
తైవాన్‌కి చెందిన ఎల్రక్టానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్ భారత విభాగం ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో రెట్టింపై 20 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.1.7 లక్షల కోట్లు) చేరినట్లు సమాచారం. ఐఫోన్ విక్రయాలు గణనీయంగా పెరగడం ఇందుకు కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే, ఉద్యోగుల సంఖ్య కూడా 65 శాతం పెరిగి సుమారు 80,000కు చేరినట్లు పరిశ్రమ, ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
చైనాపై టారిఫ్‌ల కారణంగా అమెరికా మార్కెట్ కోసం ఐఫోన్లన్నింటినీ భారత్‌లోనే తయారు చేయించుకోవాలని యాపిల్ భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫాక్స్‌కాన్ ఆదాయం అనేక రెట్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఐఫోన్లను అత్యధికంగా తయారు చేసే ఫాక్స్‌కాన్, చైనాకు వెలుపల రెండో అతి పెద్ద ప్లాంటును బెంగళూరులో సుమారు రూ.25,000 కోట్లతో ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది.
ఇండియాలో తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఫాక్స్‌కాన్ ప్రధాన కేంద్రం ఉంది. ఇక్కడ ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్‌ను నిర్వహిస్తుంది. ఈ ప్లాంట్ 2017లో ఐఫోన్ల ఉత్పత్తిని ప్రారంభించింది. 2023లో ఐఫోన్ 15ను అసెంబుల్ చేసింది. ఇది తాజా ఐఫోన్ మోడళ్లలో భారతదేశం భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. 2025 చివరి నాటికి ఐప్యాడ్ అసెంబ్లింగ్ ప్రారంభించాలని యోచిస్తోంది. చైనా నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా చెన్నై సమీపంలో స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే మాడ్యూల్ అసెంబ్లింగ్ యూనిట్లో కంపెనీ పెట్టుబడులు పెట్టింది.
ఇదీ చదవండి: మళ్లీ ఐపీవోల సందడి..!
బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఫాక్స్‌కాన్ 2.5 బిలియన్ డాలర్ల విలువైన ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ ఐఫోన్ ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. ఏటా 20 మిలియన్ల ఐఫోన్లను ఉత్పత్తి చేయడంతో పాటు 40,000 ఉద్యోగాలను సృష్టించనుంది.