sarvashiksha abiyan
-
సీజనల్ హాస్టల్స్ అవినీతి బట్టబయలు!
కోడూరు (అవనిగడ్డ): సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీజనల్ హాస్టల్స్‌లో జరుగుతున్న అవినీతి విజిలెన్స్ తనిఖీల్లో బట్టబయలైంది. ఎన్జీవోల పర్యవేక్షణలో సాగాల్సిన ఈ హాస్టల్స్ నిర్వహణ పాఠశాలల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మండలంలోని విశ్వనాథపల్లి, కోడూరు, ఉల్లిపాలెం ప్రాథమికోన్నత పాఠశాలల్లో నిర్వహిస్తున్న హాస్టల్స్‌పై మంగళవారం విజిలెన్స్ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిబ్బంది అకస్మిక దాడులు నిర్వహించారు. మూడు హాస్టల్స్‌లో విద్యార్థుల సంఖ్యకు రికార్డుల్లో ఉన్న సంఖ్యకు సంబంధం లేకపోవడంపై సీఐ నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో మెనూ ప్రకారం భోజనం వండకుండా ఇష్టమొచ్చినట్లుగా వంటలు సిద్ధం చేస్తున్నారని సీఐ గుర్తించారు. ప్రతి నెల ఇవ్వాల్సిన కాస్మెటిక్స్ చార్జీలను సైతం నిర్వాహకులు విద్యార్థినులకు ఇవ్వకుండా తమ ఖాతాల్లో జమ చేసుకుంటున్నట్లు తనిఖీల్లో బయటపడింది. ఇళ్ల వద్ద నుంచి వచ్చే డబ్బులతోనే కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసుకుంటున్నట్లు విద్యార్థులు అధికారులకు తెలిపారు. విద్యా వలంటీర్ల జీతాల్లోనూ చేతివాటం.. ప్రస్తుతం హాస్టల్స్‌లో ఉండే విద్యార్థుల సంరక్షణతో పాటు బోధన చేసేందుకు విద్యా వలంటీర్లను నియమించారు. వీరికి ప్రభుత్వం రూ.5 వేలు జీతం కూడా ఇస్తుంది. అయితే ఈ నగదును నిర్వాహకులు పూర్తిగా వాలంటీర్లకు ఇవ్వకుండా చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సీఐ తెలిపారు. వారికి నిర్వాహకులు కేవలం రూ.3 వేలు మాత్రమే ఇచ్చి మిగిలిన రూ.2 వేలను కాజేస్తున్నట్లు తమ దర్యాప్తులో తెలిందన్నారు. కొన్ని చోట్ల హాస్టల్స్ నిర్వహణ బాగానే ఉన్నా, మరికొన్ని చోట్ల అధికారుల పర్యవేక్షణ లోపంతో మరీ అధ్వానంగా ఉందన్నారు. డీఎస్పీ విజయపాల్ ఆదేశాల మేరకు ఈ ఆకస్మిక దాడులు చేశామని, వీటిపై నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు వివరించారు. ఎఫ్ఆర్ఓ తిమోతి, డీఈ వెలుగొండయా, సీనియర్ అసిస్టెంట్ మణికుమార్, కానిస్టేబుల్ నాగభూషణం, ఎంఈవో టీవీఎం. రామదాసు తదితరులు తనిఖీల్లో పాల్గొన్నారు. -
ఏసీబీ ఉచ్చు.. సొమ్ములతోనే చిచ్చు
వరంగల్‌లోని హన్మకొండలో సర్వశిక్షాభియాన్ ఈఈ రవీందర్రావు ఫర్నిచర్ కాంట్రాక్టర్ కోసం బాధితుడు వన్నాల కన్నా నుంచి రూ.3 లక్షలు డిమాండ్ చేశారు. బాధితులు ఏసీబీని ఆశ్రయించి 2018, ఫిబ్రవరి 26న వల వేయించి పట్టించారు. అయితే ఇందుకోసం కన్నా ఇచ్చిన సొమ్ము విషయం ఏసీబీ అధికారులను అడిగితే వారు పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. ఆరు నెలలు దాటిపోతున్నా తమకు బడ్జెట్ రాలేదని, తమ ఉన్నతాధికారులను కలవాలని సలహాలు ఇచ్చి పంపేస్తున్నారు. ఇది ఒక తాజా ఉదాహరణ మాత్రమే. ఇలాంటి బాధితుల చిట్టా చాలానే ఉంది. సాక్షి, హైదరాబాద్: అవినీతికి పాల్పడే అధికారుల భరతం పట్టేందుకు తమతో కలసి రావాలని ఏసీబీ పిలుపునిస్తోంది. అక్రమార్కులను పట్టించిన బాధితులు వినియోగించే సొమ్ములు తిరిగి చెల్లించే విషయంలో ఎగనామం పెడుతోంది. ఉచితంగా అందాల్సిన సేవలకు లంచాలు ఇవ్వలేక కొంతమంది బాధితులు పౌరవిజ్ఞతతో ఏసీబీకి ఫిర్యాదు చేస్తుంటారు.లంచగొండులను వల వేసే సమయంలో ఎక్కడో ఒక దగ్గరి నుంచి డబ్బులు అప్పుతెచ్చి ఏసీబీ ద్వారా పట్టిస్తుంటారు. ఇలా ట్రాప్ వేసిన కేసుల్లో బాధితులిచ్చిన మొత్తాన్ని కొద్ది రోజుల్లోపల కోర్టు వ్యవహారాలను పరిష్కరింపజేసుకొని బాధితులకు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అవినీతి నిరోధకశాఖలో ఈ ప్రక్రియ సజావుగా సాగక ఏళ్ల తరబడిగా బాధితులు తమ డబ్బు కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నారు. లంచంకోసం వెచ్చించిన మొత్తాలు వారి కుటుంబాల్లో చిచ్చురగిలిస్తోంది. 10 రోజుల్లో డిపాజిట్లు రావాల్సి ఉన్నా.. వాస్తవానికి ఏసీబీ ఇస్తున్న చైతన్యపూరితమైన ప్రకటనలతో బాధితులు వలపన్ని లంచమడిగిన అధికారులను పట్టించేందుకు రూ.5వేల నుంచి రూ.50వేల వరకు అప్పుచేసి ఆ మొత్తాలను ఇస్తున్నారు. ఇలా ఇచ్చిన లంచాన్ని ఏసీబీ పది రోజుల్లో కోర్టు డిపాజిట్ నుంచి విడుదల చేయించి ఫిర్యాదుదారుకు ఆ మొత్తం వచ్చేలా చేయాలి. ఇది జరగకపోవడంతో అవినీతి నియంత్రణ కోసం కృషిచేస్తున్న ఉత్సాహవంతులు నీరుగారిపోతున్నారు. అప్పు తెచ్చిన మొత్తాలకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వాంగ్మూల లోపమంటున్న ఏసీబీ.. ఇలాంటి కేసుల్లో వలపన్నేందుకు వినియోగించే మొత్తాలను వెనక్కు తేవాలంటే బాధితులు ఇచ్చిన కోర్టు వాంగ్మూలం సరిగ్గా ఉండనికారణంగానే అవి కోర్టులనుంచి విడిపించలేకున్నామని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. దీనితో బాధితులు విభేదిస్తూ తాము సక్రమంగానే స్టేట్మెంట్లు ఇస్తున్నామని అంటున్నారు.ట్రాప్ తర్వాత దర్యాప్తు అధికారులు సరిగ్గా పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం కారణమని న్యాయనిపుణులు చెప్తున్నారు. ఇలా పరస్పర విరుద్ధమైన కారణాల వల్ల చివరికి నష్టపోయేది ఏసీబీని ఆశ్రయించి సహకరించిన బాధితులే కావడం విశేషం.ఏసీబీకి పట్టుబడ్డ అధికారి మాత్రం అరెస్టవ్వడం, రిమాండ్‌కు వెళ్లడం, బెయిల్‌పై బయటకు వచ్చి, వీలుంటే మళ్లీ పోస్టింగ్‌లు కూడా పొంది దర్జాగా ఉంటున్నారు. ఫిర్యాదుదారులే దిక్కుతోచని స్థితిలో చిక్కుకొని కొత్త ఆర్థిక చిక్కుల్లో పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. మరికొంతమంది బాధితుల చిట్టా.. - భూపాలపల్లి జిల్లాలో అసైన్‌ల్యాండ్ పట్టాకోసం వీఆర్వో జాకీర్ హుస్సేన్ (75)నుంచి రూ. 5వేలు లంచం డిమాండ్ చేశారు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసి పట్టించాడు. ఇది జరిగి ఐదేళ్లు గడిచిపోయింది. రూ.5వేల కోసం తిరిగి తిరిగి రూ.10వేలు ఖర్చైందని బాధితుడు వాపోతున్నాడు. - ఇదే భూపాలపల్లి జిల్లా జంగేడు గ్రామానికి చెందిన రఘునా«థాచారి తన భూమి పట్టాకోసం ఆర్డీఓ ఆఫీసు జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రూ.50వేలు లంచం డిమాండ్ చేశాడు. దీనిపై ఈ ఏడాది ఏప్రిల్ 11న ఈ వలపన్నారు. ఇతడికి ఇప్పటివరకు ట్రాప్ మొత్తం తిరిగి రాలేదు. - మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సై కమలాకర్ చార్జిషీట్ దాఖలుకు ఫిర్యాదు దారుడు శ్రీనివాస్ నుంచి రూ. 10వేలు డిమాండ్ చేసి మార్చి10, 2018న ఏసీబీకి చిక్కారు. ఈ కేసులో మొత్తానిదీ అదే పరిస్థితి. - వరంగల్ నర్సంపేట మండలం ఇంటి ఓనర్ షిప్ సర్టిఫికెట్ కోసం జడల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నుంచి రెవెన్యూ అధికారి మురళి రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. ఫిబ్రవరిలో ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి మురళిని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు వెంకటేశ్వర్లు డబ్బు తిరిగి చేతికి రాలేదు. -
సర్కారు దగా
