జీజీహెచ్‌లో కోవిడ్ కేంద్రం- వైద్య పరీక్షలకు హాజరైన నిందితుడు బాషా
అవినీతి సొమ్ము వాటాల పంపకాల్లో తేడా వచ్చింది. కాకినాడ జీజీహెచ్ కోవిడ్ కేంద్రంలో అక్రమాల బాగోతం బయటపడింది. కరోనా పేరుతో ఓ సీనియర్ స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్ మరి కొందరు నడిపిన వసూళ్ల తంతును పూసగుచ్చినట్టు పోలీసులకు వివరించాడు ఆ ఎంఎన్‌ఓ. తాను కిట్లు దొంగిలించింది కేవలం స్టాఫ్ నర్సుపై ప్రతీకారం తీర్చుకోవడానికేనని వారికి చెప్పుకొచ్చాడు.
కాకినాడ క్రైం(తూర్పుగోదావరి): కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నా అవినీతిపరులు మాత్రం పేట్రేగిపోతున్నారు. వైద్యసేవల మాటున కాసుల దందాకు తెరతీస్తున్నారు. కరోనా యాంటీజెన్ ర్యాపిడ్ కిట్లు దొంగిలించి పోలీసులకు పట్టుబడ్డ బాషా వాంగ్మూలంతో కాకినాడ జీజీహెచ్ కోవిడ్ కేంద్రంలో అవినీతి బాగోతం బయటపడింది. కిట్లను పక్కదారి పట్టించి ఓ సీనియర్ స్టాఫ్ నర్సుతో పాటు ల్యాబ్ టెక్నీషియన్లు వైరస్ అనుమానితుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. కిట్లు దొంగిలించిన ఎంఎన్‌వో షేక్ జాన్ బాషా ఈ ఆరోపణలను నిజమేనన్నట్టుగా పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడం విశేషం.
కొద్ది రోజుల క్రితం ఉద్యోగాల పేరుతో..
ఇటీవల విడుదలైన జీజీహెచ్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఆసరాగా, సంబంధిత నర్సు అభ్యర్థుల నుంచి వసూళ్లకు పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని అక్కడ కొందరు జీజీహెచ్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన బాధితులను పిలిపించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న నర్సు సమక్షంలో మాట్లాడారు. ఎవరికీ డబ్బులివ్వొద్దని వాళ్లతో చెప్పి నర్సుతో పాటు అభ్యర్థులను అక్కడి నుంచి పంపేశారే తప్ప చర్యలేవీ చేపట్టలేదు. ఆ నర్సే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సూపరింటెండెంట్ ఆమె కష్టాన్ని పదింతలు చేసి ఆమెను ప్రశంసించడం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు అక్కడే పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీ షియన్‌కు ఓ ప్రైవేటు ల్యాబ్ ఉండగా జీజీహెచ్‌లో వసూళ్లకు పాల్పడడమే కాక, అక్కడికి కూడా కిట్లను తరలిస్తున్నాడని వెల్లడైంది. వసూళ్ల దందాలో ఈ వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నాడని నిందితుడు బాషా పోలీసులకు వెల్లడించాడు. ఈ వసూళ్ల వ్యవహారం వెనుక వీళ్లకు దన్నుగా జీజీహెచ్ ఉన్నతాధికారి ఉన్నారన్న చర్చ సాగుతోంది.
పోలీసులు స్వాధీనం చేసుకున్న కిట్లలో కొన్ని..
నిందితుడిని అరెస్టు చేశాం : పోలీసులు
కాకినాడ మూడో పట్టణ పోలీసులు మాట్లాడుతూ నిందితుడు బాషా ప్రతీకార చర్యలో భాగంగానే దొంగిలించినట్టు ఒప్పుకున్నాడన్నారు. నిందితుడు చెప్పిన పేర్లను సూపరింటెండెంట్‌కి తెలిపి కేసును కాకినాడ ఒకటో పట్టణ పోలీసులకు అప్పగిస్తామన్నారు. నిందితుడి నుంచి 298 కిట్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కరోనా పాజిటివ్ బాధితుడైన బాషా వాటిలో రెండు కిట్లను తన కోసం వినియోగించుకున్నాడన్నారు.
అతడికి మంగళవారం రాత్రి నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగెటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. గత నెల 27న జీజీహెచ్ నుంచి ఇంటెండ్ తీసుకున్న బాషా డీఎంహెచ్‌వో కార్యాలయానికి కిట్ల కోసం వచ్చాడని, ఆ సమయంలో సిబ్బంది అందుబాటులో లేక వెనుదిరిగాడని తెలిపారు. ఆ తర్వాత అమలాపురానికి బదిలీ కావడం, కరోనా పాజిటివ్ రావడంతో ఇంద్రపాలెంలోని తన ఇంట్లో క్వారెంటైన్‌లో ఉన్నాడన్నారు. ఆ స్టాఫ్ నర్సుపై పగతో ఆమెతో పాటు, ల్యాబ్ టెక్నీషియన్ల దందాను బయట పెట్టాలని నిర్ణయించి ఆ ఇండెంట్‌పై తేదీని పదిగా మార్చి, కిట్ల సంఖ్యను 200 నుంచి 300 చేసి తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడని విచారణలో నిర్ధారణ అయ్యిందని తెలిపారు. నిందితుడిని బు«ధవారం ఉదయం అరెస్టు చేశామని, పరీక్షల కోసం జీజీహెచ్‌కి పంపామని తెలిపారు. నిందితుడితో పాటు అతడి వద్ద లభ్యమైన 298 కిట్లను న్యాయస్థానానికి అందిచనున్నట్టు తెలిపారు.
ప్రతీకారం తీర్చుకుందామని..
ఎంఎన్‌వో బాషా కిట్లను దొంగిలించి ఇంట్లో దాచుకున్నాడు. వాటిని అమ్మి సొమ్ము చేసుకోవాలన్న ఆలోచన అతడికి లేదని పోలీసుల విచారణలో తేలింది. 300 కిట్లు దొంగిలించడానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తే నివ్వెరపరిచే సమాధానమిచ్చాడు. అక్కడి నర్సుపై ప్రతీకారం తీర్చుకునేందుకే తాను ఈ పని చేశానని తేల్చి చెప్పాడు. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం వసూలు చేసే డబ్బుల పంపకంలో చోటు చేసుకున్న ఘర్షణలో తానే డబ్బులు వసూలు చేసినట్టుగా నర్సు తనపై నింద వేసి నోడల్ అధికారికి ఫిర్యాదు చేసిందన్నాడు. దీంతో జీజీహెచ్ సూపరింటెండెంట్ తనను అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి బదిలీ చేశారని, అది తనను తీవ్ర వేదనకు గురిచేసిందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment