జూలై నెల గణాంకాలు విడుదల
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోకి జూలై నెలలో 19.94 లక్షల మంది కొత్తగా చేరారు. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ విడుదల చేశారు. ఈపీఎఫ్‌వో నిర్వహించే సామాజిక భద్రతా పథకం కింద జూలైలో 10.52 లక్షల మంది మొదటిసారి నమోదు చేసుకున్నట్టు తెలిపారు.
→ 8.77 లక్షల మంది సభ్యుల వయసు 18–25 ఏళ్ల మధ్య ఉంది. అంటే వీరంతా మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది.
→ జూలైలో కొత్తగా చేరిన వారిలో 4.41 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఈపీఎఫ్‌వో నెలవారీ పేరోల్ గణాంకాలు విడుదల చేయడం మొదలైన తర్వాత ఒక నెలలో మహిళా సభ్యుల గరిష్ట చేరిక ఇదే. ఇందులో 3.05 లక్షలు మొదటిసారి చేరిన వారు కావడం గమనార్హం.
→ 14.65 లక్షల మంది ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరారు.
→ జూలైలో ఈపీఎఫ్‌వో కిందకు చేరిన వారిలో 59 శాతం మేర మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల నుంచే ఉన్నారు.
→ తయారీ, కంప్యూటర్ సేవలు, నిర్మాణ రంగం, ఇంజనీరింగ్, బ్యాంకింగ్, ప్రైవేటు ఎలక్ట్రానిక్ మీడియా రంగాల నుంచి ఎక్కువ మంది చేరారు.
Comments
Please login to add a commentAdd a comment