బాబు వస్తే జాబు వస్తుందనే ప్రచారంతో నిరుద్యోగులను ఎన్నికల సమయంలో బురిడీ కొట్టించి ఓట్లు దండుకున్న ప్రభుత్వం ఇప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులను దగా చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు నిదర్శనమే సర్వశిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయం...నిజంగా చిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. వైఎస్ఆర్ జిల్లా, రాజంపేట: జిల్లా సర్వశిక్షా అభియాన్‌లో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని ప్రభుత్వం దగా చేసింది. జిల్లాలో 167మంది కాంట్రాక్టు ఉద్యోగులు వివిధ హైస్కూళ్లలో పనిచేస్తున్నారు. ఆర్ట్, క్రాప్ట్, పీఈటీ పోస్టులలో పనిచేస్తున్నాను. ఇంకా 25పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరంతా ఎన్నో ఆశలతో ఎప్పటికైనా తమ సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని ఆశపడ్డారు. జీతాలు పెంచాలని అమరావతిలో ఇటీవల ఆందోళన కూడా చేశారు. రూ.14వేల వేతనం పెంచుతూ, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాల కల్పించే విధంగా జీఓ జారీ చేస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అమలు ఇలా... ఆగస్టు 2017 నుంచి ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు అని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పటి నుంచి వీరి జీతాల నుంచి రికవరి చేశారు. ఆరునెలల నుంచి ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం చెబుతూ వచ్చింది. దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో ఉన్న స్కీంలోని ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎ స్ఐ కల్పించాలనే నిబంధన ఉంది. కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలుచేయాలని చట్టం ఉంది. ప్రస్తుత నేషనల్ హెల్త్ మిషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ సౌకర్యం అమలులో ఉంది. సర్కారు చేసిన దగా ఇలా... ఎస్ఏస్ఏలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం లేదు. ఆగస్టు 2017 నుంచి ఉద్యోగుల జీతాల్లో రికవరీ చేశారు. ఉద్యోగుల షేర్ ఈపీఎఫ్ 12శాతం, ఈఎస్ఐ 1.75శాతం కట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం దగా చేసింది. ఆ ఉత్తర్వులను రద్దుచేసింది. వీటికి సంబంధించి ఇప్పటివరకు కట్ చేసిన మొత్తాన్ని తిరిగి ఉద్యోగుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి జమచేయాలని రాష్ట్ర ప్రాజెక్టు డైర్క్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వంపై వెల్లుబుకుతున్న వ్యతిరేకత ఎస్ఎస్ఏ కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత వెల్లుబుకుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 2వేలమందికిపైగా వారు ఉన్నారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, పార్ట్‌టైం, కేజీబీవి ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌ను గట్టిగా వినిపించేందుకు ఉద్యమించనున్నారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి ఎస్‌ఎస్‌ఎస్‌లో పనిచేసు ్తన్న కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి తీసుకున్న నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలుకు ఉత్తర్వులు జారీ చేసి మళ్లీ వాటిని రద్దుచేయడం బాధాకరం. ఆందోళనకు అందరు సిద్ధం కావాలి. ఫిబ్రవరి 15న విజయవాడ అలంకార్ సెం టర్లో సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ధర్నాకు కదిలి రావాలి. –ఎం.చంద్రశేఖర్, రాష్ట్రకార్యదర్శి, రాష్ట్ర ఉద్యోగుల సంఘం -
సర్వ‘శిక్ష’ బదిలీలు
