వరంగల్‌లోని హన్మకొండలో సర్వశిక్షాభియాన్ ఈఈ రవీందర్‌రావు ఫర్నిచర్ కాంట్రాక్టర్ కోసం బాధితుడు వన్నాల కన్నా నుంచి రూ.3 లక్షలు డిమాండ్ చేశారు. బాధితులు ఏసీబీని ఆశ్రయించి 2018, ఫిబ్రవరి 26న వల వేయించి పట్టించారు. అయితే ఇందుకోసం కన్నా ఇచ్చిన సొమ్ము విషయం ఏసీబీ అధికారులను అడిగితే వారు పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. ఆరు నెలలు దాటిపోతున్నా తమకు బడ్జెట్ రాలేదని, తమ ఉన్నతాధికారులను కలవాలని సలహాలు ఇచ్చి పంపేస్తున్నారు. ఇది ఒక తాజా ఉదాహరణ మాత్రమే. ఇలాంటి బాధితుల చిట్టా చాలానే ఉంది.
సాక్షి, హైదరాబాద్: అవినీతికి పాల్పడే అధికారుల భరతం పట్టేందుకు తమతో కలసి రావాలని ఏసీబీ పిలుపునిస్తోంది. అక్రమార్కులను పట్టించిన బాధితులు వినియోగించే సొమ్ములు తిరిగి చెల్లించే విషయంలో ఎగనామం పెడుతోంది. ఉచితంగా అందాల్సిన సేవలకు లంచాలు ఇవ్వలేక కొంతమంది బాధితులు పౌరవిజ్ఞతతో ఏసీబీకి ఫిర్యాదు చేస్తుంటారు.లంచగొండులను వల వేసే సమయంలో ఎక్కడో ఒక దగ్గరి నుంచి డబ్బులు అప్పుతెచ్చి ఏసీబీ ద్వారా పట్టిస్తుంటారు. ఇలా ట్రాప్ వేసిన కేసుల్లో బాధితులిచ్చిన మొత్తాన్ని కొద్ది రోజుల్లోపల కోర్టు వ్యవహారాలను పరిష్కరింపజేసుకొని బాధితులకు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అవినీతి నిరోధకశాఖలో ఈ ప్రక్రియ సజావుగా సాగక ఏళ్ల తరబడిగా బాధితులు తమ డబ్బు కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నారు. లంచంకోసం వెచ్చించిన మొత్తాలు వారి కుటుంబాల్లో చిచ్చురగిలిస్తోంది.
10 రోజుల్లో డిపాజిట్లు రావాల్సి ఉన్నా..
వాస్తవానికి ఏసీబీ ఇస్తున్న చైతన్యపూరితమైన ప్రకటనలతో బాధితులు వలపన్ని లంచమడిగిన అధికారులను పట్టించేందుకు రూ.5వేల నుంచి రూ.50వేల వరకు అప్పుచేసి ఆ మొత్తాలను ఇస్తున్నారు. ఇలా ఇచ్చిన లంచాన్ని ఏసీబీ పది రోజుల్లో కోర్టు డిపాజిట్ నుంచి విడుదల చేయించి ఫిర్యాదుదారుకు ఆ మొత్తం వచ్చేలా చేయాలి. ఇది జరగకపోవడంతో అవినీతి నియంత్రణ కోసం కృషిచేస్తున్న ఉత్సాహవంతులు నీరుగారిపోతున్నారు. అప్పు తెచ్చిన మొత్తాలకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
వాంగ్మూల లోపమంటున్న ఏసీబీ..
ఇలాంటి కేసుల్లో వలపన్నేందుకు వినియోగించే మొత్తాలను వెనక్కు తేవాలంటే బాధితులు ఇచ్చిన కోర్టు వాంగ్మూలం సరిగ్గా ఉండనికారణంగానే అవి కోర్టులనుంచి విడిపించలేకున్నామని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. దీనితో బాధితులు విభేదిస్తూ తాము సక్రమంగానే స్టేట్‌మెంట్లు ఇస్తున్నామని అంటున్నారు.ట్రాప్ తర్వాత దర్యాప్తు అధికారులు సరిగ్గా పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం కారణమని న్యాయనిపుణులు చెప్తున్నారు. ఇలా పరస్పర విరుద్ధమైన కారణాల వల్ల చివరికి నష్టపోయేది ఏసీబీని ఆశ్రయించి సహకరించిన బాధితులే కావడం విశేషం.ఏసీబీకి పట్టుబడ్డ అధికారి మాత్రం అరెస్టవ్వడం, రిమాండ్‌కు వెళ్లడం, బెయిల్‌పై బయటకు వచ్చి, వీలుంటే మళ్లీ పోస్టింగ్‌లు కూడా పొంది దర్జాగా ఉంటున్నారు. ఫిర్యాదుదారులే దిక్కుతోచని స్థితిలో చిక్కుకొని కొత్త ఆర్థిక చిక్కుల్లో పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు.
మరికొంతమంది బాధితుల చిట్టా..
- భూపాలపల్లి జిల్లాలో అసైన్‌ల్యాండ్ పట్టాకోసం వీఆర్‌వో జాకీర్ హుస్సేన్ (75)నుంచి రూ. 5వేలు లంచం డిమాండ్ చేశారు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసి పట్టించాడు. ఇది జరిగి ఐదేళ్లు గడిచిపోయింది. రూ.5వేల కోసం తిరిగి తిరిగి రూ.10వేలు ఖర్చైందని బాధితుడు వాపోతున్నాడు.
- ఇదే భూపాలపల్లి జిల్లా జంగేడు గ్రామానికి చెందిన రఘునా«థాచారి తన భూమి పట్టాకోసం ఆర్డీఓ ఆఫీసు జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రూ.50వేలు లంచం డిమాండ్ చేశాడు. దీనిపై ఈ ఏడాది ఏప్రిల్ 11న ఈ వలపన్నారు. ఇతడికి ఇప్పటివరకు ట్రాప్ మొత్తం తిరిగి రాలేదు.
- మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సై కమలాకర్ చార్జిషీట్ దాఖలుకు ఫిర్యాదు దారుడు శ్రీనివాస్ నుంచి రూ. 10వేలు డిమాండ్ చేసి మార్చి10, 2018న ఏసీబీకి చిక్కారు. ఈ కేసులో మొత్తానిదీ అదే పరిస్థితి.
- వరంగల్ నర్సంపేట మండలం ఇంటి ఓనర్ షిప్ సర్టిఫికెట్ కోసం జడల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నుంచి రెవెన్యూ అధికారి మురళి రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. ఫిబ్రవరిలో ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి మురళిని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు వెంకటేశ్వర్లు డబ్బు తిరిగి చేతికి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment