సర్వ‘శిక్ష’ బదిలీలు
సర్వ‘శిక్ష’ బదిలీలు
Published Sat, Jun 10 2017 11:22 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM
- సర్వశిక్ష అభియాన్‌లో బదిలీలు
- పాఠశాలలు పునఃప్రారంభంలో తగదని ఫిర్యాదు
- సీఆర్‌టీలకు పాయింట్ల కేటాయింపులో కొందరికి పెద్దపీట
- ఎస్‌ఓల బదిలీల్లో అక్రమాలంటూ ఆరోపణలు
కర్నూలు సిటీ: సర్వశిక్ష అభియాన్‌లో బదిలీలు తీవ్ర గందరగోళానికి దారి తీశాయి. కస్తూర్బా స్కూళ్లలో ప్రత్యేకాధికారులు, కాంట్రాక్ట్ రిసోర్స్ టీచర్లు పని చేస్తున్నారు. గతంలో వీరి బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే నాడు బదిలీలు చేయక పోవడంతో ఈ ఏడాది వేసవి సెలవులు ముగిసి పునఃప్రారంభానికి రెండు రోజుల గడువు ఉన్న సమయంలో బదిలీలకు కౌన్సెలింగ్ చేపట్టింది. అయితే అక్రమాలు చోటు చేసుకున్నాయని ఎస్‌ఓలు, సీఆర్‌టీలు శనివారం ఉదయం 8.30 గంటలకే ఎస్‌ఎస్‌ఏ పీఓకు ఫిర్యాదు చేసేందుకు కార్యాలయానికి చిన్న పిల్లలతో చేరుకున్నారు. అయితే పీఓ బదిలీలపై జేసీ–2 రామస్వామి దగ్గర చర్చలు జరుపుతున్నారని తెలుసుకోని కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
అక్రమాలపై ఎస్‌ఓలు, సీఆర్‌టీలు జేసీ–2కి ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టర్‌కు సైతం ఫిర్యాదులు చేసేందుకు వెళ్లగా అనుమతి ఇవ్వక పోవడంతో వెనక్కి తిరిగి వచ్చారు. విద్యా సంత్సరం ప్రారంభంలో కాకుండా, వేసవి సెలవుల్లో బదిలీలకు కౌన్సెలింగ్ చేసి ఉంటే బాగుండదని, స్కూళ్లు ప్రారంభించేందుకు రెండు రోజుల ముందుగా బదిలీలు చేపట్టడంపై తీవ్ర అగ్రహాం వ్యక్తం చేశారు. ఇప్పటీకే పిల్లలను స్కూళ్లలో చేర్పించి, ఫీజులు కూడా కొంత చెల్లించామని, ముందస్తు సమాచారం లేకుండా కౌన్సెలింగ్ నిర్వహించడం తగదన్నారు. అధికారులు మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేస్తున్నామన్నారు.
సీఆర్‌టీ పాయింట్లలో అక్రమాలు
జిల్లాలో 53 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 47 మంది ప్రత్యేకాధికారులు, కాంట్రాక్ట్ రిసోర్స్ టీచర్లుగా సుమారు 401 మంది పని చేస్తున్నారు. వీరిలో ప్రత్యేకాధికారులుగా మూడు సంవత్సరాలు, సీఆర్‌టీలుగా ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న వారిని తప్పని సరిగా బదిలీలు చేయలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకారం ఎస్‌ఓలు 30 మంది, సీఆర్‌టీలు సుమారు 300 మంది వరకు బదిలీలకు అర్హులు. గతంలో వీరు బదిలీల కోసం ఇచ్చిన ఆప్షన్లను పరిగణలోకి తీసుకోని, ఆయా స్కూళ్లలో సీఆర్‌టీల పని తీరుపై ఎస్‌ఓలు ఇచ్చిన నివేదికల ఆధారంగా పాయింట్లు ఇచ్చారు.
అయితే ఇక్కడే అక్రమాలు జరిగాయనే విమర్శలు ఉన్నాయి. 6 స్కూళ్లకు సీఆర్‌టీలే ఇన్‌చార్జ్ ఎస్‌ఓలుగా ఉన్న స్కూళలోనే పాయింట్లలో అక్రమాలు జరిగినట్లు కొందరు సీఆర్‌టీలు ఆరోపణలు చేస్తున్నారు. మరి కొందరు పదో తరగతిలో 100 శాతం ఫలితాలు ఉండి, అడ్మిషన్లు సైతం భారీగా చేపట్టినా, బోధనలోను, ఇతర వాటన్నింటిలో మెరుగ్గా ఉన్నా కూడా మంచి పాయింట్లు రాలేదని, ఇందుకు కారణం ఎస్‌ఎస్‌ఏ అధికారుల పాత్ర ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సీఆర్‌టీల పాయింట్లు సైతం ఎస్‌పీడీ కార్యాలయం నుంచే వచ్చాయని అధికారులు చెబుతుండటం గమనార్హం.
ఆలస్యంగా కౌన్సెలింగ్:
కస్తూర్బాలో ఎస్‌ఓలు, సీఆర్‌టీల బదిలీల కోసం కౌన్సిలింగ్ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభిస్తామని అధికారులు చెప్పడంతో చాలా మంది చంటి బిడ్డలతో కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. అయితే పాయింట్లపై ఉన్న గందరగోళంతో మధ్యాహ్నం 2 గంటల తరువాత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. దీంతో చాలా మంది పిల్లలతో వచ్చిన వారు, అనారోగ్యంతో వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
Advertisement
Advertisement