- సర్వశిక్ష అభియాన్‌లో బదిలీలు - పాఠశాలలు పునఃప్రారంభంలో తగదని ఫిర్యాదు - సీఆర్టీలకు పాయింట్ల కేటాయింపులో కొందరికి పెద్దపీట - ఎస్ఓల బదిలీల్లో అక్రమాలంటూ ఆరోపణలు కర్నూలు సిటీ: సర్వశిక్ష అభియాన్‌లో బదిలీలు తీవ్ర గందరగోళానికి దారి తీశాయి. కస్తూర్బా స్కూళ్లలో ప్రత్యేకాధికారులు, కాంట్రాక్ట్ రిసోర్స్ టీచర్లు పని చేస్తున్నారు. గతంలో వీరి బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే నాడు బదిలీలు చేయక పోవడంతో ఈ ఏడాది వేసవి సెలవులు ముగిసి పునఃప్రారంభానికి రెండు రోజుల గడువు ఉన్న సమయంలో బదిలీలకు కౌన్సెలింగ్ చేపట్టింది. అయితే అక్రమాలు చోటు చేసుకున్నాయని ఎస్ఓలు, సీఆర్టీలు శనివారం ఉదయం 8.30 గంటలకే ఎస్ఎస్ఏ పీఓకు ఫిర్యాదు చేసేందుకు కార్యాలయానికి చిన్న పిల్లలతో చేరుకున్నారు. అయితే పీఓ బదిలీలపై జేసీ–2 రామస్వామి దగ్గర చర్చలు జరుపుతున్నారని తెలుసుకోని కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్రమాలపై ఎస్ఓలు, సీఆర్టీలు జేసీ–2కి ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టర్‌కు సైతం ఫిర్యాదులు చేసేందుకు వెళ్లగా అనుమతి ఇవ్వక పోవడంతో వెనక్కి తిరిగి వచ్చారు. విద్యా సంత్సరం ప్రారంభంలో కాకుండా, వేసవి సెలవుల్లో బదిలీలకు కౌన్సెలింగ్ చేసి ఉంటే బాగుండదని, స్కూళ్లు ప్రారంభించేందుకు రెండు రోజుల ముందుగా బదిలీలు చేపట్టడంపై తీవ్ర అగ్రహాం వ్యక్తం చేశారు. ఇప్పటీకే పిల్లలను స్కూళ్లలో చేర్పించి, ఫీజులు కూడా కొంత చెల్లించామని, ముందస్తు సమాచారం లేకుండా కౌన్సెలింగ్ నిర్వహించడం తగదన్నారు. అధికారులు మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేస్తున్నామన్నారు. సీఆర్టీ పాయింట్లలో అక్రమాలు జిల్లాలో 53 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 47 మంది ప్రత్యేకాధికారులు, కాంట్రాక్ట్ రిసోర్స్ టీచర్లుగా సుమారు 401 మంది పని చేస్తున్నారు. వీరిలో ప్రత్యేకాధికారులుగా మూడు సంవత్సరాలు, సీఆర్టీలుగా ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న వారిని తప్పని సరిగా బదిలీలు చేయలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకారం ఎస్ఓలు 30 మంది, సీఆర్టీలు సుమారు 300 మంది వరకు బదిలీలకు అర్హులు. గతంలో వీరు బదిలీల కోసం ఇచ్చిన ఆప్షన్లను పరిగణలోకి తీసుకోని, ఆయా స్కూళ్లలో సీఆర్టీల పని తీరుపై ఎస్ఓలు ఇచ్చిన నివేదికల ఆధారంగా పాయింట్లు ఇచ్చారు. అయితే ఇక్కడే అక్రమాలు జరిగాయనే విమర్శలు ఉన్నాయి. 6 స్కూళ్లకు సీఆర్టీలే ఇన్చార్జ్ ఎస్‌ఓలుగా ఉన్న స్కూళలోనే పాయింట్లలో అక్రమాలు జరిగినట్లు కొందరు సీఆర్టీలు ఆరోపణలు చేస్తున్నారు. మరి కొందరు పదో తరగతిలో 100 శాతం ఫలితాలు ఉండి, అడ్మిషన్లు సైతం భారీగా చేపట్టినా, బోధనలోను, ఇతర వాటన్నింటిలో మెరుగ్గా ఉన్నా కూడా మంచి పాయింట్లు రాలేదని, ఇందుకు కారణం ఎస్ఎస్ఏ అధికారుల పాత్ర ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సీఆర్టీల పాయింట్లు సైతం ఎస్పీడీ కార్యాలయం నుంచే వచ్చాయని అధికారులు చెబుతుండటం గమనార్హం. ఆలస్యంగా కౌన్సెలింగ్: కస్తూర్బాలో ఎస్ఓలు, సీఆర్టీల బదిలీల కోసం కౌన్సిలింగ్ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభిస్తామని అధికారులు చెప్పడంతో చాలా మంది చంటి బిడ్డలతో కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. అయితే పాయింట్లపై ఉన్న గందరగోళంతో మధ్యాహ్నం 2 గంటల తరువాత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. దీంతో చాలా మంది పిల్లలతో వచ్చిన వారు, అనారోగ్యంతో వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.