భారత్‌లో యాపిల్ ఉత్పత్తులను తయారుచేస్తున్న ఫాక్స్‌కాన్ తన కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తోంది. ప్రస్తుతం తమిళనాడు యూనిట్‌లో యాపిల్ ఐఫోన్‌లను తయారుచేస్తున్న కంపెనీ త్వరలో ఐప్యాడ్‌లను కూడా అసెంబుల్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ మేరకు త్వరలో కంపెనీ నుంచి ప్రకటన విడుదల కావొచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు.
యాపిల్ భారత్‌లో మరిన్ని ఉత్పత్తులను తయారుచేసేందుకు ఆసక్తిగా ఉందని గతంలోనే ప్రకటించింది. ఇప్పటికే ముంబయి, దిల్లీలో ప్రత్యేకంగా యాపిల్ అవుట్‌లెట్లను ప్రారంభించింది. తమిళనాడులో ఫాక్స్‌కాన్ ద్వారా ఐఫోన్‌లను తయారు చేస్తోంది. ఆ యూనిట్‌లోని పరికరాల్లో కొన్నింటిని అప్‌గ్రేడ్ చేసి ఐప్యాడ్‌లను తయారు చేయవచ్చని నిపుణులు సూచించినట్లు తెలిసింది. అందుకు సంస్థ కూడా ఆమోదం తెలిపిందని కొందరు అధికారులు చెప్పారు. త్వరలో దీనిపై కంపెనీ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. యాపిల్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి పూర్తిగా చైనాపైనే ఆధారపడకుండా విభిన్న ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా ఐప్యాడ్ తయారీలో కొంత భాగాన్ని గత సంవత్సరం వియత్నాంకు మళ్లించారు.
తమిళనాడులో కొత్త యూనిట్ కోసం భారత్‌కు చెందిన ఓ సంస్థ రూ.1,200 కోట్లు వెచ్చిస్తున్నట్లు ఫాక్స్‌కాన్ ఫిబ్రవరిలో ప్రకటించింది. బడ్జెట్ 2024-25లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీను 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు. దాంతో దేశీయ తయారీకి ప్రోత్సహం లభించనుంది. యాపిల్ సంస్థ ఫాక్స్‌కాన్ ద్వారా భారత్‌లో ఐప్యాడ్‌ల ఉత్పత్తి ప్రారంభిస్తే స్థానికంగా మరింత మంది ఉపాధి పొందుతారని నిపుణులు చెబుతున్నారు. దాంతోపాటు అంతర్జాతీయంగా భారత్‌లో తయారైన ఉత్పత్తులను ఎగుమతి చేసి సొమ్ము చేసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్‌ఐ) వల్ల కూడా దేశీయ తయారీని పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: భారమవుతున్న విద్యారుణాలు!
ట్రెండ్‌ఫోర్స్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ బోయ్స్ ఫ్యాన్ మాట్లాడుతూ..‘భారత్‌లో ఐప్యాడ్ ఉత్పత్తిని చేపట్టడం వల్ల సప్లై-చైన్ డిమాండ్‌ను భర్తీ చేయవచ్చు. దేశీయంగా యాపిల్ ఉత్పతులకు మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఐప్యాడ్ ఎగుమతులు 49 మిలియన్ల(4.9 కోట్లు)కు చేరుకుంటాయని అంచనా’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment