నెలలకో దాడులు చేస్తున్నా అది కూడా రూ.2 వేలు, రూ.5 వేలకు సంబంధించిన కేసులు మినహా పెద్ద చేపల జోలికి వెళ్లడంలేదు. గత ఆరు నెలల్లో ఏ ఒక్క పెద్ద కేసు కూడా ఏసీబీ పట్టుకోలేకపోవడం ఇందుకు ఉదాహరణ.
అధికారులు మాత్రం సిబ్బంది కొరత పేరు చెప్పి సులువుగా తప్పించుకుంటున్నారు. దాని వల్లే తాము ఎక్కువ కేసులు డీల్ చేయలేకపోతున్నామంటూ సమర్థించుకుంటున్నారు. ఇప్పటివరకు ఏసీబీ పట్టుకున్న కొద్దిపాటి కేసుల్లో కేవలం ఎవరో సమాచారం ఇస్తే చేసిన దాడులే మినహా.. సొంతంగా దర్యాప్తు చేసి పెద్ద చేపలను పట్టుకున్న సంఘటనలు కనిపించడం లేదు.
విజిలెన్స్ శూన్యం
నిత్యావసర వస్తువుల అక్రమ రవాణా, గోదాముల్లో అడ్డగోలుగా సరకులు నిల్వ చేస్తే విజిలెన్స్ అప్రమత్తంగా వ్యవహరించి దాడులు చేయాలి. గ్యాస్ ఏజెన్సీల్లో అవకతవకలపైనా నిఘా ఉంచాలి. ప్రభుత్వ కార్యాలయాల నిధుల దుర్వినియోగంపైనా అప్రమత్తంగా వ్యవహరించాలి. కానీ ఇందులో ఏదీ జరగడంలేదు. అసలు ఈ విభాగం అధికారులు ఉన్నారో లేరో కూడా జనానికి తెలియని పరిస్థితి.
ప్రస్తుతం ఉల్లి, బియ్యం ధరలకు నెమ్మదినెమ్మదిగా రెక్కలొస్తున్నాయి. కొందరు వ్యాపారులు, మిల్లర్లు ముందుచూపుతో సరకులను నిల్వ చేస్తున్నారు. పరిమితికి మించి గోదాములకు తరలిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఇది మరీ ఎక్కువ. రేషన్ దుకాణాల్లో బియ్యం, కిరోసిన్ బయట మార్కెట్‌కు తరలిపోతున్నా చూస్తూ ఊరుకుంటున్నారు. వీటిని విక్రయించి వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు దర్జాగా ఎగుమతి చేసుకుంటున్నారు. ప్రభుత్వ సరకులను నిల్వ చేస్తోన్న గోదాముల నుంచి బయటకు తరలిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా విజిలెన్స్‌కు చలనం ఉండడం లేదు.