న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులు సెప్టెంబర్‌లో 18.81 లక్షల మంది పెరిగారు. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 9.33 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ఉపాధి అవకాశాల పెరుగుదలను ఇది సూచిస్తోంది. వీరిలో 9.47 లక్షల మంది కొత్త సభ్యులు.
క్రితం ఏడాది ఇదే నెల కంటే 6.22 శాతం పెరిగారు. సభ్యుల్లో 8.36 లక్షల మంది 18–25 ఏళ్లలోపు వారే (60 శాతం) కావడం గమనార్హం. అంటే వీరు మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు అర్థం చేసుకోవచ్చు. 14.10 లక్షల మంది సభ్యులు సెప్టెంబర్ నెలలో ఈపీఎఫ్‌వో పరిధిలోనే ఒక సంస్థ నుంచి మానేసి, మరో సంస్థలో చేరారు.
వార్షికంగా క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే ఇది 18 శాతం అధికం. కొత్త సభ్యుల్లో 2.47 లక్షల మంది మహిళలు ఉన్నారు. 9 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్ నెల మొత్తం మీద నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 3.70 లక్షలుగా ఉంది. ఇది కూడా 12 శాతం అధికం.
21 శాతం మహారాష్ట్ర నుంచే..
సెప్టెంబర్ నెలలో నికర సభ్యుల చేరికలో మహారాష్ట్ర నుంచే 21.20 శాతం మంది ఉన్నారు. ఇక కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హర్యాన, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ నుంచి విడిగా 5 శాతం కంటే ఎక్కువ సభ్యులు చేరారు. నైపుణ్య సేవలు, ట్రేడింగ్–వాణిజ్య సంస్థలు, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, వస్త్రాల తయారీ, క్లీనింగ్, స్వీపింగ్ సేవలు, హాస్పిటళ్లలో ఎక్కువ మందికి ఉపాధి లభించింది.
Comments
Please login to add a commentAdd a comment