సాక్షి, జగిత్యాల: ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం.. అధికారుల ధనదాహం.. వెరసి జగిత్యాల మున్సిపాలిటీలో తవ్విన కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. నల్లా బిల్లులు, ఆస్తిపన్నులు, మ్యుటేషన్ల ద్వారా వచ్చిన సొమ్మును బల్దియా ఖజానాకు జమచేయడంలో కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈవిషయంలో బాధితులు కొందరు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఉప్పందించారు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. మున్సిపాలిటీలోని రెవెన్యూ విభాగంలో పలు దఫాలుగా తనిఖీలు చేస్తూనే ఉన్నారు. తాజగా మంగళవారం మరోసారి దాడులు చేయడం కలకలం సృష్టించింది.
ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్..
బల్దియాలోని రెవెన్యూ విభాగంలో ఈనెల 13న ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. మ్యుటేషన్ రశీదుల్లో వ్యత్యాసం రావడంతో విచారణ జరిపారు. బాధ్యులైన సీనియర్ అసిస్టెంట్ అనూక్ కుమార్, బిల్‌కలెక్టర్ అనిల్‌ను 17న సస్పెండ్ చేశారు. ఇదే అంశంపై లోతుగా విచారణ జరిపేందుకు మంగళవారం ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో మరోసారి తనిఖీలు చేపట్టారు. రికార్డులు నిశితంగా ప రిశీలించారు. అయితే, కొన్ని కీలకమైన ఫైళ్లు, రికార్టులు సిబ్బంది మాయం చేసినట్లు సమాచారం.
తీరు మారని మున్సిపాలిటీ..
మున్సిపాలిటీలో చోటుచేసుకుంటున్న అక్రమాలపై ఈ ఏడాది జనవరి 12న “అక్రమాల పర్వం’ శీర్షికన “సాక్షి’ కథనం ప్రచురించింది. రెవెన్యూ విభాగంలో అక్రమాలను నిగ్గుతేల్చింది. దీంతో ఫిబ్రవరి 9న ఏసీబీ అధికారులు దాడులు చేశారు. టౌన్‌ప్లానింగ్ అధికారితో పాటు అవుట్‌సోర్సింగ్ సిబ్బంది, లైసెన్స్‌డ్ ఇంజినీర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం ఓ ప్రభుత్వ వైద్యుడి నుంచి టౌన్‌ప్లానింగ్ అధికారి బాలానందస్వామి, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది రాము, లైసెన్స్‌డ్ ఇంజినీర్ నాగరాజు కలసి రూ.లక్ష డిమాండ్ చేశారు. రూ.95 వేలకు ఒప్పందం చేసుకున్నారు. దీంతో సదరు వైద్యుడు ఏసీబీని ఆశ్రయించారు.
తనిఖీల్లో 12 మందితో కూడిన బృందం
► బల్దియాలో అక్రమాలు భారీగా ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు.. మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేశారు.
► ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో 12 మంది సభ్యులుగల బృందం రెవెన్యూ సెక్షన్‌లో రికార్డులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
► ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకూ కొనసాగుతూనే ఉంది.
అన్నీ అక్రమాలే..
బల్దియాలోని రెవెన్యూ విభాగంలో మ్యుటేషన్ ప్రక్రియ అక్రమాలకు అనుకూలంగా మారింది. 2016లో ఆస్తుల మార్కెట్ వాల్యు ప్రకారం మ్యుటేషన్ కోసం 1.5 శాతం ఫీజు చెల్లించాలి. గత అక్టోబర్‌లో ప్రభుత్వం మ్యుటేషన్ ఫీజు 0.1శాతానికి తగ్గించింది. దీనిని ఆసరాగా చేసుకున్న సిబ్బంది 1990–95 మధ్య మ్యుటేషన్ కోసం వచ్చిన దరఖాస్తు దారుల నుంచి 1.5 శాతం ఫీజు వసూలు చేయాల్సి ఉంది. కానీ ఇక్కడే దందాకు తెరలేపారు. మ్యుటేషన్ ఫీజు 0.1శాతం తగ్గిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ఆధారంగా చేసుకుని 1.5 శాతం ఫీజు తీసుకున్నారు. కానీ, 0.1శాతం ఫీజు తీసుకున్నట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. మిగతా సొమ్ము నొక్కేశారు. శ్రీధర్ అనే వ్యక్తి తన ఆస్తి మ్యుటేషన్ కోసం ఇటీవల దరఖాస్తు చేశాడు. ఆస్తి విలువలో 1.5శాతం ఫీజు తీసుకుని 0.1శాతం రశీదు ఇచ్చారు. అనుమానం వచ్చిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
రెవెన్యూ సెక్షన్‌పై ప్రత్యేక నజర్
► రెవెన్యూ సెక్షన్‌లో 2016 నుంచి మ్యుటేషన్లకు సంబంధించిన రికార్డులను ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు.
► 2016 వరకు 1.5శాతం ఫీజు వసూలు చేయాల్సి ఉండగా, అధికారులు ఎంత వసూలు చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు.
► రశీదులు, ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాలన్నింటినీ చెక్ చేస్తున్నారు.
► మధ్యాహ్నం తనిఖీలు ప్రారంభించామని, ఏ సమయం వరకైనా విచారణ చేస్తామని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు.
రికార్డులు మాయం!
రెవెన్యూ విభాగంలోని మ్యుటేషన్ ఫైళ్లు 2016 సంవత్సరం నుంచి తమకు ఇవ్వాలని ఏసీబీ అధికారులు మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. 2016 నుంచి ఇప్పటిదాకా నమోదు చేసిన ఫైళ్లు లభించడంలేదని తెలుస్తోంది. అప్పట్నుంచి అసలు రికార్డులు రాశారా? లేదా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ మొత్తం ఫైళ్లు లభించకుంటే సిబ్బందిపై తగిన చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రికార్డులు పరిశీలిస్తున్నారు. రెవెన్యూ సెక్షన్‌లో పనిచేస్తున్న వారే మాయం చేశారా? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment