Medical Device
-
వైద్య పరికరాల తయారీకి కొత్త పథకం
న్యూఢిల్లీ: దేశీ వైద్య పరికరాల తయారీ పరిశ్రమను బలోపేతం చేసేందుకు ఒక పథకాన్ని తీసుకురానున్నట్టు కేంద్ర ఫార్మాస్యూటికల్స్ విభాగం సెక్రటరీ అరుణీష్ చావ్లా తెలిపారు. పరిశ్రమతో విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ పథకాన్ని రూపొందించినట్టు, దీనికి ఆర్థిక శాఖ సూతప్రాయ ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. వచ్చే నెలలోనే దీన్ని అమల్లోకి తేనున్నట్టు చెప్పారు.రెండో మెడిటెక్ స్టాకథాన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చావ్లా మాట్లాడారు. వైద్య పరికరాల తయారీ పరిశ్రమ అవసరాలను తీర్చేదిగా ఈ పథకం ఉంటుందని చెప్పారు. రానున్న రోజుల్లో దిగుమతులపై ఆధారపడడాన్ని ఇది తగ్గిస్తుందన్నారు. దీర్ఘకాలంలో దేశీ పరిశ్రమ స్వయంసమృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. వైద్య పరికరాలకు సంబంధించి ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) ఇప్పటి వరకు సత్ఫలితాలను ఇచ్చినట్టు, 20 పెద్ద ప్రాజెక్టులు కార్యకలాపాలు ప్రారంభించినట్టు చెప్పారు.కంప్యూటెడ్ టోమోగ్రఫీ (సీటీ) స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ స్కాన్, డయలాసిస్ మెషిన్లు దేశీయంగా తయారవుతున్నట్టు చావ్లా తెలిపారు. గతేడాది కేంద్ర కేబినెట్ ‘నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీ’కి ఆమోదం తెలపడం తెలిసిందే. వచ్చే ఐదేళ్లలో 50 బిలియన్ డాలర్ల స్థాయికి పరిశ్రమ ఎదిగేందుకు ఈ విధానం తోడ్పడుతుందని కేంద్రం భావిస్తోంది. -
వైద్య పరికరాల ఉత్పత్తికి రూ.24 వేల కోట్లతో ప్రోత్సాహం
సాక్షి, న్యూఢిల్లీ: అధునాతన వైద్య పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయంగా వాటి ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో రూ.24,300 కోట్లతో అనేక ప్రోత్సాహక పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాదానమిస్తూ.. 2020–21 నుంచి 2022–23 వరకు 22,274 డాలర్ల విలువైన వైద్య పరికరాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోగా.. మన దేశం నుంచి కేవలం 8,846 డాలర్ల విలువైన వైద్య పరికరాలను మాత్రమే ఎగుమతి చేసినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీయంగా అధునాతన వైద్య పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలకు శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ జాబితా సవరణ బిల్లులకు ఆమోదం ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వెనుకబడిన గిరిజన తెగలైన బోండో పోర్జా, ఖోండ్ పోర్జా, పరంగి పెర్జా తెగల కలలు నెరవేరాయి. వారిని షెడ్యూల్డ్ తెగలుగా గుర్తిస్తూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఎస్సీ, ఎస్టీల జాబితాను సవరించే రెండు బిల్లుల్ని మంగళవారం రాజ్యసభ ఆమోదించింది. ఈ సందర్భంగా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ.. అండమాన్ నుంచి ప్రధాన భూభాగం వరకూ 75 అత్యంత వెనకబడిన గిరిజన సమూహాలు విస్తరించి ఉన్నాయన్నారు. వీటిలో 10 సమూహాలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చకపోవడం వల్ల అన్యాయాలను ఎదుర్కొంటూ హక్కుల్ని కోల్పోయాయన్నారు. బలహీన గిరిజన సమూహాల సామాజిక, ఆరి్థక స్థితిగతుల్ని మార్చడానికి కేంద్రం పలు పథకాలు తీసుకొచ్చిందని, బిల్లులు సమర్థించినందుకు సభకు కేంద్రమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మరికొన్ని గిరిజన సంఘాల్ని షెడ్యూల్డు తెగల జాబితాలో చేర్చాలని పలువురు సభ్యులు తీసుకొచ్చిన ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తోందని చెప్పారు. గిరిజన పథకాలకు బడ్జెట్ పెంచాలి గిరిజన పథకాలకు బడ్జెట్ మరింత పెరిగేలా చూడాలని వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఎస్టీ విద్యార్థుల ఉన్నత విద్య నిమిత్తం నేషనల్ ఫెలోషిప్, స్కాలర్íÙప్‌కు బడ్జెట్ తగ్గించిన విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. ఏపీలో షెడ్యూల్డు తెగల జాబితా సవరణ, ఒడిశాలోని షెడ్యూల్డు కులాలు, తెగల జాబితా సవరణ బిల్లులకు మద్దతుగా మాట్లాడుతూ.. అత్యంత వెనుకబడిన గిరిజనులకు సంబంధించి ఖచ్చితమైన రికార్డు లేకపోవడం శోచనీయమని, ఖచ్చితమైన మూల్యాంకనం అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక నీటి కాలుష్యాన్ని తగ్గించాలి దేశవ్యాప్తంగా పారిశ్రామిక నీటి కాలుష్యాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభా‹Ùచంద్రబోస్ కోరారు. రాజ్యసభలో మంగళవారం నీటి (కాలుష్య నివారణ, నియంత్రణ) బిల్లుకు మద్దతుగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో 6 శాతం కంటే ఎక్కువ పరిశ్రమలు పర్యావరణ ప్రమాణాలు పాటించడం లేదన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి రసాయనాలు/ఎరువులు, సిమెంట్ పరిశ్రమలపై రూ.13.40 కోట్లకు పైగా పర్యావరణ పరిహారాన్ని విధించినప్పటికీ నీటి కలుíÙతం యధేచ్ఛగా కొనసాగుతోందన్నారు. ఈ బిల్లు ద్వారా పర్యావరణ పరిరక్షణ నిధికి జమ చేసిన మొత్తాన్ని నీటి కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులను ఎదుర్కోవడానికి ఉపయోగించాలని సూచించారు. నెలాఖరు నాటికి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పూర్తి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బరు నెలాఖరు నాటికి పూర్తవుతుందని ఏపీ ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చినట్టు కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ.. ప్రాజెక్టు విలువ రూ.288.8 కోట్లు కాగా.. ఇందులో కేంద్ర వాటా రూ.138.29 కోట్లు అని తెలిపారు. రూ.12,79,331 కోట్ల రుణాలు ఆర్బీఐ గణాంకాల ప్రకారం షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుల్లో సెప్టెంబర్ 2023 నాటికి అన్సెక్యూర్డ్ రిటైల్ లోన్స్ రూ.12,79,331 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ తెలిపారు.వైఎస్సార్సీపీ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, బీద మస్తానరావు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆ ప్రతిపాదన ఏదీలేదు ఆంధ్రప్రదేశ్‌లో మోడరనైజ్డ్, ఇంప్రూవ్ డిసీజ్ సరై్వలెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి సత్యపాల్‌సింగ్ తెలిపారు. దేశవ్యాప్తంగా పది టైర్–1, పది టైర్–2 సిటీల్లో ఈ యూనిట్లు ఉన్నాయని వైఎస్సార్సీపీ సభ్యుడు నిరంజన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. -
‘డైస్’ సేవలు అందేదెప్పుడో..!
నిర్మల్‌చైన్‌గేట్: పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం(ఆర్బీఎస్కే)లో భాగంగా డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్ వేషన్ సెంటర్ (డీఈఐసీ)ను నిర్మల్‌కు రాష్ట్ర ప్రభుత్వం 2014–15 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసింది. అప్పట్లో ఈ భవన నిర్మాణం కోసం రూ.85 లక్షల నిధులు మంజూరు చేశారు. జిల్లా ప్రసూతి ఆసుపత్రి పై అంతస్తులో 2019లో భవన నిర్మాణం పూర్తి చేసిన కాంట్రాక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు భవనాన్ని అప్పగించాడు. అయితే ఐదేళ్లు గడిచినా వైద్య పరికరాలు సమకూర్చలేదు. కనీసం సిబ్బందిని నియమించలేదు. ఫిబ్రవరిలో నోటిఫికేషన్... డైస్ కేంద్రంలో సిబ్బంది నియామకానికి గత ఫిబ్రవరి 20న వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. నాలుగు నెలలు గడిచినా ఇప్పటికీ నియామక ప్రక్రియ చేపట్టలేదు. దీంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నియామక ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందో అని ఎదురుచూస్తున్నారు. అందుబాటులోకి వస్తే ప్రయోజనాలు డైస్ కేంద్రం అందుబాటులోకి వస్తే ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించడం, పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించడం చేస్తారు. చిన్న పిల్లల వైద్యులు, ఫిజియోథెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, ఆప్తాల్మిక్ అసిస్టెంట్ ఇలా వివిధ విభాగాలకు చెందిన నిపుణులు వైద్య సిబ్బంది సుమారు 15 నుంచి 20 వరకు అందుబాటులోకి వస్తారు. మాటలు సరిగా మాట్లాడ లేని వారికి స్పీచ్ థెరపీ, అంగవైకల్యం ఉన్నవారికి ఫిజియోథెరపీ లాంటి చికిత్సలు అందిస్తారు. మూగ, చెవిటి, మానసిక దివ్యాంగులకు అవసరమైన వైద్య సహాయం అందుతుంది. మానసిక నిపుణులు సైతం అందుబాటులో ఉండటం వల్ల మనో వైకల్య సమస్య పరిష్కారం అవుతుంది. ఊడుతున్న టైల్స్... డైస్ కేంద్రం ఏర్పాటు చేసి ఐదేళ్లు పూర్తయినా భవనం మాత్రం నిరుపయోగంగానే ఉంది. దాదాపు రూ.85 లక్షలతో నిర్మించిన ఈ భవనాన్ని నాణ్యత పాటించకపోవడంతో టైల్స్ ఎక్కడికక్కడే ఊడిపోతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి డైస్ కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చి సామాన్య ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందేలా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. నియామకాలు చేపడతాం డైస్ కేంద్రానికి సంబంధించి ఫిబ్రవరిలో 11 విభాగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశాం. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేశాం. త్వరలోనే మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎన్నుకొని నియామక పత్రాలు అందిస్తాం. – డాక్టర్ ధనరాజ్, డీఎంహెచ్‌వో -
రూ. 3 వేల కోట్లతో.. ‘మెడ్‌ట్రానిక్’ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: వైద్య పరికరాల ఉత్పత్తి, ఆరోగ్య రక్షణ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెడ్‌ట్రానిక్ సంస్థ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో రూ.3 వేల కోట్ల పెట్టుబడితో మెడ్‌ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (ఎంఈఐసీ) కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మెడ్‌ట్రానిక్‌కు అమెరికా అవతల ఇది అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం కానుంది. ఆరోగ్య రక్షణ సాంకేతిక పరిశోధన, ఆవిష్కరణల రంగంలో తెలంగాణను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు సంస్థ నిర్ణయం ఊతమివ్వనుంది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతో మెడ్‌ట్రానిక్ ప్రతినిధుల బృందం గురువారం భేటీ అయింది. ప్రస్తుత పెట్టుబడితో వచ్చే ఐదేళ్లలో 1,500కు పైగా ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. హైదరాబాద్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతకు నిదర్శనం వైద్య పరికరాల ఉత్పత్తికి భారతదేశంలో అపారమైన మార్కెట్ ఉందని గుర్తించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తాము ప్రపంచంతోనే పోటీ పడుతున్నామని, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగంలో హైదరాబాద్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతకు మెడ్‌ట్రానిక్ పెట్టుబడి నిదర్శనమని అన్నారు. హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, తీసుకున్న చర్యలను కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో హెల్త్‌కేర్ టెక్నాలజీ రంగం వృద్ధికి తోడ్పాటు అందించడంతో పాటు మెడ్‌ట్రానిక్ విస్తరణ ప్రణాళికలకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఆవిష్కరణలకు కొత్త గమ్యస్థానం లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగంలో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయికి నాయకత్వం వహించేలా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వ ప్రయత్నంలో భాగస్వాములం అవుతున్నందుకు సంతోషంగా ఉందని మెడ్‌ట్రానిక్ సర్జికల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ట్ మైక్ మరీనా అన్నారు. మానవ జీవితాలను మార్చే టెక్నాలజీ ఆవిష్కరణలకు భారతదేశం నయా గమ్యస్థానంగా మారిందని చెప్పారు. కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈఓ శక్తి నాగప్పన్, మెడ్‌ట్రానిక్ వైస్ ప్రెసిడెంట్ దివ్య ప్రకాష్ జోషి పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ‘ఆక్యూజెన్ కేంద్రం’ అమెరికాలోని పెన్సిల్వేనియా కేంద్రంగా పనిచేస్తున్న బయో టెక్నాలజీ కంపెనీ ‘ఆక్యూజెన్’ హైదరాబాద్‌లో తన పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జీన్ థెరపీ, రీజనరేటివ్ సెల్ థెరపీ వ్యాక్సిన్ల తయారీకి సహకారం అందించడం వంటి ముఖ్యమైన కార్యకలాపాలను ఈ కేంద్రం నుంచి నిర్వహిస్తుంది. ఆక్యూజెన్ చైర్మన్ శంకర్ ముసునూరి, చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ అరుణ్ ఉపాధ్యాయ తదితరులు గురువారం అమెరికాలో కేటీఆర్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో ఏర్పాటు చేసే పరిశోధన అభివృద్ధి కేంద్రం ద్వారా తమ సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తామని శంకర్ ముసునూరి తెలిపారు. దీని ద్వారా రీజనరేటివ్ జెనెటిక్ చికిత్సలకు అవసరమైన మందుల తయారీలో తమకు అవకాశం కలుగుతుందని అరుణ్ ఉపాధ్యాయ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అద్భుతమైన బయోటెక్ పరిశ్రమలు, ఆ రంగానికి అవసరమైన నైపుణ్యాలు ఉన్నందున దేశీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెద్ద ఎత్తున రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయని కేటీఆర్ అన్నారు. 2030 నాటికి తెలంగాణ బయోటెక్ పరిశ్రమ 250 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. -
