తిరుపతిలో ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న వస్తువులు (ఇన్‌సెట్‌లో) విజయభాస్కర్
సాక్షి, అమరావతి /తిరుపతి క్రైం: రేణిగుంట చెక్‌పోస్ట్‌లో ఎంవీఐగా పనిచేస్తున్న పసుపులేటి విజయభాస్కర్‌పై ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఫిర్యాదు రావడంతో ఏసీబీ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం అతని ఆస్తులు రూ.4.5 కోట్లు ఉంటాయని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. అయితే మార్కెట్ విలువ ప్రకారం రూ.100 కోట్లపైగానే ఉంటాయని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..పద్మావతిపురం పంచాయతీలోని శ్రీనివాసపురంలో ఉన్న ఇంటితో పాటు, బంధువులు, కుటుంబసభ్యులకు సంబంధించి 16ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. బెంగళూరులోని 4 ప్రదేశాల్లో, అనంతరంపురంలో ఓ చోట, చిత్తూరు జిల్లాలో పదిచోట్ల, చెన్నైలోని ఓ ప్రాంతంలో, బంధువులకు చెందిన, బినామీ పేర్లతో సుమారు రూ.8కోట్ల ఆస్తులున్నట్లు గుర్తించారు.
వీటితో పాటు రెండు లాకర్లను గుర్తించారు. కడప జిల్లా, నందలూరు మండలం, శేషామాంబపురానికి చెందిన పి.సుబ్బరాయుడు కుమారుడు పి.విజయభాస్కర్ (51) 1993లో అగ్నిమాపకశాఖలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2005లో బదిలీపై రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. పలమనేరు చెక్‌పోస్టు , కడప డీటీసీ ఆఫీసులో 2014 వరకు విధులు నిర్వహించాడు. 2011లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రోజుల్లో ఒక టివి చానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌కు చిక్కి సస్పెండ్ అయ్యాడు. 2014లో ఇతనికి మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోషన్ లభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రేణిగుంట ఆర్టీఏ చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్నాడు. గతంలోనూ పలుమార్లు తనిఖీల్లో పట్టుబడిన ఆయనపై ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించడంపై ఆర్‌సీవో కేసు నమోదు చేశారు.
ఇంట్లో వందల కొద్ది పత్రాలు, బాండ్లు, నగదు, వెండి, విలువైన వస్తువులు, వాహనాలను గుర్తించారు. కొంతకాలంగా రాజకీయాల వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీనిపై ఆయన సన్నిహితులు కూడా రాజంపేట ఎమ్మెల్యే టికెట్టు కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. విజయభాస్కర్ మొదటి భార్య త్రిపురసుందరి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నారు. నిందితుడ్ని అరెస్టు చేసి నెల్లూరు కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ ఏఎస్‌ఈ తిరుమలేశ్వరరెడ్డి తెలిపారు.
గుర్తించిన ఆస్తులివే...
- బెంగళూరులోని హోసకేరహళ్లి సర్వేనం.120/3 నిందితుడు పి.విజయభాస్కర్ భార్య త్రిపురసుందరి పేరుతో ఉన్న రూ.228.69లక్షల ఇళ్లస్థలం 20 గుంటలు
- బెంగళూరులోని హోసకేరహళ్లి సర్వేనం.120/5 విజయభాస్కర్ పెద్దమ్మ కామాక్షమ్మ , రెండో చెల్లెలు పి.నాగవేణి పేరుతో రూ.81.90లక్షల ఇళ్లస్థలం7.52 గుంటలు
- బెంగళూరులోని హోసకేరహళ్లి సర్వేనం.168,ఆర్‌ఎస్‌నం.262 విజయభాస్కర్ రెండో చెల్లెలు పి.నాగవేణి పేరుతో రూ.11లక్షల ఇళ్లస్థలం 1.39 ఎకరాలు
- కడప జిల్లా ఓబులవారిపల్లి మండలం ఎర్రగుంటకోటలోని సర్వేనం.902/391/3ఎ1, 1500–2 పచ్చిపుల సుదర్శన్‌కుమార్ పేరుతో రూ.4లక్షల వ్యవసాయ భూమి 7.21 ఎకరాలు
- కడప జిల్లా ఓబులవారిపల్లి మండలం ఎర్రగుంటకోటలోని సర్వే నం 227/2ఎన్2లో పచ్చిపుల వెంకటసుబ్బయ్య పేరుతో రూ.0.20లక్షల 0.37 ఎకరాలు
- బెంగళూరులో హోబ్లీ కృష్ణరాజపుర, దేవచంద్ర గ్రామంలో తన రెండో భార్య పి.ధనలక్ష్మి తండ్రి డి.కృష్ణ పేరు మీద రూ.16.02లక్షల 1800 చదరపు అడుగులున్న రెండు ప్లాట్లు
- చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీలోని గౌతమ్‌నగర్‌లో రెండో భార్య పి.ధనలక్ష్మి పేరుతో రూ.26 లక్షల 306 అడుగులున్న ఇల్లు
వివిధ కంపెనీల్లో పెట్టుబడులు..
- బెంగళూరులోని కనకపుర మెయిన్‌రోడ్డులోని గ్రేస్ క్రియేషన్స్ క్లాత్ డిజైనింగ్ కంపెనీలో 2011లో రూ.50లక్షలు పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు.
- బెంగళూరు మైసూర్ రోడ్డులోని కుంభలగోడు ఇండస్ట్రియల్ ఏరియాలోని గ్రేస్‌టెక్స్‌ప్రో ఫ్యాక్టరీ (ఎంబ్రయిడరీ మిషన్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ)లో 2011లో రూ.30లక్షల పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారు.
చరాస్తులు..
- విజయభాస్కర్ మొదటి భార్య పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.29లక్షలు
- రెండో భార్య పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.53.33లక్షలు
- గుర్తించిన నగదు 7.72లక్షలు
- సంతకం చేసిన రూ.110.00లక్షల విలువైన 6 ఖాళీ చెక్కులు
- రూ.57.00లక్షల విలువైన 12 ప్రామిసరీ నోట్లు
- సంతకాలు చేసిన ప్రామిసరీ నోట్లు 25
- బ్యాంకు బ్యాలెన్స్ రూ.53లక్షలు
- గోల్డ్ 350 గ్రాములు, సిల్వర్ 2 కేజీలు
- ద్విచక్ర వాహనం ఒకటి, హోండా యాక్టివా, ఫోర్‌వీలర్స్ 2 (విలువ రూ.29లక్షలు)
- 2 బ్యాంకు లాకర్లను గుర్తించారు. వీటిని ఇంకా పరిశీలించలేదు.
Comments
Please login to add a commentAdd a comment