KAKINADA GGH
-
కాకినాడ జీజీహెచ్‌లో ఎంసీహెచ్ భవనం
సాక్షి, అమరావతి: కాకినాడ జీజీహెచ్‌లో రూ.42 కోట్లతో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ (ఎంసీహెచ్) బ్లాక్ నిర్మించడంతో పాటు వైద్యపరికరాల్ని ఏర్పాటు చేసేందుకు రంగరాయ వైద్యకళాశాల అల్యుమ్ని ఆఫ్ నార్త్ అమెరికా (ఆర్–ఎమ్‌కానా) ప్రతినిధులు ముందుకొచ్చారు. మంగళగిరిలోని వైద్యశాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సమక్షంలో డీఎంఈ డాక్టర్ వినోద్‌కుమార్, ఆర్–ఎమ్‌కానా ప్రతినిధులు ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా వైద్యరంగంలో సీఎం జగన్ ఆస్పత్రుల బలోపేతం, కొత్త వైద్యకళాశాలలు నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న తీరుకు స్ఫూర్తిగా తాము ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణానికి ముందుకొచ్చామని ఆర్–ఎంకానా ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే రూ.20 కోట్లతో కాకినాడ జీజీహెచ్‌లో ఎంసీహెచ్ భవనం గ్రౌండ్, మొదటి ఫ్లోర్లను నిర్మించామని, మిగిలిన భవన నిర్మాణం పూర్తిచేయడంతో పాటు అన్ని వసతులతో 18 నెలల్లో ఎంసీహెచ్ బ్లాక్‌ను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. అధునాతన సౌకర్యాలతో కూడిన మాతాశిశు సంరక్షణ సేవలు, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఈ బ్లాక్‌లో అందుబాటులోకి వస్తాయన్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో 12 లేబర్ టేబుళ్లు , 40 పడకల యాంటీనేటల్ వార్డు, రెండు ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లు, మొదటి ఫ్లోర్లో 75 పడకల పోస్ట్‌నేటల్ వార్డు, రెండో ఫ్లోర్లో రెండు అధునాతన ఎలక్టివ్ ఆపరేషన్ థియేటర్లు, మూడు, నాలుగు ఫ్లోర్లలో నియోనేటల్ వార్డు, వెంటిలేటర్, ఫొటోథెరపీ వంటి సౌకర్యాలు సమకూరతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్–ఎంకానా వ్యవస్థాపకులు, రంగరాయ వైద్యకళాశాల రెండోబ్యాచ్‌కు చెందిన డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, డాక్టర్ పాలడుగు రాంబాబు, డాక్టర్ ఎస్.వి.లక్ష్మీనారాయణ, కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమలత పాల్గొన్నారు. ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణానికి ముందుకొచ్చిన ఆర్–ఎంకానా ప్రతినిధులకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, కృష్ణ బాబు కృతజ్ఞతలు తెలిపారు. -
అమ్మ పాలకూ బ్యాంక్
అమ్మ పాలు అమృతం కంటే విలువైనవి. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి పాలు అద్భుతమైన ఔషధంలా పని చేస్తాయి. మరో విషయం ఏమంటే.. బిడ్డకు పాలివ్వడం తల్లి ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు కలుగుతుంది. తల్లి పాల నుంచి బిడ్డకు విటమిన్లు, ప్రొటీన్లు లభించడమే కాకుండా.. తల్లి స్పర్శ, వాత్సల్యపూరిత ఆలింగనం వల్ల బిడ్డ మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో భరోసా కలుగుతుంది. అంత గొప్ప విశిష్టత కలిగిన తల్లి పాలకు కొందరు బిడ్డలు దూరం కావాల్సి వస్తోంది. తల్లి పాలు దొరక్క నవజాత శిశువులు అక్కడక్కడ మరణిస్తున్న సందర్భాలూ లేకపోలేదు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు కాకినాడ జీజీహెచ్‌లో తల్లి పాల బ్యాంక్ ఏర్పాటు కాబోతోంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ: దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంటారు. ఇప్పుడు అంతకంటే గొప్ప దానం మరొకటి రాబోతోంది. అదే తల్లి పాల దానం చేయవచ్చు. తల్లి పాలు దానం చేయడమేమిటని ఆశ్చర్యపోతున్నారా! ఔను.. తల్లి పాలను సైతం ఇకనుంచి దానం చేయొచ్చు. తల్లి పాలకు దూరమైన బిడ్డలకు ప్రాణ భిక్ష, ఆరోగ్య భిక్ష కల్పించవచ్చు. రక్తదానం మాదిరిగా అమ్మ పాలను దానంగా స్వీకరించి నిల్వ చేసేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా కాకినాడలో ‘మదర్ మిల్క్ బ్యాంక్’ సిద్ధమవుతోంది. ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి (జీజీహెచ్) పీడియాట్రిక్ విభాగం పైఅంతస్తులో 8 గదులతో ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘సుశేణ హెల్త్ ఫౌండేషన్’ మధ్య ఇందుకు సంబంధించి ఇటీవల ఒప్పందం కుదిరింది. ఆ సంస్థ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ సంతోష్‌కుమార్ దేశంలోనే 8వ మదర్ మిల్క్ బ్యాంక్‌ను ఈ నెల 13న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫౌండేషన్ రూ.కోటితో మూడు విడతల్లో దీని నిర్మాణం చేపడుతోంది. తల్లి పాలు బిడ్డ ఎదుగుదల, సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో కీలకం. వీటి ప్రాధాన్యత తెలియకపోవడం వల్ల కొందరు.. శరీరాకృతి మారిపోతుందనే అపోహతో మరికొందరు.. తల్లి పాలు రాక ఇంకొందరు పిల్లలు చనుబాలకు దూరమవుతున్నారు. ప్రత్యామ్నాయంగా పోత పాలతో బిడ్డ ఆకలి తీరుస్తుండటం వల్ల బిడ్డల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఆరోగ్యాన్ని పరోక్షంగా దెబ్బ తీస్తున్నాయి. తల్లి నుంచి పాలు సేకరిస్తున్న దృశ్యం (ఫైల్) బిడ్డకు ఇవ్వగా మిగిలిన పాలను.. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్కువగా ప్రసవాలు జరిగే టాప్–5లో ఉన్న కాకినాడ జీజీహెచ్‌ను ‘సుశేణ’ హెల్త్ ఫౌండేషన్ ఎంపిక చేసుకుంది. నవజాత శిశువు నుంచి రెండేళ్ల బిడ్డ వరకు ఈ బ్యాంక్‌లో పాలు ఇస్తారు. తల్లి బిడ్డకు ఇవ్వగా మిగులు పాలను సేకరించి అవసరమైన పిల్లలకు అందిస్తారు. హెచ్ఐవీ, వీడీఆర్ఎల్ (వెనెరియల్ డిసీజ్ రీసెర్చ్ లేబొరేటరీ టెస్ట్), హెపటైటిస్ పరీక్షల్లో నెగిటివ్ వస్తేనే తల్లి పాలు తీసుకుంటారు. కాగా, ఇక్కడ తల్లుల చనుబాల పరిమాణం పెంచేందుకు అనుసరించాల్సిన శాస్త్రీయ విధానాలపై అవగాహన కల్పిస్తారు. మసాజ్ థెరఫీ, న్యూట్రిషనల్ ట్రీట్మెంట్ (పోషకాలతో కూడిన వైద్యం), మదర్‌కేర్ (బిడ్డను హత్తుకుని పాలిచ్చే) తరహాలో తల్లులకు బిడ్డలను కనీసం గంటపాటు హత్తుకుని ఉండేటట్టు ఈ బ్యాంక్‌లోని ప్రత్యేక వార్డులో నిపుణుల పర్యవేక్షణలో ఉంచుతారు. ఇలా ఈ బ్యాంక్‌లో రెండు, మూడు రోజులు ఉంచి తల్లులకు అవగాహన వచ్చాక ఇంటి వద్ద ఇదే విధానాన్ని అనుసరించాలని సూచించి పంపేస్తారు. స్వచ్ఛంద దాతలు జీజీహెచ్ మిల్క్ బ్యాంక్‌కు వచ్చి పాలు దానం చేయవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తిగా ఉచితం. తొలి దశలో సేకరించిన పాలను నిల్వ చేయకుండా వెంటనే అవసరమైన శిశువులకు పట్టిస్తారు. రెండో దశలో పాలను నిల్వ చేస్తారు. కనీసం 6 నెలల నుంచి గరిష్టంగా ఏడాది పాటు వాటిని పాడవకుండా భద్రపరుస్తారు. ఇందుకు ప్రత్యేక యంత్రాలు జీజీహెచ్‌లో సిద్ధమయ్యాయి. తొలి దశ ప్రారంభమైన నెల రోజుల వ్యవధిలో మిల్క్ పాశ్చరైజేషన్ జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఏపీలో తొలి బ్యాంక్ సామాజిక బాధ్యతలో భాగంగా నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత తీసుకున్నాం. రాష్ట్రంలోనే తొలిసారి కాకినాడ జీజీహెచ్‌లో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నాం. ప్రభుత్వంతో ఇటీవలనే ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇది సాధ్యమవుతోంది. – రమేష్ లక్కర్సు, కన్సల్టెంట్ ప్రోగ్రాం మేనేజర్, సుశేణ హెల్త్ ఫౌండేషన్ ప్రతినిధి విస్తృతం చేస్తాం ఈ సేవలను విస్తృతం చేసేందుకు నెట్వర్క్ ఆస్పత్రులతో అనుసంధానం చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించాం. మదర్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు జీజీహెచ్‌లో పరిస్థితులు ఉండటంతో సుశేణ ఫౌండేషన్ ముందుకొచ్చింది. – డాక్టర్ హేమలతాదేవి, సూపరింటెండెంట్, జీజీహెచ్, కాకినాడ శిశువుల ప్రాణాలకు రక్ష కాకినాడ జీజీహెచ్‌లో ప్రతి నెలా 700 నుంచి 800 ప్రసవాలు జరుగుతున్నాయి. రెండున్నర కేజీల కంటే తక్కువ బరువుతో పుడుతున్న నవజాత శిశువుల సంఖ్య 75 నుంచి 85 మధ్య ఉంటుంది. కిలో కంటే తక్కువ బరువుతో పుడుతున్న వారు 10 మంది ఉంటున్నారు. ఈ బ్యాంక్ శిశువుల ప్రాణ రక్షణకు తోడ్పడుతుంది. – ఎంఎస్ రాజు, హెచ్‌వోడీ, పీడియాట్రిక్, జీజీహెచ్, కాకినాడ -
Darshit: కన్నా..ఇక కనిపించవా..
సాక్షి, తాళ్లపూడి/కాకినాడ క్రైం: మూడేళ్ల దర్శిత్ విషాదాంతం అందరి హృదయాలను కలచివేసింది. మండలంలోని పైడిమెట్ట గ్రామానికి చెందిన జొన్నకూటి వినోద్‌కుమార్ కుమారుడైన దర్శిత్ (3) చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల 12న తమ ఇంటి డాబాపై ఆడుకుంటుండగా, పై నుంచి వెళుతున్న విద్యుత్ వైర్లు తగిలి బాలుడు షాక్‌కు గురయ్యాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలుడ్ని చికిత్సకోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాబును కంటికి రెప్పలా చూసుకున్నారు. బాలుడి కాళ్లకు ఇన్పెక్షన్ సోకడంతో ఆపరేషన్ చేసి రెండు కాళ్లనూ తొలగించాల్సి వచ్చింది. ఈ సంఘటన అందరి గుండెలనూ పిండేసింది. బాలుడ్ని కాపాడేందుకు జీజీహెచ్ వైద్యుల బృందం చేయని ప్రయత్నం లేదు. మరోపక్క దాతలూ స్పందించారు. పెద్ద మనసుతో ఆర్థిక సహాయం అందించారు. పలు శాఖల అధికారుల తమ ఉదారతను చాటుకున్నారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. సుమారు రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడిన చిన్నారి దర్శిత్ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచాడు. బాలుడి మృతితో పైడిమెట్ట గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. జొన్నకూటి వినోద్, చాందిని దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడైన అక్షిత్ యూకేజీ చదువుతున్నాడు. దర్శిత్ రెండో కుమారుడు. వినోద్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చదవండి: (Yanamala Brothers: నాలుగు దశాబ్దాల చరిత్ర చెబుతున్నది ఇదే) హోం మంత్రి వనిత పరామర్శ శుక్రవారం ఉదయం హోంమంత్రి తానేటి వనిత కాకినాడ జీజీహెచ్‌కు వెళ్లి ఆర్ఐసీయూలో దర్శిత్‌ను పరామర్శించారు. తల్లిదండ్రులతో మాట్లాడారు. బాలుడికి అత్యంత నాణ్యమైన వైద్యం అందించినట్లు తెలిపారు. బాలుడ్ని రక్షించేందుకు పీడియాట్రిక్స్, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, అనస్థీయా నిపుణులు శ్రమించారని వివరించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని కుటుంబానికి భరోసా ఇచ్చారు. కుమారుడ్ని కాపాడాలంటూ రోదించిన దర్శిత్ తల్లి చాందినిని హోం మంత్రి అక్కున చేర్చుకొని ఓదార్చారు. ఆర్ఐసీయూలో బాలుడికి అందుతున్న చికిత్సను హోం మంత్రి తానేటి వనతి, కలెక్టర్ కృతికా శుక్లా, ఎంపీ గీత, కౌడా ఛైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కాకినాడ నగర మాజీ మేయర్ సుంకర శివప్రసన్న పరిశీలించారు. సాయంత్రానికే బాబు మరణించాడనే దుర్వార్త మనసున్నవారిని కుదిపేసింది. బాలుడి కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు చూసి అందరూ చలించిపోయారు. -
కాకినాడ జీజీహెచ్‌లో 100కు చేరిన బ్లాక్ ఫంగస్ సర్జరీలు
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో బ్లాక్ ఫంగస్‌తో శస్త్ర చికిత్స చేయించుకున్న వారి సంఖ్య వందకు చేరింది. నెల రోజులుగా కాకినాడ జీజీహెచ్‌లో బ్లాక్ ఫంగస్ రోగులకు సేవలందిస్తున్నారు. ఇప్పటి వరకూ మొత్తం 280 మంది ఆస్పత్రిలో చేరగా, వీరిలో రికార్డు స్థాయిలో వంద మందికి వేగంగా ఆపరేషన్లు చేయడం విశేషం. ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ కృష్ణకిషోర్ ఆధ్వర్యంలో.. అప్పారావు వైద్య బృందం నిరంతరాయంగా శస్త్ర చికిత్సలు చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 9 మంది బ్లాక్ ఫంగస్ రోగులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. -
జానకినందన్ జయించాడు
కాకినాడ క్రైం: బ్లాక్‌ఫంగస్‌ను జయించిన పిన్న వయస్కుడిగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 17 నెలల బాలుడు ఘనత సాధించాడు. కాకినాడ జీజీహెచ్ నుంచి మంగళవారం డిశ్చార్జ్ అయిన నేపథ్యంలో అసిస్టెంట్ కలెక్టర్ సూర్య ప్రవీణ్‌చంద్, సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.మహాలక్ష్మి ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడారు. బాలుడు జానకినందన్ దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన బ్లాక్ ఫంగస్ బాధితుడని అసిస్టెంట్ కలెక్టర్ తెలిపారు. కాకినాడ జీజీహెచ్ వైద్యులు బాలుడికి పునర్జన్మ ప్రసాదించారని కొని యాడారు. ఇదే చికిత్సకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో కనీసం రూ.70 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. కోవిడ్ పీడియాట్రిక్స్ నోడల్ అధికారి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 20 రోజుల క్రితం బాలుడు అత్యంత ప్రమాదకర స్థితిలో జీజీహెచ్‌లో చేరాడన్నారు. చంటిపిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ ఎంఎస్ రాజు, ఈఎన్టి హెచ్‌వోడి డాక్టర్ కృష్ణకిషోర్ పర్యవేక్షణలో సూపరిం టెండెంట్ డాక్టర్ మహాలక్ష్మి ఆధ్వర్యంలో వైద్య సేవలందించామన్నారు. జూన్ 3న సైనస్ ద్వారా డాక్టర్ కృష్ణకిషోర్, డాక్టర్ సుధీర్ పర్యవేక్షణలో శస్త్రచికిత్స నిర్వహించి, ఫంగస్‌ను తొలగించామన్నారు. శస్త్రచికిత్స తరువాత తిరిగి పీడియాట్రిక్ ఐసీయూలో ఉంచి డాక్టర్ ఎంఎస్ రాజు ఆధ్వర్యం లో వైద్య సేవలు కొనసాగాయని వెంకటేశ్వర్లు చెప్పారు. 12 రోజుల పూర్తి పర్యవేక్షణ అనంతరం మంగళవారం డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. బాలుడిని ప్రతి 10 రోజులకు ఒకసారి పరీక్షిస్తామని, కొన్ని నెలలపాటు ఈ పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. డాక్టర్ మహాలక్ష్మి మాట్లాడుతూ.. అత్యుత్తమ వైద్య సేవలు, నిష్ణాతులైన వైద్య బృందాలు కాకినాడ జీజీహెచ్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరి ఆర్థిక ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని కోరారు. బాలుడి తల్లిదండ్రులు పద్మ, కిరణ్ మాట్లాడుతూ.. ఆసుపత్రి వైద్యులు తమ బిడ్డ ప్రాణాలు కాపాడిన దేవుళ్లంటూ భావోద్వేగానికి గురయ్యారు. సమావేశంలో సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ అనితతో పాటు ఆర్ఎంఓ డాక్టర్ దీప్తి వివిధ విభాగాల హెచ్ఓడీలు పాల్గొన్నారు. -
కాకినాడ జీజీహెచ్‌లో కోవిడ్ పేషెంట్స్‌కు మెరుగైన వైద్య సేవలు
-
వాటాల పంపకాల్లో తేడా.. బాగోతం గుట్టురట్టు
అవినీతి సొమ్ము వాటాల పంపకాల్లో తేడా వచ్చింది. కాకినాడ జీజీహెచ్ కోవిడ్ కేంద్రంలో అక్రమాల బాగోతం బయటపడింది. కరోనా పేరుతో ఓ సీనియర్ స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్ మరి కొందరు నడిపిన వసూళ్ల తంతును పూసగుచ్చినట్టు పోలీసులకు వివరించాడు ఆ ఎంఎన్ఓ. తాను కిట్లు దొంగిలించింది కేవలం స్టాఫ్ నర్సుపై ప్రతీకారం తీర్చుకోవడానికేనని వారికి చెప్పుకొచ్చాడు. కాకినాడ క్రైం(తూర్పుగోదావరి): కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నా అవినీతిపరులు మాత్రం పేట్రేగిపోతున్నారు. వైద్యసేవల మాటున కాసుల దందాకు తెరతీస్తున్నారు. కరోనా యాంటీజెన్ ర్యాపిడ్ కిట్లు దొంగిలించి పోలీసులకు పట్టుబడ్డ బాషా వాంగ్మూలంతో కాకినాడ జీజీహెచ్ కోవిడ్ కేంద్రంలో అవినీతి బాగోతం బయటపడింది. కిట్లను పక్కదారి పట్టించి ఓ సీనియర్ స్టాఫ్ నర్సుతో పాటు ల్యాబ్ టెక్నీషియన్లు వైరస్ అనుమానితుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. కిట్లు దొంగిలించిన ఎంఎన్‌వో షేక్ జాన్ బాషా ఈ ఆరోపణలను నిజమేనన్నట్టుగా పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడం విశేషం. కొద్ది రోజుల క్రితం ఉద్యోగాల పేరుతో.. ఇటీవల విడుదలైన జీజీహెచ్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఆసరాగా, సంబంధిత నర్సు అభ్యర్థుల నుంచి వసూళ్లకు పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని అక్కడ కొందరు జీజీహెచ్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన బాధితులను పిలిపించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న నర్సు సమక్షంలో మాట్లాడారు. ఎవరికీ డబ్బులివ్వొద్దని వాళ్లతో చెప్పి నర్సుతో పాటు అభ్యర్థులను అక్కడి నుంచి పంపేశారే తప్ప చర్యలేవీ చేపట్టలేదు. ఆ నర్సే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సూపరింటెండెంట్ ఆమె కష్టాన్ని పదింతలు చేసి ఆమెను ప్రశంసించడం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు అక్కడే పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీ షియన్కు ఓ ప్రైవేటు ల్యాబ్ ఉండగా జీజీహెచ్‌లో వసూళ్లకు పాల్పడడమే కాక, అక్కడికి కూడా కిట్లను తరలిస్తున్నాడని వెల్లడైంది. వసూళ్ల దందాలో ఈ వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నాడని నిందితుడు బాషా పోలీసులకు వెల్లడించాడు. ఈ వసూళ్ల వ్యవహారం వెనుక వీళ్లకు దన్నుగా జీజీహెచ్ ఉన్నతాధికారి ఉన్నారన్న చర్చ సాగుతోంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న కిట్లలో కొన్ని.. నిందితుడిని అరెస్టు చేశాం : పోలీసులు కాకినాడ మూడో పట్టణ పోలీసులు మాట్లాడుతూ నిందితుడు బాషా ప్రతీకార చర్యలో భాగంగానే దొంగిలించినట్టు ఒప్పుకున్నాడన్నారు. నిందితుడు చెప్పిన పేర్లను సూపరింటెండెంట్‌కి తెలిపి కేసును కాకినాడ ఒకటో పట్టణ పోలీసులకు అప్పగిస్తామన్నారు. నిందితుడి నుంచి 298 కిట్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కరోనా పాజిటివ్ బాధితుడైన బాషా వాటిలో రెండు కిట్లను తన కోసం వినియోగించుకున్నాడన్నారు. అతడికి మంగళవారం రాత్రి నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగెటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. గత నెల 27న జీజీహెచ్ నుంచి ఇంటెండ్ తీసుకున్న బాషా డీఎంహెచ్‌వో కార్యాలయానికి కిట్ల కోసం వచ్చాడని, ఆ సమయంలో సిబ్బంది అందుబాటులో లేక వెనుదిరిగాడని తెలిపారు. ఆ తర్వాత అమలాపురానికి బదిలీ కావడం, కరోనా పాజిటివ్ రావడంతో ఇంద్రపాలెంలోని తన ఇంట్లో క్వారెంటైన్లో ఉన్నాడన్నారు. ఆ స్టాఫ్ నర్సుపై పగతో ఆమెతో పాటు, ల్యాబ్ టెక్నీషియన్ల దందాను బయట పెట్టాలని నిర్ణయించి ఆ ఇండెంట్‌పై తేదీని పదిగా మార్చి, కిట్ల సంఖ్యను 200 నుంచి 300 చేసి తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడని విచారణలో నిర్ధారణ అయ్యిందని తెలిపారు. నిందితుడిని బు«ధవారం ఉదయం అరెస్టు చేశామని, పరీక్షల కోసం జీజీహెచ్‌కి పంపామని తెలిపారు. నిందితుడితో పాటు అతడి వద్ద లభ్యమైన 298 కిట్లను న్యాయస్థానానికి అందిచనున్నట్టు తెలిపారు. ప్రతీకారం తీర్చుకుందామని.. ఎంఎన్‌వో బాషా కిట్లను దొంగిలించి ఇంట్లో దాచుకున్నాడు. వాటిని అమ్మి సొమ్ము చేసుకోవాలన్న ఆలోచన అతడికి లేదని పోలీసుల విచారణలో తేలింది. 300 కిట్లు దొంగిలించడానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తే నివ్వెరపరిచే సమాధానమిచ్చాడు. అక్కడి నర్సుపై ప్రతీకారం తీర్చుకునేందుకే తాను ఈ పని చేశానని తేల్చి చెప్పాడు. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం వసూలు చేసే డబ్బుల పంపకంలో చోటు చేసుకున్న ఘర్షణలో తానే డబ్బులు వసూలు చేసినట్టుగా నర్సు తనపై నింద వేసి నోడల్ అధికారికి ఫిర్యాదు చేసిందన్నాడు. దీంతో జీజీహెచ్ సూపరింటెండెంట్ తనను అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి బదిలీ చేశారని, అది తనను తీవ్ర వేదనకు గురిచేసిందన్నాడు. -
కాకినాడ జీజీహెచ్ సిబ్బందికి లయన్స్ క్లబ్ సాయం
-
కరోనాను జయించిన రాజమండ్రి యువకుడు
సాక్షి, కాకినాడ: కరోనా బారినపడ్డ రాజమండ్రి యువకుడొకరు చికిత్స అనంతరం కోలుకున్నాడు. లండన్ నుంచి వచ్చిన అతడికి మార్చి 22న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అతడిని కాకినాడ జీజీహెచ్‌లోని ఐసోలేషన్ వార్డులో చేర్పించి చికిత్స అందించారు. రెండు వారాల ట్రీట్మెంట్ తర్వాత అతని పరిస్థితి మెరుగైంది. రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ ఫలితాలు వచ్చాయి. జిల్లా కలెక్టర్ సమక్షంలో సదరు యువకుడిని నేడు డిశ్చార్జ్ చేశారు. కాగా, జిల్లా వ్యాప్తంగా తొమ్మిది కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 28 మందికి రిపోర్టులు రావాల్సి ఉంది. ఇక జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టమైన నిఘా కొనసాగుతోంది. ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ గత అర్ధరాత్రి పలు చెక్‌పోస్టులు పరిశీలించారు. (చదవండి: పాజిటివ్ కేసులన్నీ ఢిల్లీ వెళ్లి వచ్చిన వాళ్లే) డిశ్చార్జ్ అయిన యువకుడి కామెంట్లు.. నేను విమానంలో లండన్ నుంచి దుబాయ్, అక్కడ నుంచి హైదరాబాద్ మీదుగా రాజమండ్రికి వచ్చాను. నాతో పాటు ప్రయాణించిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. నేను వెంటనే అప్రమత్తమై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదించాను. వారు నన్ను కాకినాడ జీజీహెచ్‌లో కరోనా ఐసోలేషన్ వార్డులో జాయిన్ చేశారు. నాకూ కరోనా పాజిటివ్ అని రిపోర్టు రావడంతో కొంత టెన్షన్ పడ్డాను. లండన్ నుంచి వచ్చిన తర్వాత బయట ఎక్కడా తిరగలేదు. నా కుటుంబ సభ్యులను కూడా హాస్పిటల్ క్వారంటైన్‌కు తరలించి టెస్టు చేసారు. వారికి నెగెటివ్ వచ్చింది. ఇక్కడి వైద్యులు నాకు భరోసా ఇచ్చి ట్రీట్మెంట్ అందించారు. ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా మందులు ఇస్తూ టెస్టులు చేసేవారు. రెండు సార్లు కరోనా నెగెటివ్ రావడంతో ఈ రోజు డిశ్చార్జ్ చేసారు. జీజీహెచ్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది చాలా బాగా పనిచేశారు. వారి కృషితోనే నేను కరోనా నుంచి బయట పడ్డాను. సోషల్ మీడియాలో వస్తున్నంతగా కోవిడ్-19 ప్రమాదకరం కాదు. వైద్యుల సూచనలు పాటిస్తే కరోనా నయం అవుతుంది. దానికి నేనే ఉదాహరణ. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారు వెంటనే ఆసుపత్రిలో స్వచ్ఛందంగా చేరాలి. (చదవండి: తబ్లిగీ జమాత్: 13,702 మంది..) -
చికిత్స అత్యవసరం
కాకినాడ జీజీహెచ్ ఎమర్జెన్సీ విభాగం దుస్థితి లోపిస్తున్న అధికారుల పర్యవేక్షణ విధులకు ఎగనామం పెడుతున్న వైద్యసిబ్బంది అత్యవసర సమయాల్లో అందని వైద్యం ఇక్కట్లు పడుతున్న రోగులు కాకినాడ వైద్యం : ఉభయ గోదావరి జిల్లాలకు పెద్ద దిక్కయిన కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి (జీజీహెచ్) అత్యవసర విభాగానికి అధికారులు తక్షణ చికిత్స చేపట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 24 గంటలపాటూ రోగులకు వైద్యసేవలందించాల్సిన ఈ విభాగంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపిస్తోంది. ఇదే అదునుగా కొందరు వైద్యసిబ్బంది విధులకు ఎగనామం పెడుతున్నారు. హౌస్ సర్జన్లపైనే వైద్యసేవల భారం వేయడం, సీనియర్ వైద్యులు గైర్హాజరు కావడంతో.. అత్యవసర వైద్యం సకాలంలో అందని పరిస్థితులు నెలకొన్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. ఈ విభాగం ప్రత్యేకత ఇదీ.. ∙జీజీహెచ్‌కు ప్రతి రోజూ ఉభయ గోదావరి జిల్లాల నుంచి సుమారు 3 వేల మంది వస్తూంటారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి, వివిధ ప్రమాదాల్లో క్షత్రగాత్రులకు సత్వర వైద్యసేవలు అందించేందుకు ఇక్కడ అత్యవసర వైద్య విభాగం ఏర్పాటు చేశారు. ∙ఇందులో రోడ్డు ప్రమాదాలు, పురుగు మందు తాగడం, ఆత్మహత్యాయత్నాలకు పాల్పడడం, పోలీసు కేసులకు సంబంధించిన క్షతగాత్రులకు చికిత్స చేసేందుకు మెడికో లీగల్ కేస్ (ఎంఎల్సీ) వార్డు; గుండెపోటు, ఊపిరితిత్తుల సమస్యలు, కడుపునొప్పి, అపెండిసైటిస్ (24 గంటల కడుపునొప్పి) తదితర అనారోగ్య రుగ్మతలతో సమమతమయ్యేవారికి చికిత్స చేసేందుకు నా¯ŒS ఎంఎల్సీ వార్డు ఏర్పాటు చేశారు. ∙ఎంఎల్సీ వార్డుకు నిత్యం రోడ్డు ప్రమాదాలు, పోలీసు కేసులకు సంబంధించి 20 – 25 మంది వరకూ వస్తూంటారు. కేసులు మరో 100 వరకూ నమోదవుతూంటాయి. ∙నా¯ŒS ఎంఎల్సీ వార్డుకు గుండెపోటు, కిడ్నీ, అపెండిసైటిస్ తదితర అత్యవసర పరిస్థితులకు సంబంధించి ప్రతి రోజూ సుమారు 150 దాకా కేసులు వస్తూంటాయి. ∙ఎంఎల్సీ వార్డులో 20, నా¯ŒS ఎంఎల్సీ వార్డులో 20 పడకలు ఏర్పాటు చేశారు. ∙ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడేవారికోసం క్యాజువాలిటీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (సీఐసీయూ) అందుబాటులో ఉంది. హౌస్ సర్జన్లపైనే భారం ఇక్కడ పనిచేసే సీనియర్ వైద్యులు, సిబ్బంది తర చూ విధులకు గైర్హాజరవుతున్నారన్న ఆరోపణలున్నాయి. దీనికితోడు పీజీ వైద్యుల కొరత వేధిస్తోం ది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ వైద్యసేవల భారం దాదా పు హౌస్ సర్జన్లపైనే పడుతోంది. కొన్ని సందర్భాల్లో క్షతగాత్రులకు అత్యవసర వైద్యం సరిగా అందించలేక హౌస్ సర్జన్లు ఇక్కట్లకు గురవుతున్నారు. సీనియర్ వైద్యులు కనుక అందుబాటులో ఉంటే వారిచ్చే సలహా మేరకు చికిత్స చేస్తున్నారు. లేకుంటే తమకు తోచిన వైద్యం చేస్తున్నారని రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. కొందరు వైద్య సిబ్బంది దురుసు ప్రవర్తనతో పలు గొడవలు కూడా సంభవిస్తున్నాయి. అయినప్పటికీ ఉన్నతాధికారులు ఈ విభాగం పర్యవేక్షణపై దృష్టి సారించలేదంటూ విమర్శలు వస్తున్నాయి. సిబ్బంది కొరత ఎమర్జెన్సీ విభాగంలో 24 గంటలపాటూ వైద్యం అందించేందుకు రో జుకు మూడు షిఫ్టు ల్లో వైద్య సిబ్బంది విధులు నిర్వర్తించా లి. డ్యూటీ అసిస్టెం ట్ ఫిజీషియ¯ŒS (డీఏ పీ), డ్యూటీ అసిస్టెంట్ సర్జ¯ŒS(డీఏఎస్)లు తప్పకుండా ఎంఎల్సీ, నా¯ŒS ఎంఎల్సీ వార్డుల్లో అందుబాటులో ఉండాలి. కానీ, రాత్రి సమయాల్లో ఎవరూ అందుబాటులో ఉండటం లేదని, హౌ స్ సర్జన్లపైనే భారం వేసి గైర్హాజరవుతున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఒక్కో విభాగంలో సీఎం వోతోపాటు జనరల్ మెడిసిన్, ఆర్థో, సర్జికల్‌కు చెందిన పీజీ వైద్యులతోపాటు ప్రతి షిఫ్టుకు నలుగురు హౌస్ సర్జన్లు అందుబాటులో ఉండాలి. వీరితోపాటు డ్యూటీ అసిస్టెంట్ ఫిజీషియన్, సర్జన్, ఆర్థోపెడిక్ సిబ్బంది అందుబాటులో ఉండాలి. సీనియర్ వైద్య సిబ్బంది గైర్హాజరీతో పీజీ, హౌస్ సర్జన్లు కూడా విధులకు సక్రమంగా హాజరు కావడంలేదని అక్కడ పని చేస్తున్న సిబ్బంది ఆరోపిస్తున్నారు. జూనియర్ డాక్టర్లే చికిత్స చేస్తున్నారు. రెండు వారాల క్రితం తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతున్న మా బంధువును రాత్రి 10 గంటల సమయంలో జీజీహెచ్ ఎమర్జెన్సీ వార్డులో చేర్పించాం. అక్కడ సీనియర్ వైద్యులు అందుబాటులో లేరు. ఆస్పత్రిలో చేరిన గంట తర్వాత హౌస్సర్జన్లు వంతులు వేసుకుని చివరకు వైద్యం అందించారు. గంటన్నర సేపు రోగి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడింది. సత్వర చికిత్స అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. – జి.నరసింహమూర్తి, కాకినాడ సక్రమంగా సేవలందించేలా చర్యలు ఎమర్జెన్సీ విభాగంలో రోగులకు సక్రమంగా వైద్య సేవలందించేలా చర్యలు తీసుకుంటాను. ఇక్కడ వైద్య సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది గైర్హాజరీపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ టీఎస్ఎ¯ŒS మూర్తి, సీఎస్‌ఆర్‌ఎంవో, జీజీహెచ్, కాకినాడ విధులకు ఇద్దరు స్టాఫ్‌నర్సుల డుమ్మా జీజీహెచ్ అత్యవసర విభాగాన్ని నర్సింగ్ సూపరింటెండెంట్ అక్కమాంబ ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు రెగ్యులర్ స్టాఫ్‌నర్సులు బయోమెట్రిక్‌లో హాజరు నమోదు చేసి, తర్వాత విధులకు డుమ్మా కొట్టినట్లు గుర్తించారు. ఈ మేరకు హాజరు పుస్తకంలో ఆ ఇద్దరూ గైర్హాజరైనట్టు రిమార్క్ రాశారు. విధి నిర్వహణలో అలసత్వం, విధులకు హాజరైనట్లు నమోదు చేసి, గైర్హాజరు కావడంతో స్టాఫ్ నర్సులిద్దరిపై శాఖాపరమైన చర్యకు సిఫారసు చేసినట్లు తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.