5 ఏళ్లు.. 50 బిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: వైద్య రంగంలో ఉపయోగించే పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగానే తయారీకి ఊతమివ్వడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీ 2023కి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. వైద్య పరికరాల రంగం వచ్చే అయిదేళ్లలో 50 బిలియన్ డాలర్ల స్థాయికి (దాదాపు రూ. 4.1 లక్షల కోట్లు) చేరేందుకు ఇది తోడ్పడనుంది. భారత్‌లో వైద్య పరికరాలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతుండటంతో వీటిని దేశీయంగానే ఉత్పత్తి చేయడాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని క్యాబినెట్ సమావేశం అనంతరం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మీడియాకు తెలిపారు. ప్రపంచీకరణ నేపథ్యంలో దిగుమతులు కూడా ఉంటాయని, అయితే సాధ్యమైనంత మేరకు స్థానిక అవసరాలకు అనుగుణంగా దేశీయంగానే ఉత్పత్తిని పెంచుకోవడమే కొత్త విధానం లక్ష్యమని వివరించారు. ఆరు వ్యూహాలు..: నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీలో ఆరు వ్యూహాలను నిర్దేశించుకున్నారు. నియంత్రణ విధానాలను క్రమబద్ధీకరించడం, మౌలిక సదుపాయాల కల్పన, పరిశోధన.. అభివృద్ధి.. ఆవిష్కరణలకు తోడ్పాటు అందించడం, పరిశ్రమలోకి పెట్టుబడులను ఆకర్షించడం, మానవ వనరుల అభివృద్ధి, మన పరిశ్రమకు బ్రాండింగ్ సాధించడం .. అవగాహన కల్పించడం వంటివి ఈ వ్యూహాల్లో ఉన్నాయి. ఇటు భారత్, అటు ప్రపంచ హెల్త్‌కేర్ అవసరాలను తీర్చే దిశగా దేశీయంగా వైద్య పరికరాల రంగం స్వయం సమృద్ధి సాధించేలా, ఒడుదుడుకులను సమర్థంగా ఎదుర్కొంటూ పటిష్టమైన పరిశ్రమగా ఎదిగేలా అవసరమైన మద్దతు కల్పించి, దిశా నిర్దేశం చేసేందుకు ఈ పాలసీ ఉపయోగపడనుంది. ప్రధానంగా పేషంట్లను దృష్టిలో ఉంచుకుని, వారి అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులను తయారు చేస్తూ వైద్య పరికరాల రంగం వేగవంతంగా వృద్ధి చెందేలా ఊతమివ్వాలని ఇందులో నిర్దేశించుకున్నారు. 11 బిలియన్ డాలర్ల పరిశ్రమ.. దేశీయంగా వైద్య పరికరాల మార్కెట్ 2020లో 11 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 90,000 కోట్లు) స్థాయిలో ఉందని అంచనా. అంతర్జాతీయంగా మెడికల్ డివైజ్‌ల మార్కెట్లో మన వాటా దాదాపు 1.5% వైద్య పరికరాల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా కేంద్రం ఇప్పటికే ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకాన్ని అమలు చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్‌లో 4 మెడికల్ డివైజ్ పార్క్‌ల ఏర్పాటు కోసం తోడ్పాటు అందిస్తోంది. ఈ స్కీము కింద ఇప్పటివరకు రూ. 1,206 కోట్ల విలువ చేసే పెట్టుబడులతో 26 ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. 37 ఉత్పత్తులను తయారు చేసే 14 ప్రాజెక్టులు ప్రారంభమైనట్లు వివరించింది. వీటిలో లీనియర్ యాక్సిలరేటర్, ఎంఆర్ఐ స్కాన్, సీటీ–స్కాన్, మామోగ్రామ్, సీ–ఆర్మ్, ఎంఆర్ఐ కాయిల్స్, అధునాతన ఎక్స్–రే ట్యూబ్స్ మొదలైనవి ఉత్పత్తి చేస్తున్నారు. -
కాకినాడ జీజీహెచ్‌లో ఎంసీహెచ్ భవనం
సాక్షి, అమరావతి: కాకినాడ జీజీహెచ్‌లో రూ.42 కోట్లతో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ (ఎంసీహెచ్) బ్లాక్ నిర్మించడంతో పాటు వైద్యపరికరాల్ని ఏర్పాటు చేసేందుకు రంగరాయ వైద్యకళాశాల అల్యుమ్ని ఆఫ్ నార్త్ అమెరికా (ఆర్–ఎమ్‌కానా) ప్రతినిధులు ముందుకొచ్చారు. మంగళగిరిలోని వైద్యశాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సమక్షంలో డీఎంఈ డాక్టర్ వినోద్‌కుమార్, ఆర్–ఎమ్‌కానా ప్రతినిధులు ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా వైద్యరంగంలో సీఎం జగన్ ఆస్పత్రుల బలోపేతం, కొత్త వైద్యకళాశాలలు నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న తీరుకు స్ఫూర్తిగా తాము ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణానికి ముందుకొచ్చామని ఆర్–ఎంకానా ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే రూ.20 కోట్లతో కాకినాడ జీజీహెచ్‌లో ఎంసీహెచ్ భవనం గ్రౌండ్, మొదటి ఫ్లోర్లను నిర్మించామని, మిగిలిన భవన నిర్మాణం పూర్తిచేయడంతో పాటు అన్ని వసతులతో 18 నెలల్లో ఎంసీహెచ్ బ్లాక్‌ను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. అధునాతన సౌకర్యాలతో కూడిన మాతాశిశు సంరక్షణ సేవలు, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఈ బ్లాక్‌లో అందుబాటులోకి వస్తాయన్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో 12 లేబర్ టేబుళ్లు , 40 పడకల యాంటీనేటల్ వార్డు, రెండు ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లు, మొదటి ఫ్లోర్లో 75 పడకల పోస్ట్‌నేటల్ వార్డు, రెండో ఫ్లోర్లో రెండు అధునాతన ఎలక్టివ్ ఆపరేషన్ థియేటర్లు, మూడు, నాలుగు ఫ్లోర్లలో నియోనేటల్ వార్డు, వెంటిలేటర్, ఫొటోథెరపీ వంటి సౌకర్యాలు సమకూరతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్–ఎంకానా వ్యవస్థాపకులు, రంగరాయ వైద్యకళాశాల రెండోబ్యాచ్‌కు చెందిన డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, డాక్టర్ పాలడుగు రాంబాబు, డాక్టర్ ఎస్.వి.లక్ష్మీనారాయణ, కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమలత పాల్గొన్నారు. ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణానికి ముందుకొచ్చిన ఆర్–ఎంకానా ప్రతినిధులకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, కృష్ణ బాబు కృతజ్ఞతలు తెలిపారు. -
వైద్య పరికరాల పరిశ్రమకు ఊతమివ్వండి
సాక్షి, హైదరాబాద్: వైద్య పరికరాల మార్కెట్లో ప్రపంచంలోనే టాప్–20లో భారత్ నాలుగో స్థానంలో ఉందని, ఈ పరిశ్రమకు మరింత ఊతమివ్వాల ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. ఈ సందర్భంగా దేశంలో వైద్య పరికరాల పరిశ్రమను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. గత ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో బయో ఆసియా 20వ వార్షికోత్సవ ఎడిషన్‌ను విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని తెలియజేశారు. ఇందులో భాగంగా వైద్య పరికరాల అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వివిధ కంపెనీల సీఈవోలు, వైద్యరంగ నిపుణులు, అసోసియేషన్ ప్రతినిధులు లేవనెత్తిన అంశాలను లేఖలో ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జీఎస్టీ కారణంగా వైద్య పరికరాల పరిశ్రమ ఎదుర్కొంటున్న పరిణామాలు, ప్రత్యామ్నాయ దిగుమతి విధానాలు, మేక్ ఇన్ ఇండియాపై విలోమ సుంకం ప్రభావం, మౌలిక సదుపాయాలు, ముడిసరుకు లభ్యత మొదలైన అంశాలను ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కస్టమ్ డ్యూటీతోపాటు వైద్య పరికరాల విడిభాగాలపై జీఎస్టీ కూడా పరికరాల కంటే ఎక్కువ రేటుతో వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, దేశంలోని వైద్య పరికరాల ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ప్రజలకు తక్కువ ధరకే వైద్యం అందించాలన్న దేశ మౌలిక లక్ష్యానికి భిన్నంగా ఇది ఉందన్నారు. ‘వైద్య పరికరాలు విలాసవంతమైన వస్తువులు కావు. ఆరోగ్య సంరక్షణను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి పరికరాలు, డయాగ్నొíస్టిక్స్ కీలకమని గుర్తించాలి. వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్స్పై ప్రస్తుతం విధిస్తున్న 18% జీఎస్టీని తగ్గించాలి. వైద్య పరికరాలపై 12%, డయాగ్నొస్టిక్స్‌పై 5 శాతం మేరకు జీఎస్టీని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా’అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, ఇతర ఎల్రక్టానిక్ భాగాలు, ఎల్ఈడీ మానిటర్లు, ప్యానెల్ డిస్ప్లే యూనిట్లు, బ్యాటరీ, సెమీకండక్టర్లు, మెకాట్రానిక్స్ మొదలైన వైద్య పరికరాల విడిభాగాల తయారీలో దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడానికి తీసుకోవలసిన చర్యలను వివరించారు. దీన్ని ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌లో అధునాతన పరికరాలు యంత్రాలతో మెడికల్ ఇమేజింగ్ హబ్‌ను, మెడికల్ డివైజెస్ పార్క్‌ను కేంద్రం భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు. -
జపాన్ మెరుగైన ప్రత్యామ్నాయం
న్యూఢిల్లీ: కీలకమైన వైద్య పరికరాల దిగుమతుల కోసం భారత్‌కు చైనా కంటే జపాన్ మెరుగైన ప్రత్యామ్నాయమని మెడికల్ టెక్నాలజీ అసోసియేష్ ఆఫ్ ఇండియా (ఎంటాయ్) పేర్కొంది. ఇతర దేశాల మాదిరే భారత్ సైతం తన మెడికల్ టెక్నాలజీ అవసరాల కోసం ప్రధానంగా అమెరికా, జపాన్, యూరప్, బ్రిటన్, చైనా, సింగపూర్ దేశాలపై ఆధారపడి ఉన్నట్టు గుర్తు చేసింది. చైనా నుంచి మెడికల్ టెక్నాలజీ దిగుమతుల విలువ పెరుగుతుండడం ఆందోళనకరమని, ప్రాధాన్య ప్రాతిపదికన ప్రత్యామ్నాయాలను గుర్తించాల్సిన అవసరం ఉందని సూచించింది కొన్ని రకాల వైద్య పరికరాలకు భారత్ తగినంత తయారీ సామర్థ్యాన్ని సమకూర్చుకుందని చెబుతూ.. క్లిష్టమైన సాంకేతికతతో కూడిన ఉపకరణాల కోసం దిగుమతులపైనే ఆధారపడి ఉన్నట్టు తెలియజేసింది. నాణ్యమైన, అత్యాధునిక వైద్య పరికరాల దిగుమతులు కష్టమేమీ కాబోదంటూ.. చైనా నుంచి ఈ తరహా ఉత్పత్తుల విలువ పెరగడం ఒక్కటే ఆందోళన కలిగిస్తున్నట్టు ఎంటాయ్ చెప్పింది. చైనా–భారత్ మధ్య గత మూడేళ్లుగా సరిహద్దు, ద్వైపాక్షిక విభేదాలు నెలకొనడం తెలిసిందే. అయినా కానీ కీలకమైన వైద్య పరికరాల దిగుమతుల విలువ 2020–21లో 327 బిలియన్ డాలర్ల నుంచి 2021–22లో 515 బిలియన్ డాలర్లకు విస్తరించింది. ‘‘వైద్య పరికరాలు, విడిభాగాల దిగుమతులు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద పలు ప్రోత్సాహకాలను ఇప్పటికే ప్రకటించడం విలువైన చర్యే. కానీ, ఇది ఫలితాలను ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఆలోపు భారత్ అత్యవసరంగా చైనాకు ప్రత్యామ్నాయాలను చూడాలి’’అని ఎంటాయ్ చైర్మన్ పవన్ చౌదరి పేర్కొన్నారు. -
వైద్య పరికరాల పరిశ్రమలకు చేయూత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య పరికరాల తయారీ పరిశ్రమ అభివృద్ధి కోసం సరైన విధానాన్ని తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని.. ఈ రంగానికి తగిన చేయూతనిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కె.తారకరామారావు హామీ ఇచ్చారు. ‘బయో ఆసియా 2023’ సదస్సులో భాగంగా ఆదివారం హెచ్ఐసీసీలో దేశంలోని 20 ప్రముఖ వైద్య పరికరాల తయారీ కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మంత్రి కేటీఆర్ అందులో పాల్గొని మాట్లాడారు. దేశంలో వైద్య పరికరాల తయారీ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలు, పారిశ్రామిక సానుకూలతలను వైద్య పరికరాల తయారీ కంపెనీల ప్రతినిధులకు వివరించారు. కాగా దేశంలో వైద్య పరికరాల తయారీ రంగానికి అవసరమైన ప్రోత్సాహం, ఈ రంగం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించారు. ఇందులో మెడ్‌ట్రానిక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ బ్లాక్ వెల్, రాజీవ్‌నాథ్ (ఎండీ, హిందుస్థాన్ సినర్జీస్), ఆదిత్య బెనర్జీ (ఎండీ, బీబ్రౌన్ మెడికల్ ఇండియా), సుమీత్‌భట్ (సీఈవో, ట్రైవిట్రాన్ హెల్త్‌కేర్), శిశిర్ అగర్వాల్ (ఎండీ, టెరుమో ఇండియా), భార్గవ్ కోటాడియా (షాజహాన్ మెడికల్ టెక్నాలజీస్), సచిన్ గార్గ్ (డైరెక్టర్, ఇన్నోవేషన్ ఇమేజింగ్ టెక్నాలజీస్), జతిన్ మహాజన్ (ఎండీ, జె.మిత్రా) సహా ఇరవై ప్రముఖ వైద్య పరికరాల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
వైద్య రంగానికి దిక్సూచి.. మెడ్‌టెక్ జోన్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్.. వైద్య ఉపకరణాల తయారీలో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ఈ సంస్థ.. ఇప్పుడు ప్రపంచస్థాయి ఆవిష్కరణలకు, సంస్థలకు కూడా కేరాఫ్‌గా మారింది. వైద్య రంగానికే దిక్సూచిలా మారుతోంది. కోవిడ్ సమయంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్స్‌ని తయారు చేసి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్న మెడ్ టెక్ జోన్ అదే జోరును కొనసాగిస్తోంది. వైద్య రంగంలో ప్రపంచంలోనే మొట్టమొదటి డేటా సెంటర్ ఇటీవల ఇక్కడ ప్రారంభమైంది. రెండు రోజుల క్రితం ప్రపంచస్థాయి గామా రేడియేషన్ సెంటర్ కూడా ప్రారంభమైంది. ఇలాంటి విప్లవాత్మక సంస్థలు ఎన్నో ఈ జోన్లో చోటు కోసం క్యూ కడుతున్నాయి. కరోనాను ఎదుర్కోవడంలో.. కరోనా వైరస్ విజృంభించిన సమయంలో ఆ మహమ్మారిని సమర్ధంగా ఎదుర్కోవడానికి అవసరమైన కిట్లు, ఉపకరణాలను మెడ్‌టెక్ జోన్ అందించింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్లని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత మోల్బియో డయాగ్నోస్టిక్స్ కిట్లు, వెంటిలేటర్లు, థర్మల్ స్కానర్ల ఉత్పత్తి చేపట్టింది. ప్రపంచ దేశాలకు అవసరమైన పలు ఉపకరణాలను అందించింది. ప్రతి రోజూ 100 వెంటిలేటర్లు, 500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 10 లక్షల ఆర్టీపీసీఆర్ కిట్లు తయారు చేసేది. దీంతో ప్రపంచం దృష్టి మెడ్‌టెక్ జోన్‌పై పడింది. పరిశోధనలు, ఆవిష్కరణలు: ప్రస్తుతం మెడ్‌టెక్ జోన్లో 100 సంస్థలు వైద్య పరికరాల ఉత్పత్తి, పరిశోధనలు చేపడుతున్నాయి. ఎప్పటికప్పుడు అత్యాధునిక వైద్యానికి అవసరమైన పరికరాలు, ఉత్పత్తుల్ని తయారు చేయడంలో ప్రపంచంలోనే ఈ జోన్ ముందు వరసలో నిలుస్తోంది. ఎమ్మారై పరికరాల్లో ఉపయోగించే మాగ్నెట్స్‌లో అత్యుత్తమ ఫలితాల్ని తక్కువ కాలంలోనే అందించేలా సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని ఇటీవలే తయారు చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1.5 టెస్లా ఎమ్మారై కండక్టింగ్ మాగ్నెట్స్‌ని మాత్రమే వినియోగిస్తున్నారు. ఇక్కడ మాత్రం మరింత శక్తివంతమైన సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని తయారు చేస్తున్నారు. ఎమ్మారైని తయారు చేసే సంస్థకు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తుండటం విశేషం. మరోవైపు.. దేశవ్యాప్తంగా ఆస్పత్రులు, గ్రామీణ కేంద్రాలకు టెలీ రేడియాలజీ సేవలు అందించేందుకు టెలీ రేడియాలజీ సొల్యూషన్స్ (టీఆర్ఎస్) కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దీని ద్వారా 70 శాతానికిపైగా గ్రామీణ ప్రాంత ప్రజలు రేడియాలజీ సేవల కోసం పట్టణాలు, నగరాలకు పరుగులు తీయాల్సిన అవసరం ఉండదు. ప్రపంచస్థాయి గామా రేడియేషన్ సెంటర్ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్బీ) మార్గదర్శకాల మేరకు మెడ్ టెక్‌లో ప్రపంచస్థాయి గామా రేడియేషన్ సెంటర్‌ని రెండు రోజుల క్రితం ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేక రేడియేషన్ సెంటర్‌ని ఏర్పాటు చేశారు. వైద్యం, వ్యవసాయం, సీ ఫుడ్‌లో నాణ్యమైన ఎగుమతులకు గామా రేడియేషన్ సేవల కేంద్రం ఉపయోగపడుతుంది. ఇందుకోసం కోబాల్ట్–60ని ఉపయోగించనున్నట్లు మెడ్‌టెక్ జోన్ ప్రతినిధులు తెలిపారు. దిగుమతుల నుంచి ఎగుమతులకు.. గతంలో భారత్.. ఏటా రూ.50 వేల కోట్ల విలువైన వైద్య పరికరాలు దిగుమతి చేసుకునేది. ఎప్పుడైతే.. ఏపీ మెడ్‌టెక్ జోన్లో ఉపకరణాల ఉత్పత్తి జోరందుకుందో.. ఈ పరిస్థితి మారిపోయింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే కోట్లాది రూపాయల విలువైన అత్యాధునిక యంత్రాలు ఇక్కడే తయారవుతున్నాయి. ఎమ్మారై యంత్రాలను దిగుమతి చేసుకోవాలంటే రూ.4.5 కోట్లు ఖర్చవుతుంది. మెడ్‌టెక్‌లో కేవలం రూ.98 లక్షలకే వీటిని తయారు చేస్తున్నారు. దీనివల్ల అత్యాధునిక ఎమ్మారై స్కానర్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఒక్కో యంత్రానికి దాదాపు రూ.3.5 కోట్లు ఆదా అవుతుంది. తద్వారా ఎంతో విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. మరిన్ని ఆస్పత్రులు ఎమ్మారై యంత్రాలను ఏర్పాటు చేసుకొనే వెసులుబాటు కలిగింది. ప్రపంచంలోనే తొలిసారిగా.. హెల్త్ క్లౌడ్ వైద్య పరికరాల పరిశ్రమల అవసరాల్ని తీర్చేందుకు డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా మెడ్‌టెక్ జోన్ మరో అడుగు ముందుకు వేసింది. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్ టెల్ కార్పొరేషన్‌తో కలిసి కొద్ది నెలల క్రితం ప్రపంచంలోనే తొలిసారిగా వైద్య రంగానికి సంబంధించి హెల్త్ క్లౌడ్ని రూపొందించింది. డిజిటల్ ఆరోగ్య సేవలు, ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ అలయన్స్, రేడియాలజీ ఇమేజింగ్ సర్వీసులు, హెల్త్ డిజిటల్ డేటా.. ఇలా భిన్నమైన ఆరోగ్య సేవల్ని అనుసంధానించేలా డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి. ఈ డేటా సెంటర్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు హెల్త్ కేర్ సౌకర్యాలు అందనున్నాయి. ప్రస్తుతం ఈ హెల్త్ క్లౌడ్ అభివృద్ధి దశలో ఉంది. త్వరలోనే పూర్తిస్థాయి సేవలు అందనున్నాయి. ఎంఎస్ఎంఈతో ఒప్పందం ఆరోగ్య రంగంలో సహకారం కోసం కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ ఆధీనంలో ఉన్న ఎంఎస్ఎంఈతోనూ మెడ్‌టెక్ జోన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆరోగ్య రంగంలోని ఎంఎస్ఎంఈల మధ్య పోటీతత్వం పెంచేందుకు ఈ ఒప్పందం ఉపయుక్తం కానుంది. ఇలా.. విభిన్న రీతుల్లో విప్లవాత్మకమైన వైద్య పరికరాల్ని ప్రపంచానికి అందించేలా.. వైద్య పరికరాల తయారీ, ఎగుమతుల్లో భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు మెడ్‌టెక్ జోన్ కృషి చేస్తోంది. -
ఏపీ మెడ్‌టెక్ జోన్ నుంచి ఎంఆర్ఐ పరికరాలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వైద్య ఉపకరణాల ఉత్పత్తికి వేదికగా నిలుస్తూ ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ మరో అత్యాధునిక ఆవిష్కరణకు కేంద్ర బిందువుగా మారింది. ఎంఆర్ఐ పరికరాల్లో ఉపయోగించే మాగ్నెట్స్‌లో అత్యుత్తమ ఫలితాలను తక్కువ కాలంలోనే అందించేలా సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని తయారు చేసింది. మెడ్‌టెక్ జోన్ నుంచే పరికరాల ఉత్పత్తి, పరీక్షలు, అభివృద్ధి జరగడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్ఐ)ని అత్యంత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం, రేడియో తరంగాలను ఉపయోగించడంపై ఆధారపడి ఉంటుంది. ఛాతీ, ఉదరం, మెదడు, వెన్నెముక లేదా కటి ప్రాంతంతో సంబంధం ఉన్న అనేక భాగాల ఆరోగ్య స్థితిగతుల్ని తెలుసుకునేందుకు ఎంఆర్ఐ తీస్తారు. ఎంఆర్ఐ స్కానర్ల నుంచి వచ్చే అయస్కాంత క్షేత్రాలు, రేడియో తరంగాలు శరీర కణజాలాల్లో ఉండే ప్రోటాలతో జరిపే పరస్పర చర్య ద్వారా ఆ భాగానికి సంబంధించిన చిత్రాన్ని తీస్తుంది. ఈ స్కాన్ ఆధారంగా.. ఆరోగ్య సమస్యల్ని వైద్యులు నిర్థారిస్తుంటారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 1.5 టెస్లా ఎంఆర్ఐ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని మాత్రమే వినియోగిస్తున్నారు. కానీ.. ఏపీ మెడ్‌టెక్ జోన్లో మాత్రం ఎంఆర్ఐలలో అత్యంత కీలకమైన పరికరంగా పరిగణించే సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని మరింత శక్తివంతంగా తయారు చేశారు. దీని ద్వారా ఎంఆర్ఐ స్కానింగ్ తీసే సమయం మరింత తగ్గే అవకాశం ఉందని మెడ్‌టెక్ వర్గాలు వెల్లడించాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని ఉత్పత్తి చేయడమే కాకుండా.. మెడ్‌టెక్ జోన్లోనే పరీక్షలు నిర్వహించడంతో పాటు.. పరికరాలనూ అభివృద్ధి చేశారు. ఎంఆర్ఐ స్కానర్‌ను తయారు చేసే అసలు తయారీదారులకు అత్యంత కీలక భాగమైన సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని విశాఖ నుంచే ఎగుమతి చేస్తున్నారు. -
వైద్య పరికరం పాడైతే ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు
సాక్షి, హైదరాబాద్: మీరు వెళ్లిన ప్రభుత్వాస్పత్రిలో ఎక్స్‌రే మెషీన్ పనిచేయడం లేదా? బయట ఎక్స్‌రే తీయించుకోమని చెబుతున్నారా? ఇటువంటి డయాగ్నొస్టిక్ దళారుల దందాకు చెక్ చెప్పేలా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి పరికరం పాడైపోయినా ఎవరైనా సరే వెంటనే ఫిర్యాదు చేసేందుకు 8888 526666 నంబర్‌ను అందుబాటులోకి తీసుకొ చ్చింది. రాష్ట్రంలో తొలిసారిగా రూ.20 కోట్లతో ‘బయో మెడికల్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్’పేరుతో వైద్య పరికరాల నిర్వహణకు విధానాన్ని వైద్య ఆరోగ్యశాఖ రూపొందించింది. ఇందులోభాగంగా వైద్య పరికరాల నిర్వహణకు ప్రత్యేకంగా ప్రోగ్రాం మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ను తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ)లో ఏర్పాటు చేసింది. వైద్య పరికరాల వివరాలన్నీ వెబ్ పోర్టల్‌లో నమోదై ఉంటాయి. అవి ప్రస్తుతం ఏ ఆస్పత్రుల్లో ఉన్నాయి.. తయారీ తేదీ...వారంటీ తేదీ...గతంలో జరిగిన మరమ్మతుల వివరాలు, ప్రస్తుత మెయింటెనెన్స్ కాంటాక్ట్ వివరాలు అందులో ఉంటాయి. రూ.5 లక్షలకు పైగా విలువైన అన్ని రకాల వైద్య పరికరాలు ఏవైనా పాడైతే వెంటనే డాక్టర్ కానీ, రోగికానీ ఇతరులెవరైనా https://emmstelangana.uat. dcservices.in/ లేదా 8888 526666 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు అందగానే పీఎంయూ సంబంధిత రిపేర్ కాంట్రాక్ట్ ఏజెన్సీకి సమాచారం అందించి, నిర్ణీత సమయంలోగా మరమ్మతు చేయిస్తుంది. అనంతరం ఆ వైద్య పరికరం బాగైనట్లుగా పీఎంయూలో కనిపిస్తుంది. ఏజెన్సీ నిర్ణీత సమయంలోగా మరమ్మతు చేయని పక్షంలో టెండర్ అగ్రిమెంట్ ప్రకారం చర్యలు తీసుకుంటారు. -
వైద్య ఉపకరణాల తయారీ కేంద్రంగా నగరం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశానికి హైదరాబాద్ వైద్య ఉపకరణాల తయారీ కేంద్రంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. నరాలు, గుండె జబ్బులకు సంబంధించిన అత్యాధునిక వైద్య ఉపకరణాల తయారీ సంస్థ ఎస్3వీ వాస్క్యులార్ టెక్నాలజీస్ సంస్థ సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్కులో రూ.250 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఎస్3వీ వాస్క్యులార్ టెక్నాలజీస్ ప్రతినిధులు గురువారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వైద్య ఉపకరణాల పార్కులో 2017 నుంచి ఇప్పటివరకు సుమారు రూ.1,500 కోట్ల పెట్టుబడులతో పాటు 7 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించాయన్నారు. 302 ఎకరాల్లో విస్తరించి ఉన్న మెడికల్ డివైజెస్ పార్కులో పెట్టుబడులకు మంచి స్పందన లభిస్తోందని, ఇప్పటివరకు 50కి పైగా కంపెనీలు పెట్టుబడులతో ముందుకు వచ్చి తయారీ, పరిశోధన, అభివృద్ధి యూనిట్లు ఏర్పాటు చేశాయన్నారు. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలు, తయారీ రంగంలో వైద్య ఉపకరణాల పార్కును బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని కేటీఆర్ అన్నారు. రూ.250 కోట్లతో తాము నెలకొల్పే యూనిట్ ద్వారా 500 మందికి ప్రత్యక్షంగా, మరో 250 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఎస్3వీ వాస్క్యులార్ టెక్నాలజీస్ ప్రమోటర్, డైరెక్టర్ బదరీ నారాయణ్ వెల్లడించారు. కేటీఆర్‌తో బదరీ నారాయణ్, విజయగోపాల్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రాష్ట్ర లైఫ్‌సైన్సెస్, ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. -
CM YS Jagan: ఆసక్తిగా.. ఆరా!
సాక్షి, అమరావతి: తన క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం స్వయంగా పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రూ.426 కోట్ల వ్యయంతో ఏర్పాటైన 144 పీఎస్ఏ ప్లాంట్ల ప్రారంభం సందర్భంగా దాదాపు 20 రకాలకు పైగా హైఎండ్ మెడికల్ ఎక్విప్మెంట్ పనితీరును సీఎం ఆసక్తిగా పరిశీలించారు. మెడికల్ కాలేజీల నిర్మాణ పనుల్లో పురోగతి, పీఎస్ఏ ప్లాంట్ల ఫోటో గ్యాలరీని తిలకించారు. చదవండి: Andhra Pradesh: లక్షణంగా ఆరోగ్యం -
ఆన్లైన్ వ్యాపారం ముసుగులో భారీ సైబర్ మోసం
విజయవాడ స్పోర్ట్స్: ఆన్లైన్ వైద్య పరికరాల వ్యాపారం ముసుగులో జరుగుతున్న సైబర్ మోసం విజయవాడలో వెలుగు చూసింది. నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి మోసపోయామంటూ శనివారం సాయంత్రం సైబర్, సూర్యారావుపేట పోలీసులను ఆశ్రయించారు. ఈ ఏడాది జూన్ చివరి వారంలో టెలివియా అనే సంస్థ లవ్‌లైఫ్ అండ్ న్యాచురల్ హెల్త్‌కేర్ పేరుతో ప్రత్యేకమైన యాప్‌ను రూపొందించి ఆన్లైన్లో వైద్య పరికరాల విక్రయం ప్రారంభించింది. ఈ యాప్‌లో ఉన్న వైద్య పరికరాలను కొనుగోలు చేయండి.. సదరు పరికరాలను మేమే అద్దెకు ఇచ్చి, వచ్చిన లాభాన్ని మీకు ఇస్తామనే బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కరోనా సమయంలో వైద్య పరికరాలకు గిరాకీ పెరిగిన నేపథ్యంలో ఈ వ్యాపారంలో పెట్టుబడి పెడితే లక్షలు ఆర్జించవచ్చనే ఆశతో ఎంతో మంది ఈ యాప్‌ను డౌన్‌లోన్ చేసుకుని వైద్య పరికరాలపై పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న పెట్టుబడిదారులతో 372 టెలిగ్రాం గ్రూపులను (ఒక్కో గ్రూపునకు 250 మంది సభ్యులు) ఏర్పాటు చేసి వ్యాపారం లావాదేవీలను ఎప్పటికపుడు అప్డేట్ చేశారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో వచ్చిన లాభాలను ఎప్పటికప్పుడు పెట్టుబడిదారులకు ఇచ్చేయడంతో పాటు తరుచూ గిఫ్ట్ కూపన్లను ఇవ్వడంతో వేలాది మంది ఈ వ్యాపారం పట్ల ఆకర్షితులయ్యారు. ఒక్కొక్కరు రూ.లక్షల్లో నగదును నిర్వాహకులకు యూపీఐ (ఫోన్ పే, గూగుల్ పే) ద్వారా పంపారు. ఈ నెల 19వ తేదీ నుంచి సంస్థ బోర్డ్ తిప్పేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నగర ప్రజల నుంచి ఈ సంస్థ కోట్లాది రూపాయలు వసూలు చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించి, విచారణ చేస్తున్నామని సైబర్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
హైదరాబాద్ సిగలో మరో నగ.. దేశంలోనే అతి పెద్ద మెడికల్ ఇండస్ట్రియల్ పార్కు
దేశంలోనే అతి పెద్దదైన మెడికల్ డివైజ్ ఇండస్ట్రియల్ పార్కు హైదరాబాద్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. నగర శివారులోని సుల్తాన్‌పూర్‌లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఏడు మెడికల్ డివైజ్ ఇండస్ట్రీస్‌ని మంత్రి కేటీఆర్ డిసెంబరు 15న ప్రారంభించనున్నారు. నాలుగేళ్ల కిందట ఈ పార్కుకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మెడికల్ హబ్‌గా ప్రొమియా థెరాప్యూటిక్స్, హువెల్ లైఫ్ సైన్సెస్, ఆకృతి ఒకులోప్లాస్టీ, అర్కా ఇంజనీర్స్, ఎస్వీపీ టెక్నో ఇంజనీర్స్, ఎల్వికాన్ అండ్ డీస్మెడిలైఫ్ సంస్థలు తమ ఫ్యా్టక్టరీలను నేడు ప్రారంభించనున్నాయి. దీంతో ఫార్మా సెక్టార్‌కే కాకుండా మెడికల్ డివైజెస్‌కి కూడా హైదరాబాద్ హబ్‌గా మారనుంది. తయారయ్యేవి ఇవే మెడికల్ రంగానికి సంబంధించి కేర్ డివైజెస్, విట్రో డయాగ్నోస్టిక్ పరికరాలు, అనలైజర్స్, ఒక్యులర్ ఇంప్లాంట్స్, సర్జికల్, డెంటర్ ఇంప్లాంట్స్, డ్రెసింగ్ తదితర మెడికల్ ఉత్పత్తులు ఈ ఫ్యాక్టరీల నుంచి రాబోతున్నాయి. 1300ల మందికి ఉపాధి ఈ మెడికల్ డివైజ్ పార్కులో ప్రస్తుత పెట్టుబడులు రూ.265 కోట్లకు చేరుకోగా ప్రత్యక్షంగా 1300ల మందికి ఉపాధి లభిస్తుంది. 2030 నాటికి హైదరాబాద్‌లో లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీస్ విలువల వన్ బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన భారతదేశంలోనే అతిపెద్ద వైద్య పరికరాల తయారీ పార్కు (మెడికల్ డివైజెస్ పార్క్) సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఒకే రోజు ఏడు కంపెనీలను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి @KTRTRS గారు ప్రారంభించనున్నారు. #TriumphantTelangana pic.twitter.com/cnJhPOZO8L — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) December 15, 2021 చదవండి:Hyderabad: ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ విస్తరణ.. కొత్తగా మరో డెలివరీ సెంటర్ -
చైనా ఉత్పత్తులపై చర్యలు తీసుకోకుంటే.. మన వాళ్లకు కష్టమే !
న్యూఢిల్లీ: చౌకగా వచ్చి పడుతున్న చైనా వైద్య పరికరాల ముందు దేశీ పరిశ్రమ వెలవెలబోతోంది. కరోనా మహమ్మారి ఉధృత రూపం చూపించిన సమయంలో.. వైద్య ఉత్పత్తులకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. దీంతో దేశీ పరిశ్రమ తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంది. కానీ, ఇప్పుడు సరైన అమ్మకాల్లేక 33 శాతం సామర్థ్యాన్ని వినియోగించుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా కన్జ్యూమబుల్స్, డిస్పోజబుల్స్, తక్కువ ధరలతో కూడిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలు మరింత ప్రతికూలతలను చూవిచూస్తున్నాయి. ఇదీ పరిస్థితి.. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైజెస్ ఇండస్ట్రీ (ఏఐఎంఈడీ) గణాంకాలను పరిశీలిస్తే.. కరోనా రాక ముందు ఏటా 6.24 మిలియన్ల పీపీఈ కిట్ల ఉత్పత్తి దేశీయంగా నడిచేది. కానీ, ఈ ఏడాది జూన్ నాటికి పీపీఈ కిట్ల సామర్థ్యం 234 మిలియన్ పీసులకు పెరిగింది. 3,360 వెంటిలేటీర్ల తయారీ సామర్థ్యం నుంచి 7,00,000 వెంటిలేటర్లకు పెరిగింది. మాస్క్‌ల ఉత్పత్తి అయితే ఏకంగా 31 కోట్ల నుంచి 355 కోట్లకు పెరిగిపోయింది. ‘‘కరోనా రెండో విడత విరుచుకుపడిన ఈ ఏడాది మార్చి–ఏప్రిల్‌లో కంపెనీలు పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేశాయి. అయినా కానీ కొంత కొరత నెలకొంది’’ అని ఏఐఎంఈడీ ఫోరమ్ కోర్డినేటర్ రాజీవ్‌నాథ్ తెలిపారు. కానీ, ఇప్పుడు 40 శాతం ఉత్పత్తి సామర్థ్యమే నడుస్తోందని చెప్పారు. చెన్నైకు చెందిన మాస్క్‌ల తయారీ కంపెనీ శాన్సిఫి అయితే మూడింత ఒక వంతు ఉత్పత్తి సామర్థ్యాన్నే (ఎగుమతులతో కలసి) ప్రస్తుతం వినియోగించుకోగలుగుతున్నట్టు సంస్థ సీఈవో సుధీర్‌రెడ్డి తెలిపారు. కరోనా సమయంలో మిలియన్ డాలర్లతో సామర్థ్యాన్ని పెంచుకున్నామని, ఇప్పుడు స్థిర వ్యయాలే భారంగా మారినట్టు చెప్పారు. ‘‘పరిస్థితి ఇదే మాదిరిగా మరో ఆరు నెలలు కొనసాగితే అప్పుడు మెషినరీని విక్రయించడం లేదంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు’’ అని సుధీర్‌రెడ్డి అన్నారు. దిగుమతుల పాత్ర.. ఒకవైపు కొంత డిమాండ్ తగ్గిన మాట వాస్తవమే కానీ, దేశీయ పరిశ్రమ సామర్థ్యం మేరకు పనిచేయకపోవడానికి చైనా నుంచి వస్తున్న చౌక దిగుమతులు కూడా కారణమేనని పరిశ్రమ అంటోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో చైనా నుంచి వైద్య పరికరాల దిగుమతులు 75 శాతం పెరిగాయి. భారత్‌కు వైద్య పరికరాల ఎగుమతిదారుల్లో చైనానే ముందుంటోంది. అమెరికా, జర్మనీలు వెనుకనే ఉన్నాయి. మన దేశ అవసరాల్లో 80 శాతం పరికరాలను దిగుమతి చేసుకుంటున్నట్టు (సుమారు రూ45,000 కోట్ల విలువైన) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ స్కీమ్) కింద దేశీయంగా వైద్య పరికరాల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కానీ, ఇప్పటికే తయారీ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి ఎదుర్కొంటుంటే.. పీఎల్ఐ కింద అదనంగా పరిశ్రమలను ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుందన్న ప్రశ్న ఎదురవుతోంది. చైనా నుంచి దిగుమతులు పెరగడం ఆందోళన కలిగించేదిగా రాజీవ్‌నాథ్ అన్నారు. ప్రభుత్వం దేశీ పరిశ్రమను, ఇన్వెస్టర్లను మరింత ప్రోత్సహించే చర్యలతో ముందుకు రావాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. కనీసం కీలకమైన పరికరాలను అయినా పీఎల్ఐ పరిధిలోకి చేర్చాలన్నారు. లేదంటే టారిఫ్‌లతో (దిగుమతి సుంకాలు) అయినా దిగుమతుల నుంచి దేశీ పరిశ్రమకు రక్షణ కల్పించాలని అభిప్రాయపడ్డారు. స్థానిక కంపెనీల్లో ఉత్సాహం కరవు.. వైద్య పరికాల పీఎల్ఐ పథకం కింద ఎక్కువ దరఖాస్తులు బహుళజాతి కంపెనీల నుంచే వచ్చాయని, స్థానిక కంపెనీలు పెద్దగా ముందుకు రాలేదని స్కాన్‌రే టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు ఆల్వ తెలిపారు. ఇన్వేసివ్ వెంటిలేటర్ల తయారీలో స్కాన్‌రే ప్రముఖ సంస్థగా ఉంది. చైనా నుంచి వచ్చే దిగుమతులపై నిషేధం విధించడం లేదంటే టారిఫ్‌లు పెంచడం అంత సులభం కాదని దేశీ వైద్య పరికాల పరిశ్రమ భావిస్తోంది. ‘‘ప్రభుత్వం నిజంగా నిషేధం విధించలేదు. ఎందుకంటే ఈ చర్యతో దేశీ పరిశ్రమ కూడా ఇబ్బందుల పాలవుతుంది. ఎందుకంటే విడిభాగాల కోసం దేశీ పరిశ్రమ చైనాపై ఆధారపడుతోంది. మా స్కాన్‌రే కంపెనీ విషయాన్నే పరిశీలిస్తే.. 80 శాతం విడిభాగాలు స్థానికంగానే సమకూర్చుకుంటున్నాం. అయినప్పటికీ మరో 20 శాతం కీలక విడిభాగాలపై చైనాపై ఆధారపడాల్సిందే. నిషేధిస్తే మేము సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని ఆల్వ వివరించారు. చదవండి: చైనా నుంచి నెమ్మదిగా సైడ్.. భారత్ మార్కెట్ కోసం మైక్రోసాఫ్ట్ మాస్టర్ ప్లాన్ -
Jhonson & Jhonson: ఇంతకాలం కలిసి మెలిసి.. ఇకపై వేర్వేరుగా
ఫార్మా, మెడికల్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఇకపై రెండుగా విడిపోతుంది. ఇంత కాలం జాన్సన్ అండ్ జాన్సన్ కిందనే ఔషధాలు, వైద్య పరికరాలు, ఉత్పత్తులను అందిస్తోంది. ఇకపై ఔషధాలు, మెడికల్ ఉత్పత్తులను వేర్వేరు విభాగాలుగా చేయాలని నిర్ణయించింది. తమ గ్రూపు ద్వారా అందుతున సేవలను విడగొట్టడం ద్వారా మరింత నాణ్యమైన సేవలు వేగంగా అందుతాయనే నమ్మకం ఉందని జాన్సన్ అండ్ జాన్సన్ పేర్కొంది. గ్రూపును రెండుగా విడగొట్టే ప్రక్రియ పద్దెనిమిది నెలల నుంచి రెండేళ్లలోపు పూర్తి చేస్తామని తెలిపింది. అన్ని వివరాలు పూర్తిగా సమీక్షించి తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు గ్రూపు సీఈవో అలెక్స్ గోర్కి వెల్లడించారు. జాన్సన్ అండ్ జాన్సన్‌కి ప్రపంచ వ్యాప్తంగా 1.36 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా పెద్ద కంపెనీలను రెండుగా విడగొడుతున్న సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ, తోషిబాలు ఇటీవల తమ గొడుకు కింద అందున్న సేవలు, ఉత్పత్తులను రెండుగా విడగొడుతున్నట్టు ప్రకటించాయి. వాటి విభజన ప్రక్రియ పూర్తి కాకముందే అదే తరహా ప్రకటన జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి వెలువడింది. -
ఫార్మాలో స్వయం సమృద్ధి..
న్యూఢిల్లీ: దేశీయంగా బల్క్ డ్రగ్స్, వైద్య పరికరాల తయారీని మరింతగా ప్రోత్సహించడంపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా బల్క్ డ్రగ్, మెడికల్ డివైజ్ పార్క్‌లను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన నాలుగు స్కీముల మార్గదర్శకాలను కేంద్రం సోమవారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఫార్మా రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించే విధంగా ఈ స్కీమ్‌లను రూపొందించినట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ విలేకరుల సమావేశంలో తెలిపారు. 53 కీలకమైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ), వైద్య పరికరాల తయారీలో భారత్ స్వయం సమృద్ధి సాధించాలన్నది లక్ష్యమని ఆయన వివరించారు. వీటికి సంబంధించి భారత్ ప్రస్తుతం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి పరిణామాలతో అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలు దెబ్బతిని, దేశీయంగా వైద్యంపై ప్రతికూల ప్రభావాలు పడే పరిస్థితి నెలకొందని మంత్రి చెప్పారు. అయితే, ఫార్మా రంగం, జాతీయ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ క్రియాశీలకంగా వ్యవహరించి ఔషధాల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో లాక్డౌన్ సమయంలోనూ ఇబ్బందులు పడే అవసరం రాలేదన్నారు. ఈ నేపథ్యంలోనే దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని దేశీయంగా ఆయా ఔషధాలు, డివైజ్‌ల ఉత్పత్తిని మరింత పెంచుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోందని మంత్రి చెప్పారు. ‘ప్రస్తుతం దేశీ ఫార్మా రంగ పరిమాణం సుమారు 40 బిలియన్ డాలర్లుగా ఉంది. సరైన తోడ్పాటు అందిస్తే 2024 నాటికి ఇది 100 బిలియన్ డాలర్లకు చేరగలదు. తద్వారా 2025 నాటికల్లా భారత్‌ను 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్య సాధనకు తోడ్పడగలదు‘ అని గౌడ తెలిపారు. ఫార్మా విభాగం రూపొందించిన ఈ స్కీములకు కేంద్ర క్యాబినెట్ ఈ ఏడాది మార్చిలో ఆమోదముద్ర వేసింది. అర్హత ప్రమాణాలను బట్టి ఎంపిక.. పరిశ్రమవర్గాలు, రాష్ట్రాల ప్రభుత్వాలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన మీదట స్కీముల మార్గదర్శకాలు రూపొందించినట్లు గౌడ చెప్పారు. మార్గదర్శకాల్లో పొందుపర్చిన అర్హతా ప్రమాణాల్లో ఆయా ఉత్పత్తి సంస్థలకు వచ్చే మార్కుల ఆధారంగా తయారీ ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) స్కీమునకు ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో ఏర్పాటయ్యే ఈ ఉత్పత్తి పార్కుల్లో అధునాతన ఇన్ఫ్రా, మెరుగైన కనెక్టివిటీ, తక్కువ ధరలకు స్థలం, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు అవసరమైన పటిష్టమైన వ్యవస్థ మొదలైనవన్నీ ఉంటాయని పేర్కొన్నారు. దీనివల్ల కొత్త తయారీ యూనిట్ల ఏర్పాటులో సమయం, పెట్టుబడి వ్యయాలు తగ్గుతాయని వివరించారు. ‘ఈ స్కీములపై కంపెనీల నుంచి సానుకూల స్పందన ఉంటుందని భావిస్తున్నాం. అధునాతన టెక్నాలజీ, పెట్టుబడులను ఈ పార్కులు ఆకర్షించగలవు. కార్యకలాపాలు ప్రారంభమైన రెండు, మూడేళ్లలో ఇవి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల కొద్దీ ఉద్యోగాలను కల్పించగలవు, అలాగే దిగుమతులపై ఆధారపడటం తగ్గించగలవు. గ్లోబల్ ఫార్మా హబ్‌గా భారత్ ఎదిగేందుకు ఉపయోగపడగలవు‘ అని గౌడ చెప్పారు. స్వాగతించిన పరిశ్రమ.. దేశీయంగా బల్క్ డ్రగ్, మెడికల్ డివైజ్‌ల తయారీకి ఊతమిచ్చేందుకు ఉద్దేశించిన స్కీముల మార్గదర్శకాలను పరిశ్రమ స్వాగతించింది. స్కీములు సక్రమంగా అమలైతే 8–10 ఏళ్ల కాలంలో ఏపీఐల తయారీలో భారత్ స్వయం సమృద్ధి సాధించగలదని ఇండియన్ డ్రగ్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐడీఎంఏ) ఈడీ అశోక్ కుమార్ మదన్ తెలిపారు. -
పీఎల్ఐ పథకాలకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: దేశీయంగా వైద్య పరికరాల తయారీని ప్రోత్సహించడానికి రూ.3,420 కోట్ల రూపాయలతో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ప్రధాని ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రూ.400 కోట్లతో మెడికల్ డివైజ్ పార్క్స్ స్కీమ్‌కు ఆమోదం తెలిపింది. పీఐఎల్ పథకం ద్వారా వచ్చే అయిదేళ్లలో రూ.68,437 కోట్ల రూపాయల విలువైన వైద్య పరికరాలను ఉత్పత్తి చేయవచ్చునని కేంద్రం అంచనా వేస్తోంది. జాతీయ ఆరోగ్య మిషన్ ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వీటి ఏర్పాటుకు రూ.3,399.35 కోట్లు అవుతాయని అంచనా. ఈ భేటీ వివరాలను మంత్రి జవదేకర్ వెల్లడించారు. ఎలక్ట్రానిక్ కంపెనీలకు రూ.40,995 కోట్లు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కంపెనీలకు రూ.40,995 కోట్ల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ను ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలిసింది. మేకిన్ ఇండియా హబ్‌ను రూపుదిద్దడం కోసం ఎలక్ట్రానిక్, మెడికల్ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీకి వచ్చే అయిదేళ్లలో రూ.41వేల కోట్లు కేటాయించనున్నారు. దీంతో ఆయా రంగాలకు ఆర్థికంగా ఊతం వచ్చి 2025 నాటికి రూ.10 లక్షల కోట్లు ఆదాయం వస్తుందని కేంద్రం భావిస్తోంది. మరోవైపు పత్తి రైతులకు జరిగిన నష్టాన్ని పూరించడానికి రూ. 1,061 కోట్లు కేటాయించింది. అత్యవసర మందులు, పరికరాలు అందుబాటులో కరోనా నేపథ్యంలో అత్యవసరమైన మందులు, వైద్య పరికరాలను దేశంలో తయారు చేసేందుకు ప్రభుత్వం రూ.14వేల కోట్లను మంజూరు చేసిందని మోదీ తెలిపారు. ఫార్మా సంస్థల యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ మాట్లాడారు. అవసరానికి సరిపడిన ఆర్ఎన్ఏ డయాగ్నోస్టిక్ (కోవిడ్‌ను గుర్తించే) కిట్లను ఉత్పత్తి చేయాలని కోరారు. మందులు, పరికరాలను అవసరాల మేరకు తయారు చేయడంతోపాటు నూతన పరిష్కారాలను కనుగొనాలని కోరారు. కరోనా ముప్పును ఎదుర్కొనేందుకు అవసరమైన మందులు, పరికరాలను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు గాను రూ.14వేల కోట్ల విలువైన పథకాలను ఆమోదించామని మోదీ అన్నారు. -
వుహాన్‌కు భారత్ మందులు
న్యూఢిల్లీ/సియోల్/బీజింగ్: కోవిడ్–19 వైరస్ ప్రభావిత ప్రాంతమైన చైనాలోని వుహాన్ ప్రాంతానికి భారత్ సుమారు 15 టన్నుల మందులను పంపింది. భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన విమానంలో బుధవారం ఈ మందులను తరలించారు. వుహాన్‌కు వెళ్లేందుకు భారత్‌కు చెందిన విమానాలకు అనుమతులివ్వడంలో చైనా కావాలనే ఆలస్యం చేస్తోందని గత వారం భారత్ ప్రకటించడం తెల్సిందే. విమానం తిరిగొస్తూ 80 మంది భారతీయులు, చుట్టుపక్కల దేశాల నుంచి 40 మందిని భారత్‌కు తీసుకురానుంది. విమానంలో మాస్కులు, గ్లోవ్స్, ఇతర అత్యవసర వైద్య పరికరాలను పంపిస్తున్నట్లు తెలిపింది. ద.కొరియాలో కోవిడ్ పైపైకి చైనాలో కోవిడ్–19 (కరోనా వైరస్) బాధితుల సంఖ్య క్రమేపీ తగ్గుతుంటే మరోవైపు దక్షిణ కొరియాలో వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. బుధవారం ఒక్కరోజే 134 మంది కోవిడ్ బారిన పడ్డారు. చైనాలో కోవిడ్ తీవ్రత క్రమేపీ తగ్గుతోంది. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారులు బుధవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మంగళవారం 52 మంది వైరస్సోకి మరణించారు. ఇప్పటివరకూ ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 2715కు చేరుకోగా, వ్యాధితో ఉన్న వారి సంఖ్య 78,064కు చేరింది. -
45 నిమిషాల్లోనే 33 రక్త పరీక్షలు
న్యూఢిల్లీ: రక్త పరీక్షల చేసుకుంటే అన్ని రిపోర్టుల కోసం కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు నిరీక్షించాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బంది లేకుండా 33 రకాల డయోగ్నొస్టిక్స్కు కేవలం 45 నిమిషాల్లోనే గుర్తించి వాటికి సంబంధించిన నివేదికలను అందజేసే అద్భుతమైన వైద్య పరికరాన్ని అమెరికా రిటర్న్ 36 ఏళ్ల కనవ్ కహోల్ కనుగొన్నారు. రక్తపోటు, రక్తంలో సుగర్ లెవల్, హార్ట్ బీట్ రేట్, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం, మూత్రంలో ప్రొటీన్ తదితరాలే కాకుండా మలేరియా, డెంగ్యూ, హెపటైటిస్, హెచ్ఐవీ, టైఫాయిడ్ జబ్బులను కూడా ఈ డివైస్ కొన్ని నిమిషాల్లోనే గుర్తిస్తుంది. ఈ వైద్య పరికరానికి కనవ్ కహోల్ ‘స్వస్త్య స్లేట్’ అని పేరు పెట్టారు. అమెరికాలోని అరిజోన విశ్వవిద్యాలయంలో బయోమెడికల్ ఇన్ఫర్మేటిక్స్ విభాగంలో ఇంజనీరుగా పనిచేసిన కనవ్ తన రంగంలో మాతృదేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో భారత్‌కు తిరిగొచ్చారు. భారత్‌లో ప్రతి 1700 మందికి ఒక్క డాక్టర్ చొప్పున ఉన్నారని, ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం కనీసం 1000 మందికి ఒక్కరు చొప్పున డాక్టర్లు ఉండాలని, ఈ నేపథ్యంలో భారత ప్రజలకు ఆరోగ్య సేవలు సకాలంలో అందాలంటే సాంకేతిక పరికరాల అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని తాను గుర్తించానని కనవ్ మీడియాకు తెలిపారు. అందుకనే తాను ఈ స్వస్త్య స్లేట్‌ను కనుగొనాల్సి వచ్చిందని ఆయన వివరించారు. తాను కనిపెట్టిన ఈ పరికరం ప్రాథమికంగా మొబైల్ ఫ్లాట్‌ఫారమ్‌పై పనిచేస్తుందని, సెల్‌ఫోన్ లేదా ట్యాబ్‌కు బీపీ మానిటర్, ఈసీజీ సిస్టమ్, బ్లడ్ షుగర్ మానిటర్, వాటర్ క్వాలిటీ యూనిట్‌ను అనుసంధామిస్తామని కనవ్ తెలిపారు. అన్ని పరీక్షల ఫలితాలను బ్లూటూత్ లేదా యూఎస్బీ కనెక్షన్ ద్వారా ఆండ్రాయిడ్ మొబైల్ డివైస్‌కు పంపిస్తామని ఆయన తెలిపారు. వేగంగా రక్త పరీక్ష ఫలితాలను కనుగొనాల్సిన డెంగ్యూ, హెపటైటీస్ లాంటి జబ్బులకు ఇది ఎంతో ప్రయోజనకరమని ఆయన చెప్పారు. వైద్యుల అవసరం లేకుండానే 33 రకాల పరీక్షలను నిర్వహించేందుకు ఈ డివైస్ ఆక్సిలరీ నర్స్ మిడ్‌వైఫ్స్ (ఏఎన్ఎం), అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ ఆక్టివిస్ట్స్ (ఆశ)కు ఎంతో ఉపయోగకరమని ఆయన వివరించారు. రక్త పరీక్షల ఫలితాలను నేరుగా రోగులకే కాకుండా వారి సంబంధిత వైద్యులకు కూడా పంపించడం ఈ పరికరం ద్వారా సాధ్యమని కనవ్ తెలిపారు. అంతేకాకుండా రోగులకు ఏ డాక్టర్ వద్దకు వెళ్లాలో కూడా ఫలితాలనుబట్టి సూచించే వెసలుబాటు ఈ పరికరంలో ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ పరికరాన్ని నైజీరియా, పెరు, నార్వే, కెనడా, గుజరాత్, జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్, బీహార్, మేఘాలయ తదితర 80 లోకేషన్లలో వినియోగిస్తున్నారని ఆయన తెలిపారు. దీని ధర కేవలం 53 వేల రూపాయలు మాత్రమేనని, అదే 33 పరీక్షలను నిర్వహించేందుకు విడివిడిగా పరికరాలను కొనుగోలు చేసినట్లయితే ఐదారు లక్ష ల రూపాయలు ఖర్చవుతుందని ఆయన చెప్పారు.