దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు... జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు కేంద్ర ఆదేశాలు... ప్రపంచ వ్యాప్తంగా మళ్ళీ ఎక్కువవుతున్న భయాలు... వీటన్నిటి మధ్య ప్రధాని మోదీ శనివారం రాత్రి జాతిని ఉద్దేశించి చేసిన కొత్త టీకా విధాన ప్రకటన నైతిక స్థైర్యాన్ని నింపవచ్చు. నియమిత రెండు డోసులే కాక, అదనపు మూడో డోస్‌ను బూస్టర్ డోస్‌గా ఇవ్వాలంటూ కొద్ది రోజులుగా దేశమంతటా చర్చోపచర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని చేసిన ఆ ప్రకటన – క్రిస్మస్ హెల్త్‌గిఫ్ట్. భారత్ బయోటెక్ సంస్థ తయారీ కోవాగ్జిన్ టీకాను 12 ఏళ్ళు పైబడ్డవారికి వేయవచ్చంటూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతించిన కాసేపటికే మోదీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. నూటికి 50 మందిలో టీకా రోగనిరోధకతను ఒమిక్రాన్ తోసిపుచ్చినట్టు దేశంలో ప్రాథమిక డేటా. అందుకే, బూస్టర్‌డోస్‌లు, టీనేజర్లకు టీకాలతో కరోనాపై పోరాటపటిమనీ, పరిధినీ పెంచడం స్వాగతించాలి.
పెద్దనోట్ల రద్దు ప్రకటన నాటి నుంచి చీకటి పడ్డాక మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నా రంటే, ఒక విధమైన ఉత్కంఠ! ఒమిక్రాన్ కేసులు, లాక్డౌన్ పుకార్ల మధ్య శనివారమూ అదే పరిస్థితి. చివరకు మోదీ 15 – 18 ఏళ్ళ మధ్యవయసు పిల్లలకు టీకాలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు – ఆరోగ్య సంరక్షణ వర్కర్లు – తీవ్ర అనారోగ్య సమస్యలున్న 60 ఏళ్ళు పైబడ్డ పెద్దలకు ‘ముందు జాగ్రత్త డోస్’ (ప్రపంచమంతా బూస్టర్ అంటున్న మూడో డోస్)లు జనవరి నుంచి ఇస్తామనేసరికి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే కాస్తంత ఆలస్యమైందని కొందరు అంటున్నా, కనీసం ఒమిక్రాన్ వేళ ధైర్యమిచ్చే ప్రకటన చేశారనే భావన కలిగింది. ప్రస్తుతం దేశంలో నెలకి 30 కోట్ల పైగా (కోవిషీల్డ్ 25 – 27 కోట్లు, కోవాగ్జిన్ 5–6 కోట్ల) డోస్‌లు ఉత్పత్తవుతున్నాయి. రాష్ట్రాల వద్ద 18 కోట్ల డోసులు నిల్వ ఉన్నాయట. 11 రాష్ట్రాల్లో దేశ సగటు కన్నా తక్కువగా టీకాకరణ జరుగుతోంది.
తాజా ప్రకటనతో నాలుగు వారాల తేడాతో వేసే రెండు డోసుల కోవాగ్జిన్ టీకా, మూడు డోసుల డీఎన్‌ఏ ఆధారిత టీకా జైకోవ్–డి... ఈ రెండిటికీ మనదేశంలో 12 ఏళ్ళు పైబడ్డవారికి వాడేందుకు అనుమతి ఉన్నట్టయింది. జైడస్ క్యాడిలా తయారీ జైకోవ్–డికి ఆగస్టులోనే భారత్‌లో అనుమతి లభించింది. అదింకా మార్కెట్‌లోకి రాలేదు. అంటే, దాదాపు ఏడాదిగా విపణిలో ఉన్న కోవాగ్జిన్ ఒక్కటే మన టీనేజర్లకు శరణ్యం. అటు జైకోవ్–డి విషయంలో కానీ, ఇటు కోవాగ్జిన్ విషయంలో కానీ ఈ నిర్ణీత వయసు వారిపై ఆయా టీకాల సామర్థ్యంపైనా, సురక్షితమేనా అన్నదానిపైనా సరైన పరిశోధన పత్రాలు లేవు. బాహాటంగా సమాచారమూ లేదు. తయారీ సంస్థల పత్రికా ప్రకటనలే ప్రజలకు ఆధారం కావడం విచిత్రం. నిజానికి, 2 ఏళ్ళు పైబడిన పిల్లలకు సంబంధించిన డేటాను భారత్ బయోటెక్, 12 ఏళ్ళు పైబడిన వారి డేటాను జైడస్ క్యాడిలా సమర్పించాయి. కానీ, 15 – 18 ఏళ్ళ మధ్యవయస్కులకే టీకాలు పరిమితం చేస్తూ మోదీ ప్రకటనకు కారణాలేమిటో తెలియదు.
నిజానికి, ప్రపంచవ్యాప్తంగా అనేక వర్ధమాన దేశాల్లో సరఫరా సరిగ్గా లేదు. టీకాల కొరత ఉంది. పైపెచ్చు పిల్లలకూ, టీనేజర్లకూ కరోనా తీవ్రంగా వచ్చే అవకాశం తక్కువనీ, అత్యధిక రిస్కున్నవారికి సైతం అన్ని దేశాల్లో టీకాకరణ పూర్తి కాలేదనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసెంబర్ 22న కూడా పేర్కొంది. అందుకే, అర్హులైన వయోజనులందరికీ టీకాలు వేయడం పూర్తయ్యే దాకా భారత్‌లో టీనేజర్లకు ఓకే చెప్పరని భావించారు. ప్రభుత్వ విధానానికి మార్గదర్శనం చేస్తున్న శాస్త్రవేత్తలు సైతం పదే పదే సమావేశమైనా, బాహాటంగా ఏమీ చెప్పలేదు. ఎట్టకేలకు ప్రధానే స్వయంగా కొత్త నిర్ణయం ప్రకటించే ఘనత తీసుకున్నారు. టీకాల సరఫరా సమృద్ధిగా ఉన్న అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు ఇప్పటికే పసిపిల్లలకూ, టీనేజర్లకూ టీకాలు వేసేస్తున్నాయి. మన దేశ తాజా కోవిడ్ టీకా విధానంపై అది సహజంగానే ప్రభావం చూపింది. ఆ మాటకొస్తే, ఐరోపాలోని అనేక దేశాలతో పాటు కెనడా, బహ్రయిన్, ఇజ్రాయెల్, ఒమన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, చైనా లాంటివి కూడా ఇప్పటికే 12 ఏళ్ళ లోపు వారికి టీకాలకు ఓకే అనేశాయి.
భారత్‌లో వయోజనుల్లో 40 శాతం మందికి (38 కోట్ల మందికి) పూర్తిగా టీకాలేయడం అవనే లేదు. అందుకే, వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్, ఇప్పటికీ తొలగిపోని డెల్టా వేరియంట్ ముప్పు నేపథ్యంలో – 18 ఏళ్ళ లోపు వారి కన్నా వయోజనులకే మరింత రిస్కుంది అనేది మరో వాదన. మొత్తం మీద టీకాకరణలో కొత్త దశలోకి కొత్త ఏడాది అడుగిడనున్నాం. రెండో డోస్ వేసుకున్నా 8 నుంచి 9 నెలల్లో రోగనిరోధకత తగ్గుతుందన్న అధ్యయనాలతో ‘ముందు జాగ్రత్త’ పేరుతో కొందరికి బూస్టర్ డోసులూ వేయనున్నాం. మొదటి డోస్ వేసుకొని రెండో డోసుకు రాని వారిని ఒప్పించడంతో పాటు, అవసరార్థులకు బూస్టర్ డోస్ వేయడం ఇప్పుడున్న సవాలు. వ్యాధి లక్షణాలు కనపడ్డ 5 రోజుల్లోగా తీసుకుంటే, అమెరికా, బ్రిటన్‌లలో ఆసుపత్రి కష్టాలు, మరణాలను 89 శాతం తగ్గిస్తున్నాయంటున్న యాంటీ వైరల్ మాత్రల్నీ అనుమతించవచ్చేమో ఆలోచిస్తే మంచిదే! సమస్యల్లా – దేశ జనాభా మొదలు విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల దాకా అందరూ కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించడం, రిస్కు లేని దేశాల నుంచి వస్తున్నవారు అసలు నిబంధనల్నే పాటించక పోవడం! దేశంలో తాజా కేసుల పెరుగుదలకు అదే కారణమని అధికారులు మొత్తుకుంటున్నారు. కానీ, మాస్కులు తీసేసి, భౌతిక దూరమైనా లేకుండా, గుంపులుగా తిరుగుతున్నవారికి ఏమని చెప్పాలి? ఎన్నిసార్లని జాగ్రత్తల బుద్ధి గరపాలి? కరోనాపై పోరులో అదే పెను సమస్య!
Comments
Please login to add a commentAdd a comment