న్యూఢిల్లీ: చైనాలో కోవిడ్ విజృంభణకు కారణమైన కరోనా వైరస్ వేరియంట్ భారత్‌లోనూ ప్రబలే వీలుందన్న భయాల నడుమ ప్రధాని మోదీ ప్రజలకు సూచనలు చేశారు. ‘కోవిడ్ ఇంకా అంతం కాలేదు. జనసమ్మర్థ ప్రాంతాల్లో మాస్క్‌లు కచ్చితంగా ధరించండి. పండుగలు, నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండండి’ అని ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు. దేశంలో కోవిడ్ పరిస్థితి, భారత ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత తదితర అంశాలపై ప్రధాని మోదీ గురువారం ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
జీనోమ్ సీక్వెన్సింగ్ పెంచండి
‘కోవిడ్ పరిస్థితి సంక్షిష్టంగా మారకుండా అడ్డుకోండి. కోవిడ్ నియమాలు కచ్చితంగా అమలయ్యేలా చూడండి. కొత్త కేసుల ట్రాకింగ్‌పై దృష్టిపెట్టండి. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ‘నిఘా’ పెంచండి’ అని ఉన్నతాధికారులకు సూచించారు. ఔషధాలు, వ్యాక్సిన్లు, ఆస్పత్రుల్లో పడకల అందుబాటుపై అధికారులను ఆరాతీశారు. ‘ ప్రజలంతా జనసమ్మర్ద ప్రాంతాల్లో మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోండి. ప్రికాషన్ డోస్ అందరికీ అందేలా చూడండి. సులభంగా వైరస్ ప్రభావానికి లోనయ్యే వారికి, వృద్ధులకు ప్రికాషన్ డోస్ అందుబాటులో ఉంచండి.
టెస్టింగ్ సంఖ్యను పెంచండి. జన్య క్రమ విశ్లేషణలను అధికం చేయండి. వ్యాక్సినేషన్‌పై అవగాహనను మరింతగా పెంపొందించండి’ అని అధికారులకు మోదీ సూచించారు. ‘అనుమానిత రోగుల శాంపిళ్లను రోజువారీగా ఇన్సాకాగ్ వారి జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లకు పంపాలని రాష్ట్రాలకు సూచించాం’ అని ఆ తర్వాత ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
రోజువారీ సగటు కేవలం 153 కేసులే
‘జీనోమ్’ ద్వారా కొత్త వేరియంట్ కేసులను త్వరగా కనిపెట్టి అప్రమత్తమయ్యే అవకాశాలు మెరుగుపడతాయి. కోవిడ్ చికిత్స ఉపకరణాలు, సౌకర్యాలు, మానవ వనరుల అందుబాటు విషయంలో మరింత జాగురూకత అవసరం’ అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రపంచదేశాల్లో కోవిడ్ తాజా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, నీతి ఆయోగ్(ఆరోగ్యం) సభ్యుడు ఒక సమగ్ర ప్రజెంటేషన్ చూపించారు. ‘భారత్‌లో పరిస్థితి అదుపులో ఉంది. రోజువారీ సగటు కేసుల సంఖ్య కేవలం 153కు, డిసెంబర్22తో ముగిసిన వారంలో వారపు పాజిటివిటీ రేటు 0.14 శాతానికి దిగొచ్చిందని అధికారులు వివరించారు.
అయితే, ప్రపంచవ్యాప్తంగా చూస్తే గత ఆరు వారాలుగా సగటున రోజుకు 5.9 లక్షల కేసులు నమోదవుతుండటం గమనార్హం. ఈ భేటీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింథియా, విదేశాంగ మంత్రి జైశంకర్, సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, నీతి ఆయోగ్ సీఈవో అయ్యర్, నీతి ఆయోగ్(ఆరోగ్యం) సభ్యుడు వీకే పాల్, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై గురువారమే సమీక్షా సమావేశాలు నిర్వహించాయి.
Comments
Please login to add a commentAdd a comment