యాన్యుటీతో ఉపయోగాలేంటి? | what is the use of annuity? | Sakshi
Sakshi News home page

యాన్యుటీతో ఉపయోగాలేంటి?

Published Mon, Mar 21 2016 1:19 AM | Last Updated on Tue, Jun 4 2019 6:37 PM

what is the use of annuity?

నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్), ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్(ఈపీఎఫ్)ల్లో యాన్యుటీని కొనుగోలు చేయాలని చెబుతుంటారు కదా ? అసలు ఈ యాన్యుటీ అంటే ఏమిటి ? దీనివల్ల మనకు ఏం ఉపయోగాలున్నాయి?  - సుకృతి, హైదరాబాద్

 యాన్యుటీ వల్ల మీకు క్రమం తప్పకుండా కొంత ఆదాయం వస్తుంది. ఏదైనా ఒక జీవిత బీమా కంపెనీకి పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిపి ఈ యాన్యుటీని కొనుగోలు చేయాలి. ఈ యాన్యుటీ కొనుగోలు వల్ల మీ రిటైర్డ్ జీవితానికి క్రమం తప్పకుండా కొంత ఆదాయం లభిస్తుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్)లో మీరు పొదుపు చేసిన మొత్తంలో కనీసం 40 శాతానికి యాన్యుటీని ఏదైనా జీవిత బీమా సంస్థ నుంచి కొనుగోలు చేయాలి. పెన్షన్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(పీఎఫ్‌ఆర్‌డీఏ) ఆమోదం పొందిన జీవిత బీమా సంస్థ నుంచి మాత్రమే ఈ యాన్యుటీని కొనుగోలు చేయాలి. జీవిత కాలానికి ఆదాయం, జీవించి ఉన్నంతకాలం, ఆ తర్వాత జీవిత భాగస్వామికి ఆదాయం,  తదితర ఆప్షన్లతో యాన్యుటీని ఎంచుకోవచ్చు. ఈ యాన్యుటీ వల్ల పాలసీదారుడికి రిటైరైన తర్వాత క్రమం తప్పకుండా కొంత ఆదాయం వస్తుంది.

 నేను రెండు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ(యూలిప్)లను తీసుకున్నాను. 2011లో హెచ్‌డీఎఫ్‌సీ ఎస్‌ఎల్ క్రెస్ట్ పాలసీని తీసుకున్నాను. ఈ పాలసీ వార్షిక ప్రీమియం రూ.50,000. ఐదు ప్రీమియమ్‌లు చెల్లించాను. 2012లో హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్ సూపర్ ప్లస్ ప్లాన్‌ను కూడా తీసుకున్నాను. ఈ ప్లాన్ వార్షిక ప్రీమియం రూ.1.2 లక్షలు. ఇప్పటివరకూ మూడు వార్షిక ప్రీమియమ్‌లు చెల్లించాను. ఈ పాలసీలను సరెండర్ చేస్తే నాకు ఎంత వస్తుంది? ఈ పాలసీలను కొనసాగించమంటారా ? లేక ఈ పాలసీల నుంచివైదొలగమంటారా ? తగిన సలహా ఇవ్వండి? - నిర్మల్ కుమార్, వరంగల్

 హెచ్‌డీఎఫ్‌సీ ఎస్‌ఎల్ క్రెస్ట్... ఇది యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్).  హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్ సూపర్ ప్లస్ అనేది యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్. యూలిప్/యూఎల్‌పీపీల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన మదుపు వ్యూహం కాదని చెబుతుంటాం. ఇవి ఖరీదైనవి. తగినంత  బీమా కవర్‌ను ఇవ్వలేవు. అంతేకాకుండా తగిన రాబడులను కూడా అందించలేవు. హెచ్‌డీఎఫ్‌సీ ఎస్‌ఎల్ క్రెస్ట్ తీసుకొని ఐదేళ్లు  అయిన ందున దీనిని మీరు సరెండర్ చేయవచ్చు. సరెండర్ చేసేటప్పుడు ఫండ్ విలువ ఎంత ఉంటుందో అంతే సరెండర్ విలువ మీకు వస్తుంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్ సూపర్ ప్లస్ పాలసీ తీసుకొని ఐదేళ్లు కానందున దీనిని సరెండర్ చేస్తే డిస్‌కంటూన్యూడ్ చార్జీలు పోను  సరెండర్ విలువ వస్తుంది.

ఇది కూడా ఐదేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాతనే వస్తుంది.  మీరు సరెండర్ చేసేటప్పుడు ఉన్న ఫండ్ ఎన్‌ఏవీపై ఆధారపడి సరెండర్ వేల్యూ ఉంటుంది. ఈ పాలసీలను సరెండర్ చేయడం వల్ల మీకు నష్టాలు వచ్చినప్పటికీ, వీటిల్లో కొనసాగక సరెండర్ చేయడమే మంచిదని నా అభిప్రాయం. ఎప్పుడూ బీమాను, ఇన్వెస్ట్‌మెంట్‌ను కలగలపవద్దు. ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం హైబ్రిడ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు తీసుకోవద్దు. బీమా కోసం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం ఉత్తమం. వీటికి ప్రీమియమ్ తక్కువగా ఉంటుంది. రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. తగిన రాబడులు వస్తాయి. మీరు భరించగలిగే రిస్క్‌ను బట్టి ఈ డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోండి.

 నేను ఎంబీఏ చదివాను. ఒక ఇన్‌ఫ్రా కంపెనీలో ఉన్నత స్థానంలో ఉద్యోగం చేస్తున్నాను. రూ. కోటి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఒక్కోటి రూ.50 లక్షల చొప్పున రెండు వేర్వేరు కంపెనీల నుంచి టర్మ్ ప్లాన్‌లు తీసుకోవడం మంచిదా ? లేకుంటే ఒకే కంపెనీ నుంచి రూ. కోటికి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం మంచిదా? ఆన్‌లైన్‌లో లభించే కొన్ని మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు సూచించండి?  - శ్రీనివాస్, సూర్యాపేట

 భారీ మొత్తంలో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే, ఒకే కంపెనీ నుంచి కాకుండా రెండు కంపెనీల నుంచి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం మంచిది. ప్రీమియం, క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఏగాన్ రెలిగేర్ ఐటర్మ్ ప్లాన్, మ్యాక్స్ లైఫ్ ఆన్‌లైన్ టర్మ్ ప్లాన్, భారతీ ఏఎక్స్‌ఏ లైఫ్ ఈప్రొటెక్ట్.. ఈ సంస్థల టర్మ్ ప్లాన్‌లను పరిశీలించవచ్చు. మీ వయస్సును బట్టి మీరు చెల్లించాల్సిన ప్రీమియమ్‌ను, మీ ఆదాయ వ్యయాలను పరిగణనలోకి తీసుకొని వీటిల్లోంచి పాలసీలను ఎంచుకోండి. మీకు, మీ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించి పాలసీలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో క్లెయిమ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement