Employees pravidend Fund
-
ఈపీఎఫ్‌వో కిందకు 20 లక్షల కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోకి జూలై నెలలో 19.94 లక్షల మంది కొత్తగా చేరారు. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ విడుదల చేశారు. ఈపీఎఫ్‌వో నిర్వహించే సామాజిక భద్రతా పథకం కింద జూలైలో 10.52 లక్షల మంది మొదటిసారి నమోదు చేసుకున్నట్టు తెలిపారు. → 8.77 లక్షల మంది సభ్యుల వయసు 18–25 ఏళ్ల మధ్య ఉంది. అంటే వీరంతా మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. → జూలైలో కొత్తగా చేరిన వారిలో 4.41 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఈపీఎఫ్‌వో నెలవారీ పేరోల్ గణాంకాలు విడుదల చేయడం మొదలైన తర్వాత ఒక నెలలో మహిళా సభ్యుల గరిష్ట చేరిక ఇదే. ఇందులో 3.05 లక్షలు మొదటిసారి చేరిన వారు కావడం గమనార్హం. → 14.65 లక్షల మంది ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరారు. → జూలైలో ఈపీఎఫ్‌వో కిందకు చేరిన వారిలో 59 శాతం మేర మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల నుంచే ఉన్నారు. → తయారీ, కంప్యూటర్ సేవలు, నిర్మాణ రంగం, ఇంజనీరింగ్, బ్యాంకింగ్, ప్రైవేటు ఎలక్ట్రానిక్ మీడియా రంగాల నుంచి ఎక్కువ మంది చేరారు. -
అక్టోబర్‌లో భారీగా ఉపాధి
న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్‌లో భారీగా ఉపాధి కల్పన నమోదైంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్వహిస్తున్న ఈపీఎఫ్ పథకంలో 15.29 లక్షల మంది సభ్యులుగా చేరారు. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 18.2 శాతం మందికి అదనంగా ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. అక్టోబర్ నెలకు సంబంధించి పేరోల్ గణాంకాలను కేంద్ర కారి్మక శాఖ బుధవారం విడుదల చేసింది. 7.72 లక్షల మంది కొత్త సభ్యులు నికరంగా చేరినట్టు తెలుస్తోంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు ఇందులో 6 శాతం వృద్ధి నమోదైంది. నికర సభ్యుల చేరిక 15.29 లక్షలుగా ఉంది. కొత్తగా చేరిన వారిలో 58.60 శాతం మంది 18–25 ఏళ్ల వయసులోని వారు. అంటే సంఘటిత రంగంలో వీరంతా మొదటిసారి ఉపాధి పొందిన వారని తెలుస్తోంది. ఇక 11.10 లక్షల మంది ఒక సంస్థలో మానేసి మరో సంస్థలో చేరారు. వీరు ఆన్లైన్లో తమ ఈపీఎఫ్లను బదిలీ చేసుకున్నారు. ఈపీఎఫ్‌వో నుంచి వైదొలగిన సభ్యుల సంఖ్య గడిచిన 12 నెలల్లోనే తక్కువగా ఉంది. మహిళా సభ్యులు 3 లక్షలు: 7.72 లక్షల కొత్త సభ్యుల్లో 2.04 లక్షల మంది మహిళలు ఉన్నారు. అక్టోబర్ నెలకు నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 3.03 లక్షలుగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలో పోల్చి చూస్తే 15 శాతం వృద్ధి కనిపించింది. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 22 శాతం మంది సభ్యులు చేరారు. హోటళ్లు, టీ విక్రయ కేంద్రాలు, ట్రేడింగ్, షాపులు, కెమికల్స్ కంపెనీలు, జీవత బీమా సంస్థల్లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. -
ఈఎస్ఐసీ కిందకు 11.82 లక్షల కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఈఎస్ఐసీ నిర్వహించే సామాజిక భద్రతా పథకం కింద అక్టోబర్ నెలలో కొత్తగా 11.82 లక్షల మంది సభ్యులుగా చేరారు. అక్టోబర్ నెలకు సంబంధించిన గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్సీ) విడుదల చేసింది. 2017 సెప్టెంబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు చేరిన మొత్తం సభ్యుల సంఖ్య 7.49 కోట్లుగా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2021–22)లో 1.49 కోట్ల మంది సభ్యులు చేరగా, అంతకుముందు 2020–21లో చేరిన సభ్యుల సంఖ్య 1.15 కోట్లుగాను, 2019–20లో 1.51 కోట్లు, 2018–19లో 1.49 కోట్ల చొప్పున కొత్త సభ్యులు భాగస్వాములు అయ్యారు. ఈఎస్ఐసీ, ఈపీఎఫ్‌వో పథకాల్లో నెలవారీగా సభ్యుల చేరిక గణాంకాలను ఎన్ఎస్వో విడుదల చేస్తుంటుంది. అక్టోబర్ నెలలో ఈపీఎఫ్‌వోలో కొత్తగా 12.94 లక్షల మంది సభ్యులు చేరినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2017 అక్టోబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు ఈపీఎఫ్‌వో కింద చేరిన కొత్త సభ్యులు 5.99 కోట్లుగా ఉన్నారు. -
రిటైర్మెంట్ ఫండ్ సంస్థకు ‘ఈటీఎఫ్’ బొనాంజా
న్యూఢిల్లీ: ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి రిటైర్మెంట్ ఫండ్ సంస్థ– ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) భారీ బొనాంజా పొందుతోంది. కార్మిక, ఉపాధి వ్యవహారాల శాఖ మంత్రి రామేశ్వర్ తెలి వెల్లడించిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► మార్చి 2022 వరకు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో ఈపీఎఫ్ఓ రూ. 1,59,299.46 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడుల ప్రస్తుత (నోషనల్) మార్కెట్ విలువ రూ. 2,26,919.18 కోట్లు. 2019–20లో రూ.31,501 కోట్లు, 2020–21లో రూ.32,071 కోట్లు, 2021–22లో రూ.43,568 కోట్లు ఈటీఎఫ్‌లలోకి ఈపీఎఫ్ఓ పెట్టుబడులు వెళ్లాయి. ► ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య ఈటీఎఫ్‌ల్లో ఈపీఎఫ్ఓ పెట్టుబడి విలువ రూ.12,199.26 కోట్లు. ఇదే కాలంలో డెట్ ఇన్స్ట్రమెంట్లలోకి వెళ్లిన మొత్తం పెట్టుబడి విలువ రూ.84,477.67 కోట్లు ► నిఫ్టీ 50, సెన్సెక్స్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈ), భారత్ 22 సూచీల ఆధారంగా ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెట్టడం జరిగింది. 15 శాతం వరకే పెట్టుబడులు పరిమితి... ఈపీఎఫ్ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్రతా సంస్థ. ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్ ప్రయోజనాలు అలాగే సభ్యుడు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ దాదాపు 6 కోట్ల మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది. పటిష్టమైన స్థాయిలో దాదాపు రూ.300 కోట్ల మిగులునూ నిర్వహిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.1 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి ఇటీవలే కేంద్రం ఆమోదముద్ర వేసింది. గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో (1977–78లో ఈపీఎఫ్ 8 శాతం) కనిష్ట వడ్డీరేటు ఇది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. ప్రారంభంలో ఈపీఎఫ్ఓ తన పెట్టుబడి పరిమితుల్లో 5 శాతం స్టాక్ మార్కెట్లలో పెట్టాలని నిర్ణయించుకుంది. తరువాత ఈ నిష్పత్తిని 2016–17లో 10 శాతానికి పెంచడం జరిగింది. 2017–18లో 15 శాతానికి పెంచారు. డెట్ ఇన్‌స్ట్రమెంట్లలో 85 శాతం నిధులను పెట్టుబడులుగా పెట్టే అవకాశం ఉంది. (క్లిక్: ఇన్కమ్ టాక్స్ నుంచి 143 (1) నోటీసు వచ్చిందా?..అప్పుడేం చేయాలి ?) -
నేటి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండో విడత సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం,, ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)లో వడ్డీ రేట్లు తగ్గింపు, రైతులకు కనీస మద్దతు ధర, రష్యా దాడులతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపు వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. బడ్జెట్ ప్రతిపాదనలకు పార్లమెంటు ఆమోద ముద్ర, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టడం కేంద్ర ప్రభుత్వం అజెండాలో ప్రధానమైనవి. సోమవారం లోక్‌సభ కార్యకలాపాలు మొదలు కాగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కశ్మీర్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత సమావేశాల్లో దానిపై చర్చ జరుగుతుంది. రాజ్యాంగ (షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆదేశాల (సవరణ) బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేయించుకోవాలని కేంద్రం యోచిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు అదుపులోకి రావడంతో పార్లమెంటు ఉభయ సభలు యథావిధిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగనున్నాయి. ఈ సారి సమావేశాలు ఏప్రిల్ ఎనిమిదో తేదీన పూర్తికానున్నాయి. ప్రజా సమస్యలపై చర్చించాలి : కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదివారం ఉదయం పార్టీ పార్లమెంటు వ్యూహాల గ్రూప్ సభ్యులతో సమావేశమయ్యారు. సభలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఒకే భావజాలం కలిగిన పార్టీలతో సమన్వయంతో పని చేయాలని నిర్ణయానికొచ్చారు. బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశాలను లేవనెత్తి, వాటిపై చర్చ జరిగేలా చూస్తామని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. -
యాన్యుటీతో ఉపయోగాలేంటి?
నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్), ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్(ఈపీఎఫ్)ల్లో యాన్యుటీని కొనుగోలు చేయాలని చెబుతుంటారు కదా ? అసలు ఈ యాన్యుటీ అంటే ఏమిటి ? దీనివల్ల మనకు ఏం ఉపయోగాలున్నాయి? - సుకృతి, హైదరాబాద్ యాన్యుటీ వల్ల మీకు క్రమం తప్పకుండా కొంత ఆదాయం వస్తుంది. ఏదైనా ఒక జీవిత బీమా కంపెనీకి పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిపి ఈ యాన్యుటీని కొనుగోలు చేయాలి. ఈ యాన్యుటీ కొనుగోలు వల్ల మీ రిటైర్డ్ జీవితానికి క్రమం తప్పకుండా కొంత ఆదాయం లభిస్తుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)లో మీరు పొదుపు చేసిన మొత్తంలో కనీసం 40 శాతానికి యాన్యుటీని ఏదైనా జీవిత బీమా సంస్థ నుంచి కొనుగోలు చేయాలి. పెన్షన్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్డీఏ) ఆమోదం పొందిన జీవిత బీమా సంస్థ నుంచి మాత్రమే ఈ యాన్యుటీని కొనుగోలు చేయాలి. జీవిత కాలానికి ఆదాయం, జీవించి ఉన్నంతకాలం, ఆ తర్వాత జీవిత భాగస్వామికి ఆదాయం, తదితర ఆప్షన్లతో యాన్యుటీని ఎంచుకోవచ్చు. ఈ యాన్యుటీ వల్ల పాలసీదారుడికి రిటైరైన తర్వాత క్రమం తప్పకుండా కొంత ఆదాయం వస్తుంది. నేను రెండు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ(యూలిప్)లను తీసుకున్నాను. 2011లో హెచ్డీఎఫ్సీ ఎస్ఎల్ క్రెస్ట్ పాలసీని తీసుకున్నాను. ఈ పాలసీ వార్షిక ప్రీమియం రూ.50,000. ఐదు ప్రీమియమ్‌లు చెల్లించాను. 2012లో హెచ్డీఎఫ్సీ పెన్షన్ సూపర్ ప్లస్ ప్లాన్‌ను కూడా తీసుకున్నాను. ఈ ప్లాన్ వార్షిక ప్రీమియం రూ.1.2 లక్షలు. ఇప్పటివరకూ మూడు వార్షిక ప్రీమియమ్‌లు చెల్లించాను. ఈ పాలసీలను సరెండర్ చేస్తే నాకు ఎంత వస్తుంది? ఈ పాలసీలను కొనసాగించమంటారా ? లేక ఈ పాలసీల నుంచివైదొలగమంటారా ? తగిన సలహా ఇవ్వండి? - నిర్మల్ కుమార్, వరంగల్ హెచ్డీఎఫ్సీ ఎస్ఎల్ క్రెస్ట్... ఇది యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్). హెచ్డీఎఫ్సీ పెన్షన్ సూపర్ ప్లస్ అనేది యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్. యూలిప్/యూఎల్‌పీపీల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన మదుపు వ్యూహం కాదని చెబుతుంటాం. ఇవి ఖరీదైనవి. తగినంత బీమా కవర్‌ను ఇవ్వలేవు. అంతేకాకుండా తగిన రాబడులను కూడా అందించలేవు. హెచ్డీఎఫ్సీ ఎస్ఎల్ క్రెస్ట్ తీసుకొని ఐదేళ్లు అయిన ందున దీనిని మీరు సరెండర్ చేయవచ్చు. సరెండర్ చేసేటప్పుడు ఫండ్ విలువ ఎంత ఉంటుందో అంతే సరెండర్ విలువ మీకు వస్తుంది. ఇక హెచ్డీఎఫ్సీ పెన్షన్ సూపర్ ప్లస్ పాలసీ తీసుకొని ఐదేళ్లు కానందున దీనిని సరెండర్ చేస్తే డిస్కంటూన్యూడ్ చార్జీలు పోను సరెండర్ విలువ వస్తుంది. ఇది కూడా ఐదేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాతనే వస్తుంది. మీరు సరెండర్ చేసేటప్పుడు ఉన్న ఫండ్ ఎన్‌ఏవీపై ఆధారపడి సరెండర్ వేల్యూ ఉంటుంది. ఈ పాలసీలను సరెండర్ చేయడం వల్ల మీకు నష్టాలు వచ్చినప్పటికీ, వీటిల్లో కొనసాగక సరెండర్ చేయడమే మంచిదని నా అభిప్రాయం. ఎప్పుడూ బీమాను, ఇన్వెస్ట్‌మెంట్‌ను కలగలపవద్దు. ఇన్వెస్ట్మెంట్స్ కోసం హైబ్రిడ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు తీసుకోవద్దు. బీమా కోసం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం ఉత్తమం. వీటికి ప్రీమియమ్ తక్కువగా ఉంటుంది. రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. తగిన రాబడులు వస్తాయి. మీరు భరించగలిగే రిస్క్‌ను బట్టి ఈ డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోండి. నేను ఎంబీఏ చదివాను. ఒక ఇన్ఫ్రా కంపెనీలో ఉన్నత స్థానంలో ఉద్యోగం చేస్తున్నాను. రూ. కోటి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఒక్కోటి రూ.50 లక్షల చొప్పున రెండు వేర్వేరు కంపెనీల నుంచి టర్మ్ ప్లాన్లు తీసుకోవడం మంచిదా ? లేకుంటే ఒకే కంపెనీ నుంచి రూ. కోటికి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం మంచిదా? ఆన్లైన్లో లభించే కొన్ని మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు సూచించండి? - శ్రీనివాస్, సూర్యాపేట భారీ మొత్తంలో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే, ఒకే కంపెనీ నుంచి కాకుండా రెండు కంపెనీల నుంచి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం మంచిది. ప్రీమియం, క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఏగాన్ రెలిగేర్ ఐటర్మ్ ప్లాన్, మ్యాక్స్ లైఫ్ ఆన్లైన్ టర్మ్ ప్లాన్, భారతీ ఏఎక్స్ఏ లైఫ్ ఈప్రొటెక్ట్.. ఈ సంస్థల టర్మ్ ప్లాన్లను పరిశీలించవచ్చు. మీ వయస్సును బట్టి మీరు చెల్లించాల్సిన ప్రీమియమ్‌ను, మీ ఆదాయ వ్యయాలను పరిగణనలోకి తీసుకొని వీటిల్లోంచి పాలసీలను ఎంచుకోండి. మీకు, మీ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించి పాలసీలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో క్లెయిమ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. -
వచ్చే నెల నుంచి స్టాక్ మార్కెట్లో ఈపీఎఫ్ఓ పెట్టుబడి
న్యూఢిల్లీ : ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) వచ్చే నెల నుంచి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించనుంది. వచ్చే నెల ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో(ఈటీఎఫ్) ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తామని ఈపీఎఫ్ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కె.కె.జలాన్ చెప్పారు. తమ ఇంక్రిమెంటల్ డిపాజిట్లలో 5 శాతం వరకూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేస్తామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరలో ఇంక్రిమెంటల్ డిపాజిట్లు రూ.లక్ష కోట్లు వస్తాయని అంచనాలున్నాయని, వీటిల్లో 5 శాతం అంటే రూ.5,000 కోట్ల వరకూ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తామని తెలియజేశారు. ఈపీఎఫ్ఓకు సంబంధించి అత్యున్నత నిర్ణాయక సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) ఈ ఏడాది మార్చి 31న స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి నిర్ణయం తీసుకుంది. దీన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకించినా... ఈటీఎఫ్‌లో కనిష్టంగా 5 శాతంగా గరిష్టంగా 15 శాతం ఈపీఎఫ్ఓ ఇన్వెస్ట్ చేయవచ్చంటూ కార్మిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 23న ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని అనుసరించి ఈ ఆర్థిక సంవత్సరంలో 5 శాతం నిధులను ఇన్వెస్ట్ చేయాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఈపీఎఫ్ఓ పెట్టుబడులు పెట్టాలనుకున్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్... పెట్టుబడులు పెట్టేనాటికి రూ.5,000 కోట్ల కంటే తక్కువగా ఉండకూడదు. ఈపీఎఫ్ఓ ఇన్వెస్ట్మెంట్ నిబంధన ప్రకారం... మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే లిస్టెడ్ కంపెనీల్లో 65 శాతం వరకూ ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఈపీఎఫ్ఓ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ పీఎఫ్ ట్రస్ట్‌లు కూడా... ప్రైవేట్ ప్రావిడెండ్ ఫండ్ ట్రస్ట్‌లు కూడా స్టాక్మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి కార్మిక మంత్రిత్వ శాఖ అనుమతించింది. ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ప్రైవేట్ పీఎఫ్ ట్రస్ట్‌లు 15 శాతం వరకూ పెట్టుబడులు పెట్టవచ్చని పేర్కొంది. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ నియంత్రణలో 3,000కు పైగా ఇలాంటి ప్రైవేట్ పీఎఫ్ ట్రస్ట్‌లు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఈ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ కనిష్టంగా 5 శాతం, గరిష్టంగా 15 శాతం వరకూ స్టాక్మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.