ఈపీఎఫ్‌వోలోకి 17.89 లక్షల కొత్త సభ్యులు | EPFO adds 17. 89 lakh net members in January 2025 | Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌వోలోకి 17.89 లక్షల కొత్త సభ్యులు

Published Fri, Mar 21 2025 3:36 AM | Last Updated on Fri, Mar 21 2025 7:44 AM

EPFO adds 17. 89 lakh net members in January 2025

11.67 శాతం పెరుగుదల

జనవరి పేరోల్‌ గణాంకాలు విడుదల

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కిందకు జనవరిలో 17.89 లక్షల మంది కొత్తగా చేరారు. క్రితం ఏడాది జనవరి నెల గణాంకాలతో పోల్చి చూస్తే 11.67 శాతం మందికి అదనంగా ఉపాధి లభించింది. 2024 డిసెంబర్‌ నెల గణాంకాలతో పోల్చి చూసినా ఉపాధి కల్పనలో 11.48 శాతం వృద్ధి నమోదైంది. ఇక ఈపీఎఫ్‌వో పరిధిలోకి మొదటిసారి 8.23 లక్షల మంది వచ్చి చేరారు. క్రితం ఏడాది జనవరితో పోల్చి చూస్తే 1.87 శాతం మందికి అదనంగా మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది.

మొదటిసారి సభ్యుల్లో 4.70 లక్షల మంది (57 శాతం) 18.25 ఏళ్ల వయసులోని వారున్నారు. వార్షికంగా చూస్తే ఈ వయసులోని వారు 3% అధికంగా ఉపాధి పొందారు. జనవరిలో 15.03 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో ఉద్యోగం మానేసి, మరో సంస్థలో చేరారు. క్రితం ఏడాది జనవరితో పోల్చి చూసినప్పుడు 23 శాతం పెరుగుదల కనిపించింది. అంటే ఉద్యోగ వలసలు అధికమైనట్టు కనిపిస్తోంది. వీరంతా పూర్వపు సంస్థ నుంచి కొత్త సంస్థకు ఈపీఎఫ్‌వో ఖాతా బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు.  

2.17 లక్షల మంది మహిళలు 
కొత్త సభ్యుల్లో 2.17 లక్షల మంది మహిళలు ఉన్నారు. క్రితం ఏడాది జనవరితో పోల్చి చూస్తే 6 శాతం పెరుగుదల నమోదైంది. జనవరిలో 60 శాతం మేర సభ్యుల చేరిక ఐదు రాష్ట్రాల నుంచే ఉండడం గమనార్హం. అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 22.77 శాతం మంది ఈపీఎఫ్‌వోలో చేరారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, హర్యానా, ఢిల్లీ, యూపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి సభ్యుల చేరిక విడిగా 5 శాతానికి పైన ఉంది. నైపుణ్య సేవలు, రోడ్డు మోటారు రవాణా తదితర రంగాలు ఎక్కువ మందికి ఉపాధి కలి్పంచాయి. ఇందులో 40 శాతం మందికి నైపుణ్య సేవల్లో ఉపాధి లభించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement