విద్యుత్‌ సంస్థలో అవినీతి చీకట్లు! | Corruption In Power Department hyderabad | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సంస్థలో అవినీతి చీకట్లు!

Published Mon, Sep 3 2018 8:04 AM | Last Updated on Sat, Sep 22 2018 8:30 PM

Corruption In Power Department hyderabad - Sakshi

  సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం) అవినీతి పుట్టగా మారింది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కొంత మంది ఇంజినీర్లు ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది సైతం వీరిబాటలోనే నడుస్తున్నారు. దీంతో విసిగిపోయిన వినియోగదారులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇద్దరు ఏఈలు, ఒక లైన్‌మెన్‌ ఏసీబీకి పట్టుబడ్డారు. అక్రమ మీటర్ల వ్యవహారంలో మరో ముగ్గురి(ఒక ఏఈ సహా లైన్‌మెన్, ఆర్టిజన్‌)పై వేటు పడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంస్థలో పెరిగిపోయిన అవినీతిని రూపుమాపేందుకు ప్రభుత్వం ఇతర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఈ శాఖ ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచింది. ఆశించిన దానికంటే అధిక మొత్తంలో వేతనాలు పెంచినా అక్రమ వసూళ్ల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం గచ్చిబౌలికి చెందిన లైన్‌మెన్‌ ఎ.రాజేందర్‌ ఓ ఎలక్ట్రికల్‌ కాంట్రాక్టర్‌ నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డాడు. ఆ తర్వాత ఏడీఈ, ఏఈలను కూడా ఏసీబీ విచారించింది. నిబంధనల ప్రకారం మీటర్లు, ప్యానల్‌ బోర్డు కోసం నిర్దేశించిన చార్జీలను వినియోగదారులు డిస్కంకు చెల్లించినప్పటికీ నెల రోజులుగా మీటర్లు జారీ చేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ఇందులో పెద్ద తలకాయల ప్రమేయం కూడాఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

పెట్టిన ఖర్చులు సంపాదించుకునేందుకే..
ప్రభుత్వ సంస్థల్లో ఎక్కడా లేని విధంగా డిస్కంలో పనిచేసే ప్రదేశాలను యాజమాన్యమే ‘ఫోకల్‌.. నాన్‌ ఫోకల్‌’ కేటగిరీలుగా విభజించింది. ఆదాయం తక్కువగా ఉన్న ప్రాంతాలను నాన్‌ఫోకల్‌గా, ఆదాయం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఫోకల్‌గా పేర్కొంటున్నారు. బదిలీ సమయంలో ఫోకల్‌(కొత్త నిర్మాణాలు, కొత్త వెంచర్లు అధికంగా ఉండే ప్రదేశాలు) పోస్టు కోసం ఏఈలు, ఏడీఈలు, డీఈలు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. రాజకీయ పెద్దలకు, ఉన్నతాధికారులకు భారీ మొత్తంలో చెల్లించి పోస్టింగ్‌లు పొందడం డిస్కంలో అందరికీ తెలిసిన తతంగమే. ముఖ్యంగా శివారు ప్రాంతలైన గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్, సరూర్‌నగర్, చంపాపేట్, శంషాబాద్, హబ్సిగూడ, బోయిన్‌పల్లి, కూకట్‌పల్లితో పాటు పరిశ్రమలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోస్టింగ్‌ కోసం ఇంజినీర్లు పోటీ పడుతుంటారు. పోస్టింగ్‌ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. ఇలా పెట్టిన ఖర్చులను తిరిగి సంపాధించుకునేందుకు ఆ తర్వాత అడ్డదారులు తొక్కతున్నారు. కొత్త మీటర్లు, ప్యానల్‌ బోర్డులు, ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్‌ షిష్టింగ్, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో కొత్త లైన్ల ఏర్పాటు.. ఇలా ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్‌ చేసి మరీ వసూలు చేస్తున్నారు. ఇందుకు క్షేత్రస్తాయి కార్మికులను ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. ఎవరైనా పట్టుబడినప్పుడు తమకేమీ సంబంధం లేదని పెద్దలు తప్పించుకుంటే కిందిస్థాయి సిబ్బందిపై వేటు పడుతోంది. 

పెద్దల పనికి చిరుద్యోగులు బలి  
ఓల్డ్‌ బోయిన్‌పల్లి సెక్షన్‌ పరిధిలో రోలింగ్‌ స్టాక్‌లోని 130 మీటర్లును మాయం చేసి, గుట్టుచప్పుడు కాకుండా వినియోగదారుల నివాసాలకు అమర్చిన ఘటనలో లైన్‌మెన్‌ రమేషాచారి సహా ఏఈ వినోద్‌కుమార్‌ను సస్పెండ్‌ చేశారు. ఈ విషయంలో ఏడీఈ, డీఈలకు సంబంధం లేదన్నట్లు వదిలేశారు. అదే విధంగా సరూర్‌నగర్‌ డివిజన్‌ హయత్‌నగర్‌ సెక్షన్‌ పరిధిలో హెచ్‌టీ మీటర్ల జారీలోనూ అక్రమాలు జరిగాయి. ఒకే సర్వీసు నెంబర్‌తో ఉన్న మీటర్‌ను అధిక మొత్తంలో రీడింగ్‌ నమోదైన ప్రతిసారి సాంకేతిక అంశాలను కారణాలుగా చూపి ఎనిమిదిసార్లు మార్చారు. అంతేగాక డిస్కంను ఏమార్చిన వినియోగదారుల నుంచి వసూలు చేసిన బిల్లులను సొంత ఖాతాలో జమ చేసుకున్నారు. ఈ ఘటనపై ఓ ఆర్టిజన్‌ కార్మికుపై డిస్కం వేటు వేసి విజిలెన్స్‌ విచారణ చేపట్టింది. ఈ అంశంలో సంబంధత డివిజన్‌ ఉన్నతాధికారులకు ప్రమోయం ఉన్నప్పటికీ వారిపై చర్యలు తీసుకునేందుకు యాజమాన్యం వెనకాడుతుండుతోంది.

యాజమాన్యమే అక్రమార్కులకు కొమ్ముకాస్తోందని సంస్థలోని ఉద్యోగులే విమర్శిస్తున్నారంటే ‘డిస్కం’ పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి డీఈ, ఏడీఈ, ఏఈలకు తెలియకుండా కొత్త మీటర్లు, ప్యానల్‌ బోర్డులు, ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు సాధ్యం కాదు. ఒకవేళ మంజూరు చేసినా వెంటనే తెలిసిపోతుంది. నిబంధనల ప్రకారం నిర్దేశించిన ఛార్జీలను వినియోగదారుడు సంస్థకు చెల్లించిన తర్వాత గడువులోగా వాటిని మంజూరు చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే కారణాలు అన్వేశించాల్సిన బాధ్యత సదరు ఉన్నతాధికారులదే. ఉన్నతాధికారులే ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని అక్రమాలను ప్రోత్సహిస్తుండడంతో వినియోగదారులు తమ బాధతలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఏసీబీని ఆశ్రయిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement