సాక్షి, అమరావతి: కాకినాడ జీజీహెచ్‌లో రూ.42 కోట్లతో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ (ఎంసీహెచ్) బ్లాక్ నిర్మించడంతో పాటు వైద్యపరికరాల్ని ఏర్పాటు చేసేందుకు రంగరాయ వైద్యకళాశాల అల్యుమ్ని ఆఫ్ నార్త్ అమెరికా (ఆర్–ఎమ్‌కానా) ప్రతినిధులు ముందుకొచ్చారు. మంగళగిరిలోని వైద్యశాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సమక్షంలో డీఎంఈ డాక్టర్ వినోద్‌కుమార్, ఆర్–ఎమ్‌కానా ప్రతినిధులు ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు.
నాడు–నేడు కార్యక్రమం ద్వారా వైద్యరంగంలో సీఎం జగన్ ఆస్పత్రుల బలోపేతం, కొత్త వైద్యకళాశాలలు నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న తీరుకు స్ఫూర్తిగా తాము ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణానికి ముందుకొచ్చామని ఆర్–ఎంకానా ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే రూ.20 కోట్లతో కాకినాడ జీజీహెచ్‌లో ఎంసీహెచ్ భవనం గ్రౌండ్, మొదటి ఫ్లోర్‌లను నిర్మించామని, మిగిలిన భవన నిర్మాణం పూర్తిచేయడంతో పాటు అన్ని వసతులతో 18 నెలల్లో ఎంసీహెచ్ బ్లాక్‌ను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు.
అధునాతన సౌకర్యాలతో కూడిన మాతాశిశు సంరక్షణ సేవలు, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఈ బ్లాక్‌లో అందుబాటులోకి వస్తాయన్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో 12 లేబర్ టేబుళ్లు , 40 పడకల యాంటీనేటల్ వార్డు, రెండు ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లు, మొదటి ఫ్లోర్‌లో 75 పడకల పోస్ట్‌నేటల్ వార్డు, రెండో ఫ్లోర్‌లో రెండు అధునాతన ఎలక్టివ్ ఆపరేషన్ థియేటర్లు, మూడు, నాలుగు ఫ్లోర్‌లలో నియోనేటల్ వార్డు, వెంటిలేటర్, ఫొటోథెరపీ వంటి సౌకర్యాలు సమకూరతాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్–ఎంకానా వ్యవస్థాపకులు, రంగరాయ వైద్యకళాశాల రెండోబ్యాచ్‌కు చెందిన డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, డాక్టర్ పాలడుగు రాంబాబు, డాక్టర్ ఎస్.వి.లక్ష్మీనారాయణ, కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమలత పాల్గొన్నారు. ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణానికి ముందుకొచ్చిన ఆర్–ఎంకానా ప్రతినిధులకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, కృష్ణ బాబు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment