బాబు వస్తే జాబు వస్తుందనే ప్రచారంతో నిరుద్యోగులను ఎన్నికల సమయంలో బురిడీ కొట్టించి ఓట్లు దండుకున్న ప్రభుత్వం ఇప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులను దగా చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు నిదర్శనమే సర్వశిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయం...నిజంగా చిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది.
వైఎస్‌ఆర్ జిల్లా, రాజంపేట: జిల్లా సర్వశిక్షా అభియాన్‌లో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని ప్రభుత్వం దగా చేసింది. జిల్లాలో 167మంది కాంట్రాక్టు ఉద్యోగులు వివిధ హైస్కూళ్లలో పనిచేస్తున్నారు. ఆర్ట్, క్రాప్ట్, పీఈటీ పోస్టులలో పనిచేస్తున్నాను. ఇంకా 25పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరంతా ఎన్నో ఆశలతో ఎప్పటికైనా తమ సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని ఆశపడ్డారు. జీతాలు పెంచాలని అమరావతిలో ఇటీవల ఆందోళన కూడా చేశారు. రూ.14వేల వేతనం పెంచుతూ, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాల కల్పించే విధంగా జీఓ జారీ చేస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
అమలు ఇలా...
ఆగస్టు 2017 నుంచి ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్‌ఐ అమలు అని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పటి నుంచి వీరి జీతాల నుంచి రికవరి చేశారు. ఆరునెలల నుంచి ఈపీఎఫ్, ఈఎస్‌ఐ అమలు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం చెబుతూ వచ్చింది. దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో ఉన్న స్కీంలోని ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎ స్‌ఐ కల్పించాలనే నిబంధన ఉంది. కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ఈపీఎఫ్, ఈఎస్‌ఐ అమలుచేయాలని చట్టం ఉంది. ప్రస్తుత నేషనల్ హెల్త్ మిషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ సౌకర్యం అమలులో ఉంది.
సర్కారు చేసిన దగా ఇలా...
ఎస్‌ఏస్‌ఏలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం లేదు. ఆగస్టు 2017 నుంచి ఉద్యోగుల జీతాల్లో రికవరీ చేశారు. ఉద్యోగుల షేర్ ఈపీఎఫ్ 12శాతం, ఈఎస్‌ఐ 1.75శాతం కట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం దగా చేసింది. ఆ ఉత్తర్వులను రద్దుచేసింది. వీటికి సంబంధించి ఇప్పటివరకు కట్ చేసిన మొత్తాన్ని తిరిగి ఉద్యోగుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి జమచేయాలని రాష్ట్ర ప్రాజెక్టు డైర్‌క్టర్ ఉత్తర్వులు జారీచేశారు.
ప్రభుత్వంపై వెల్లుబుకుతున్న వ్యతిరేకత
ఎస్‌ఎస్‌ఏ కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత వెల్లుబుకుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 2వేలమందికిపైగా వారు ఉన్నారు. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, పార్ట్‌టైం, కేజీబీవి ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌ను గట్టిగా వినిపించేందుకు ఉద్యమించనున్నారు.
ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి
ఎస్‌ఎస్‌ఎస్‌లో పనిచేసు ్తన్న కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి తీసుకున్న నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈపీఎఫ్, ఈఎస్‌ఐ అమలుకు ఉత్తర్వులు జారీ చేసి మళ్లీ వాటిని రద్దుచేయడం బాధాకరం. ఆందోళనకు అందరు సిద్ధం కావాలి. ఫిబ్రవరి 15న విజయవాడ అలంకార్ సెం టర్‌లో సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ధర్నాకు కదిలి రావాలి. –ఎం.చంద్రశేఖర్,
రాష్ట్రకార్యదర్శి, రాష్ట్ర ఉద్యోగుల సంఘం
Comments
Please login to add a commentAdd a comment