
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తోందన్న భయాల వేళ మరో టీకా అందుబాటులోకి వచ్చింది. దేశీయ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసుగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలో నాసల్ వ్యాక్సిన్ ధరను మంగళవారం ప్రకటించింది భారత్ బయోటెక్. ప్రైవేటు కంపెనీలకు సింగిల్ డోసు టీకా ధర రూ.800(పన్నులు అదనం)గా నిర్ణయించినట్లు తెలిపింది. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.325కే ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
జనవరి నాలుగో వారం నుంచి అందుబాటులోకి రానుంది ఈ నాసల్ వ్యాక్సిన్. ‘ఇంకోవాక్’(iNCOVACC)గా పిలిచే ఈ నాసల్ వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు కోవిన్ పోర్టల్ ద్వారా ఇప్పటి నుంచే స్లాట్స్ బుక్సింగ్ చేసుకోవచ్చని భారత్ బయోటెక్ తెలిపింది. ఇప్పటికే కోవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు ఇంకోవాక్ నాసల్ టీకాను బూస్టర్‌గా పొందవచ్చు. జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా దీని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. బీబీవీ154గా పిలిచే ఈ నాసల్ టీకా ఇంకోవాక్ బ్రాండ్ పేరుతో మార్కెట్లో లభ్యమవుతుంది. ప్రాథమిక, బూస్టర్ డోసు కోసం అనుమతులు పొందిన ప్రపంచంలోనే తొలి నాసల్ వ్యాక్సిన్‌గా ఇంకోవాక్ నిలిచినట్లు పేర్కొంది భారత్ బయోటెక్.
ఇదీ చదవండి: Corona New Variant BF.7: కరోనా బీఎఫ్.7 బాధితులకు పైసా ఖర్చు లేకుండా చికిత్స.. ఎక్కడంటే?
Comments
Please login to add a commentAdd a comment