ఛీ ఛీ ఇదేం దూషణ!
- జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఓ ఉన్నతాధికారి నిర్వాకం
- మహిళా ఉద్యోగుల పట్ల అసభ్య ప్రవర్తన
- ‘సాక్షి’తో గోడు చెప్పుకున్న బాధితులు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ఏయ్.. పచ్చ రంగు చీర కట్టుకున్నదాన.. నిన్నే..! ఇటురా.. మీటింగ్‌కు వచ్చావా? లేక.. ’ ఈ మాటలు ఎవరో సభ్యత లేని మనిషివి కావు.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నత స్థాయి అధికారి.. నర్సులను, మహిళా ల్యాబ్ టెక్నీషియన్లను ఉద్దేశించి అంటున్న మాటలు.
ఉన్నతస్థాయి అధికారి దూషణ పర్వాన్ని తట్టుకోలేక కొంత మంది బాధితులు ‘సాక్షి’ కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పారు. ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘వైద్య విధ్వంసం’పై ప్రచురించిన వరుస కథనాలకు స్పందించిన మహిళా ఉద్యోగులు.. ‘మీరు రాస్తున్న కథనాలతో పాటు మా వ్యథను కూడా ప్రచురించండి’ అని కోరారు. ఇంతకాలం మౌనంగా భరించిన వారు.. తమ బాధను బట్టబయలు చేశారు.
ఆ చూపులు భరించలేం...
ఇటీవల సమావేశానికి వచ్చిన ఓ మహిళా ఉద్యోగిని ఉద్దేశించి ‘ఏమే.. బొట్ల బొట్ల చీరకట్టుకొచ్చినవ్.. షూటింగ్‌కు వచ్చావా?’ అంటూ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటంతో సదరు ఉద్యోగి కన్నీరు మున్నీరుగా విలపించడంతో తోటి ఉద్యోగులు ఓదార్చారు. అదే రోజు జరిగిన విషయాన్ని ఆమె తన తండ్రికి వివరించింది. తండ్రి ఈ విషయాన్ని ఓ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.మరో ప్రభుత్వ ఉద్యోగి భార్యను కూడా ‘ఏమే’ అంటూ ఏకవచనంతో సంబోధించడంతో పాటు మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీసే చూపులతో ఇబ్బంది పెట్టినట్టు ఫిర్యాదులు అందాయి. తమ ఇంట్లో కూడా చెప్పుకోలేని దుస్థితి అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మెమో ఇప్పించి....
సదరు ఉద్యోగి టార్గెట్ చేసిన మహిళా ఉద్యోగులకు చీటికి మాటికి మెమోలు ఇప్పిస్తారని, వచ్చి నేరుగా కలవాలని తన సబార్డినేట్స్‌తో ఫోన్ చేయిస్తారని, మెమో పట్టుకొని ఆయన ఆఫీసు రూంలోకి వెళ్తే నరకంలోకి వెళ్లినట్లుగా ఉంటుందని ఓ ఉద్యోగి ఉద్వేగానికి లోనయ్యారు. మీసం తిప్పుతూ ‘మీరు చెప్పినట్టు ఇక్కడ సాగవు’ అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతారని, ఎదురు మట్లాడితే వేధింపులకు గురి చేస్తారని, చేయని తప్పుకు ఎక్కడ ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందేమోనన్న ఆవేదనతో ఉన్నామని.. మరో ఉద్యోగి కన్నీళ్ల పర్యంతమయ్యారు. సదరు ఉద్యోగి మీద నిర్భయ చట్టం ప్రయోగిస్తే ఇప్పటి వరకు కనీసం 50 కేసులు పెట్టాల్సి వచ్చేదని మరో ఉద్యోగి ఆక్రోశం వెళ్లగక్కారు. ఇలాంటి అధికారిని తక్షణమే పంపించి మహిళా ఉద్యోగుల ఆత్మగౌరవం కాపాడాలని వారు కలెక్టర్‌ను కోరుతున్నారు.