రేపు రెండో విడత పల్స్‌పోలియో
* ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్య ఆరోగ్యశాఖ
* జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు 3.67 లక్షలు
* పీహెచ్‌సీలు, అర్భన్‌హెల్త్‌సెంటర్లకు వ్యాక్సిన్ సరఫరా
నల్లగొండ టౌన్: రెండో విడత పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని జిల్లాలో ఆదివారం నిర్వహించనున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల లోపు వయస్సు కలిగిన పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. పల్స్ పోలియో కార్యక్రమం కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలు, ఐదు రెవెన్యూ డివిజన్లలో కలిపి మొత్తం 3లక్షల 67వేల 460మంది ఐదు సంవత్సరాల లోపు వయస్సు కలిగిన పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. వారికి అవసరమైన వ్యాక్సీన్ జిల్లాకు తెప్పించారు. జిల్లాలోని 15 సీహెచ్‌ఎన్‌సీలు, వాటి పరిధిలోని 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలుగు పీపీ యూనిట్లు, 8 అర్భన్ హెల్త్ సెంటర్లు, మూడు అర్భన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లకు వ్యాక్సిన్ సరఫరా చేశారు. పోలియో చుక్కలను వేయడానికి రూరల్ పరిధిలో 2737 సెంటర్లు, అర్భన్‌లో 234 పోలియే చుక్కల కేంద్రాలను కలిపి మొత్తం జిల్లా వ్యాప్తంగా 2971 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశారు.
79 మొబైల్ బృందాల ఏర్పాటు
సంచారజాతులు,ఇటుకబట్టీలు,మురికివాడలు, నిర్మాణ రంగాలు, చేపలుపట్టే ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారి పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి 79 మొబైల్ బృందాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్టు చేసింది. మొబైల్ బృందంలో పీహెచ్‌సీ వైద్యాధికారితో పాటు నలుగురు సిబ్బంది పోలియో చుక్కలను వేయడంతో పాటు వారి పరిధిలో కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్, బస్‌స్టాప్‌లలో పోలియో చుక్కలను వేయడం కోసం 54 ట్రాన్సిట్ బృందాలను నియమించారు.
పోలియో చుక్కల కార్యక్రమంపై ప్రజలలో అవగాహన కల్పించడం కోసం అవసరమైన కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేశారు. 21వ తేదీ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పోలియో కేంద్రాలలో పిల్లలకు చుక్కలను వేయనున్నారు. అదే విధంగా 22, 23 తేదీల్లో ఇంటింటికీ తిరిగి చుక్కలు వేయించని పిల్లలను గుర్తించి వారికి పోలియో చుక్కలు వేయనున్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు ఉపాధ్యాయులు, స్వయం సహాయక సంఘాలు, ఐకేపీ, ఐసీడీఎస్, ఆశ వర్కర్ల సేవలను వినియోగించుకుంటారు.
11,884 మంది సిబ్బంది నియామకం
పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతం చేయడానికి జిల్లా వ్యాప్తంగా 11,884 మంది సిబ్బందిని నియమించారు. అందులో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది 1836, ఉపాధ్యాయులు 327, అంగన్‌వాడీ వర్కర్లు 3560, ఆశ వర్కర్లు 2978, ఇతర వాలంటీర్లు 3183 మందిని నియమించారు. కార్యక్రమం పర్యవేక్షణ కోసం 294 మంది సూపర్‌వైజర్లను నియమించారు. కార్యక్రమాన్ని కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అదనపు జా యింట్ కలెక్టర్, డీఎంఅండ్‌హెచ్‌ఓ, డీఐఓ, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్, ఇతర శాఖల అధికారులు పర్యవేక్షించనున్నారు.
నేడు పల్స్‌పోలియో ర్యాలీ
జిల్లాలో ఆదివారం నుంచి నిర్వహించనున్న రెండో విడత పల్స్‌పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ భానూప్రసాద్‌నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాలీ ఉదయం 9. గంటలకు డీఎంహెచ్ కార్యాలయం వద్ద ప్రారంభమై గడియారం సెంటర్ మీదుగా ప్రకాశంబజార్, డీఈఓ కార్యాలయంనుంచి డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి చేరుకుంటుందని తెలిపారు.