అనకాపల్లి టౌన్: లేబర్ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ఏఈ శుక్రవారం ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. జిల్లా ఇన్‌చార్జి ఏసీబీ డీఎస్పీ వీవీఎస్‌ఎస్ రమణమూర్తి అందించిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది ఏఈగా మహేశ్వరరావు పనిచేస్తున్నారు. బిల్లులను క్లియర్ చేసేందుకు నర్సీపట్నానికి చెందిన లేబర్ కాంట్రాక్టర్ పైలా రమణ నుంచి మహేశ్వరరావు రూ.3.20 లక్షలు డిమాండ్ చేశాడు. అయితే.. రమణ రూ.2 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఈ విషయాన్ని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. శుక్రవారం సాయంత్రం ఏఈ మహేశ్వరరావు అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఓ దుకాణం వద్ద రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బిల్లుల మొత్తానికి మహేశ్వరరావుకు 5 శాతం చెల్లించేలా ఒప్పందం జరిగినట్లు డీఎస్పీ తెలిపారు. ఏఈని శనివారం విశాఖ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు కె.లక్ష్మణమూర్తి, రమేష్, సతీష్, కిశోర్‌కుమార్, పి.శ్రీనివాసరావు, వి.విజయకుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment