రోడ్డు పరిమాణాన్ని తెలిసే పరీక్ష నిర్వహిస్తున్న ఏసీబీ డీఎస్పీ ప్రసాద్, చిత్రంలో అధికారులు (ఫైల్ ఫోటోస్)
పుష్కర పనుల్లో అవినీతి రాజ్యమేలింది.. ప్రభుత్వ అండతో దోచుకున్నారు.. ఇష్టారాజ్యంగా పనులు చేపట్టారు.. కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల్లో డొల్లతనం బయటపడింది.. నాణ్యత ప్రమాణాలు లేకపోవడంతో విజిలెన్స్ నివేదిక ఇచ్చింది.. తాజాగా ఏసీబీ అధికారులు తనిఖీల చేపట్టారు.. కాని కథ అడ్డం తిరిగింది.. జిల్లా మంత్రి రంగంలోకి దిగారు.. తనిఖీలు నిలిచిపోయినట్లు సమాచారం.
అమరావతిబ్యూరో/పటమట: పుష్కరాల సందర్భంగా ఘాట్ల నిర్మాణంలో అవినీతిని బట్టబయ్యాలు చేసేందుకు అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. సుమారు 220 పనులపై వెచ్చించిన రూ.200 కోట్లు పనులపై ఆరా తీశారు. ఈ నెల 15 నుంచి 31 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టు, పుష్కర ఘాట్లు పరిశీలించి బాధ్యులపై చర్యలు చేపడతామని ప్రకటించారు. తొలిరోజు హడావిడి చేసిన అధికారులు పటమట, సత్యనారాయణపురంలోని పలు రోడ్లు శాంపిల్స్ కూడా తీసుకున్నారు. కార్పొరేషన్‌లోని ఇంజినీరింగ్ సెక్షన్‌లోని ఆయా పనులకు సంబంధించి ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు.
కథ అడ్డం తిరిగింది..
పుష్కార పనుల్లో ఇప్పటికే విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి అందించింది. తాజాగా ఏసీబీ అధికారులు దాడికి దిగారు. దీంతో కాంట్రాక్టుర్లు, అధికారులు కంగుతిన్నారు. రాజకీయ నిర్ణయాలతో అధికారులను ఇబ్బంది పెడతారా అంటూ కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు.. అభివృద్ధి చేసినందుకు తాము చేసిన పనులపైనే విచారణ చేపట్టడం తమను అవమానించినట్లేననని కార్పొరేటర్లు ప్రభుత్వంలో కీలకస్థానంలో ఉన్న జిల్లా మంత్రికి మొరపెట్టుకున్నారు. అంతే సదరు మంత్రి చక్రం తిప్పినట్లు సమాచారం. పుష్కర పనులపై ఏసీబీ విచారణ అర్థంతరంగా నిలిచిపోయినట్లు సమాచారం.
అంచనాలతో సంబంధం లేకుండా పనులు
♦ పటమటలోని భద్రయ్యనగర్‌లో 400 మీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణానికి రూ. 40 లక్షలు అంచనాలుంటే అంతే విస్త్రీర్ణం ఉన్న రోడ్డును సత్యనారాయణపురంలో రోడ్డుకు రూ.75 లక్షలు ఖర్చు పెంచారు.
♦ బీఆర్పీరోడ్డు, పశ్చిమ రైల్వే స్టేషన్ సమీపంలోని కాళేశ్వరరావు మార్కెట్ వరకు రోడ్డు వేయటానికి రూ.1.56 కోట్లు అంచనాలు వేయగా దీన్ని రూ.1.46 కోట్లకు కాంట్రాక్టర్ దక్కించుకుని తూతూ మంత్రంగా రోడ్డు వేయటంతో అదే ఏడాది వర్షాలకు అదికాస్త కొట్టుకుపోయింది.
♦ జీఎస్‌రాజు రోడ్డు నిర్మాణానికి 9.96కోట్లు అంచనాలు వేయగా దీన్ని రూ.9.17 కోట్లు దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డు వేశారు. ఆరునెలల్లోనే రోడ్లు దెబ్బతిన్నాయని ఫిర్యాదు వచ్చాయి.
♦ పటమట పంటకాలువ రోడ్డు, రైతు బజారు, హైస్కూలు రోడ్డు నిర్మాణానికి రూ. 8.86 కోట్లుతో నిర్మించగా అక్కడ నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్‌కు ఉండగా మరమ్మతులకు గురైనా పట్టించుకోవటంలేదు.
నామినేషన్ పద్ధతిలోనే..
సాధారణంగా అభివృద్ధి పనులు చేసేందుకు ఈ– ప్రొక్యూర్‌మెంట్ ద్వారా ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది. అయితే 2016 ఆగస్టులో కృష్ణా పుష్కరాలు పనులకు ఆరు నెలల ముందు మాత్రమే టెండర్లు పిలవటం, అదీ నామినేషన్ ప్రాతిపదికన కేటాయింపులు జరగటంతో ఆయా పనులు అవినీతితో మునిగిపోయాయి. పుష్కర పనులకు సంబంధించి దాదాపు 80 శాతం పనులు ఆరునెలల కాలంలోనే కేటాయింపులు జరిగాయని అధికారులే చెబుతున్నారు.. ఈ విధానాకికి అప్పట్లో ఇక్కడ పనిచేసిన ఓ ఐఏఎస్ అధికారి సహకారం కూడా ఉండటంతో పనులన్నీ కౌన్సిల్ తీర్మానం జరగకుండా కేటాయింపులు జరిగాయని ప్రధాన ఆరోపణ.
పర్సంటేజ్‌లో తేడాలొచ్చాయనా...
కార్పొరేషన్ విభాగంలోని ఇంజినీరింగ్ అధికారులు ప్రతి పనికి పర్సంటేజ్‌ని ఆశించటం సహజం. ఈ నేపథ్యంలో పబ్లిక్‌వర్క్స్ విభాగంలోని ఓ అధికారి ఇప్పటి వరకు ఇచ్చే పర్సంటేజ్ చాలటంలేదని తనకు పర్సంటేజ్ పెంచాలని పేచీ పెట్టడంతో ఇంజినీరింగ్ విభాగంలో అవకతవకలు బట్టబయలయ్యాయని విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment